ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 11న ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువగల అభివృద్ధి పనులు ప్రారంభం
రహదారి, విద్యుత్, పర్యాటక రంగ ప్రాజెక్టులకు ప్రాధాన్యం
కొత్తగా రిజిస్టరైన స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక సూచిక సర్టిఫికెట్లు
మధ్యప్రదేశ్ ఈశాగఢ్ గురూజీ మహరాజ్ మందిర దర్శనం, పూజలు
Posted On:
09 APR 2025 9:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 11న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. వారణాసిలో ప్రధాని... ఉదయం 11 గంటలకు రూ. 3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3:15 గంటలకు మధ్యప్రదేశ్ చేరుకుని ఈశాగఢ్ లోని గురూజీ మహరాజ్ మందిరంలో దైవదర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు ఆనందపూర్ ధామ్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి కార్యక్రమాలు
వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వడంలో భాగంగా – ముఖ్యంగా వారణాసిలో రహదారి అనుసంధానం మెరుగుదల సహా, పలు రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. వారణాసి రింగు రోడ్డు - సారనాథ్ మధ్య వంతెనకు శంకుస్థాపన... నగరంలోని భిఖారీపూర్, మండువాడీ రైల్వే క్రాసింగు వద్ద ఫ్లై ఓవర్లు... వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం, 31వ జాతీయ రహదారి వద్ద రూ. 980 కోట్ల వ్యయం కాగల హైవే అండర్ పాస్ సొరంగ రహదారి నిర్మాణ పనులకు శ్రీ మోదీ శంకుస్థాపనలు చేస్తారు.
విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో వారణాసి డివిజన్లోని జౌన్ పూర్, ఛందౌలీ, గాజీపూర్ జిల్లాల్లో రూ. 1,045 కోట్ల వ్యయం కాగల రెండు 400 కిలోవాట్లు, ఒక 220 కిలోవాట్ల సబ్ స్టేషన్లు... అనుబంధ పంపిణీ లైన్లను ప్రారంభిస్తారు. వారణాసి చౌకీఘాట్ వద్ద 220 కిలోవాట్ల విద్యుత్ సబ్ స్టేషన్ కు, గాజీపూర్ లో 132 కిలోవాట్ల సబ్ స్టేషన్ కు శంకుస్థాపనలు చేస్తారు. వారణాసి నగర విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పనులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పనులకు సుమారు రూ. 775 కోట్లు ఖర్చవుతుంది.
భద్రతా సిబ్బంది సౌకర్యార్థం పీఏసీ రాంనగర్ క్యాంపస్ లోని పోలీస్ లైన్, బ్యారాక్స్ వద్ద ట్రాన్సిట్ హాస్టల్
(తాత్కాలిక బస) కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ ప్రాంతంలోని వివిధ పోలీసు స్టేషన్ల నూతన పరిపాలన భవనాలకు... పోలీస్ లైన్ ప్రాంగణంలో రెసిడెన్షియల్ హాస్టల్ కు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు.
అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వివిధ విద్యారంగ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో భాగంగా పింద్రా లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.. బర్కీ గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ కళాశాల.. 356 గ్రామీణ గ్రంథాలయాలు, 100 అంగన్వాడీ కేంద్రాలను ప్రధాని ప్రారంభిస్తారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద 77 ప్రాథమిక పాఠశాల భవనాల పునరుద్ధరణకు, వారణాసిలోని చోలాపూర్‌లో కస్తూర్బా గాంధీ పాఠశాల కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు ఉదయ్ ప్రతాప్ కళాశాలలో ఫ్లడ్‌లైట్లు, ప్రేక్షకుల గ్యాలరీతో కూడిన సింథటిక్ హాకీ టర్ఫ్‌కు.. శివపూర్‌లో మినీ స్టేడియానికీ ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
గంగా నది వద్ద సామ్నే ఘాట్, శాస్త్రి ఘాట్ పునరాభివృద్ధి… జల్ జీవన్ మిషన్ కింద రూ. 345 కోట్ల విలువైన 130 గ్రామీణ తాగునీటి పథకాలు... వారణాసిలోని ఆరు మునిసిపల్ వార్డుల అభివృద్ధి... వారణాసిలోని వివిధ ప్రదేశాల్లో ల్యాండ్‌స్కేపింగ్, శిల్పకళా ప్రతిష్ఠాపన పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
హస్తకళాకారుల కోసం ఎంఎస్ఎంఈ యూనిటీ మాల్... మోహన్‌సరాయ్ లో ట్రాన్స్‌పోర్ట్ నగర్ స్కీమ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు... డబ్ల్యూటీపీ భేలుపూర్‌లో 1 మెగావాట్ సౌరశక్తి కేంద్రం... 40 గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ హాళ్ళూ... వారణాసిలోని వివిధ పార్కుల సుందరీకరణకు పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
70 ఏళ్ళు పైబడి, తొలిసారిగా ఆరోగ్య పథకం నుంచి లబ్ధి పొందుతున్న వృద్ధులకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ వయ్ వందన కార్డులను అందజేస్తారు. తబలా, చిత్రకళ, ఠండాయి, తిరంగా బర్ఫీ వంటి స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) పత్రాలను అందజేస్తారు. బనాస్ డెయిరీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ పాల సరఫరాదారులకు శ్రీ మోదీ రూ. 105 కోట్లకు పైగా బోనస్ సొమ్మును బదిలీ చేస్తారు.
మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి కార్యక్రమాలు
భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పెంపొందించాలన్న ఆశయానికి అనుగుణంగా, మధ్యప్రదేశ్ అశోక్‌నగర్ జిల్లా, ఈశాగఢ్ తాలూకాలోని ఆనంద్‌పూర్ ధామ్‌ను ప్రధానమంత్రి సందర్శిస్తారు. దైవదర్శనం అనంతరం గురూజీ మహారాజ్ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అటుపై ఆనంద్‌పూర్ ధామ్‌లోని ఆలయ సముదాయాన్ని కూడా ప్రధాని సందర్శిస్తారు.
ఆనంద్‌పూర్ ధామ్ ఆధ్యాత్మిక, దాతృత్వ ప్రయోజనార్థం స్థాపించారు. 315 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో 500 పైగా ఆవులతో కూడిన ఆధునిక గోశాల... శ్రీ ఆనంద్‌పూర్ ట్రస్ట్ వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సుఖ్‌పూర్ గ్రామంలో ధర్మాసుపత్రి… సుఖ్‌పూర్, ఆనంద్‌పూర్ లలో పాఠశాలలు... దేశవ్యాప్తంగా వివిధ సత్సంగ్ కేంద్రాలను కూడా ఆనంద్‌పూర్ ట్రస్ట్ నిర్వహిస్తోంది.
***
(Release ID: 2120756)
Visitor Counter : 26
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada