అంతరిక్ష విభాగం
పార్లమెంటులో ప్రశ్న: అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రోత్సాహం
Posted On:
20 MAR 2025 2:52PM by PIB Hyderabad
అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు:
i. ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఈ) అంతరిక్ష కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాలుపంచుకునేందుకు వీలుగా సరళీకరణలను ప్రవేశపెట్టింది.
ii. ఎన్జీఈ కార్యకలాపాలకు ప్రోత్సాహం, ప్రారంభం, అనుమతులు, పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ని ఏర్పాటు చేసింది.
iii. 2023-అంతరిక్ష విధానాన్ని, నిబంధనలు, మార్గదర్శకాలు, ప్రక్రియలను (ఎన్జీపీ), ఎఫ్డీఐ విధానాలను రూపొందించింది. నియంత్రణాధికారం గురించి స్పష్టత, అంతరిక్ష రంగ పురోభివృద్ధికి ఈ విధానాలు మార్గం సుగమం చేస్తాయి.
iv. టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ (టీఏఎఫ్), ప్రారంభ నిధి, ధరల నిర్ణయంలో మద్దతు, మెంటార్షిప్, అంతరిక్షంలో అంకుర పరిశ్రమలకు, ఎన్జీఈలకు మద్దతునిచ్చే సాంకేతిక ప్రయోగశాలల ఏర్పాటు వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్జీఈలతో 78 అవగాహన ఒప్పందాలపై సంతకాలు, 31.12.2024 కల్లా 72 అనుమతులను జారీ చేసింది.
v. పీపీపీ పద్ధతిలో ఎర్త్ అబ్జర్వేషన్ (ఈఓ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇన్-స్పేస్ కృషి చేస్తోంది.
vi. చిన్న ఉపగ్రహ వాహక నౌకల (ఎస్ఎస్ఎల్వీ) సాంకేతికతను భారతీయ కంపెనీలకు బదలాయించే ప్రక్రియ కొనసాగుతోంది.
vii. అంతరిక్ష కక్ష్య వనరులను భారత కంపెనీల అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశాలను కల్పిస్తున్నారు.
viii. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1000 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇన్ స్పేస్ తో దాదాపు 330 పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు అనుసంధానమయ్యాయి. వీటి అంతరిక్ష కార్యకలాపాలు, డేటా ప్రసారం, సాంకేతికత బదిలీ, ప్రచార కార్యకలాపాలు, ఇన్ స్పేస్ సాంకేతిక కేంద్రం, ఇస్రో పరీక్షా కేంద్రాలను వినియోగించుకునే అవకాశం వంటి వాటికి ఇన్ స్పేస్ అనుమతులను ఇస్తుంది.
రాజ్య సభకు ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు, భూవిజ్ఞాన శాస్త్ర, అణుశక్తి, అంతరిక్ష శాఖ, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2113285)
Visitor Counter : 29