జౌళి మంత్రిత్వ శాఖ
‘‘స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో’’- భారత్ చేనేత ఉత్పాదనల ఉత్సవం
* నోయిడాలో జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ‘‘స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో’’ ప్రారంభం
* 13 రాష్ట్రాల చేనేతకారులను ఒక చోటుకు తీసుకువచ్చిన ఎక్స్‌పో
* #నా నేత నా గొప్పదనం #నా ఉత్పత్తి నా గొప్పదనం
Posted On:
17 APR 2025 11:49AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) నోయిడాలోని తన కార్పొరేట్ కార్యాలయంలో ‘‘స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో’’ను ప్రారంభించింది.
ఈ ప్రదర్శనలో 13 రాష్ట్రాల చేనేత కార్మికులు పాల్గొంటున్నారు. ప్రాచీన చేనేత సంప్రదాయం పట్ల సరికొత్తగా శ్రద్ధవహించి చేనేతకారులకు వారి ఉత్పాదనలను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ఒక అదనపు వేదికను అందించాలన్నదే ఈ ఎక్స్‌పో ధ్యేయం.
ఈ కార్యక్రమంలో 25 దుకాణాలు ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. చాలా నైపుణ్యంతో తయారు చేసిన చీరలు, డ్రెస్ మెటీరియల్, మహిళలు భుజాల మీదుగా ముందువైపునకు వేసుకొనే వస్త్రాలు, దుపట్టాలు వంటి వాటిని ఈ స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు.
జౌళి కార్యదర్శి నీలమ్ శమీ రావు ఎక్స్‌పోను సందర్శించి, చేనేతకారులతో మాట్లాడారు. మన సంప్రదాయాన్ని పరిరక్షించడానికి వారు చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.
‘‘స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో, మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్’’ ప్రదర్శన నోయిడాలోని ఎన్‌హెచ్‌డీసీ కాంప్లెక్స్, సెక్టర్ 2లో ఈ నెల 24 వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.
***
(Release ID: 2122591)