ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
చార్ ధామ్, హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర- 2025: సత్వర, సురక్షిత నమోదుకు ‘ఆధార్’ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం
• ‘ఆధార్’ ప్రమాణీకరణను ఉపయోగించుకొంటూ చార్ ధామ్, హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర- 2025కు 7.5 లక్షల మందికి పైగా తీర్థయాత్రికులు నమోదు
• చార్ ధామ్ యాత్రకు ‘ఆధార్’ ఆధారిత ఉత్తరాఖండ్ పర్యాటక అభివృద్ధి మండలి (యూటీడీబీ).. మెరుగైన జనసమూహ నిర్వహణకు ఈ పద్ధతి దోహదం
Posted On:
26 MAR 2025 4:22PM by PIB Hyderabad
భారత్‌లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన తీర్థయాత్రల్లో ఒకటైన చార్ ధామ్, హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రలో పాలుపంచుకోవడానికి నమోదు ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నంలో భాగంగా, ‘ఆధార్’ ఆధారిత ప్రమాణీకరణతోపాటు ఈకేవైసీ పద్ధతిని ఉత్తరాఖండ్ పర్యాటక అభివృద్ధి మండలి (యూటీడీబీ) ప్రారంభించింది.
ఇది నమోదుకు పట్టే కాలాన్ని తగ్గించడంతోపాటు తీర్థయాత్రికులకు లభించే అనుభూతులను మెరుగుపరచాలనేదే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం.
‘ఆధార్’ ఆధారిత ఆన్‌లైన్ నమోదుతో, తీర్థయాత్రికుల రాకపోకలను పర్యవేక్షించడం, దేవాలయాల్లో ఒకే సమయంలో చాలా ఎక్కువ మంది కిక్కిరిసిపోకుండా ఆపగలగడం, ముఖ్యంగా బాగా ఎత్తున నెలకొన్న ప్రాంతాల్లో వాతావరణ సంబంధిత సూచనలను తెలియజేస్తున్న తీరును మెరుగుపర్చడంలో అధికారులకు చక్కని తోడ్పాటు లభించనుంది.
సంప్రదాయానికీ, సాంకేతికతకూ మధ్య సమతౌల్యం
చార్ ధామ్, హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర- 2025 కోసం నమోదు ప్రక్రియ ఈ నెల 20న మొదలైంది. ఈ రోజు ఉదయం వరకు చూస్తే 7,50,000 మందికి పైగా యాత్రికులు ‘ఆధార్’ ఆధారిత నమోదు సదుపాయ ప్రయోజనాన్ని పొందారు.
రాష్ట్రాలు అమలుచేస్తున్న కార్యక్రమాలకు భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మద్దతిస్తోంది. ప్రజలకు జీవించడంలో సౌలభ్యాన్ని మరింతగా మెరుగుపరచడంలో సాయపడుతోంది. రిజిస్ట్రేషన్ పోర్టల్ https:// తోపాటు ‘‘టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్’’ ("Tourist Care Uttarakhand") మొబైల్ యాప్ దీనిని ఉపయోగించుకొంటున్నది.
ఈ చర్య నకిలీ నమోదులను అడ్డుకోవడంలో సాయపడగలదన్న భావన ఉంది. దీంతో, మరింత ఎక్కువ మంది యాత్రికులకు అవకాశం దక్కుతుంది. ‘ఆధార్’ ఆధారిత డిజిటల్ మాధ్యమ వెరిఫికేషన్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతంగా మార్చడంతో పాటు వివిధ పత్రాలను సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించి వేయనుంది. కొన్ని నిర్దేశిత కేంద్రాలలో ఆఫ్‌లైన్ పద్ధతిలో నమోదు చేసుకొనే విధానం కూడా అమలులో ఉంది.
నమోదును ‘ఆధార్’తో ముడి పెట్టినందువల్ల యాత్రికుల వాస్తవ సంఖ్య అందుబాటులో ఉండి వారికి వసతి ఏర్పాట్లు, రవాణా, ఆహారం, వైద్య సాయం.. వీటి విషయంలో మెరుగైన ప్రణాళిక రూపకల్పనతో పాటు ఆ ప్రణాళికకు తగ్గట్టు నిర్వహణకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఇది వనరుల దుబారాను అరికడుతుంది. వనరుల లోటు సమస్యను నివారిస్తుంది. అంతేకాకుండా, ఇది అత్యవసర స్థితులు తలెత్తినప్పుడు అధికార యంత్రాంగానికీ, తీర్థయాత్రికులకు మధ్య సమన్వయాన్ని సైతం మెరుగుపరచగలుగుతుంది.
***
(Release ID: 2116067)
Visitor Counter : 17