ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూస్18 ‘రైజింగ్ భారత్ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


· “భారత్‌పై ప్రపంచ దృష్టి... అంచనాలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి”

· “కేవలం దశాబ్దం వ్యవధిలోనే భారత్‌ రెట్టింపు వేగంతో దూసుకెళ్లడమేగాక ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కూడా రెట్టింపు చేసింది”

· “మన దేశం నిలకడగా... స్థిరంగా వృద్ధి చెందుతుందని భావించిన వారు నేడు శరవేగంతో పరుగులు తీసే సాహసోపేత భారత్‌ను చూస్తారు”

· “అభివృద్ధికి ప్రధాన శత్రువు అనవసర జాప్యమే”

· “ఆకాంక్షలు వృద్ధికి సారథ్యం వహిస్తే అది సార్వజనీనం.. సుస్థిరం కాగలదు”

· “వక్ఫ్‌ చట్టాలు ప్రతి ఒక్కరికీ... ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్నిస్తాయి”

· “భారత కళాకారులు తమదైన ముద్రతో సారాంశాన్ని సృష్టించి... అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించగలిగేలా ‘వేవ్స్‌’ సాధికారతనిస్తుంది”

Posted On: 08 APR 2025 10:26PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో న్యూస్‌ 18 నిర్వహించిన ‘ఉషోదయ భారత్‌ శిఖరాగ్ర సదస్సు’ (రైజింగ్ భారత్ సమ్మిట్‌)లో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు ద్వారా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగాగల గౌరవనీయ అతిథులతో మమేకమయ్యే అవకాశం కల్పించిందంటూ నెట్‌వర్క్18 యాజమాన్యానికి ఆయన ఈ సందదర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి భారత యువత ఆకాంక్షలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సదస్సు నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదే వేదికపై నిర్వహించిన ‘వికసిత భారత్‌ యువ నాయకత్వ గోష్ఠి’ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలనే యువత కలలు, సంకల్పం, అభినివేశం ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించే 2047 నాటికి భారత్‌ పురోగమన పథాన్ని వివరిస్తూ అడుగడుగునా నిరంతర చర్చలు విలువైన అవగాహననిస్తాయని పేర్కొన్నారు. అమృత కాల తరాన్ని శక్తియుతం చేస్తూ.. మార్గదర్శకత్వం వహిస్తూ.. వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌ కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి దూసుకెళ్లిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అందుకే, “భారత్‌పై ప్రపంచ దృష్టి, అంచనాలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే “అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురైనా, ఒక్క దశాబ్దంలోనే భారత్ రెట్టింపు వేగంతో దూసుకెళ్లింది... అదే ఊపుతో ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కూడా రెట్టింపు చేసింది” అని వివరించారు. భారత పురోగమనం నిలకడగా, స్థిరంగా సాగుతుందని ఒకనాడు భావించినవారు నేడు ‘శరవేగంతో దూసుకెళ్లే సాహసోపేత భారత్‌’ను ప్రత్యక్షంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మన దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని ఆయన ప్రగాఢ విశ్వాసం వెలిబుచ్చారు. “ఈ అసమాన ప్రగతికి సారథ్యం వహిస్తున్నది యువత ఆశయాలు, ఆకాంక్షలే”నని స్పష్టం చేశారు. కాబట్టి, వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే నేటి  జాతీయ ప్రాథమ్యమని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ రోజు తేదీ ఏప్రిల్‌ 8 కాగా, మరో రెండు రోజులు గడిస్తే 2025 సంవత్సరంలో తొలి 100 రోజులు పూర్తవుతాయని గుర్తుచేస్తూ, ఈ వంద రోజులలో తీసుకున్న నిర్ణయాలు భారత యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఈ 100 రోజుల ప్రస్తావన  కేవలం నిర్ణయాల గురించి మాత్రమే కాదు... భవిష్యత్తుకు పునాది వేయడానికి సంబంధించిన అంశాల గురించి కూడా” అని ఆయన స్పష్టం చేశారు. విధానాలను అవకాశాలను అందుకోగల మార్గాలుగా మార్చామని పేర్కొన్నారు. యువ నిపుణులు, వ్యవస్థాపకులకు ప్రయోజనం చేకూర్చేలా రూ.12 లక్షల వరకు వార్షికాదాయంపై పన్ను రద్దు సహా కీలక కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యకు 10,000 కొత్త సీట్లు, ఐఐటీలలో 6,500 కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయని, విద్యారంగ విస్తరణతోపాటు ఆవిష్కరణల వేగం పెరిగిందనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, దేశం నలుమూలలకూ ఆవిష్కరణలు చేరేవిధంగా 50,000 కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను  ఏర్పాటు చేశామని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ ప్రయోగశాలలు ఆవిష్కరణలలో గొలుసుకట్టు ప్రతిస్పందనకు దోహదం చేస్తాయని ఆయన వివరించారు. అలాగే కృత్రిమ మేధ (ఏఐ), నైపుణ్యాభివృద్ధి దిశగా కొత్త అత్యున్నత నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు ఇవి తోడ్పడతాయన్నారు. తద్వారా యువతను భవిష్యత్‌ సంసిద్ధతతో తీర్చదిద్దడానికి వీలుంటుందని చెప్పారు. ఆలోచనల నుంచి ప్రభావం దాకా పయనంలో సౌలభ్యం కల్పిస్తూ 10,000 కొత్త ‘పీఎం పరిశోధన సభ్యత్వాల’ను కూడా శ్రీ మోదీ ప్రకటించారు. అంతరిక్ష రంగం తరహాలోనే అణుశక్తి రంగంలోనూ అవకాశాలు అందివస్తాయని, దీంతో విభజన రేఖలు తొలగి  ఆవిష్కరణలకు బాటలు పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. గిగ్ ఆర్థిక వ్యవస్థలోని యువత కోసం సామాజిక భద్రత పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. గతంలో వీరికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదని, ఇప్పుడు ప్రభుత్వ విధానాలకు వారూ కేంద్రకంగా ఉన్నారని వివరించారు. ఎస్సీ/ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్లదాకా టర్మ్ లోన్‌ అంశాన్ని కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. సార్వజనీత వాగ్దానంగా మిగిలిపోకుండా నేడొక విధానంగా రూపొందిందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలన్నీ దేశ యువతకు ప్రత్యక్ష  ప్రయోజనం చేకూరుస్తాయని, దేశ ప్రగతి వారి పురోగమనంతో ముడిపడి ఉండటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.

“మన దేశం గడచిన 100 రోజుల్లో సాధించిన అసమాన విజయాలు ప్రగతి విషయంలో భారత్‌ ఏమాత్రం రాజీపడబోదని, ఆ వేగాన్ని ఆపడం ఎవరితరమూ కాదని, అచంచల దీక్షతో ముందడుగు వేస్తుందని రుజువు చేస్తున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు. ఈ 100 రోజుల వ్యవధిలోనే అంతరిక్షంలో ఉపగ్రహాల జోడింపు, విడదీత ద్వారా ప్రపంచంలో ఈ సామర్థ్యంగల నాలుగో దేశంగా భారత్‌ అవతరించిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించిందని, 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని దాటిందని గుర్తుచేశారు. మరోవైపు 1,000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రికార్డు సహా కీలక ఖనిజాల కార్యక్రమం ప్రారంభాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం 8వ వేతన కమిషన్ ఏర్పాటు నిర్ణయం, రైతులకు ఎరువుల సబ్సిడీ పెంపును కూడా శ్రీ మోదీ గుర్తుచేశారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను ఇది చాటిచెబుతున్నదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 3 లక్షలకు పైగా కుటుంబాల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం, స్వామిత్వ పథకం కింద 65 లక్షలకుపైగా ఆస్తి కార్డుల పంపిణీని కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఈ 100 రోజుల్లోనే ప్రపంచంలోని ఎత్తయిన సొరంగాల్లో ఒకటైన సోనామార్గ్ ను దేశానికి అంకితం చేశామని చెప్పారు. భారత నావికాదళంలో ‘ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్’ నౌకలను సమకూర్చడాన్ని కూడా గుర్తుచేశారు. సైన్యం కోసం ‘దేశీయంగా’ తయారు చేసిన ‘తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం ఇవ్వడాన్ని కూడా ఆయన ఉదహరించారు. వక్ఫ్ సవరణకు బిల్లు ఆమోదం సామాజిక న్యాయం వైపు ఓ కీలక ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 100 రోజులు కేవలం 100 నిర్ణయాలను  మాత్రమేగాక 100 సంకల్పాల సాకారాన్ని, తీర్మానాలను నెరవేర్చడాన్ని సూచిస్తాయని ఆయన అన్నారు.

“ఉషోదయ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న తారకమంత్రం ఈ పనితీరు మాత్రమే”నని ప్రధానమంత్రి ఇటీవలి తన రామేశ్వరం పర్యటనను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఆయన చారిత్రక పంబన్ వంతెనను ప్రారంభించారు. బ్రిటిష్‌ పాలకులు 125 ఏళ్ల కిందట అక్కడ నిర్మించిన వంతెన చరిత్రకు సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు.  అలాగే అనేక తుఫానులకు ఎదురొడ్డి నిలిచిందని, గణనీయ కష్టనష్టాలను చవిచూసిందని ఆయన వివరించారు. దీనికి సంబంధించి ఏళ్ల తరబడి ప్రజలు మొరపెట్టుకుంటున్నా మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. అయితే, కొత్త వంతెన పనులు తమ ప్రభుత్వం హయాంలోనే మొదలై,  ప్రారంభోత్సవం కూడా చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. అంతేగాక దేశం తొలి ‘వర్టికల్‌ లిఫ్ట్’ రైలు-సముద్ర వంతెనను రూపొందించుకున్నదని పేర్కొన్నారు.

ఆలస్యంతో అన్నిటికీ అనర్థమేనని స్పష్టం చేస్తూ- పనితీరు, తక్షణ కార్యాచరణే పురోగమన సారథులని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మేరకు “అభివృద్ధికి ప్రధాన శత్రువు జాప్యమే... కాబట్టే, ఈ శత్రువును రూపుమాపేందుకు మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అస్సాంలోని బోగీబీల్‌ వంతెన గురించి ప్రస్తావిస్తూ- దీనికి 1997లో నాటి ప్రధాని శ్రీ దేవెగౌడ శంకుస్థాపన చేయగా, ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి తన హయాంలో పనులను ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే, అనంతర ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాజెక్ట్ స్తంభించిపోగా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో లక్షలాది ప్రజలు నానా అగచాట్లూ పడ్డారని తెలిపారు. చివరకు తమ ప్రభుత్వం 2014లో ఈ ప్రాజెక్టును పునఃప్రారంభించి, నాలుగేళ్లలో... 2018కల్లా పూర్తి చేసిందని వివరించారు. అదేవిధంగా కేరళలోని కొళ్లం బైపాస్ రోడ్డు ప్రాజెక్టు కూడా 1972 నుంచి స్తంభించిందని, గత ప్రభుత్వాలు 50 ఏళ్లపాటు అరకొర పనులతో కాలక్షేపం చేయగా, తమ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలోనే పూర్తిచేశామని పేర్కొన్నారు.

అంతేకాకుండా నవీ ముంబయి విమానాశ్రయంపై 1997లో చర్చలు మొదలు కాగా, 2007లో దీనికి ఆమోదముద్ర పడిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై చర్యలేవీ తీసుకోలేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక దీన్ని వేగిరపరచిందని, నవీ ముంబయి విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు ప్రారంభమయ్యే రోజు ఇక ఎంతో దూరం లేదని ఆయన వివరించారు.

 

ప్రధానమంత్రి ముద్రా యోజనకు పదేళ్లు పూర్తవుతున్నాయంటూ ఏప్రిల్ 8 ప్రత్యేకతను గుర్తు చేసిన ప్రధానమంత్రి.. గతంలో హామీదారు లేకుండా బ్యాంకు ఖాతా తెరవడం కూడా సవాలుగా ఉండేదని, బ్యాంకు రుణాలు సాధారణ కుటుంబాలకు కలగానే ఉండేవని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేయడం మినహా ఏ రకమైన పూచీకత్తూ ఇవ్వలేని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, భూమిలేని కూలీలు, మహిళలు సహా అణగారిన వర్గాలందరి ఆకాంక్షలను ముద్రా యోజన నెరవేర్చిందన్నారు. వారి కలలు, ఆకాంక్షలు, కృషికి విలువ లేదా అని ప్రశ్నించిన శ్రీ మోదీ.. గత దశాబ్ద కాలంలో ముద్రా యోజన కింద ఏ హామీ లేకుండానే 52 కోట్ల రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. ట్రాఫిక్ లైట్ గ్రీన్ సిగ్నల్ చూపడానికి పట్టేంత సమయంలో 100 ముద్రా రుణాలు క్లియరవుతున్నాయని, పళ్లు తోముకున్నంత సమయంలో 200 రుణాలకు అనుమతి లభిస్తోందని, రేడియోలో ఇష్టమైన పాట విన్నంత సమయంలో 400 రుణాలు మంజూరవుతున్నాయంటూ... ఈ పథకం ఎంత వేగంగా అమలవుతోందో ఆయన పేర్కొన్నారు. ఏదైనా డెలివరీ యాప్ లో ఆర్డర్ పెట్టడానికి పట్టే సమయంలో 1,000 ముద్రా రుణాలు మంజూరవుతున్నాయనీ, అలాగే ఓటీటీలో ఓ ఎపిసోడ్ పూర్తయ్యేలోగా ముద్రా యోజన కింద 1,000 వ్యాపారాలు మొదలవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

“ముద్రా యోజనకు పూచీకత్తులు అవసరం లేదు. ప్రజలపై నమ్మకముంచింది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 11 కోట్ల మంది తొలిసారిగా స్వయం ఉపాధి కోసం రుణాలు పొందే అవకాశం లభించిందనీ.. తద్వారా మొదటిసారిగా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని తెలిపారు. గత దశాబ్ద కాలంలో ముద్రా యోజన ద్వారా 11 కోట్ల కలలకు రెక్కలొచ్చాయని వ్యాఖ్యానించారు. గ్రామాలూ చిన్నపట్టణాలన్నింటినీ చేరుతూ.. ఈ పథకం కింద దాదాపు రూ.33 లక్షల కోట్లు పంపిణీ చేశామని, అనేక దేశాల జీడీపీ కన్నా ఇది ఎక్కువని ఆయన పేర్కొన్నారు. “ఇది కేవలం మైక్రో ఫైనాన్స్ మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో విప్లవాత్మకమైన మార్పు కూడా’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకులను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 100కు పైగా జిల్లాలను ‘వెనుకబడిన’ జిల్లాలుగా ప్రకటించి నిర్లక్ష్యానికి గురిచేశాయని, వాటిలో చాలా వరకు ఈశాన్య, గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అత్యుత్తమ ప్రతిభావంతులను కాకుండా.. అధికారులను శిక్షగా ఈ జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చేవారని, ‘వెనుకబడిన’ ప్రాంతాలను అలాగే స్తబ్దుగా ఉంచే సంకుచిత మనస్తత్వానికి ఇది నిదర్శనమని అన్నారు. ఈ ప్రాంతాలను ఆకాంక్షాత్మక జిల్లాలుగా గుర్తించడం ద్వారా తమ ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పాలనలో ఈ జిల్లాలకు ప్రాధాన్యమిచ్చామని, ప్రతిష్ఠాత్మక పథకాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేశామని, వివిధ అంశాల్లో అభివృద్ధిని పర్యవేక్షించామని చెప్పారు. ఇప్పుడు ఈ జిల్లాలు చాలా అంశాల్లో అనేక రాష్ట్రాలు, జాతీయ సగటులను అధిగమించాయని వ్యాఖ్యానించారు. అది స్థానిక యువతకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ‘‘మేం కూడా సాధిస్తాం, మేం కూడా పురోగమిస్తాం’’ అని ఈ జిల్లాల్లో యువత ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పగలదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు, జర్నళ్ల నుంచి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమానికి గుర్తింపు దక్కిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయమే స్ఫూర్తిగా.. ఇప్పుడు 500 ఆకాంక్షాత్మక బ్లాకులపై ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. “ఆకాంక్షలతో ముందుకు నడిచే వృద్ధి సమ్మిళితమైనది, సుస్థిరమైనది’’ అని ఆయన అన్నారు.

ఒక దేశం త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే శాంతి, సుస్థిరత, భద్రతా భావం అత్యావశ్యకమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. ‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ గర్వంగా తలెత్తుకోగలమో’’ అన్న గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కవితా పంక్తిని ఈ సందర్భంగా ఉటంకించారు. నిర్భయాన్నీ దృఢచిత్తాన్నీ ఆయన బోధించారని చెప్పారు. భయం, ఉగ్రవాదం, హింసతో కూడిన వాతావరణాన్ని భారత్ దశాబ్దాలుగా ఎదుర్కొన్నదని, దీనివల్ల యువత తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని తరాలుగా జమ్మూ కాశ్మీర్‌ యువకులు బాంబు దాడులు, కాల్పులు, రాళ్ల దాడులకు గురయ్యారనీ.. గత ప్రభుత్వాలు ఈ మంటలను ఆర్పే ధైర్యం చేయలేకపోయాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ బలమైన రాజకీయ సంకల్పం, సునిశిత చర్యలు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిని సమూలంగా మార్చేశాయని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్ యువత నేడు అభివృద్ధిలో క్రియాశీలకంగా భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు.

ఈశాన్య ప్రాంతంలో నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, శాంతిని పెంపొందించడంలో తమ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఒకప్పుడు 125కు పైగా జిల్లాలు హింసలో కూరుకుపోయాయని, నక్సలిజం మొదలవడంతో ప్రభుత్వ పరిధి అక్కడితో ముగిసిందని అన్నారు. పెద్ద సంఖ్యలో యువత నక్సలిజం బాధితులయ్యారని పేర్కొన్నారు. ఈ యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత దశాబ్ద కాలంలో 8 వేల మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయి హింసామార్గాన్ని వీడారని తెలిపారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఇప్పుడు 20 కన్నా తక్కువగానే ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కూడా దశాబ్దాల తరబడి వేర్పాటువాదాన్ని, హింసను భరించాయని శ్రీ మోదీ చెప్పారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం 10 శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసిందని, 10,000 మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి అభివృద్ధి బాట పట్టారని తెలిపారు. వేలాదిగా యువత ఆయుధాలను వదిలిపెట్టడమే కాకుండా.. తమ భవిష్యత్ వర్తమానాలను కాపాడుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వాటిని మరుగున పడి ఉండేలా చేశారని శ్రీ మోదీ అన్నారు. 20వ శతాబ్దపు రాజకీయ తప్పిదాలు 21వ శతాబ్దపు తరాలపై భారం మోపకూడదని, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. సంతుష్టీకరణ రాజకీయాలు దేశ అభివృద్ధికి సవాలుగా పరిణమించాయన్నారు. వక్ఫ్ సంబంధిత చట్టాలకు ఇటీవలి సవరణను ప్రస్తావిస్తూ.. దీనిపై ఇప్పుడు నడుస్తున్న చర్చలన్నీ బుజ్జగింపు రాజకీయాల ఫలితమేనని, ఇది కొత్తదేమీ కాదని ప్రధానమంత్రి అన్నారు. “సంతుష్టీకరణకు భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో బీజం పడింది” అని ఆయన అనారు. ఇతర దేశాల్లాగా కాకుండా స్వాతంత్య్రం కోసం విభజనను భారత్ ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో దేశ ప్రయోజనాల కన్నా అధికారానికే ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమన్నారు. ప్రత్యేక దేశం అనే ఆలోచన సాధారణ ముస్లిం కుటుంబాల కోరిక కాదని, కొందరు అతివాదులు దానిని ప్రచారం చేశారని శ్రీ మోదీ అన్నారు. ఏకపక్షంగా అధికారాన్ని పొందడం కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు వారికి మద్దతిచ్చారని విమర్శించారు.

సంతుష్టీకరణ రాజకీయాలు కాంగ్రెస్‌కు అధికారాన్నీ.. కొందరు అతివాద నాయకులకు శక్తిని, సంపదను ఇచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. కానీ, ఓ సాధారణ ముస్లింకు దీనివల్ల లభించిందేమిటని ప్రశ్నించారు. నిరుపేద ముస్లింలు నిర్లక్ష్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. షా బానో కేసును ఉదహరిస్తూ ముస్లిం మహిళలు అన్యాయాన్ని ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు. సంతుష్టీకరణ కోసం ఆ కేసులో వారి రాజ్యాంగ హక్కులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మహిళలను మాట్లాడనీయలేదని, ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా వారిపై ఒత్తిడిని పెంచారని అన్నారు. మరోవైపు అతివాదులకు మహిళల హక్కులను అణచివేసేలా స్వేచ్ఛనిచ్చారన్నారు.

“సంతుష్టీకరణ రాజకీయాలు దేశంలో ప్రధానమైన సామాజిక న్యాయ భావనకు ప్రాథమికంగా విరుద్ధం” అన్న శ్రీ మోదీ.. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దీనిని సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. 2013 వక్ఫ్ చట్ట సవరణ అతివాద శక్తులను, భూ మాఫియాను సంతుష్టీకరించే ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు. న్యాయం కోసం రాజ్యాంగపరమైన మార్గాలన్నింటినీ పరిమితం చేస్తూ.. అది రాజ్యాంగానికి అతీతమన్న భావనను ఆ సవరణ కలిగించిందన్నారు. అతివాదులను, భూ మాఫియాను మరింతగా పెంచిందంటూ ఈ సవరణ దుష్పరిణామాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కేరళలోని క్రైస్తవులకు చెందిన భూములు తమవేనన్న వక్ఫ్ వాదన, హర్యానాలోని గురుద్వారా భూములపై వివాదాలు, కర్ణాటకలో రైతుల భూములు తమవని వక్ఫ్ వాదించడాన్ని ఆయన ఉదాహరించారు. చాలా రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలు, వేల హెక్టార్ల భూమి ఇప్పుడు ఎన్ వోసీ, చట్టపరమైన సంక్లిష్టతలలో చిక్కుకున్నాయన్నారు. దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు, పొలాలు లేదా ప్రభుత్వ భూములు ఏవైనా... తమ ఆస్తులపై యాజమాన్యాన్ని నిలుపుకోగలమన్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క నోటీసు వల్ల.. అనేక మంది తమ సొంత ఇళ్లు, పొలాలు తమవే అని నిరూపించుకోవడానికి పత్రాల కోసం తంటాలు పడ్డారన్నారు. న్యాయం చేయడానికి బదులు భయం గొలిపేలా చేసిన ఆ చట్టం స్వభావాన్ని ఆయన ప్రశ్నించారు.

ముస్లిం సమాజం సహా అన్ని వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడే అద్భుతమైన చట్టాన్ని రూపొందించిన పార్లమెంటును శ్రీ మోదీ అభినందించారు. ఇది వక్ఫ్ పవిత్రతను కాపాడుతుందని, వెనుబడిన ముస్లింలు, మహిళలు, పిల్లల హక్కులు రక్షిస్తుందని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుపై జరిగిన చర్చ భారత పార్లమెంటరీ చరిత్రలో రెండో అతి సుదీర్ఘమైన చర్చ అని, ఉభయ సభలలో 16 గంటల పాటు దీనిపై చర్చించారని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సమావేశాలు నిర్వహించిందని, 128 గంటల పాటు చర్చల్లో పాల్గొన్నదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా దాదాపు కోటి సూచనలు వచ్చాయని తెలిపారు. “భారత్ లో ప్రజాస్వామ్యం ఇకపై పార్లమెంటుకే పరిమితం కాదని, ప్రజల భాగస్వామ్యం ద్వారా బలోపేతమవుతోందని ఇది నిరూపిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

సాంకేతికత, కృత్రిమ మేధలో ప్రపంచం వేగంగా దూసుకుపోతున్న తరుణంలో.. మానవులను యంత్రాల నుంచి వేరు చేసే అంశాలైన కళ, సంగీతం, సంస్కృతి, సృజనాత్మకతపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమల్లో వినోద పరిశ్రమ ఒకటని, అది మరింతగా విస్తరించబోతోందని శ్రీ మోదీ చెప్పారు. కళను, సంస్కృతిని ప్రోత్సహించి, వాటిని ఘనంగా చాటడం కోసం అంతర్జాతీయ వేదికగా వేవ్స్ (ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వేవ్స్ కు సంబంధించి ఓ ప్రధాన కార్యక్రమం మే నెలలో ముంబయిలో జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఉత్తేజకర, సృజనాత్మక రంగాలైన సినిమాలు, పాడ్‌కాస్ట్, గేమింగ్, సంగీతం, ఏఆర్, వీఆర్ పరిశ్రమలపై ఆయన మాట్లాడారు. ఈ పరిశ్రమలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. భారతీయ కళాకారులు కళారూపాలను సృష్టించి ప్రపంచంతో పంచుకోవడానికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను భారత్ కు ఆహ్వానించడానికి వేవ్స్ మంచి అవకాశాన్నిస్తుందని అన్నారు. వేవ్స్ వేదికను ప్రాచుర్యంలోకి తేవాలని నెట్‌వర్క్ 18ను ప్రధానమంత్రి కోరారు. సృజనాత్మక రంగాలకు చెందిన యువ నిపుణులు ఈ వేదికలో భాగస్వాములు కావాలని కోరారు. “వేవ్స్ ప్రతీ ఇంటినీ, ప్రతీ గుండెనూ తాకాలి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ సదస్సు ద్వారా దేశ యువతలోని సృజనాత్మకత, వారి ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని చాటిన నెట్‌వర్క్ 18ను ప్రధానమంత్రి ప్రశంసించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆలోచించడానికి, సూచనలివ్వడానికి, పరిష్కారాలను గుర్తించడానికి యువతను ప్రోత్సహించేలా ఇది మంచి వేదికగా నిలిచిందంటూ అభినందించారు. యువతను కేవలం శ్రోతలుగా మాత్రమే కాకుండా, మార్పు దిశగా వారిని క్రియాశీలక భాగస్వాములుగా ఈ సదస్సు నిలిపిందన్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం వహించి ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి కోరారు. ప్రామాణికంగా రికార్డు చేయడం, అధ్యయనం, విలువైన సలహాలూ సూచనలను విధాన రూపకల్పనలో పొందుపరచడం ద్వారా.. ఈ సదస్సును చిరస్థాయిలో నిలపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి యువత ఉత్సాహం, ఆలోచనలు, భాగస్వామ్యం చోదక శక్తులని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారందరికీ, ముఖ్యంగా యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

వాయు కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, నదుల ప్రక్షాళన, అందరికీ విద్య, దేశంలోని వీధుల్లో రద్దీని తగ్గించడం వంటి సవాళ్లపై దేశవ్యాప్తంగా యువత, ఎంపికచేసిన కళాశాలలు సూచించిన పరిష్కారాలు, ఆలోచనల సంకలనం ‘సమాధాన్’ పత్రాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. 

 

***


(Release ID: 2120752) Visitor Counter : 22