ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిసార్లో రూ.410 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన


· “నేడు మన రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి.. ఇది మనకే కాదు.. యావద్దేశానికీ ఎంతో ముఖ్యమైన రోజు”

· “హర్యానా-అయోధ్య మార్గంలో నేడు విమానాలు ప్రారంభం కావడంతో శ్రీకృష్ణుని ఈ పవిత్ర భూమి నేరుగా శ్రీరాముని నగరంతో సంధానితమైంది”

· “మా ప్రభుత్వం ఒకవైపు అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూ... మరోవైపు పేదల సంక్షేమం-సామాజిక న్యాయానికి భరోసా ఇస్తోంది”

Posted On: 14 APR 2025 12:14PM by PIB Hyderabad

దేశ ప్రజలందరికీ సురక్షిత, సౌలభ్య విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలన్న సంకల్పం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని హిసార్‌లో రూ.410 కోట్లపైగా వ్యయంతో నిర్మించే మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- హర్యానా ప్రజల శక్తిసామర్థ్యాలు, క్రీడాస్ఫూర్తి, సోదరభావం రాష్ట్రానికి ప్రతీకలుగా అభివర్ణిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ముమ్మర పంట కోతల వేళ కూడా పెద్ద సంఖ్యలో ఆశీర్వదించేందుకు వచ్చారంటూ ప్రజలకు తజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా గురు జంభేశ్వర్, మహారాజా అగ్రసేన్లతోపాటు పవిత్ర అగ్రోహ క్షేత్రానికి ప్రధానమంత్రి సగౌరవ నివాళి అర్పించారు. హర్యానా... ముఖ్యంగా హిసార్కు సంబంధించి  తన మధుర జ్ఞాపకాలను ప్రజలతో పంచుకున్నారు. బీజేపీ తనకు రాష్ట్రశాఖ బాధ్యతలు అప్పగించిన సమయంలో అనేకమంది సహచరులతో భుజం కలిపి పార్టీ బలోపేతానికి కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో వారు ప్రదర్శించిన అంకితభావం, కఠోర పరిశ్రమను ప్రముఖంగా ప్రస్తావించారు. వికసిత హర్యానా, వికసిత భారత్‌ సంకల్పంపై పార్టీ నిబద్ధత తనకెంతో గర్వకారణమని, ఈ దిశగా అందరూ అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

“నేడు మన రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి. ఇది మనకే కాకుండా  దేశం మొత్తానికీ అత్యంత ముఖ్యమైన రోజు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ 11  సంవత్సరాల పాలనకు బాబాసాహెబ్ జీవితం, పోరాటాలు, సందేశం మూలస్తంభాలని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రతి నిర్ణయం.. విధానం సహా అనునిత్యం పరిపాలన బాబాసాహెబ్ దార్శనికతకు అంకితమై కొనసాగిందని పేర్కొన్నారు. దుర్బల, అణగారిన, దోపిడీకి గురైన పేద, గిరిజన వర్గాలు సహా మహిళల జీవనం మెరుగుకు, వారి కలల సాకారానికి ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నదని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలన్నీ సాధించే దిశగా నిరంతర, వేగవంతమైన ప్రగతి తారకమంత్రంగా తమ ప్రభుత్వం ముందంజ వేస్తున్నదని చెప్పారు.

హర్యానా-అయోధ్య క్షేత్రాలను నేరుగా అనుసంధానిస్తూ విమానయాన సేవలకు శ్రీకారం చుట్టడాన్ని ప్రస్తావిస్తూ- శ్రీకృష్ణుని పావన భూమికి, శ్రీరాముని దివ్య ధామానికిగల ప్రత్యక్ష సంబంధానికి ఇదొక ప్రతీక అని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇదేవిధంగా ఇతర నగరాలకూ త్వరలోనే విమానయాన సేవలు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా హిసార్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేయడాన్ని ప్రస్తావిస్తూ హర్యానా ఆకాంక్షలకు రెక్కలు తొడిగే దిశగా ఇదొక ముందడుగని వ్యాఖ్యానించారు. ఈ కీలక ఘట్టం నేపథ్యంలో హర్యానా ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

సాధారణ స్లిప్పర్లు ధరించేవారు కూడా విమానయానం చేయడం సాధ్యమేనన్న తన దృక్కోణాన్ని గుర్తుచేస్తూ- తన ఈ వాగ్దానం నేడు దేశమంతటా సాకారం అవుతున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు గత పదేళ్లలో లక్షలాది భారతీయులు తొలిసారి విమాన ప్రయాణ అనుభవం పొందారని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఇంతకుముందు సరైన రైల్వే స్టేషన్‌ సదుపాయం కూడా లేని ప్రాంతాల్లో ఇవాళ కొత్త విమానాశ్రయాలు నిర్మితమవుతున్నాయని చెప్పారు. ఆ మేరకు 2014కు ముందు.. అంటే- దాదాపు 7 దశాబ్దాలు గడిచేసరికి దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 మాత్రమేనని గుర్తుచేశారు. అయితే, గత పదేళ్లలోనే ఈ సంఖ్య 150కి చేరగా, రెట్టింపు పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు. ఇక ‘ఉడాన్’ పథకం కింద దాదాపు 90 ఏరోడ్రోమ్‌లు అనుసంధానితం కాగా, 600కిపైగా మార్గాల్లో విమాన రాకపోకలు సాగుతున్నాయని తెలిపారు. దీనివల్ల అధికశాతం ప్రజానీకానికి సరసమైన ధరతో విమాన యానం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. పర్యవసానంగా వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని వెల్లడించారు. అలాగే వివిధ విమానయాన సంస్థలు రికార్డు స్థాయిలో 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లిచ్చాయని పేర్కొన్నారు. దీనివల్ల పైలట్లు, విమాన సేవికలు, ఇతరత్రా సేవల సిబ్బంది రూపంలో అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. దీంతోపాటు విమానాల నిర్వహణ రంగంలోనూ గణనీయ  ఉపాధి అవకాశాల సృష్టికి వీలుంటుందని తెలిపారు. ఈ క్రమంలో “హిసార్ విమానాశ్రయం హర్యానా యువత ఆకాంక్షలకు రెక్కలు తొడిగి, కొత్త అవకాశాలతో వారి కలల సాకారంలో తనవంతు పాత్ర పోషిస్తుంది” అన్నారు.

“మా ప్రభుత్వం ఇటు అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూ, అటు పేదల సంక్షేమం-సామాజిక న్యాయం ద్వారా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ దార్శనికతను సాకారం చేస్తూ రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను నెరవేరుస్తోంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బాబాసాహెబ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ- ఆయనను ఎంతో అవమానించిందని, రెండుసార్లు ఆయన ఎన్నికలలో ఓడిపోయేందుకు కారణమయ్యారని వ్యవస్థ నుంచి ఆయనను నెట్టివేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ఇక బాబాసాహెబ్ మరణానంతరం ఆయన వారసత్వాన్ని రూపుమాపేందుకు, ఆ మహనీయుడి ఆలోచనలను భూస్థాపితం చేసేందుకు కాంగ్రెస్‌ యత్నించిందని వ్యాఖ్యానించారు. డాక్టర్ అంబేడ్కర్‌ రాజ్యాంగ రక్షకుడైతే, వారు దాని విధ్వంసకులని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. డాక్టర్ అంబేడ్కర్‌ దేశంలో సమానత్వ సాధనకు కృషి చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయ వైరస్‌ను వ్యాప్తి చేసిందని ఆరోపించారు.

దేశంలో ప్రతి పేదకు, అణగారిన వ్యక్తికి గౌరవప్రద జీవితమిచ్చే ధ్యేయంతో వారి కలలు, ఆకాంక్షలు నెరవేరేందుకు చేయూతనిచ్చారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తన సుదీర్ఘ పాలన కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించిందని ఆయన విమర్శించారు. నాటి పాలకుల హయాంలో అసమానతలను ప్రస్ఫుటం చేస్తూ- కొందరు నాయకుల ఈతకొలనులకు నీరందిందిగానీ, గ్రామాల దాహార్తి మాత్రం తీరలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 70 ఏళ్లకు కూడా కొళాయి కనెక్షన్లు గ్రామీణ కుటుంబాలలో 16 శాతానికి మాత్రమే పరిమితమయ్యాయని గుర్తుచేశారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రయోజనాలు అసమతౌల్యానికి గురయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, గడచిన 6-7 ఏళ్ల వ్యవధిలోనే తమ ప్రభుత్వం 12 కోట్లకుపైగా గ్రామీణ కుటుంబాలకు కొళాయి  కనెక్షన్లు ఇచ్చిందని, తద్వారా 80 శాతం నివాసాలకు సురక్షిత నీరు అందుతున్నదని ఆయన వివరించారు. బాబాసాహెబ్ ఆశీర్వాదంతో ఇంటింటికీ కొళాయి నీటి సరఫరా లక్ష్యం సాకారం కాగలదని విశ్వాసం వెలిబుచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేసిన మరుగుదొడ్ల కొరత సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి శాశ్వత పరిష్కారంలో భాగంగా దేశంలో 11 కోట్లకుపైగా మరుగుదొడ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా ప్రభుత్వ నిరంతర కృషితో గౌరవప్రదమైన జీవితంపై ప్రజలకు భరోసా లభించిందని చెప్పారు.

మునుపటి ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు అనేక అవరోధాలు, ఆటంకాలు తప్పలేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. బ్యాంకు లావాదేవీల సౌలభ్యం వారికి అందని ద్రాక్షలా ఉండేదని, బీమా సదుపాయంతోపాటు రుణలభ్యత, ఆర్థిక సహాయం కలలకు మాత్రమే పరిమితమని అన్నారు. కానీ, తమ ప్రభుత్వ హయాంలో జన్‌ధన్‌ ఖాతాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలవారేనని ఆయన స్పష్టం చేశారు. ఈ లబ్ధిదారులంతా నేడు తమ రూపే కార్డులను నిండు విశ్వాసంతో చూపగలగడం వారి ఆర్థిక సార్వజనీనత, సాధికారతకు ప్రతీక అని ఆయన సగర్వంగా ప్రకటించారు.

అధికార సముపార్జనకు ఒక ఉపకరణంగా కాంగ్రెస్ పార్టీ పవిత్ర రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని శ్రీ మోదీ విమర్శించారు. అధికార సంక్షోభం తలెత్తినప్పుడల్లా రాజ్యాంగాన్ని ఘోరంగా ధిక్కరించిందని ఆరోపించారు. అధికారం నిలబెట్టుకునే ప్రయత్నంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన ఎమర్జెన్సీ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పనే రాజ్యాంగ ప్రబోధమని, అప్పటి ప్రభుత్వం దాన్ని ఎన్నడూ పాటించింది లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు శ్రీకారం చుడితే ప్రతిపక్షం వ్యతిరేకించిందని గుర్తుచేశారు.

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ దాన్నొక బుజ్జగింపు ఉపకరణంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్యాంగం విరుద్ధమైనప్పటికీ కర్ణాటకలోని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మతం ప్రాతిపదికన ప్రభుత్వ టెండర్లలో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వార్తా కథనాలు వచ్చాయని తెలిపారు. వాస్తవానికి బుజ్జగింపు విధానాలు కొందరు తీవ్రవాదులకు ఉపయోగపడ్డాయిగానీ, ముస్లిం సమాజానికి ఎంతో హాని చేశాయన్నారు. వారికి చదువుసంధ్యలు లేకుండా చేసి, పేదరికంలోకి నెట్టాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలకు తిరుగులేని  రుజువు వక్ఫ్ చట్టమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా 2013లో తన ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి నాటి కాంగ్రెస్‌ సర్కారు అనేక రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ చట్టాన్ని సవరించిందని చెప్పారు.

ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తామంటూ అర్థవంతమైన చర్యలేవీ తీసుకోలేదని కాంగ్రెస్‌ను ప్రధాని విమర్శించారు. వారికి నిజంగా ముస్లిం సమాజంపై శ్రద్ధ ఉంటే, తమ పార్టీ అధ్యక్షుడిగా ముస్లింను నియమించి ఉండేవారని లేదా ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టికెట్లు ఇచ్చేవారని అన్నారు. వారి ఆలోచనలలో ఏనాడూ ముస్లింల వాస్తవ సంక్షేమానికి తావులేకపోవడమే వారి నిజ స్వరూపానికి నిదర్శనమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. పేదలు, నిరాశ్రయులైన మహిళలు, పిల్లల ప్రయోజనాలకు ఉద్దేశించిన విస్తృత వక్ఫ్ భూములను భూ మాఫియాలు దోపిడీ చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల భూములను కూడా ఆక్రమించుకుంటున్నాయని తెలిపారు. చివరకు పస్మాంద ముస్లిం సమాజానికీ ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టానికి సవరణ ద్వారా అటువంటి దోపిడీకి అడ్డుకట్ట పడిందని చెప్పారు. వక్ఫ్ బోర్డులు ఇకపై గిరిజన భూముల జోలికి వెళ్లకుండా సవరించిన చట్టంలో కొత్తగా కీలక నిబంధనను జోడించామని తెలిపారు. గిరిజన ప్రయోజనాల పరిరక్షణలో ఇదొక ముందడుగని ఆయన పేర్కొన్నారు. కొత్త నిబంధనలు వక్ఫ్ పవిత్రతను గౌరవిస్తూ పేదలతోపాటు పస్మాంద  ముస్లిం కుటుంబాలు, మహిళలు, బాలల హక్కులను కాపాడతాయన్నారు. ఇది రాజ్యాంగం ప్రబోధించే వాస్తవిక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ వారసత్వాన్ని గౌరవించడంతోపాటు భవిష్యత్తరాలకు స్ఫూర్తినిచ్చేలా 2014 నుంచి ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను ప్రధానమంత్రి ఉటంకించారు. దేశవిదేశాలలో ఆయనతో ముడిపడిన ప్రదేశాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన గుర్తుచేశారు. చివరకు ముంబయిలోని ఇందు మిల్లులో బాబాసాహెబ్ స్మారకం నిర్మాణం కోసం ప్రజలు ఆందోళన చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం బాబాసాహెబ్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని “మౌ’ సహా లండన్‌లోని ఆయన విద్యాభ్యాస ప్రదేశం, ఢిల్లీలోని మహాపరినిర్వాణ్‌ స్థల్ (సమాధి), నాగ్‌పూర్‌లోని దీక్షా భూమి”తోపాటు అన్ని కీలక స్థలాలను  చక్కగా తీర్చిదిద్ది, ‘పంచతీర్థం’ పేరిట సందర్శక ప్రదేశాలుగా మార్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల దీక్షాభూమిని సందర్శించి నివాళి అర్పించే అవకాశం తనకు లభించిందని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ వాగాడంబరం ప్రదర్శించిందని, బాబాసాహెబ్తోపాటు చౌదరి చరణ్ సింగ్‌ను ‘భారతరత్న’ పురస్కారంతో సత్కరించడంలో విఫలమైందని ప్రధాని విమర్శించారు. కేంద్రంలో బిజెపి మద్దతుగల ప్రభుత్వ హయాంలోనే బాబాసాహెబ్‌కు ఈ అత్యున్నత పురస్కార ప్రదానం చేయగా, చౌదరి చరణ్ సింగ్‌ను ఆ అవార్డుతో సత్కరించింది కూడా తమ పార్టీయేనని ఆయన సగర్వంగా వివరించారు.

పేదల సంక్షేమం, సామాజిక న్యాయ పథాన్ని బలోపేతం చేసినందుకు హర్యానా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నదని ప్రధాని ప్రశంసించారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి దారుణంగా ఉండేదని, ఉపాధి కోసం రాజకీయ సంబంధాలపై ఆధారపడాల్సి వచ్చిందని లేదా కుటుంబ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్ సైనీ ప్రభుత్వం ఇటువంటి అవినీతి పద్ధతులను నిర్మూలించడం తనకెంతో  సంతృప్తినిచ్చిందని చెప్పారు. లంచాలు, సిఫారసులు లేకుండా ఉద్యోగాలివ్వడంలో హర్యానా అద్భుత రికార్డు నెలకొల్పిందని కొనియాడారు. హర్యానాలో 25,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా గత ప్రభుత్వాలు ఎన్నో కుయుక్తులు పన్నాయని ఆయన ఆరోపించారు. కానీ, ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్ సైనీ పదవీ బాధ్యతలు చేపట్టగానే అర్హులైన అభ్యర్థులకు వేలాదిగా నియామక లేఖలు జారీచేశారని గుర్తుచేశారు. తమ పార్టీ సుపరిపాలనకు ఇదొక ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో వేలాది కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం ప్రశంసనీయమన్నారు.

దేశ రక్షణకు హర్యానా గణనీయ స్థాయిలో తోడ్పడిందని, సాయుధ దళాలలో పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్ర యువత పనిచేస్తుండటం ఇందుకు నిదర్శనమని శ్రీ మోదీ ప్రశసించారు. అయితే, ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్‌ (ఒఆర్‌ఒపి) పథకం అమలులో గత ప్రభుత్వం దశాబ్దాల పాటు మోసపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మాత్రమే ఈ పథకంపై సిబ్బంది ఆకాంక్షలను నెరవేర్చామని గుర్తుచేశారు. దీనికింద హర్యానాలోని మాజీ సైనికులకు రూ.13,500 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కాగా, గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం రూ.500 కోట్లు కేటాయించి సైనికులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. అలాగే దళితులు, వెనుకబడిన తరగతులు లేదా సైనికులకు ఏనాడూ మద్దతిచ్చింది లేదని ఆయన స్పష్టం చేశారు.

వికసిత భారత్‌ సంకల్పాన్ని బలోపేతం చేయడంలో హర్యానా పాత్రపై విశ్వాసం వ్యక్తం చేస్తూ-  క్రీడలు లేదా వ్యవసాయ రంగాల్లో ప్రపంచంపై ఈ రాష్ట్ర ప్రభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇక్కడి యువత శక్తిసామర్థ్యాలపై తనకుగల అపార విశ్వాసాన్ని ప్రకటించారు. హర్యానా ఆకాంక్షలు నెరవేర్చడంలో కొత్త విమానాశ్రయం, విమానాలు ఉత్ప్రేరకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కీలక ఘట్టం సందర్భంగా హర్యానా ప్రజలకు అభినందనలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంలో అత్యాధునిక ప్రయాణికుల ప్రాంగణం, కార్గో టెర్మినల్, ‘ఎటిసి’ భవనం ఉంటాయి. హిసార్ నుంచి అయోధ్యకు (వారానికి రెండుసార్లు) విమానాలు ప్రయాణిస్తాయి. అలాగే జమ్ము, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్‌లకు వారంలో మూడు విమాన సర్వీసులు నడుపుతారు. దీంతో విమానయాన సంధాన ప్రగతిలో హర్యానా మరింత ముందడుగు వేస్తుంది.

 

****


(Release ID: 2121691) Visitor Counter : 12