ప్రధాన మంత్రి కార్యాలయం
హర్యానాలోని యమునానగర్ లో అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
వికసిత భారత్ కోసం వికసిత హర్యానా- ఇదే మా సంకల్పం: ప్రధాని
దేశ నిర్మాణానికి విద్యుత్ కొరత అడ్డంకిగా మారకుండా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం: మేం ప్రారంభించిన పీఎం సూర్యగఢ్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లును సున్నాకు తగ్గించవచ్చు: ప్రధానమంత్రి
హర్యానా రైతుల సామర్థ్యాన్ని పెంచడమే మా ప్రయత్నం:ప్రధాని
Posted On:
14 APR 2025 3:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని యమునా నగర్లో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హర్యానా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవిత్ర భూమి హర్యానాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఇది సరస్వతీ మాత జన్మస్థలం, మంత్రాదేవి నివాసం, పంచముఖి హనుమాన్ జీ స్థానం, అలాగే పవిత్ర కపాలమోచన్ సాహిబ్ ఉన్న ప్రదేశంగా పేర్కొంటూ, "హర్యానా సంస్కృతి, భక్తి అంకితభావ సంగమం" అని ఆయన వర్ణించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. బాబాసాహెబ్ దార్శనికత, ప్రేరణ ఇప్పటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“యమునానగర్ కేవలం ఒక నగరం మాత్రమే కాదు. ఇది భారత్‌కు అత్యంత కీలకమైన పరిశ్రమల కేంద్రంగా మారింది. ప్లైవుడ్ నుంచి ఇత్తడి, ఉక్కు పరిశ్రమల వరకు, దేశ ఆర్థిక వ్యవస్థకు విశేషంగా సహకరిస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు. అలాగే, ఈ ప్రాంతంలోని సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, రుషి వేదవ్యాసుల పవిత్ర భూమి అయిన కపాల మోచన్ మేళా. గురు గోవింద్ సింగ్ జీ ఆయుధాల స్థలం వంటి ప్రదేశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్యానా ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో పంచకులా నుంచి యమునానగర్‌కు తరచూ వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటూ, ఈ నగరంతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. తనతో కలిసి పనిచేసిన నిబద్ధతతో కూడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ఈ ప్రాంతంలో ఉన్న కష్టించి పని చేయడం, నిబద్ధత సంప్రదాయాన్ని ప్రశంసించారు.
వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో హర్యానా అభివృద్ధిలో రెట్టింపు వేగాన్ని సాధిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో హర్యానా అభివృద్ధి కూడా భాగమని స్పష్టం చేశారు. మరింత వేగంతోనూ, ఎక్కువ స్థాయి లోనూ పనిచేయడం ద్వారా హర్యానా ప్రజలకు సేవ చేయడానికి, యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన తెలిపారు. ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఈ నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఈ కొత్త అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా హర్యానా ప్రజలకు హార్దిక అభినందనలు తెలియజేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, సామాజిక న్యాయానికి పరిశ్రమల అభివృద్ధి ఒక మార్గమని బాబాసాహెబ్ నమ్మేవారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న కమతాల సమస్యను బాబాసాహెబ్ గుర్తించారని చెబుతూ, వ్యవసాయ భూమి తక్కువగా ఉన్న దళితులకు పరిశ్రమల అభివృద్ధి ద్వారా అత్యధిక లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. పరిశ్రమలు దళితులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయనే బాబాసాహెబ్ దృష్టిని ప్రధాని పంచుకున్నారు. అలాగే, భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిలో బాబాసాహెబ్ పాత్రను ఆయన గుర్తు చేశారు. ఈ దిశగా దేశపు తొలి పరిశ్రమల మంత్రిగా ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి బాబాసాహెబ్ పనిచేసిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు.
పారిశ్రామికీకరణ, తయారీ రంగాల మధ్య సమన్వయాన్ని గ్రామీణ సౌభాగ్యానికి పునాదిగా దీనబంధు చౌదరి ఛోటు రామ్ జీ కూడా గుర్తించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. వ్యవసాయంతో పాటు చిన్నచిన్న పరిశ్రమల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచినప్పుడే గ్రామాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఛోటూ రామ్ జీ విశ్వసించారని ఆయన పేర్కన్నారు. గ్రామాలు రైతుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన చౌధరి చరణ్ సింగ్ జీ కూడా ఇదే దృష్టిని కలిగి ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయానికి తోడ్పాటుగా ఉండాలని, ఎందుకంటే ఈ రెండూ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభాలని చరణ్ సింగ్ నమ్మారని ఆయన వివరించారు.
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ సారాంశం తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలోనే ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ‘మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్’ ద్వారా ప్రభుత్వం తయారీ రంగంపై పెట్టిన దృష్టిని ఆయన ప్రత్యేకంగా వివరించారు. దళిత, వెనుకబడిన, అణగారిన, అట్టడుగు వర్గాల యువతకు గరిష్ట ఉపాధి అవకాశాలను సృష్టించడం, వారికి అవసరమైన శిక్షణను అందించడం, వ్యాపార ఖర్చులను తగ్గించడం, ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలను సన్నద్ధం చేయడం, భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి తగ్గట్టు నాణ్యతగా ఉండేలా చూడటం ఈ మిషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ లక్ష్యాలను సాధించడానికి నిరంతర విద్యుత్ సరఫరా ప్రాముఖ్యతను, నేటి ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, యమునానగర్, హర్యానాకు ప్రయోజనం చేకూర్చే దీన్ బంధ్ చౌదరి ఛోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్ పనులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. యమునానగర్ భారతదేశ ప్లైవుడ్ అవసరాల్లో సగభాగాన్ని ఉత్పత్తి చేస్తుందని, అల్యూమినియం, రాగి, ఇత్తడి పాత్రల తయారీకి కేంద్రంగా ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. యమునానగర్ నుంచి పెట్రో కెమికల్ ప్లాంట్ పరికరాలు పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడం వల్ల ఈ పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని, మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ కు తోడ్పడుతుందని ఆయన ఉద్ఘాటించారు.
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో విద్యుత్ పాత్ర కీలకమని చెబుతూ, వన్ నేషన్-వన్ గ్రిడ్, కొత్త బొగ్గు విద్యుత్ ప్లాంట్లు, సౌర శక్తి ప్రాజెక్టులు, అణు రంగం విస్తరణ వంటి కార్యక్రమాలతో సహా విద్యుత్ లభ్యతను పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న బహుముఖ ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో విద్యుత్ కొరత అడ్డంకి కాకూడదంటే విద్యుత్ ఉత్పత్తిని పెంచడం చాలా అవసరమని, 2014కు ముందు గత ప్రభుత్వ హయాంలో, తరచూ కరెంటు ఆగిపోయేదని, కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఇంకా ఇలాంటి సంక్షోభాలు కొనసాగేవని ఆయన అన్నారు. ఆ కాలంలో కర్మాగారాలు, రైల్వేలు, నీటి పారుదల వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ తన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసిందని, ఇప్పుడు పొరుగు దేశాలకు విద్యుత్ ను ఎగుమతి చేస్తోందని అన్నారు. హర్యానాలో విద్యుత్ ఉత్పత్తిపై తమ ప్రభుత్వం పెట్టిన దృష్టి వల్ల వచ్చిన ప్రయోజనాలను ప్రధాని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రం 16,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సామర్థ్యాన్ని 24,000 మెగావాట్లకు పెంచడమే లక్ష్యమని కూడా ఆయన ప్రకటించారు.
థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, ప్రజలే స్వయంగా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారేలా చేసే ద్వంద్వ దృష్టిని ప్రభుత్వం అవలంబించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందుకోసం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ఇళ్లపై సౌర ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్ బిల్లులు లేకుండా చూసుకోవచ్చని, అంతేకాక మిగతా విద్యుత్‌ను విక్రయించి ఆదాయాన్ని ఆర్జించవచ్చని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని, హర్యానా నుంచి లక్షలాది మంది ఈ పథకంలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం విస్తరణతో ఏర్పడుతున్న సేవల వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సౌర విద్యుత్ రంగం కొత్త నైపుణ్యాలను సృష్టిస్తోందని, ఎంఎస్ఎంఈలకు అవకాశాలను అందిస్తోందని, యువతకు అనేక ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరుస్తోందని ఆయన తెలిపారు.
చిన్న పట్టణాల్లోని చిన్న పరిశ్రమలకు సరిపడా విద్యుత్, ఆర్థిక వనరులను సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాన మంత్రి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిందన్నారు. చిన్న పరిశ్రమలు పెరిగే కొద్దీ ప్రభుత్వ మద్దతును కోల్పోతాయనే భయం లేకుండా విస్తరించడానికి వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని సవరించామని, ఈ దిశగా చిన్న పరిశ్రమలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడంతో పాటు క్రెడిట్ గ్యారంటీ పరిధిని పెంచామని పేర్కొన్నారు.
ముద్రా యోజన 10 సంవత్సరాల మైలురాయిని అధిగమించిందని, దీని కింద రూ .33 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుటుంబాలకు చెందిన వారేనని స్పష్టం చేశారు. భారత యువత గొప్ప కలల్ని నెరవేర్చేందుకు చిన్నచిన్న పరిశ్రమలు కూడా కీలక పాత్ర పోషించాలి అనే దిశగా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదని ప్రధాని తెలిపారు.
ప్రతి భారతీయునికి ఆహారం అందించే హర్యానా రైతుల కృషిని ప్రధానమంత్రి, ప్రశంసించారు. రైతుల సంతోషాలు, సవాళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థిరమైన భాగస్వాములుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. హర్యానా రైతులను శక్తిమంతులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 24 పంటలను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా హర్యానాలో లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారని, ఈ పథకం కింద రూ.9,000 కోట్లకు పైగా క్లెయిమ్లు వచ్చాయని తెలిపారు. అలాగే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా హర్యానా రైతులకు రూ.6,500 కోట్లు పంపిణీ చేశామని, ఇది వారి జీవనోపాధికి, వృద్ధికి మరింత తోడ్పడుతుందని పేర్కొన్నారు.
వలసకాలం నాటి నీటి పన్నును రద్దు చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, ఇది కాలువ నీటిపై పన్నులు చెల్లించకుండా రైతులకు ఉపశమనం కలిగించిందని, ఈ పన్ను కింద రూ .130 కోట్లకు పైగా బకాయిలను కూడా మాఫీ చేశారని పేర్కొన్నారు. రైతులు, పశువుల యజమానులకు కొత్త ఆదాయ అవకాశాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. ఆవు పేడ, వ్యవసాయ అవశేషాలు, ఇతర సేంద్రియ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు వ్యర్థాలను నిర్వహించడానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి వీలు కల్పించే గోబర్ధన్ యోజన గురించి కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ఏడాది బడ్జెట్ లో దేశవ్యాప్తంగా 500 గోబర్ధన్ ప్లాంట్లను ఏర్పాటును ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యమునానగర్ లో నూతన గోబర్ధన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం వల్ల నగరపాలక సంస్థకు ఏటా రూ.3 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. గోబర్ధన్ యోజన స్వచ్ఛ భారత్ అభియాన్ కు కూడా దోహదం చేస్తోందని, పరిశుభ్రత, సుస్థిరత లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెడుతోందని తెలిపారు.
అయోధ్య ధామ్ కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించిన హిసార్ లో తాను గతంలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అభివృద్ధి పథంలో హర్యానా శరవేగంగా పురోగతి సాధిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. రేవారి పట్టణానికి కొత్త బైపాస్ ను ప్రకటించిన ప్రధానమంత్రి.... ఇది మార్కెట్లు, చౌరస్తాలు, రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బైపాస్ ద్వారా వాహనాలు పట్టణాన్ని సాఫీగా దాటి వెళ్లగలవని అన్నారు. నాలుగు లైన్లుగా నిర్మించే ఈ బైపాస్ ఢిల్లీ నుంచి నార్నౌల్‌కు ప్రయాణ సమయాన్ని ఒక గంట వరకు తగ్గిస్తుందని ఆయన తెలిపారు. ఈ అవకాశంపై ప్రజలను ఆయన అభినందించారు.
రాజకీయాలు తమకు ఒక సేవా మాధ్యమం అని, ప్రజలకు, దేశానికి సేవ చేయడమే తమ మార్గమని తెలియచేస్తూ, "హర్యానాలో స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మా పార్టీ వాగ్దానాలను నెరవేరుస్తుంది” అన్నారు. ఇక్కడ మూడోసారి ఎన్నికైన తరువాత కూడా ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని విపక్ష పాలిత రాష్ట్రాలతో సరిపోల్చిన ప్రధాని, అక్కడ ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతోందని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన ప్రస్తావించారు, అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని అన్నారు. కర్ణాటకలో కూడా ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యుత్, పాలు, బస్సు ఛార్జీలు, విత్తనాలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆయన ప్రస్తావించారు. సోషల్ మీడియాలో చూస్తున్నట్టుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు, అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు, ముఖ్యమంత్రి సన్నిహితులు కూడా కర్ణాటకను అవినీతిలో నంబర్ వన్ గా అంగీకరించారని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అడవులను నరికివేసి ప్రకృతికి, వన్యప్రాణులకు హాని కలిగిస్తోందని విమర్శించారు. పరిపాలనకు సంబంధించిన రెండు నమూనాలను ఆయన పోల్చారు. తమ పార్టీ నమూనా నిజమైనదని, అభివృద్ధి చెందిన భారత్ కోసం అంకితమైందని, అయితే ప్రతిపక్షాల నమూనా మోసపూరితమని, కేవలం అధికారంపైనే అవి దృష్టి సారించాయని పేర్కొన్నారు. అభివృద్ధి పట్ల తమ పార్టీ నిబద్ధతకు యమునానగర్ లో జరుగుతున్న ప్రయత్నాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
వైశాఖీ పండుగ వైశిష్ట్యాన్ని, జలియన్‌వాలా బాగ్ మారణకాండ 106వ వార్షికోత్సవాన్ని ప్రస్తావిస్తూ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా, బ్రిటిష్ పాలకుల క్రూరత్వాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఆ దురంతం భారత చరిత్రలో ఒక బాధాకర అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతంలోని మరొక ముఖ్యమైన కోణాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బ్రిటిష్ ప్రభుత్వంలోని ప్రముఖ న్యాయవాది, ఉన్నతాధికారి అయిన శంకరన్ నాయర్ మానవత్వం కోసం, దేశం కోసం నిలబడి పోరాడడాన్ని అప్రతిహత చైతన్యంగా ప్రధానమంత్రి అభివర్ణించారు.. శంకరన్ నాయర్, ఆ క్రూరత్వాలకు నిరసనగా తన పదవి నుంచి రాజీనామా చేసి, విదేశీ పాలనపై ధీటుగా గొంతెత్తిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. జలియన్ వాలాబాగ్ కేసును ఒంటరిగా వాదించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించి, కోర్టులో జవాబుదారీగా నిలిచారని, కేరళకు చెందిన ఒక వ్యక్తి పంజాబ్ లో మారణకాండకు, బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా ఎలా నిలబడ్డాడో చూపించే శంకరన్ నాయర్ సాహసం "ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్"కు ఒక అద్భుతమైన ఉదాహరణగా ప్రధాని అభివర్ణించారు. ఈ ఐక్యత, ప్రతిఘటన స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటం వెనుక నిజమైన ప్రేరణ అని, అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా ప్రయాణంలో చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
శంకరన్ నాయర్ రచనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సమాజానికి మూలస్తంభాలైన పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిరంతర కృషి కొనసాగిస్తాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. సమిష్టి కృషి హర్యానాను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ, కేంద్రమంత్రులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ రావు ఇందర్ జిత్ సింగ్, శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు, చివరి స్థానం వరకు విద్యుత్ చేరాలన్న దృష్టితో యమునానగర్‌లో దీన్ బంధు ఛోటూ రామ్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల ఆధునిక యూనిట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 8,470 కోట్ల వ్యయంతో, 233 ఎకరాల్లో నిర్మించే ఈ యూనిట్ హర్యానా రాష్ట్రం విద్యుత్ స్వయం సమృద్ధిని గణనీయంగా పెంచి, రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గోబర్ధన్ ( గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో- ఆగ్రో రిసోర్సెస్ ధన్) దార్శనికతను ముందుకు తీసుకెళ్తూ, యమునానగర్‌లోని ముఖరాబ్‌పూర్‌లో కంఫ్రెస్‌డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2,600 మెట్రిక్ టన్నులు. సమర్థవంతమైన సేంద్రీయ వ్యర్థాల నిర్వహణకు ఇది సహాయపడుతుంది, అదే సమయంలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది.
భారత్ మాల పరియోజన కింద సుమారు రూ.1,070 కోట్ల విలువైన 14.4 కిలోమీటర్ల రేవారీ బైపాస్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది రేవారీ నగరంలో రద్దీని తగ్గిస్తుంది, ఢిల్లీ-నార్నౌల్ ప్రయాణ సమయాన్ని ఒక గంట తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను పెంచుతుంది.
(Release ID: 2121687)
Visitor Counter : 10
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam