సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్-2025: మీడియా వినోద రంగాల్లోని అంకుర పరిశ్రమలకు సరికొత్త మార్గదర్శి
2025 వేవెక్స్-2025 లో వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్ల ఎదుట కొత్త ప్రతిపాదనలతో అంకుర పరిశ్రమలు
వేవెక్స్-2025 ద్వారా అంకుర పరిశ్రమలకు సురక్షితమైన పెట్టుబడులు, మరింత గుర్తింపూ దక్కే అవకాశం
Posted On:
18 MAR 2025 6:11PM
|
Location:
PIB Hyderabad
మీడియా, వినోద రంగాల్లోని అంకుర పరిశ్రమలకు జాతీయ స్థాయి అవకాశాలు, గుర్తింపులతో పాటు సులభ పెట్టుబడుల అవకాశాలను కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వేవెక్స్-2025 పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. అఖిలభారత ఇంటర్నెట్, మొబైల్ సంస్థ ‘ఐఏఎంఏఐ’ సహకారంతో జరిగే ఈ కార్యక్రమం, మే 1 నుంచి 4 వరకూ ముంబయి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే వేవ్స్ (ప్రపంచ దృశ్య- శ్రవణ, వినోద సదస్సు)లో భాగంగా ఏర్పాటవుతుంది.
దేశ అంకుర పరిశ్రమలు ఈ రంగంలో పరివర్తనకు నేతృత్వం వహించేందుకు గాను వేవెక్స్-2025 చోదకశక్తిగా పనిచేస్తుంది. కార్యక్రమం ద్వారా అంకుర పరిశ్రమలకు అవగాహన పెంపొందటం, అవకాశాలు లభించడమే కాక, వ్యాపార అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు దక్కే అవకాశం కూడా ఉంది. కార్యక్రమంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సమావేశాల్లో వెంచర్ క్యాపిటలిస్టులు, పేరొందిన ఏంజెల్ ఇన్వెస్టర్ల ఎదుట ప్రతిపాదనలుంచే అపురూపమైన అవకాశం అంకుర పరిశ్రమలకు దక్కుతుంది. కార్యక్రమాలు జాతీయస్థాయి టెలివిజన్ ప్రసారాల ద్వారా అసంఖ్యాకులకు చేరతాయి కాబట్టి అంకుర పరిశ్రమలకు విస్తృత స్థాయి గుర్తింపు దక్కుతుంది.
వేవెక్స్-2025... గేమింగ్, యానిమేషన్, ఎక్స్టెండెడ్ రియాలిటీ, మెటావర్స్, జెనరేటివ్ ఏఐ, నవీనతర కంటెంట్ వేదికలపై ప్రాథమికంగా దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమం పెట్టుబడుల కల్పనకే పరిమితమవక మెంటార్షిప్ అవకాశాలు, పెట్టుబడుల నెట్వర్కింగ్, దిగ్గజ మీడియా, టెక్ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను కూడా కల్పిస్తుంది. కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమ నేతలు ఒక వద్దకు చేరి కలిసి ఆలోచనలు కలబోసుకునే అవకాశం కలుగుతుంది. వినోదం, సాంకేతికతల కలయికతో కంటెంట్ సృజన, పంపిణీ, వాడకం రూపురేఖలు మారిపోతాయి.
వేవెక్స్ కార్యక్రమంలో స్థూలంగా రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ పిచింగ్ ( పెట్టుబడుల కోసం చేసే ప్రతిపాదనలు) సెషన్లు ఏర్పాటవుతాయి – మొదటి సెషన్లో అంకుర పరిశ్రమలు వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్ల ఎదుట తమ ప్రతిపాదనలు ఉంచుతాయి. ఇక రెండో సెషన్లో ఎంపిక చేసిన స్టార్ట్ అప్ లు పేరొందిన ఏంజెల్ ఇన్వెస్టర్ల బృందం ఎదుట తమ ఆలోచనలను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమం జాతీయ స్థాయి టెలివిజన్ ద్వారా ప్రసారం చేస్తారు కాబట్టి, పాల్గొంటున్న అంకుర పరిశ్రమలు అసంఖ్యాక ప్రేక్షకులను చేరే అవకాశం సహా వాటికి పెట్టుబడి అవకాశాలు కూడా విస్తృతమవుతాయి.
వేవెక్స్-2025 కార్యక్రమానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ దశల వడపోతల అనంతరం అట్టహాసంగా జరిగే ఫైనల్స్ కోసం అత్యంత సమర్థవంతమని భావించే స్టార్ట్అప్ లను ఎంచుకుంటారు. టెలివిజన్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమంలో ఈ అంకుర పరిశ్రమలు సెలెబ్రిటి ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టుల ఎదుట తమ ప్రతిపాదనలను గురించి వివరిస్తాయి. ఫైనల్ లో ఎంపికైన సంస్థలు, పరిశ్రమ నిపుణులు పాల్గొనే సమగ్రంగా అభివృద్ధిపరచిన మెంటార్షిప్ కార్యక్రమాల లబ్ధి పొందే అవకాశం ఉంది, అంతేకాక, ఇన్వెస్టర్ నెట్వర్కింగ్ అవకాశాలను దక్కించుకునే అవకాశం, దిగ్గజ మీడియా, టెక్ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు.
మీడియా-టెక్ పరిశ్రమల కేంద్రంగా భారత్ కు గల గుర్తింపును వేవెక్స్ కార్యక్రమం మరింత బలపరుస్తుంది. ఏఐ-ఆధారిత కంటెంట్, డిజిటల్ మీడియా, కొత్తగా ఆవిర్భవిస్తున్న వినోదరంగ సాంకేతికతలను కార్యక్రమం వినియోగించుకుంటుంది. మీడియా-టెక్ రంగ సృజనాత్మకతలో భారత్ ను అగ్రగామి దేశంగా నిలపాలన్న ఆశయంతో, వ్యూహాత్మకంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన వేవ్స్ నోడల్ అధికారి వెల్లడించారు.
డిజిటల్ కంటెంట్, సాంకేతికతల్లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న నేపథ్యంలో అంకుర పరిశ్రమలు ఈ రంగంలో బలపడేందుకు వేవెక్స్-2025 గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. జాతీయస్థాయి గుర్తింపు, పెట్టుబడులు, ఉన్నత స్థాయి మెంటార్షిప్ అవకాశాలను కోరుకునే వారు https://wavex.wavesbazaar.com/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వేవ్స్ గురించి:
మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి 4 వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు.
మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా, సదస్సు మీకు ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, అనుసంధానమై మరింత తోడ్పాటును అందించేందుకు అవకాశాలని కల్పిస్తుంది.
కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ-సంగీత రంగాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.
మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు ఇక్కడ :
రండి, మాతో ప్రయాణించండి! వేవ్స్ సదస్సు లో పాల్గొనేందుకు ఇప్పుడే మీ పేర్లను నమోదు చేసుకోండి! (అతి త్వరలో మీ ముందుకు..!)
Release ID:
(Release ID: 2112764)
| Visitor Counter:
47