వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారు పరిరక్షణ చట్టం-2019తోపాటు


‘కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలను అడ్డుకోవడానికి ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు-2024’కు
కచ్చితంగా కట్టుబడి ఉండాలని కోచింగ్ కేంద్రాలకు కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికరణ (సీసీపీఏ) సలహా

* తప్పుదోవ పట్టించే క్లెయిములు, అనుచిత వ్యాపార పద్ధతులపై
‘ఐఐటీ-జేఈఈ’, ‘నీట్‌’ కోచింగ్ కేంద్రాలు కొన్నిటికి సీసీపీఏ నోటీసులు

Posted On: 17 APR 2025 12:46PM by PIB Hyderabad

వినియోగదారు పరిరక్షణ చట్టం-2019తోపాటు ‘కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలను అడ్డుకోవడానికి ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు-2024’కు కోచింగ్ కేంద్రాలు కచ్చితంగా కట్టుబడి ఉండాలంటూ కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికరణ (సీసీపీఏ) సలహా ఇచ్చింది.

ఆయా కోచింగ్ కేంద్రాలు తెలియజేసే సమాచారం యథార్థంగా, స్పష్టంగా, తప్పుదోవపట్టించే వాదాలకు చోటివ్వనిదిగా ఉండాలని, ముఖ్య అంశాలను వినియోగదారులకు తెలియజేయకుండా దాచిపెట్టేదిగా ఉండరాదని సీసీపీఏ తెలిపింది. దీనికి తోడు, కోచింగ్ కేంద్రాలు విజయానికి మాదీ హామీ అని పేర్కొనడం మానుకోవాలంది. విద్యార్థుల పేర్లు, ర్యాంకులు, ఏ కోర్సు, కోర్సుకు చెల్లింపు చేసిందీ లేనిదీ వంటి ముఖ్య వివరాలను ప్రకటనల్లో సూటిగా తెలియజేయాలంది.
వినియోగదారులను తప్పుదోవ పట్టకుండా చూడడానికిగాను ఇతర ప్రధాన విషయాలను కూడా గమనిక పేరిట సమాన ఆకారంలో, అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని పేర్కొంది.

ఐఐటీ-జేఈఈ, ‘నీట్’ (ఎన్ఈఈటీ) వంటి పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడిన తరువాత, ‘కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలను అడ్డుకోవడానికి ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు-2024’ను కోచింగ్ కేంద్రాలు పాటించడం లేదన్న విషయాన్ని సీసీపీఏ గమనించింది.

చట్టాన్ని, మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించిన విషయాన్ని సీసీపీఏ పరిశీలించి, ఈ కింద అంశాలకు సంబంధించి కొన్ని కోచింగ్ సంస్థలకు నోటీసులిచ్చింది: -

     •  ప్లేస్‌మెంట్/ఎంపిక.. వీటికి హామీనివ్వడం
     •  జేఈఈ/ఎన్ఈఈటీలో ర్యాంకు తెప్పిస్తామని వాగ్దానం చేయడం
     •  వినియోగదారు హక్కులను ఉల్లంఘించడం
     •  తప్పుదోవ పట్టించే ప్రకటనలతోపాటు
     •    అనుచిత వ్యాపార పద్ధతులకు (అంటే, వాగ్దానం చేసిన సేవలను సమకూర్చకపోవడం, ప్రవేశాన్ని రద్దుచేసి కూడా ఫీజును వెనుకకు తిరిగి ఇవ్వకపోవడం, సేవలో లోపం, ఫీజును కొంతయినా వాపసు చేయకపోవడం వంటి వాటికి) ఒడిగట్టడం

పైన ప్రస్తావించిన క్లెయిములు, వ్యవహారాలు వినియోగదారు పరిరక్షణ చట్టం-2019లో సెక్షన్ - 2(28) తోపాటు 2 (47) సహా వివిధ నిబంధనలనే కాకుండా, కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటన నిరోధానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు-2024ను కూడా ఉల్లంఘించినట్లుగా కనబడుతోంది.

కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటన నిరోధానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు-2024ను కిందటి ఏడాది నవంబరు 13న జారీ చేశారు.
 
ఈ మార్గదర్శకాలు కోచింగ్ కేంద్రాలు వాటి సేవలను పెంచుకోవడానికి తప్పుడు క్లెయిములను, తప్పుడు ప్రకటనలను, తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఇవ్వకుండా అడ్డుకొంటాయి. అంతేకాక దగాకోరు విధానాలకు పాల్పడకుండా నిరోధిస్తాయి. విద్యార్థులను దోచుకోవడాన్ని నివారించే, వారు తప్పుడు వాగ్దానాల వలలో పడకుండా చూసే, లేదా అనుచిత ఒప్పందాలకు బద్ధులు కాకుండా చూసే క్రమంలో ఈ మార్గదర్శక సూత్రాల రూపకల్పన ఒక కీలక నిర్ణయం. అంతేకాదు,   కోచింగ్ రంగంలో పారదర్శకత్వాన్ని పెంచడానికి, విద్యార్థులతోపాటు వారి కుటుంబాలు సరైన, వాస్తవ  సమాచారాన్ని తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సాయపడడానికి  ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయి. ఈ మార్గదర్శకాలు ప్రస్తుతం అమలవుతున్న నియమాలకు అనుబంధంగా ఉంటూనే, కోచింగ్ రంగంలో ప్రకటనలను క్రమబద్ధీకరించే నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాయి.

వినియోగదారు హక్కులను పరిరక్షించడంతోపాటు కోచింగ్ రంగంలో పారదర్శకత్వానికి పట్టం కట్టడానికి చేపట్టిన ఒక ముఖ్య నిర్ణయంలో భాగంగా, సీసీపీఏ గత మూడు సంవత్సరాల్లో కోచింగ్ కేంద్రాలు తప్పుదోవ పట్టించే ప్రకటనలకు, న్యాయవిరుద్ధ వ్యాపార పద్ధతులకు, ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాల్లో ఆ కేంద్రాలపై తగిన చర్యలు తీసుకుంది.

ఈ విషయంలో, సీసీపీఏ 49 నోటీసులను జారీ చేసింది. 24 కోచింగ్ కేంద్రాలకు మొత్తం రూ.77.60 లక్షల జరిమానాను విధించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు, అనుచిత వ్యాపార ధోరణులకు ఒడిగట్టడాన్ని మానుకోవాలని ఆ కేంద్రాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది.

సీసీపీఏ ఇంతకు ముందు యూపీఎస్‌సీ సీఎస్ఈ, ఐఐటీ-జేఈఈ, నీట్, ఆర్‌బీఐ, నాబార్డ్ సహా ఇతర పోటీ పరీక్షలకు సేవలను అందిస్తున్న కోచింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకుంది. దీంతో, వినియోగదారు పరిరక్షణ చట్టం-2019ని అతిక్రమిస్తూ ఎలాంటి తప్పుడు ప్రకటనలు గాని, లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు గాని వెలువడకుండా చూడడానికి కట్టుబడి ఉంటానని సీసీపీఏ తాను వ్యక్తం చేసిన నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు అవుతోంది.

 

*** 


(Release ID: 2122594) Visitor Counter : 43