సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
శాన్ ఫ్రాన్సిస్కోలో గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ)లో భారత్ పెవిలియన్ ప్రారంభం
* జీడీసీలో ఆకట్టుకొంటున్న వేవ్స్ - ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ విజేతలు
Posted On:
20 MAR 2025 5:54PM by PIB Hyderabad
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ)లో ఇండియన్ పెవిలియన్ అందరి దృష్టినీ తన వైపు ఆకర్షించడంలో చక్కని ప్రారంభాన్ని అందుకొంది. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సల్ జనరల్ డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి పెవిలియన్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ కాన్సల్ జనరల్ శ్రీ రాకేశ్ అద్‌లఖా, సమాచార, ప్రసార శాఖలో ఎన్ఎఫ్‌డీసీ డిజిటల్ గ్రోత్ విభాగం అధిపతి శ్రీ తన్మయ్ శంకర్ పాల్గొన్నారు.

మార్చి 17 నుంచి 21 వరకు జరిగే గేమ్స్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ)... గేమ్ డెవపలర్లు, ఈ పరిశ్రమలోని వృత్తినిపుణులకు సంబంధించినంతవరకు ప్రపంచంలోనే అతి పెద్దదీ, అన్నింటి కన్నా ఎక్కువ ప్రభావాన్ని కలిగించే కార్యక్రమం. ఈ కాన్ఫరెన్స్‌లో.. గేమ్స్ రూపకల్పన, టెక్నాలజీ, వాణిజ్య ధోరణులపై ఉపన్యాసాలు, ప్యానళ్లు, ప్రదర్శనల (ఎగ్జిబిషన్స్) నిర్వహణ.. ఇవన్నీ భాగంగా ఉన్నాయి.
వేవ్స్‌ను ప్రోత్సహించడం: భారత్‌లోని ప్రధాన, మీడియా, వినోద శిఖరాగ్ర సదస్సు నిర్వహణ (WAVES: India’s Premier M&E Summit)
త్వరలో జరగనున్న ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద శిఖరాగ్ర సదస్సు (వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్.. ‘వేవ్స్’)కు ప్రోత్సాహాన్ని అందించడం ఇండియా పెవిలియన్ ప్రధానంగా తన దృష్టిని కేంద్రీకరిస్తున్న అంశాలలో ఒకటి. వేవ్స్ (WAVES)ను 2025 మే 1 నుంచి 4 మధ్య ముంబయిలో నిర్వహించనున్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్న, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) నిర్వహించనున్న వేవ్స్.. ప్రపంచ ప్రసార మాధ్యమాలు, వినోద (ఎం అండ్ ఈ) పరిశ్రమ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్న ఒక ప్రధాన వేదికగా మారడానికి సిద్ధమవుతోంది. వాణిజ్యాన్ని, నవకల్పనలను, వివిధ దేశాల మధ్య సహకారం ప్రధానంగా రూపుదిద్దుకొనే ప్రాజెక్టులను ప్రోత్సహిస్తూ, ప్రపంచంలో కంటెంట్ సృజనకు కూడలి (హబ్)గా భారత్‌ను వేవ్స్ నిలబెట్టబోతోంది.

భారత గేమింగ్ శ్రేష్ఠత్వం అన్ని వర్గాల దృష్టినీ ఆకట్టుకొనేందుకు రంగం సిద్ధం
జీడీసీలో ఏర్పాటు చేసిన "ది ఇండియా పెవిలియన్"లో అత్యాధునిక ప్రదర్శన సంస్థలు (ఎగ్జిబిటర్లు), నూతన ఆవిష్కర్తలు (ఇన్నొవేటర్లు) కొలువుదీరారు. వారు ఇండియాలో శరవేగంగా దూసుకుపోతున్న గేమింగ్ పరిశ్రమ పురోగమనాన్ని ప్రధానంగా చాటుతున్నారు. ఈ పెవిలియన్‌లో దేశంలోని కొన్ని అగ్రగామి గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీల ఘనతలను ప్రదర్శిస్తున్నారు. ఈ తరహా కంపెనీల్లో నజారా టెక్నాలజీస్, విన్‌జో (WinZO)లతోపాటు ఐజీడీసీ 2024 పురస్కార విజేతలైన వాలా ఇంటరాక్టివ్ (Wala Interactive), బ్రూడ్ గేమ్స్ (Brewed Games), జిగ్మా గేమ్స్ (Xigma Games)లతోపాటు సింగులర్ స్కీమ్ కూడా ఉన్నాయి. ‘సింగులర్ స్కీమ్’ గేమ్ డెవలప్‌మెంట్ ప్రక్రియలో తనదైన సృజనశీలత్వానికి, ప్రావీణ్యానికి ప్రఖ్యాతిని సాధించింది.

దీనికి అదనంగా, వేవ్స్ లో భాగంగా ఉన్న ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ (Create in India Challenge) పోటీలలో ఒక పోటీ అయిన భారత్ టెక్ ట్రయంఫ్ సీజను 3 లో విజేతలుగా నిలిచిన ఎంట్రీలను కూడా పెవిలియన్‌లో ప్రదర్శిస్తున్నారు. వీటిలో..
• యుడిజ్ సొల్యూషన్స్ (Yudiz Solutions)
• బ్రాహ్మణ్ స్టూడియోస్ (Brahman Studios)
• గాడ్‌స్పీడ్ గేమింగ్ (Godspeed Gaming)
• సెకండ్ క్వెస్ట్ (Second Quest)
• ఓవర్ ది మూన్ స్టూడియోస్ (Over the Moon Studios)
• గేమ్2మేకర్ (Game2Maker)
• పారియా ఇంటరాక్టివ్ (Pariah Interactive)
• లిస్టో (Lysto)
• మిక్సర్ (Mixar)
• లిటిల్ గురు (Little Guru)
• మోనో టస్క్ స్టూడియోస్ (Mono Tusk Studios)
• గేమ్ఇయాన్ (GameEon)
• ఫన్‌స్టాప్ (Funstop)
• అబ్రకదబ్ర (Abracadabra) .. ఉన్నాయి.
భారత్ పెవిలియన్ సహకారానికి సంబంధించిన ఒక వ్యూహాత్మక వేదికగా పనిచేస్తుంది. ఇది భారతీయ గేమింగ్ కంపెనీలను ప్రపంచ డెవలపర్లు, ప్రచురణకర్తలు, పెట్టుబడిదారులతో సంధానిస్తుంది. సహనిర్మాణం, టెక్నాలజీ ప్రధాన భాగస్వామ్యాలు, కంటెంట్ పంపిణీ.. ఈ అంశాల్లో సంభాషణలు నిర్వహించుకొనేందుకు తోడ్పాటును అందిస్తుంది. ఇలా చేసి ఈ పెవిలియన్ ప్రపంచ గేమింగ్ మార్కెటులో భారతీయ స్టూడియోలకు సరికొత్త వృద్ధి అవకాశాలను గుర్తించడంలో సాయపడుతుంది.
ఎన్ఎఫ్‌డీసీ ని గురించి:
భారత్‌లో మంచి చలనచిత్రాలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కేంద్రీయ ఏజెన్సీయే భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ). ఫిల్మార్ట్ (FILMART), కేన్స్ చలనచిత్రోత్సవం, బెర్లినాలే వంటి ముఖ్య అంతర్జాతీయ కార్యక్రమాలలో ఎన్ఎఫ్‌డీసీ భాగం పంచుకొని, భారతీయ కంటెంట్ సృజనకారులకు సహనిర్మాణాలు, మార్కెట్ లభ్యత అంశాలలో మార్గాన్ని సుగమం చేస్తుంది.
వేవ్స్ గురించి (About WAVES) :
ప్రసార మాధ్యమాలు, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిపోనున్న ఈ తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద శిఖరాగ్ర సదస్సు (వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్.. ‘వేవ్స్’)ను భారత ప్రభుత్వం మహారాష్ట్ర లోని ముంబయిలో మే 1 నుంచి 4 వరకు నిర్వహించనుంది.
ఈ రంగంలో నిపుణులు, పెట్టుబడిదారుడు, రూపకర్త, ఆవిష్కర్త, ఇలా ఏ పాత్రను మీరు పోషిస్తున్నా సరే.. ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. ప్రసార మాధ్యమాలు, వినోద పరిశ్రమతో అనుసంధానం కావడానికి, సహకారం పెంపొందించుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మీ వంతు తోడ్పాటు అందించడానికి అంతర్జాతీయ వేదికను వేవ్స్ మీకు అందిస్తుంది.
ఇండియాలో దాగున్న సృజనాత్మకతను ప్రోత్సహించి, కంటెట్ రూపకల్పన, మేధాహక్కులు, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా దేశాన్ని తయారు చేయడమే వేవ్స్ లక్ష్యం. ప్రసార రంగం, పత్రికా మాధ్యమం, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం - సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్) తదితర రంగాలు, పరిశ్రమలపై ఈ సందర్భంగా దృష్టిని సారిస్తున్నారు.
మీరేమైనా ప్రశ్నలు అడగదలచుకొన్నారా? వాటికి సమాధానాలు చూడండిక్కడ : here
రండి, మాతో కలసి ప్రయాణించండి! వేవ్స్ లో పాల్గొనడానికి నమోదు చేసుకోండి ఇప్పుడే : now (త్వరలో వస్తోంది!).
***
(Release ID: 2113695)
Visitor Counter : 15