ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని
అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా చైతన్యపరిచేందుకు భారత్‌లో కొత్త సామాజిక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి: ప్రధాని
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత అమర సంస్కృతికి ఆధునిక వటవృక్షం లాంటిది. ఇది భారతీయ సంస్కృతిని, దేశ చైతన్యాన్ని నిరంతరం సజీవంగా ఉంచుతోంది: ప్రధాని
చేస్తున్న పనుల్లో దృష్టి నా అనే దాని మీద కాకుండా మన అన్న దానిపై ఉన్నప్పుడు, దేశ స్ఫూర్తి అత్యంత ప్రాధాన్యమిచ్చినప్పుడు.. విధానాలు, నిర్ణయాల్లో దేశ ప్రజల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైన అంశంగా ఉన్నప్పుడు మాత్రమే వాటి ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది: ప్రధాని
ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా మనస్ఫూర్తిగా సేవలందించేందుకు భారత్ నిలబడుతోంది: ప్రధాని
జాతి నిర్మాణ స్ఫూర్తితో నిండిన మన యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకెళ్తోంది: ప్రధాని
Posted On:
30 MAR 2025 2:09PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.
భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, వచ్చే నెలలో రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి గురించి ప్రస్తావించిన ఆయన దీక్షాభూమిలో ఆయనకు నివాళులు అర్పించి, ఆశీస్సులు పొందటం గురించి మాట్లాడారు. నవరాత్రి, ఇతర పండుగల సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సేవా కేంద్రంగా నాగపూర్ ప్రాముఖ్యత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఆధ్యాత్మికత, జ్ఞానం, గౌరవం, మానవత్వాన్ని ప్రతిబింబించే మాధవ్ నేత్రాలయ స్ఫూర్తిదాయక గీతం గురించి వ్యాఖ్యానించారు. నేత్రాలయ గొప్ప తనం గురించి మాట్లాడిన ఆయన.. పూజ్య గురూజీ ఆశయాలకు అనుగుణంగా లెక్కలేనన్ని జీవితాల్లో వెలుగులు నింపుతూ దశాబ్దాలుగా లక్షలాది మందికి సేవలందిస్తున్న సంస్థ మాధవ్ నేత్రాలయ అని కొనియాడారు.
మాధవ్ నేత్రాలయ నూతన కేంద్రానికి శంకుస్థాపన చేయటం గురించి మాట్లాడుతూ.. నేత్రాలయ విస్తరణ వల్ల సేవా కార్యక్రమాల్లో వేగం పుంజుకొని వేలాది కొత్త జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి జీవితాల్లోని చీకటి తొలగిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేత్రాలయతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరి కృషిని అభినందించిన ఆయన.. వారి నిరంతర సేవలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో 'సబ్ కే ప్రయాస్'కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ.. ఆరోగ్య సంరక్షణ రంగంలో దేశం సాధించిన గణనీయమైన పురోగతి గురించి మాట్లాడారు. మాధవ్ నేత్రాలయ ఈదిశగా దోహదం చేస్తోందని అన్నారు. పౌరులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని, నిరుపేదలకు కూడా సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందుబాటులో ఉండాలని, ఏ పౌరుడూ జీవన గౌరవాన్ని కోల్పోకూడదని పేర్కొన్నారు. దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వృద్ధులు వైద్యం గురించి ఆందోళన చెందొద్దని తెలిపారు. లక్షలాది మందికి ఉచిత వైద్యం అందిస్తోన్న ఆయుష్మాన్ భారత్ ప్రభావాన్ని ప్రధానంగా చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో మందులు అందిస్తూ పౌరులకు వేల కోట్ల రూపాయలను ఆదా చేస్తూ దేశవ్యాప్తంగా వేలాది జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గత దశాబ్దకాలంగా గ్రామాల్లో లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు టెలీమెడిసిన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. వైద్య పరీక్షల కోసం పౌరులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరాన్ని ఈ సదుపాయాలు తొలగించాయని ప్రధానంగా చెప్పారు.
దేశంలో వైద్య కళాశాలలను రెట్టింపు చేయడం, ఎయిమ్స్ సంస్థలను మూడింతలు చేయడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ప్రజలకు సేవలందించడానికి మరింత నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉండేలా చూడటానికి వైద్య సీట్ల సంఖ్య కూడా రెట్టింపు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు తమ మాతృభాషల్లో వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆధునిక వైద్య విజ్ఞానంలో పురోగతితో పాటు, దేశం తన సాంప్రదాయ జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్న యోగా, ఆయుర్వేదం ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోందన్నారు.
ఏ దేశ మనుగడ అయినా దాని సంస్కృతి, చైతన్యాన్ని పెంచుకోవటంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ప్రధాని.. శతాబ్దాల బానిసత్వం, ఆక్రమణలు దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నించినప్పటికీ భారతదేశ చైతన్యం సజీవంగా, గట్టిగా ఉందని అన్నారు. "క్లిష్ట సమయాల్లో కూడా దేశంలో కొంగొత్త సామాజిక ఉద్యమాలు ఈ చైతన్యాన్ని కొనసాగించాయి" అని వ్యాఖ్యానించారు. గురు నానక్ దేవ్, కబీర్ దాస్, తులసీదాస్, సూర్‌దాస్, మహారాష్ట్రకు చెందిన సంత్ తుకారాం, సంత్ ఏక్‌నాథ్, సంత్ నామ్‌దేవ్, సంత్ ధ్యానేశ్వర్ వంటి సాధువులు తమ అసలైన ఆలోచనలతో జాతీయ చైతన్యానికి జీవం పోసినట్లు వివరించారు. ఈ ఉద్యమాలు వివక్ష అనే చక్రాన్ని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని ఏకం చేశాయని అన్నారు. నిస్పృహలో ఉన్న సమాజాన్ని కుదిపేసి దాని నిజమైన రూపాన్ని గుర్తుచేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భారత జాతీయ చైతన్యం చెక్కుచెదరకుండా చేసిన స్వామి వివేకానంద సేవలను ప్రధానంగా తెలిపిన ప్రధాని.. వలస పాలన చివరి దశాబ్దాల్లో ఈ చైతన్యాన్ని ఉత్తేజపరచడంలో డాక్టర్ హెడ్గేవార్, గురూజీల పాత్రను ప్రస్తావించారు. వందేళ్ల క్రితం జాతీయ చైతన్యాన్ని కాపాడేందుకు, ప్రోత్సాహించేందుకు నాటిన బీజాలు ఇప్పుడు మహావృక్షంగా ఎదిగాయన్నారు. లక్షలాది మంది స్వయం సేవకులు శాఖలుగా ఉన్న ఈ మహా వృక్షానికి- సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నతస్థాయిని ఇస్తాయని అన్నారు. "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత అమర సంస్కృతికి సంబంధించిన ఆధునిక అక్షయ వటవృక్షం. ఇది భారతీయ సంస్కృతిని, మన దేశ చైతన్యాన్ని నిరంతరం శక్తివంతం చేస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
మాధవ్ నేత్రాలయ కొత్త ప్రాంగణం తన ప్రయాణాన్ని ప్రారంభించటం గురించి మాట్లాడుతూ.. దృష్టి, దిశల మధ్య సహజ సంబంధాన్ని ప్రస్తావిస్తూ.. “మనం నూరేళ్లు చూద్దాం” అని అర్థం వచ్చే "పశ్యమ శారదా శతం" అనే వైదిక ఆకాంక్షను ఉటంకిస్తూ జీవితంలో పరమ దృష్టి ప్రాముఖ్యత గురించి ప్రధానంగా తెలిపారు. బాహ్య దృష్టి, అంతర్గత దృష్టి రెండింటి ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా మాట్లాడారు. విదర్భకు చెందిన ప్రజ్ఞాచక్షుగా పేరొందిన మహానుభావుడు శ్రీ గులాబ్ రావ్ మహరాజ్‌ను స్మరించుకుంటూ.. "చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయినప్పటికీ, శ్రీ గులాబ్ రావ్ మహరాజ్ అనేక పుస్తకాలను రచించారు" అని వ్యాఖ్యానించారు. ఆయనకు భౌతికంగా దృష్టి లేనప్పటికీ లోతైన దృష్టి ఉందని.. ఇది జ్ఞానం నుండి ఉద్భవించే విచక్షణ ద్వారా వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ఇటువంటి దార్శనికత వ్యక్తిగతంగా, సమాజం మొత్తం సాధికారత కల్పిస్తుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది బాహ్య, అంతర్గత దృష్టి కోసం కృషి చేస్తోన్న పవిత్ర ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు. బాహ్య దార్శనికతకు మాధవ్ నేత్రాలయ ఒక ఉదాహరణ అని అన్న ఆయన.. అంతర్గత దృష్టి సంఘ్‌ను సేవకు పర్యాయపదంగా మార్చిందని పేర్కొన్నారు.
సేవ, పరోపకారమే జీవిత లక్ష్యమన్న ఆయన…వీటిపై పలు గ్రంథాలును ఉటంకించారు. విలువలతో ముడిపడి ఉన్నప్పుడు సేవ భక్తి రూపంగా మారుతుందని, ఇది ప్రతి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త జీవిత సారాంశం అని పేర్కొన్నారు.
ఈ సేవా స్పూర్తే తరతరాలుగా స్వయం సేవకులు సేవ కోసం అంకితమయ్యేందుకు ప్రేరేపిస్తోందని అన్నారు. సేవ విషయంలో ఉన్న ఈ భక్తే స్వయం సేవకులను నిరంతరం చురుకుగా ఉంచుతోందని, వారు అలసిపోవటానికి లేదా ఆగిపోయేందుకు ఎప్పుడూ అనుమతించదని పేర్కొన్నారు. జీవిత ప్రాముఖ్యత కాలవ్యవధిలో కాకుండా దాని ఉపయోగంలో ఉందని గురూజీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. "దేవ్ టు దేశ్", "రామ్ టు రాస్" అనే సూత్రాల మార్గనిర్దేశంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చటంపై తన నిబద్ధతను ప్రధానంగా తెలియజేశారు. సరిహద్దు గ్రామాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఇలా వివిధ ప్రాంతాల్లో స్వయం సేవకుల నిస్వార్థ కృషి అభినందించారు. వనవాసి కళ్యాణ్ ఆశ్రమాలు, గిరిజన పిల్లల కోసం ఏకలవ్య విద్యాలయాలు, సాంస్కృతిక జాగృతి మిషన్లు, నిరుపేదలకు సేవ చేయడానికి సేవాభారతి చేస్తున్న కృషికి సంబంధించిన కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని ఆయన వివరించారు. మహాకుంభమేళాలో నేత్రా కుంభ్ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన స్వయం సేవకులను ప్రశంసించిన ఆయన.. సేవ అవసరం ఉన్న ప్రతి చోట స్వయం సేవకులు ఉన్నారని ప్రధానంగా పేర్కొన్నారు. వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో స్వయం సేవకులు క్రమశిక్షణతో వ్యవహరించారన్న ఆయన.. వారి నిస్వార్థతను, సేవా నిబద్ధతను చాటిచెప్పారు. "సేవ అనేది ఒక పవిత్రమైన యాగం. నైవేద్యాల వల్ల యజ్ఞ జ్వాలలో మండుతూ ఆశయం అనే మహా సముద్రంలో కలిసిపోతాం" అని వ్యాఖ్యానించారు.
గురూజీ గురించి ఒక స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు. సంఘ్‌ను సర్వవ్యాప్తం అని ఎందుకు పేర్కొన్నారని అడిగినప్పుడు... గురూజీ సంఘ్‌ను వెలుగుతో పోల్చారని.. ప్రతి పనిని కాంతి స్వయంగా చేయలేకపోయినా చీకటిని తొలగించి ఇతరులకు ముందుకెళ్లేందుకు కావాల్సిన మార్గాన్ని చూపిస్తుందని అన్నారు. గురూజీ బోధన ఒక జీవన మంత్రంగా పనిచేస్తుందని.. ప్రతి ఒక్కరూ వెలుతురు అనే వనరుగా మారాలని, అడ్డంకులను తొలగించాలని, ప్రగతికి బాటలు వేయాలని కోరారు. "నేను కాదు, మీరు", "నాది కాదు, దేశం కోసం" అనే సూత్రాలతో నిస్వార్థ అనే భావంలోని సారాన్ని వివరించారు.
"నేను" కంటే "మేం" అనే భావనకు ప్రాధాన్యత ఇవ్వడం.. అన్ని విధానాలు, నిర్ణయాలలో దేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచే అంశం ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్న ప్రధాని.. ఇటువంటి విధానం దేశవ్యాప్తంగా సానుకూల ప్రభావాలను ఇస్తుందని అన్నారు. దేశాన్ని వెనక్కు నెట్టిన చట్రాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరాన్ని ప్రముఖంగా తెలిపారు. వలసవాద మనస్తత్వానికి అతీతంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. 70 ఏళ్లుగా అణచివేతతో కొనసాగిన వలసవాద అవశేషాల స్థానంలో ఇప్పుడు భారత్ జాతీయ గౌరవానికి సంబంధించిన కొత్త అధ్యాయాలను ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. భారతీయులను కించపరిచేలా రూపొందించిన కాలం చెల్లిన ఆంగ్లేయుల చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ్ సంహితను తీసుకురావటాన్ని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. వలసవాద వారసత్వానికి బదులుగా కర్తవ్యానికి ప్రతీకగా రాజ్‌పథ్‌ను కర్తవ్య మార్గంగా మార్చటం గురించి మాట్లాడారు. నావికాదళం జెండాపై వలస కాలం నాటి చిహ్నాలను తొలగించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిహ్నాన్ని వాటి స్థానంలో తీసుకొచ్చినట్లు పునరుద్ధాటించారు. స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించటంపై ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చిన ప్రాంతం, అలాగే దేశం కోసం వీర్ సావర్కర్ కష్టనష్టాలను అనుభవించిన ప్రాంతం అయిన అండమాన్ దీవులకు వారి పేర్లను పెట్టటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘‘వసుధైవ కుటుంబం అనే భారత మార్గదర్శక సూత్రం ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తోంది. దేశం తీసుకుంటోన్న చర్యలలో ప్రతిబింబిస్తుంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఒక కుటుంబంగా ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించటాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 'ఆపరేషన్ బ్రహ్మ' కింద మయన్మార్‌లో ఇటీవల సంభవించిన భూకంపం.. తుర్కియే, నేపాల్ భూకంపాల సమయంలో సాయం, మాల్దీవుల్లో నీటి సంక్షోభం వంటి ప్రకృతి వైపరీత్యాలకు భారత్ సత్వరమే స్పందించిందని ఆయన పేర్కొన్నారు. సంఘర్షణల సమయంలో ఇతర దేశాల పౌరులను తరలించడంలో భారత పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. దేశ పురోగతి అభివృద్ధి చెందుతోన్న దేశాల (గ్లోబల్ సౌత్) స్వరాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. ప్రపంచ సౌభ్రాతృత్వ స్ఫూర్తి భారత సాంస్కృతిక విలువల నుంచి ఉద్భవించిందని అన్నారు. ఆత్మవిశ్వాసంతో కూడిన రిస్క్ తీసుకునే సామర్థ్యం పెంపొందించుకున్న మన యువతను గొప్ప జాతీయ ఆస్తిగా వర్ణించిన ఆయన.. ఆవిష్కరణలు, అంకురాల్లో వారు చేసిన కృషిని, భారతీయ వారసత్వం, సంస్కృతి పట్ల వారికి ఉన్న గౌరవాన్ని ప్రస్తావించారు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో లక్షలాది మంది యువకులు పాల్గొనడం భారత్‌కు ఉన్న శాశ్వత సంప్రదాయాలతో వారి సంబంధానికి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. జాతీయ అవసరాలపై యువత దృష్టి, భారత్‌లో తయారీ విజయంలో వారి పాత్ర, స్థానిక ఉత్పత్తులకు వారి మద్దతు గురించి ఆయన మాట్లాడారు. క్రీడారంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు రాణిస్తూ జాతి నిర్మాణ స్ఫూర్తితో దేశం కోసం జీవించాలన్న, పనిచేయాలనే వారి సంకల్పాన్ని ఉద్ఘాటించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా భారత యువత దేశాన్ని నడిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్థాగతంగా వ్యవహరించటం, అంకితభావం, సేవాభావం ఈ ప్రయాణంలో చోదక శక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్‌ఎస్‌ఎస్ దశాబ్దాల కృషి, అంకితభావం ఫలిస్తున్నాయని.. భారతదేశ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించాయని వ్యాఖ్యానించారు.
1925లో ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన సమయంలో ఎదురైన భిన్నమైన పరిస్థితుల గురించి మాట్లాడారు. ఆ కాలం పోరాటం, స్వాతంత్య్ర లక్ష్య సాధనకు గుర్తుగా ఉన్న సమయమని అన్నారు. సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణ ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్నారు. 2025 నుంచి 2047 మధ్య కాలం దేశానికి కొత్త, ప్రతిష్టాత్మక లక్ష్యాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఒక గొప్ప జాతీయ సౌధంలో ఒక చిన్న రాయి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ గురూజీ రాసిన లేఖలోని స్ఫూర్తిదాయక మాటలను గుర్తు చేసుకున్నారు. సేవా నిబద్ధతను పెంపొందించుకోవడం, అలుపెరగని కృషిని కొనసాగించడం, అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ సమయంలో పంచుకున్నట్లుగా రాబోయే వెయ్యి సంవత్సరాలకు దేశానికి సంబంధించిన బలమైన పునాది వేయాలనే తన దార్శనికతను మరోసారి వ్యక్తం చేశారు. డాక్టర్ హెడ్గేవార్, గురూజీ వంటి మహానుభావుల మార్గదర్శకత్వం దేశానికి సాధికారత అందించటాన్ని కొనసాగిస్తుందని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారతావని దార్శనికతను నెరవేర్చాలని, తరతరాల త్యాగాలను గౌరవించాలనే సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, స్వామి అవదేశానంద్ గిరి మహారాజ్, డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2116960)
Visitor Counter : 26
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam