కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎమ్ ఇంటర్న్‌షిప్ యాప్‌ను కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా సమక్షంలో ప్రారంభించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


* తరగతి గదిలో విద్య నేర్చుకోవడానికి, పరిశ్రమ అంచనాలకు మధ్య ఉండే అంతరాన్ని భర్తీ చేసే సత్తా పీఎమ్ ఇంటర్న్‌షిప్‌కు ఉంది: ఆర్థిక మంత్రి

Posted On: 17 MAR 2025 8:18PM by PIB Hyderabad

ప్రైం మినిస్టర్స్ ఇంటర్న్‌షిప్ స్కీము కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిన ఒక మొబైల్ అప్లికేషన్ (యాప్‌)ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ న్యూ ఢిల్లీలోని పార్లమెంటులోని సమన్వయ్ హాల్ నంబర్ 5లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ వ్యవహారాలు, రవాణా శాఖల సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా కూాడా పాల్గొన్నారు.


ఈ యాప్‌లో విశేషాలు ఇలా ఉన్నాయి :

సాఫీగా ఉన్న డిజైను, సులభమైన  మార్గదర్శనం (నావిగేషన్)తో కూడిన సహజ ఇంటర్‌ఫేస్

ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ సాయంతో ఇట్టే నమోదు చేసుకోవచ్చు

సరళ మార్గదర్శనం - అర్హత కలిగిన అభ్యర్థులు వారికి అనువుగా ఉండే స్థానం (లొకేషన్) వగైరాల వాటి ఆధారంగా అవకాశాలను జల్లెడ పట్టుకోవచ్చు.

వ్యక్తిగత డ్యాష్‌బోర్డు

ఒక ప్రత్యేక సహాయక బృందం నుంచి కావలసిన సేవలను పొందగలిగే సదుపాయం

ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అభ్యర్థులకు తాజా సమాచారం అందజేత.

ఉపాధిని,  నైపుణ్యాల్ని, అవకాశాలను పెంచడానికి అయిదు పథకాలతో ఓ ప్యాకేజీని రంగంలోకి తెచ్చిన ప్రధానమంత్రి దార్శనికతను శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. తరగతి గదిలో నేర్చుకొనే విషయాలకూ శ్రమశక్తి విషయంలో పరిశ్రమ పెట్టుకునే అంచనాలకూ నడుమ అంతరాన్ని భర్తీ చేయగల సత్తాతోపాటు దీని ద్వారా యువతలో ఉద్యోగాలు చేయడానికి కావలసిన శక్తియుక్తులను పెంచే దక్షత కూడా పీఎం ఇంటర్న్‌షిప్‌కు ఉందని ఆమె స్పష్టంచేశారు. ఈ పథకంలో ఉత్సాహంగా పాలుపంచుకోవాల్సిందిగా పరిశ్రమ వర్గాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. వారి ప్రమేయం దేశంలో చేయితిరిగిన సిబ్బందిని ప్రోత్సహిస్తూనే, మరో వైపు దేశ నిర్మాణానికి కూడా తోడ్పాటును ఇవ్వగలుగుతుందని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు.

పీఎంఐఎస్ యాప్‌ను తీసుకురావడంతో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాల్ని అందుకొనే వెసులుబాటు బాగా పెరుగుతుందని సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా అన్నారు.

ఈ పీఎంఐఎస్ అప్లికేషన్‌తో, యూజర్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఇటీవలే ప్రకటించిన రెఫరల్ కార్యక్రమాన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ రెఫరల్ కార్యక్రమం తమ పేర్లను నమోదు చేసుకొన్న యువతకు పథకానికి గాను ఇతర అర్హులైన అభ్యర్థులను సూచించేందుకు, అలా చేసి బహుమతులను గెలుచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పోర్టల్ (వెబ్ బ్రౌజర్)లో నమోదు చేసుకొన్న యువతీయువకులు కూడా ఈ రెఫరల్ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు.

ప్రైం మినిస్టర్స్ ఇంటర్న్‌షిప్ స్కీము (పీఎంఐఎస్)ను 2024-25  బడ్జెటులో ప్రకటించారు. అయిదు సంవత్సరాల్లో ఒక కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందజేయాలన్నదే ఈ పథకం లక్ష్యం. ఈ పథకాన్ని మొదట 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించాలన్న ధ్యేయంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను గతేడాది అక్టోబరు 3న ప్రారంభించారు. ఈ పథకం ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

భారత్‌లో అగ్రగామి కంపెనీలలో 12 నెలల పాటు చెల్లింపుతో కూడిన ఇంటర్న్‌షిప్‌లను కల్పించడం.

ఈ పథకం యువతకు వ్యాపారాల్లో గాని లేదా సంస్థలలో గాని (కనీసం 6 నెలల పాటు) శిక్షణను పొందేందుకు, అనుభవాన్ని, నైపుణ్యాన్ని సాధించేందుకు అవకాశాలను కల్పిస్తుంది. ఇది విద్యాసంబంధిత జ్ఞానార్జనకు, పరిశ్రమ రంగ అవసరాలకు మధ్య అంతరాన్ని భర్తీ చేయడంలో సహాయకారి అవుతుంది. అంతేకాకుండా ఉపాధి సంబంధిత సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకోవడంలో కూడా తోడ్పడుతుంది.

ఈ పథకం 21ఏళ్లు మొదలు 24 ఏళ్ల వయస్సు గల వ్యక్తులను దృష్టిలో పెట్టుకొంటుంది. వారు ఇప్పటికే ఎలాంటి పూర్తి కాల విద్యాసంబంధిత  పాఠ్యక్రమంలో చేరకుండా ఉండడం గాని, లేదా బతుకుతెరువును సంపాదించుకోవడం గాని చేయనివారై కూడా ఉండాలి. అలాంటి వారు వారి కెరియర్‌ను మొదలుపెట్టేందుకు ఒక అద్వితీయ అవకాశాన్ని ఈ పథకం అందిస్తుందన్నమాట.

ప్రతి ఇంటర్న్ (శిక్షణ పొందే అభ్యర్థి)కి నెలకు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని ఇస్తారు. దీనికి అదనంగా రూ.6,000 ఏకమొత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు.

పైలట్ ప్రాజెక్టు ఒకటో దశలో (కిందటి ఏడాదిలో అక్టోబరు మొదలు డిసెంబరు దాకా) 25 రంగాల్లో దాదాపుగా 280 కంపెనీల్లో ఇంచుమించు 745 జిల్లాల వ్యాప్తంగా 1.27 లక్షల కన్నా ఎక్కువ అవకాశాలను నమోదు చేశారు. అభ్యర్థులకు 82,000కు పైగా ఆఫర్లను ఇచ్చారు.

పైలట్ ప్రాజెక్టు రెండో దశ ఈ ఏడాది జనవరిలో మొదలైంది. సుమారు 327 కంపెనీలు దేశమంతటా (కొత్త అవకాశాలకు తోడు ఒకటో దశలో ఖాళీగా మిగిలినవి కలుపుకొని) 1.18 లక్షల కన్నా ఎక్కువ అవకాశాలను ఇవ్వజూపాయి. వీటిలో నుంచి దాదాపు 37,000 అవకాశాలు పట్టభద్రుల కోసం కాగా 23,000 అవకాశాలు ఐటీఐ పూర్తి చేసిన వారికి, 18,000 అవకాశాలు డిప్లొమా హోల్డర్లకు, 15,000 అవకాశాలు 12వ తరగతి వారికోసం కాగా 25,000 అవకాశాలు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగం, ప్రయాణం, ఆతిథ్య రంగం, బ్యాంకింగ్ , ఫైనాన్స్ రంగం వంటి విభిన్న రంగాలలో అవకాశాలతోపాటు వివిధ రకాల ఉద్యోగాలు.. ఉదాహరణకు విక్రయాలు, మార్కెటింగు వంటివి, ఐటీఐ ఉత్తీర్ణులకు సాంకేతికత ప్రధానంగా ఉన్న అవకాశాలు, మానవ వనరుల ఇంటర్న్‌షిప్, ఇలా మరెన్నో అవకాశాలను ఇవ్వజూపారు. ఈ అవకాశాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 735 జిల్లాల్లో లభిస్తున్నాయి.

పైలట్ ప్రాజెక్టు రెండో దశలో పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో చేరడాన్ని గురించిన అవగాహనను విస్తృతం చేసే ప్రయత్నాన్ని చేపట్టారు. పీఎంఐఎస్ పోర్టల్‌లో డ్యాష్‌బోర్డును సరళతరం చేస్తూ, దీనిని మరింత ఎక్కువ ఉపయోగానికి అనుకూలమైందిగా తీర్చిదిద్దారు. ఇవ్వజూపే అవకాశాలు, పోషించాల్సిన పాత్రలను గురించి మరింత సమాచారాన్ని ఇచ్చారు. కాలేజీలు, జాబ్ మేళాల వంటి వివిధ విద్యాసంస్థల్లో నిర్వహించిన 80కి పైగా అవుట్‌రీచ్ కార్యక్రమాల్లో పాల్గొన్న యువతీయువకులతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ), రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమకు చెందిన భాగస్వామ్య సంస్థల అధికారులు మాట్లాడారు.


పీఎంఐఎస్ రెండో దశలో ప్రయోగాత్మక (పైలట్) ప్రాజెక్టు అమలు తీరును అంచనా వేయడానికి, పీఎంఐఎస్‌కు సంబంధించిన కార్యాచరణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే కృషిని గుర్తించడానికి, బహుమతులను ఇవ్వడానికి ఒక ఫ్రేంవర్కును రూపొందించారు.

రెండో దశ కోసం ఇంటర్న్‌షిప్ దరఖాస్తులను ఈ ఏడాది మార్చి నెల 31వరకు స్వీకరిస్తారు.

అర్హులైన యువతీయువకులు కొత్త మొబైల్ యాప్ ద్వారా గాని లేదా https://pminternship.mca.gov.in/ అనే వెబ్ చిరునామాతో లభ్యమయ్యే పోర్టల్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు.

 

***


(Release ID: 2112292) Visitor Counter : 9