ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

1996 శ్రీలంక క్రికెట్ జట్టుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

• ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానానికి భారత్ కట్టుబడి ఉంది: ప్రధాని

• పొరుగుదేశాల్లో సంక్షోభాల వేళల్లో ముందుగా ప్రతిస్పందించే దేశం భారత్: ప్రధాని

Posted On: 06 APR 2025 8:19PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1996 సంవత్సరపు శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో శ్రీలంకలో నిన్న మాట్లాడారు. అరమరికల్లేకుండా సాగిన ఈ సంభాషణ క్రమంలో, క్రికెటర్లు ప్రధానిని కలుసుకొన్నందుకు సంతోషాన్ని, కృతజ్ఞత‌ను వ్యక్తం చేశారు. వారిని కలుసుకొన్నందుకు ప్రధానమంత్రి కూడా తన సంతోషాన్ని ప్రకటించారు. ఈ టీమ్ కనబర్చిన చక్కని ఆట తీరు భారతీయులకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని, ముఖ్యంగా ఆ మరపురాని గెలుపు చెరగని ముద్ర వేసిందని ఆయన అన్నారు. వారి విజయం ఇంకా దేశంలో మారుమోగుతూనే ఉందని ఆయన అభివర్ణించారు.

అహ్మదాబాద్‌లో 2010లో ఒక మ్యాచ్‌కు తాను హాజరైన సంగతిని శ్రీ మోదీ గుర్తుచేసుకొన్నారు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్లలో ఒకరు అంపైర్ పాత్రను పోషించడం తాను గమనించానని ఆయన తెలిపారు. భారత్ 1983లో ప్రపంచ కప్‌ను గెలవడం, 1996 వరల్డ్ కప్‌ను శ్రీలంక కైవసం చేసుకోవడం గొప్ప మార్పులకు కారణమయ్యాయని ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ విజయాలు క్రికెట్ జగతికి ఎలా కొత్త రూపురేఖలను తీర్చిదిద్దిందీ ఆయన వివరించారు. 1996వ సంవత్సరంలో జరిగిన మ్యాచులలో అప్పటి శ్రీలంక క్రికెట్ జట్టు ప్రదర్శించిన వినూత్న ఆట శైలితో టి-20 క్రికెట్ పరిణామ క్రమం ముడిపడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. జట్టులో ఇతర క్రీడాకారులు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు. వారు ఇప్పటికీ ఇంకా క్రికెట్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారా? కోచ్‌లుగా కొనసాగుతున్నారా అనే అంశాలను ఆయన తెలుసుకోవాలనుకున్నారు.

శ్రీలంకలో 1996లో బాంబు పేలుళ్లు సంభవించి ఇతర జట్లు ఉపసంహరించుకొన్నప్పటికీ భారత్ మాత్రం శ్రీలంక వెళ్లాలనే నిర్ణయించుకోవడాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు. తాము కష్ట కాలాన్ని ఎదుర్కొన్న వేళ భారత్ సంఘీభావాన్ని తెలపడాన్ని శ్రీలంక క్రీడాకారులు ప్రశంసించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. భారత్ చాటిచెప్పిన స్థిర క్రీడాస్ఫూర్తిని ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ,1996లో బాంబు పేలుళ్లు శ్రీలంకను కుదిపివేయడం సహా ప్రతికూలస్థితిపై భారత్ ఏ విధంగా పైచేయిని సాధించిందీ స్పష్టం చేశారు. 2019లో చర్చిలో బాంబు విస్ఫోటాల తరువాత శ్రీలంకలో పర్యటించిన మొట్టమొదటి ప్రపంచ నేతను తానేనని శ్రీ మోదీ అన్నారు. భారతీయ క్రికెట్ జట్టు కూడా 2019లో శ్రీలంకలో పర్యటించిందని తెలిపారు. సుఖదుఖ్ఖాల్లో శ్రీలంక వెన్నంటి నిలచిన భారత్ దృఢ వైఖరి, నిబద్ధత భారత్ అనుసరిస్తున్న చిరకాల విలువలకు అద్దంపడుతోందన్నారు.

 

శ్రీలంక వర్తమాన ఆర్థిక సంక్షోభ కాలంలో భారత్ అచంచల మద్దతునిస్తున్నందుకు ప్రస్తుతం శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టుకు శిక్షకునిగా ఉన్న శ్రీ సనత్ జయసూర్య ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులను నిర్వహించడానికి ఒక క్రికెట్ మైదానాన్ని శ్రీలంకలోని జాఫ్నాలో ఏర్పాటు చేయడానికి ఎంతవరకు వీలవుతుందో భారత్ పరిశీలించాలని కూడా ప్రధానిని ఆయన అభ్యర్థించారు. ఇది జరిగితే, శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో క్రికెటర్లుగా ఎదగాలనుకొనే వారికీ, ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని శ్రీ సనత్ జయసూర్య అన్నారు.

శ్రీ జయసూర్య వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రధాని ప్రశంసించారు. ‘‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’’ అనే సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు దేశాలలో సంకట స్థితులు తలెత్తినప్పుడు భారత్ సత్వరం ప్రతిస్పందించిందని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ... మయన్మార్‌లో ఇటీవల భూకంపం వచ్చిన నేపథ్యంలో భారత్ అన్ని ఇతర దేశాల కన్నా ముందు ప్రతిస్పందించిందన్నారు. ఇరుగుపొరుగు దేశాలు, మిత్ర దేశాల అభ్యున్నతికి భారత్ ప్రాధాన్యాన్నిచ్చి బాధ్యతాయుతంగా మెలగుతుందని ఆయన అన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్నప్పుడు భారత్ సహాయాన్ని అందించిందని కూడా శ్రీ మోదీ చెప్పారు. శ్రీలంక సవాళ్లను అధిగమించడంలో సహకరించడాన్ని ఒక బాధ్యతగా భారత్ భావిస్తుందని ఆయన చెప్పారు. అనేక కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జాఫ్నా విషయంలో శ్రీ జయసూర్య ఆలోచనలను ప్రశంసిస్తూ, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులకు ఆతిథ్యాన్ని ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఎంతైనా ఉందన్నారు. ఈ సూచనను పరిశీలించి, దీనికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తన బృందం తెలుసుకొంటుందని ప్రధాని హామీనిచ్చారు.

ప్రతిఒక్కరినీ మరోసారి కలుసుకొని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతోపాటు పరిచిత వ్యక్తులను పలకరించే అవకాశాన్ని కల్పించినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞత‌లు తెలిపారు. శ్రీలంకతో భారత్‌కు చిరకాలంగా సంబంధాలున్నాయని ఆయన అంటూ సంభాషణను ముగించారు. శ్రీలంక క్రికెట్ సముదాయం చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకైనా తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.‌

 

 

***

MJPS/SR


(Release ID: 2119704) Visitor Counter : 10