మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ముస్లింల హజ్ యాత్రకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
Posted On:
15 APR 2025 10:54AM by PIB Hyderabad
భారతీయ ముస్లింలు వార్షిక హజ్ యాత్ర చేపట్టే అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
2014లో దేశానికి కేటాయించిన హజ్ యాత్రీకుల కోటా 1,36,020 ఉండగా.. ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా 2025 నాటికి 1,75,025కు పెరిగింది. యాత్ర ప్రారంభమవడానికి కొన్ని రోజుల ముందు సౌదీ అధికారులు ఈ కోటాను ఖరారు చేస్తారు.
భారత్ కు కేటాయించిన కోటాలో ఎక్కువ భాగానికి అవసరమైన ఏర్పాట్లను భారత హజ్ కమిటీ ద్వారా మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఎంఏ) పూర్తి చేస్తుంది. ఈ ఏడాది ఆ సంఖ్య1,22,518 గా ఉంది. సౌదీ విధానాల ప్రకారం విమాన ప్రయాణం, రవాణా, మీనా క్యాంపులు, వసతి, అదనపు సేవలను అందించడానికి అవసరమైన ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేశారు.
సంప్రదాయం ప్రకారం, మిగిలిన కోటాను ప్రైవేట్ టూర్ ఆపరేటర్లకు కేటాయించారు. సౌదీ మార్గదర్శకాల్లో వచ్చిన మార్పుల ప్రకారం ఈ ఏడాది ఎంఓఎంఏ ద్వారా 800కు పైగా ప్రైవేటు టూర్ ఆపరేటర్లను 26 చట్టబద్ధమైన సంస్థలుగా ఏకీకృతం చేశారు. వీటిని కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆపరేటర్ (సీహెచ్‌జీవో)లుగా పిలుస్తారు. న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తూ, ఈ 26 సీహెచ్‌జీవోలకు ముందుగానే హజ్ కోటాను ఎంవోఎంఏ కేటాయించింది. అయితే, రిమైండర్లు ఇచ్చినప్పటికీ సౌదీ అధికారులు నిర్దేశించిన గడువును అనుసరించడంలో ఈ సంస్థలు విఫలమయ్యాయి. అలాగే మీనా క్యాంపులు, వసతి, యాత్రకు రవాణా సహా తప్పనిసరి కాంట్రాక్టులను సౌదీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఖరారు చేయడంలోనూ సఫలీకృతం కాలేకపోయాయి.
ఈ అంశంలో మంత్రిత్వ స్థాయితో సహా సంబంధిత సౌదీ అధికారులతో భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరిపింది.
యాత్రీకుల భద్రతపై, ముఖ్యంగా మీనా క్యాంపుల్లో పరిస్థితిపై సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను తెలియజేసింది. అధిక వేసవి ఉష్ణోగ్రతల మధ్య మీనా క్యాంపులో అందుబాటులో ఉన్న అతి తక్కువ స్థలంలో హజ్ యాత్రకు సంబంధించిన ఆచారాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేయడం ద్వారా మీనా క్యాంపులో స్థలాభావం ఏర్పడుతుంది. అదే విధంగా ఈ సారి ఏ దేశానికి గడువు పొడిగించబోమని సౌదీ అధికారులు తెలియజేశారు.
ప్రభుత్వ జోక్యంతో హజ్ పోర్టల్ (నుసుక్ పోర్టల్)ను అన్ని సీహెచ్‌జీవోలకు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ప్రస్తుతం మీనా క్యాంపులో 10,000 మందికే స్థలం అందుబాటులో ఉన్నందున తదనుగుణంగా సీహెచ్‌జీవోలు తమ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ పనిని త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని సీహెచ్‌జీవోలకు ఎంవోఎంఏ ఆదేశాలు జారీ చేసింది. మరింత మంది యాత్రికులకు బస కల్పిచేందుకు వెసులుబాటు కల్పించిన సౌదీ అధికారుల ప్రయత్నాన్ని భారత్ ప్రశంసించింది.
***
(Release ID: 2121997)
Visitor Counter : 6