సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘వేవ్స్‌ సమ్మిట్‌-2025’ నేపథ్యంలో నిర్వహించిన ‘ట్రూత్‌టెల్‌ హ్యాకథాన్’ పోటీలో అగ్రస్థానం సాధించిన 5 విజేత జట్ల ప్రకటన


· తప్పుడు సమాచార నిరోధంపై ఏఐ పరిష్కారాల రూపకల్పనలో అగ్రస్థానాన నిలిచి తలా రూ.10 లక్షల బహుమతి గెలుచుకున్న “టీమ్స్‌ యూనిక్రాన్, అల్కెమిస్ట్, హూషింగ్ లయర్స్, బగ్ స్మాషర్స్, వోర్టెక్స్ స్క్వాడ్” జట్లు

· ఏఐ తనిఖీ ఉపకరణాల నుంచి మోసపూరిత మాధ్యమ అంశాలను పసిగట్టే వ్యవస్థల దాకా రూపుదిద్దుకున్న ఈ ఆవిష్కరణలు ముంబయిలో మే 1-4 మధ్య నిర్వహించే ‘వేవ్స్‌ సమ్మిట్‌-2025’లో ప్రదర్శితమవుతాయి

Posted On: 07 APR 2025 7:19PM by PIB Hyderabad

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌-2025 (వేవ్స్) నేపథ్యంలో ‘క్రియేట్‌ ఇన్‌ ఇండియా ఛాలెంజ్‌’ కింద నిర్వహించిన ‘ట్రూత్‌టెల్‌ హ్యాకథాన్’ పోటీలో అగ్రస్థానం సాధించిన 5 విజేత జట్లను ఇండియా సెల్యులార్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ-ఐసియా), సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబి) ఈ రోజు సంయుక్తంగా ప్రకటించాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న తప్పుడు సమాచారం, మోసపూరిత మాధ్యమ అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో పసిగట్టే ఆవిష్కరణల రూపకల్పన లక్ష్యంగా ఈ పోటీ నిర్వహించారు. ఇందులో విజేతలను న్యూఢిల్లీలోని ‘ఇండియా హాబిటాట్ సెంటర్‌’లో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమంలో సత్కరించారు. అలాగే మొత్తం పోటీదారుల నుంచి ఎంపిక చేసిన 25 మంది ఆవిష్కర్తలు పరిశ్రమ నిపుణుల బృందం సమక్షాన తమ నమూనాల పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

ఈ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 5,600 దరఖాస్తులు రాగా, విజేతలుగా నిలిచి రూ.10 లక్షల వంతున బహుమతి అందుకున్న ఐదు ఆవిష్కర్త జట్లు రూపొందించిన పరిష్కారాలు కిందివిధంగా ఉన్నాయి:

టీమ్‌ యూనిక్రాన్-ఢిల్లీ ‘అన్వేష’ పేరిట వచనం, చిత్రాలు, వీడియోలలోని తప్పుడు సమాచారాన్ని గుర్తించగల ఉపకరణాన్ని రూపొందించింది.

టీమ్‌ అల్‌కెమిస్ట్‌-డెహ్రాడూన్‌ ‘వెరిస్ట్రీమ్‌’ ప్రక్రియను రూపొందించింది. ప్రతి ఫ్రేములోనూ వాస్తవానికి పెద్దపీట వేసే ఒక సంపూర్ణ పరిష్కారాన్ని ఈ జట్టు సిద్ధం చేసింది. ఇది లాంగ్‌చెయిన్‌ ఆధారిత ‘ఎన్‌ఎల్‌పి’ డైనమిక్ నాలెడ్జ్ గ్రాఫ్‌లు, జిఐఎస్‌ దృక్కోణాలు, వివరణాత్మక ఏఐ వినియోగం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలలో దొర్లే తప్పుడు సమాచారాన్ని గుర్తించి, సరిదిద్దగలదు.

టీమ్ హూషింగ్ లయర్స్-బెంగళూరు ‘నెక్సస్‌ ఆఫ్‌ ట్రూత్‌’ పేరిట ఏఐ ఆధారిత ఉపకరణాన్ని రూపొందించింది. డీప్‌ఫేక్‌ల గుర్తింపుతోపాటు బహుభాషా మద్దతు, ప్రత్యక్ష ప్రసార హెచ్చరికలతో వార్తా కథనాలను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూ, తప్పుడు సారాంశంపై సత్వర అప్రమత్తత సామర్థ్యం దీనికుంది.

టీమ్ బగ్ స్మాషర్స్‌-ఢిల్లీ తప్పుడు సమాచారాన్ని పసిగట్టే ఏఐ ఆధారిత ‘లైవ్ ట్రూత్’ ఉపకరణం రూపొందించింది. ఇది స్థానిక ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం), నిజనిర్ధారణ ‘ఎపిఐ’లను జోడించి ప్రత్యక్ష ప్రసారాల్లో సమాచార విశ్వసనీయతపై తక్షణ అంచనాలను రూపొందిస్తుంది. అలాగే, జీపీఎస్‌ ఆధారిత సందేశాల (ఎస్‌ఎంఎస్‌) తనిఖీ ద్వారా సామాజిక ఆధారిత ధ్రువీకరణ చేస్తుంది.

టీమ్ వోర్టెక్స్ స్క్వాడ్-బెంగళూరు తప్పుడు సమాచారాన్ని తక్షణం పసిగట్టే, నిజ నిర్ధారణ చేయగల ఏఐ ఆధారిత ఉపకరణాన్ని రూపొందించింది. ఇది ప్రత్యక్ష కార్యక్రమాల సమయంలో తప్పుడు సమాచారాన్ని గుర్తించి, హెచ్చరించడంతోపాటు తక్షణ కచ్చితత్వం, పారదర్శకతకు వీలు కల్పిస్తుంది.

మాధ్యమాంశాల సమగ్రత మెరుగుదల, ప్రత్యక్ష ప్రసారాల వేళ తప్పుడు సమాచార నిరోధం లక్ష్యంగా ఈ బృందాలలో ప్రతి ఒక్కటీ తాము రూపొందించిన వినూత్న విధానాలను ప్రదర్శించాయి. ఏఐ తనిఖీ ఉపకరణాల నుంచి మోసపూరిత మాధ్యమ అంశాలను పసిగట్టే వ్యవస్థల దాకా రూపుదిద్దుకున్న ఈ ఆవిష్కరణలు ముంబయిలో మే 1-4 తేదీల మధ్య నిర్వహించే ‘వేవ్స్‌ సమ్మిట్-2025’లో ప్రదర్శితమవుతాయి. ‘వేవ్స్‌-2025’లో భాగంగా మాధ్యమాలు, సాంకేతికత నేపథ్యంగా బాధ్యతాయుత ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఈ హ్యాకథాన్ను నిర్వహించారు.

ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ (మీటీ) అదనపు కార్యదర్శి, ‘ఇండియాఏఐ మిషన్’ సీఈఓ శ్రీ అభిషేక్ సింగ్, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ శంకర్ వంటి గౌరవనీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ట్రూత్‌టెల్‌ హ్యాకథాన్‌ తుది పోటీల విశిష్ట న్యాయనిర్ణేతల బృందంలో ‘మీటీ’ అంకుర కూడలి (ఎంఎస్‌హెచ్‌) పూర్వ సీఈవో శ్రీ జీత్‌ విజయ్‌వర్గియా, మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థలో ఏఐ టెక్‌ స్రేటజిస్ట్‌ డైరెక్టర్‌ శ్రీ విక్రమ్ మల్హోత్రా, ‘ఎబిజి’ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ నిర్వాహక భాగస్వామి శ్రీ అలోక్‌ గుర్టూ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)లో సీనియర్ పరిశోధకుడు-గౌరవ ఆచార్యుడు డాక్టర్ అవిక్ సర్కార్, ‘స్టేజ్‌’ సంస్థ సహ-వ్యవస్థాపకుడు, సీటీవో శ్రీ శశాంక్‌ వైష్ణవ్‌ వంటి ఉద్దండులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ‘ఐసియా’ చైర్మన్ శ్రీ పంకజ్ మొహింద్రూ మాట్లాడుతూ- “వదంతికిగల శక్తి ఎలాంటిదో మన దేశానికి అనాదిగా అనుభవమే. అయితే, ప్రస్తుత డిజిటల్‌ శకంలో గ్రామీణ జానపద గాథల నుంచి తప్పుదోవ పట్టించే నమ్మకాల దాకా తప్పుడు సమాచారం వ్యాపించడం అటుంచి, నేడు ఏకంగా రెక్కలు కట్టుకుని వేగంగా విస్తరించిపోతోంది. కాబట్టి, తప్పుడు సమాచారం సమస్య పరిష్కారం దిశగా డిజిటల్ రంగంలో అడుగుపెట్టడం మునుపటికన్నా ఇప్పుడు మనకు ఎంతో ప్రధానం. ముఖ్యంగా ఈ డిజిటల్ కాలంలో అవాస్తవాలు శరవేగంగా వ్యాపించడం మన ముందున్న తీవ్ర సమస్య. అయితే, 36 శాతం నారీశక్తి భాగస్వామ్యం సహా వినూత్న, ఆవిష్కరణాత్మక, ఉజ్వల మేధా తరం మనకు ఇవాళ ఇక్కడే అందుబాటులో ఉంది. అందువల్ల బలమైన, భవిష్యత్‌ సంసిద్ధ పరిష్కారాల సృష్టిపై నాకు అపార విశ్వాసం ఉంది. ఈ రోజున విజేతలు చూపిన పరిష్కారాలు కేవలం బహుమతి గెలుచుకునే ఆలోచనలకు పరిమితం కాదు... నైతిక, ఏఐ ఆధారిత పరిష్కారాల ద్వారా సంక్లిష్ట డిజిటల్ ముప్పుల నిరోధంపై ప్రపంచానికి భారత్‌ మార్గనిర్దేశం చేయగలదని చాటే నమూనాలు” అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ- విజయం దిశగా వారి పయనం మొదలైన నేపథ్యంలో వారి పరిష్కారాలు ప్రపంచంపై వాస్తవిక ప్రభావం చూపే క్షణం కోసం తాను ఎదురుచూస్తుంటానని శ్రీ మొహింద్రూ వ్యాఖ్యానించారు. ట్రూత్‌టెల్ హ్యాకథాన్లో భాగంగా ప్రదర్శించిన ఆలోచనలు నిరంతర ప్రగతితో కొత్త శిఖరాలను చేరగలవని, ప్రపంచ వేదికపై ఏఐ ఆవిష్కరణకు నాయకత్వం వహించగలవని ఆయన ప్రగాఢ విశ్వాసం వెలిబుచ్చారు.

అనంతరం ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ- “యథాతథ స్వరానుకరణే కాకుండా చిత్రాలు సహా ఏకంగా వ్యక్తి గుర్తింపును కూడా విశ్వసనీయమైనదిగా కృత్రిమ మేధ మనను నమ్మిస్తున్న కాలమిది. కాబట్టి, కాల్పనికత నుంచి వాస్తవాన్ని వేరుచేసి చూపగలగడం ఓ ప్రధాన సమస్యగా మారింది. ఈ సవాలును పరిష్కరించే దిశగా ‘ట్రూత్‌టెల్ హ్యాకథాన్’ను ఓ కీలక ముందడుగని అభివర్ణించవచ్చు. ఇందులో పాల్గొనడం ద్వారా వినూత్న పరిష్కారాల రూపకల్పనకు శ్రమించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. తప్పుడు సమాచారం వ్యాప్తి నిరోధం, దాని హానికర పరిణామాల నుంచి సమాజ రక్షణకు ఇక్కడ సాగుతున్న కృషి ఎంతగానో దోహదం చేస్తుంది. బాధ్యతాయుత ఆవిష్కరణల కోసం ఏఐ వినియోగం ద్వారా దేశాన్ని శక్తిమంతం చేసే ఇలాంటి కార్యక్రమాలకు మేం సదా మద్దతిస్తామని పునరుద్ఘాటిస్తున్నాను. మన దేశానికి ఎంతో విలువైనవిగానే కాకుండా తప్పుడు సమాచారంపై ప్రపంచవ్యాప్త పోరాటంలోనూ ఈ పరిష్కారాలు ప్రధాన పాత్ర పోషించగలవని విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.

అలాగే, ఈ హ్యాకథాన్‌ నిర్వహణపై ‘ఐసియా’ను ఆయన అభినందించారు. తద్వారా విశ్వసనీయత పరిరక్షణతోపాటు మన డిజిటల్ కరెన్సీ భవిత రక్షణకు కృషి చేస్తున్నామని శ్రీ సింగ్‌ వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధానికి ఉత్తమ పరిష్కారాన్వేషణ దిశగా ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచిన  ఐదు విజేత బృందాలు మరింత కృషి చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ శంకర్ మాట్లాడుతూ- “నేటి డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం విసిరే సవాళ్ల పరిష్కారం దిశగా ట్రూత్‌టెల్ హ్యాకథాన్ కీలక ముందడుగు. ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ కింద 32 సవాళ్లతో నిర్వహించిన పోటీల్లో ఇదొకటి. మీడియా-వినోద పరిశ్రమను ప్రభావితం చేసే అత్యంత ప్రధాన సమస్యలలో ఒకదాన్ని పరిష్కరించే దిశగా ప్రపంచవ్యాప్త యువ ఆవిష్కర్తలకు ఇది ఒకే వేదికపైకి తెచ్చింది. తప్పుడు సమాచారం జీవితాలనే కాకుండా సామాజిక సామరస్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే తప్పుడు సారాంశాన్ని తక్షణం పసిగట్టి, హెచ్చరించే సాంకేతిక పరిష్కారాన్వేషణ మనకెంతో ముఖ్యం. తదనుగుణంగా స్పందించిన పోటీదారులందరి ఆవిష్కరణాత్మక ఆలోచనలకు నా అభినందనలు. ఈ కొత్తదనాన్ని నిరంతరం కొనసాగించాల్సిందిగా వారికి నా సూచన. ఈ పరిష్కారాల ప్రభావాన్ని ‘వేవ్స్‌-2025’లో ప్రత్యక్షంగా చూడటానికి మేమెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. ఆ వేదికపై ఇవన్నీ అంతర్జాతీయ ప్రేక్షకులకు ప్రదర్శితం కావడం ద్వారా బాధ్యతాయుత మీడియా భవితను ప్రభావితం చేయగలవు. భవిష్యత్తు కోసం మరింత అవగాహన సహిత సురక్షిత డిజిటల్ ఆవరణాన్ని మనం సృష్టించగలం” అని వ్యాఖ్యానించారు.

ట్రూత్‌టెల్ హ్యాకథాన్‌కు 2024 అక్టోబరులో శ్రీకారం చుట్టగా, 300కుపైగా నగరాల నుంచి 36 శాతం మహిళలు సహా విద్యార్థులు, నిపుణుల నుంచి 450కిపైగా విశిష్ట పరిష్కార ఆలోచనలు అందాయి. వివిధ దశల్లో వడపోత, ప్రోత్సాహక కార్యక్రమాల తర్వాత ఢిల్లీలో నిర్వహించిన తుది మహా సమరానికి 25 బృందాలను ఎంపిక చేశారు. వీరంతా కోయంబత్తూర్ నుంచి చండీగఢ్ దాకా, బెంగళూరు నుంచి భోపాల్ వరకూ భారత అద్వితీయ యువశక్తికి ప్రతీకలుగా నిలిచారు.

ట్రూత్‌టెల్ హ్యాకథాన్ నిర్వహణకు ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ, ఇండియాఏఐ మిషన్ మద్దతిచ్చాయి. దేశ యువత సారథ్యంలో ఆవిష్కరణాత్మక సమస్యా పరిష్కార మార్గాల ద్వారా ఏఐ నైతిక వినియోగం, డిజిటల్‌ ఆవరణ వ్యవస్థలపై విశ్వసనీయత బలోపేతాన్ని ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వ విస్తృత దృక్కోణానికి అనుగుణంగా ఈ పోటీ సాగింది.

మరింత సమాచారం కోసం https://icea.org.in/truthtell ను సందర్శించవచ్చు.

‘ఐసియా’ గురించి...

దేశంలోని ఎలక్ట్రానిక్స్-సాంకేతిక కంపెనీలతో సంయుక్తంగా పనిచేసే ప్రధాన పారిశ్రామిక సంఘం ‘ఐసియా’ హార్డ్‌ వేర్, సాఫ్ట్‌ వేర్ సామర్థ్యాల సముచిత ఏకీకరణను ప్రోత్సహించడం ద్వారా మన దేశాన్ని అంతర్జాతీయ సాంకేతిక సామర్థ్య కూడలిగా రూపొందించడమే దీని ధ్యేయం. తదనుగుణంగా ఆవిష్కరణాత్మకతకు పదునుపెడుతూ, నైపుణ్యానికి సారథ్యం వహించగల చురుకైన వ్యవస్థ సృష్టికి ఇది కృషి చేస్తోంది.

 

***


(Release ID: 2119960) Visitor Counter : 21