లోక్‌సభ సచివాలయం
కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా సభా కార్యకలాపాల కోసం ‘సంసద్ భాషిణి’ వ్యవస్థ రూపకల్పనపై లోక్‌సభ సచివాలయం-ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం
· కృత్రిమ మేధ.. ప్రత్యక్ష అనువాదాల ద్వారా పార్లమెంటు కార్యకలాపాల నమోదు-లభ్యతను విప్లవాత్మకం చేసే దిశగా ‘సంసద్ భాషిణి’ వ్యవస్థ
· ఈ వ్యవస్థతో బహుళ భాషలలో ఎంపీలు, పరిశోధకులు, విద్యారంగంలోని వారికి విస్తృత పార్లమెంటరీ చర్చలు-రికార్డులన్నీ లభ్యం
Posted On:
18 MAR 2025 8:42PM by PIB Hyderabad
పార్లమెంటు కార్యకలాపాల సందర్భంగా బహుభాషా సౌలభ్యం దిశగా కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ (సంసద్ ఏఐ సొల్యూషన్) రూపకల్పన కోసం లోక్‌సభ సచివాలయం-కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా-కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ల సమక్షంలో సంతకాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం కింద ‘సంసద్ భాషిణి’ పేరిట సభా వ్యవహారాలకు సంబంధించి బహుళ భాషలలో క్రమబద్ధీకరించే ప్రక్రియలతో కూడిన సమగ్ర సభాంతర కృత్రిమ మేధ వ్యవస్థను అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందం ధ్యేయం.
పార్లమెంటరీ సమాచార నిధి ఆధారంగా ఉత్పత్తులు/ఉపకరణాల సంయుక్త రూపకల్పన-వినియోగంపై లోక్‌సభ సచివాలయం, మంత్రిత్వశాఖ అంగీకారానికి వచ్చాయి. ‘ఏఐ’ ఉపకరణాలు/ఉత్పత్తులపై అవగాహన, మెరుగుదల కోసం పార్లమెంటు నుంచి లభించే పార్లమెంటరీ సమాచారం-వనరులను ఉపయోగించుకుంటారు. ఈ సందర్భంగా అనువాద సామర్థ్యం, ఇతర సాంకేతిక నైపుణ్యాన్ని భాషిణి సమకూరుస్తుంది.
సంసద్ భాషిణి కింద కీలక కార్యక్రమాలు కిందివిధంగా ఉంటాయి:
1. కృత్రిమ మేధ ఆధారిత అనువాదం
· చర్చా వారసత్వ పత్రాలు, అజెండా ఫైళ్లు, కమిటీ సమావేశాలు, ఇతర పార్లమెంటరీ వ్యవహారాల సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లోకి నిరంతరం అనువదించడం.
· పౌరులందరికీ భాషా వైవిధ్యం, సౌలభ్యాలపై హామీ.
2. పార్లమెంటు వెబ్‌సైట్ కోసం కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్
· విధానపరమైన కీలక నిబంధనలు, పత్రాలను పొందడంలో సభ్యులు, అధికారులకు తోడ్పడే అత్యాధునిక చర్య-ప్రతిచర్యాత్మక (ఇంటరాక్టివ్) చాట్‌బాట్.
· వినియోగదారులకు తక్షణ, కచ్చిత ప్రతిస్పందనల లభ్యత. తద్వారా కీలక పార్లమెంటరీ నిబంధనలు, కార్యకలాపాల శోధన సమయం ఆదా.
· వినియోగదారులతో చర్య-ప్రతిచర్యల ద్వారా చాట్‌బాట్ నిరంతరం నేర్చుకుంటూ, స్వీయ మెరుగుదలతోపాటు కాలక్రమంలో సామర్థ్యం పెంచుకుంటుంది.
3. సంభాషణ వచనంగా మార్పిడి-ప్రత్యక్ష భాషానువాదం
· సంభాషణ పూర్వక చర్చల తక్షణ లిప్యంతరీకరణతో వచనంగా మార్చే విప్లవాత్మక వ్యవస్థ.
· చర్చల సులభ నమోదు, లభ్యత, ప్రస్తావన తదితరాలకు భరోసా ఇస్తూ అన్ని భారతీయ భాషలలో ఇది అందుబాటులో ఉంటుంది.
· నేపథ్య రణగొణల తగ్గింపు, సానుకూలీకరించగల పదకోశం, మెరుగైన కచ్చితత్వం కోసం పత్రాల సమర్థ ప్రామాణీకరణ ఉపకరణాల లభ్యత.
4. తక్షణ లిప్యంతరీకరణతో సంభాషణల మార్పిడి
· సంభాషణ లేదా ప్రసంగాల తక్షణ మార్పిడి, అనువాద సౌలభ్యం. ఇది సంభాషణలు, చర్చలను వివిధ భాషలలో తక్షణం అందుబాటులో ఉంచుతుంది.
· సుదీర్ఘ చర్చల స్వయంచలిత సంక్షిప్తీకరణ.. తద్వారా సత్వర నిర్ణయాలు, మరింత మెరుగ్గా రికార్డుల నిర్వహణకు దోహదం చేస్తుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ- దీనికి నాయకత్వం వహించడంతోపాటు మార్గనిర్దేశం చేసినందుకుగాను లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం కార్యరూపంలోకి వస్తే అత్యాధునిక కృత్రిమ మేధ పరిష్కారాలతో పార్లమెంటరీ ప్రక్రియలు రూపాంతరం చెందగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సంసద్ భాషిణి’తో బహుళ భాషలలో సమాచార సౌలభ్యం ఇనుమడిస్తుందని చట్టసభ కార్యకలాపాల పత్ర ప్రామాణీకరణ క్రమబద్ధం కాగలదని పేర్కొన్నారు. అంతేకాకుండా సాంకేతికత ఆధారిత పాలనలో భారత్ స్థానం అంతర్జాతీయంగా మరింత బలోపేతం కాగలదని ప్రగాఢ విశ్వాసం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. కాగా, లోక్‌సభ సచివాలయం తరఫున సంయుక్త కార్యదర్శి శ్రీ గౌరవ్ గోయల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
***
(Release ID: 2112642)
Visitor Counter : 29