వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉల్లిపాయల ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని ఉపసంహరించుకొన్న కేంద్రం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి
Posted On:
22 MAR 2025 7:18PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని ఉపసంహరించుకొంది. ఈ నిర్ణయం ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వర్తించనుంది. వినియోగదారు వ్యవహారాల విభాగం సూచన మేరకు రెవెన్యూ విభాగం ఈ విషయంలో ఈ రోజు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
దేశంలో వినియోగానికి ఉల్లిపాయలు అందుబాటులో ఉండేటట్లు చూడడానికి, ప్రభుత్వం సుంకాన్ని, కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) విధించి ఎగుమతిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంది. 2023 డిసెంబరు 8 నుంచి 2024 మే 3 వరకు దాదాపు 5 నెలల పాటు ఎగుమతిపై నిషేధాన్ని కూడా విధించారు. 2024 సెప్టెంబరు 13 నుంచి వర్తిస్తున్న 20 శాతం ఎగుమతి సుంకాన్ని తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఎగుమతుల విషయంలో ఆంక్షలు అమలైనప్పటికీ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉల్లి ఎగుమతులు 17.17 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)గా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (మార్చి 18 నాటికి) 11.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు ఎగుమతి అయ్యాయి. నెలవారీ ఉల్లి ఎగుమతి 2024 సెప్టెంబరులో 0.72 ఎల్ఎంటీగా ఉండగా, ఈ ఏడాది జనవరి నెలలో 1.85 ఎల్ఎంటీకి చేరుకొంది.
రైతులకు లాభదాయక ధరలు అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ నిర్ణయం ఒక నిదర్శనంగా ఉండడంతోపాటు వినియోగదారులకు ఉల్లిపాయలు వారు భరించగల ధరలలో అందుబాటులో ఉంచగలుగుతుంది. రబీ పంట దిగుబడులు మంచి స్థాయిలలో రాగలవన్న అంచనాలు నెలకొనడంతో మార్కెట్ ధరలతోపాటు చిల్లర విక్రయధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్ ధరలు గత సంవత్సరాలలో ఇదే కాలంలో ధరల స్థాయి కన్నా ఎగువనే ఉన్నాయి. అయినప్పటికీ అఖిల భారతీయ వెయిటెడ్ ఏవరేజ్ రిటైల్ మోడల్ ధరలలో 39 శాతం క్షీణత ఉండటాన్ని గమనించవచ్చు. ఇదే మాదిరిగా, గత ఒక నెల రోజులలో అఖిల భారతీయ సగటు చిల్లర ధరలలో 10 శాతం తగ్గుదల నమోదైంది.
గ్రాఫ్-1: ఉల్లి మార్కెటు, చిల్లర ధరల ధోరణులు

ఉల్లికి ప్రామాణిక మార్కెట్లు అయిన లాసల్‌గాఁవ్, పింపల్‌గాఁవ్ మార్కెట్లకు ఉల్లిపాయల రాక ఈ నెల నుంచి పెరిగి.. ఈ నేపథ్యంలో ధరలు దిగివచ్చాయి. ఈ నెల 21న లాసల్‌గాఁవ్ మార్కెట్లలో ఉల్లిగడ్డ ధర ఒక్కో క్వింటాలుకు రూ.1330గా ఉండగా, పింపల్‌గాఁవ్ మార్కెట్లో ఉల్లిగడ్డ ధర ఒక్కో క్వింటాలుకు రూ.1325గా ఉండింది.
గ్రాఫ్-2: లాసల్‌గాఁవ్ మార్కెట్లో రాక, ధరలు

గ్రాఫ్-3: పింపల్‌గాఁవ్ మార్కెట్లో రాక, ధరలు

వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం అంచనాల ప్రకారం, ఈ సంవత్సరంలో రబీ ఉత్పాదన 227 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఉంది. ఇది కిందటి ఏడాది ఉత్పాదన అయిన 192 ఎల్ఎంటీ కన్నా 18 శాతం ఎక్కువ. భారత్‌లోని మొత్తం ఉల్లి ఉత్పాదనలో 70-75 శాతం రబీ ఉల్లి దిగుబడి వాటాయే ఉందని లెక్కతేలింది. అక్టోబరు, నవంబరు నుంచి ఖరీఫ్ పంట వచ్చే వరకు మొత్తంమీద లభ్యత, ధరలలో స్థిరత్వాన్ని పరిరక్షించడంలో రబీ ఉల్లి దిగుబడి కీలకం అవుతోంది. ఈ ముందస్తు అంచనాను బట్టి చూస్తే, ఈ సీజనులో ఆశించిన దానికన్నా ఎక్కువ ఉత్పాదన ఉండే కారణంగా రాబోయే నెలల్లో మార్కెట్ ధరల్లో మరింత క్షీణత చోటుచేసుకొంటుందన్న అంచనా ఉంది.
ఉల్లి ఉత్పాదన 2023 ఆగస్టు నుంచి తక్కువగా ఉండడం, అంతర్జాతీయంగా అధిక ధరలు పలుకుతుండడం అనే రెండు సవాళ్లను ఎదుర్కొని సతమతం అవుతున్న భారత్‌కు ప్రస్తుతం ఉత్పాదన పెరగడంతోపాటు నియంత్రిత ధరల స్థితీ ఉపశమనాన్ని కలిగించే స్వాగతించదగ్గ పరిణామం.
***
(Release ID: 2114241)
Visitor Counter : 12