పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చమురుక్షేత్రాల (నియంత్రణ-అభివృద్ధి) సవరణ బిల్లుకు లోక్‌ సభలో ఆమోదముద్ర

Posted On: 12 MAR 2025 8:51PM by PIB Hyderabad

‘చమురు క్షేత్రాల (నియంత్రణ-అభివృద్ధి) సవరణ బిల్లు, 2024’కు లోక్‌సభ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభ కిందటి ఏడాది డిసెంబరు 3న ఆమోదించింది. మార్కెట్ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత అవసరాలను తీర్చడానికి, చమురు రంగాన్ని పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి సంబంధిత చట్ట స్వరూపాన్ని సంస్కరించాలన్నదే ఈ బిల్లు ఉద్దేశం. ఇలా చేస్తే చమురు, వాయువు అన్వేషణను, ఉత్పత్తి కార్యకలాపాలను ఇప్పటి కన్నా పెంచవచ్చు. పౌరులకు  తగినంత స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేటట్లు చూడడం, తక్కువ ధరల్లో ఇంధన లభ్యతతోపాటు పౌరుల భద్రతకు పూచీపడే దిశలో భారత్ చేస్తున్న కృషిలో ఈ బిల్లు ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. అదే సమయంలో, 2047 కల్లా ‘వికసిత్ భారత్‌’ ను ఆవిష్కరించాలన్న గౌరవ ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో కూడా ఈ బిల్లు తన వంతు తోడ్పాటును అందించగలుగుతుంది.  

గత పది సంవత్సరాలలో, ప్రభుత్వం అనేక ప్రధాన సంస్కరణలను తీసుకువచ్చింది. ఈ సంస్కరణలలో.. కాంట్రాక్టులను ఇవ్వడంలో ‘ఉత్పత్తిని పంచుకొనే తరహా’ విధానం నుంచి ‘రెవెన్యూను పంచుకొనే తరహా’ విధానానికి మారడం కీలకమైన సంస్కరణ. ప్రక్రియలను సరళతరం చేయడం, దేశంలో చమురు, వాయువుల అన్వేషణతోపాటు వాటి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి నియంత్రణలకు సంబంధించిన భారాన్ని తగ్గించడం, ఇదివరకు అనుమతించని ప్రాంతాలలోనూ అన్వేషణ కార్యకలాపాలకు వెసులుబాటును కల్పించడం, ముడి చమురును నియంత్రణ పరిధి నుంచి తప్పించడంతోపాటు సహజ వాయువు మార్కెటింగులో, ధరల ఖరారులో స్వేచ్ఛనివ్వడం.. వంటివి కూడా కలిసి ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో అన్వేషణ కొనసాగుతున్న విస్తీర్ణంలో 76 శాతం విస్తీర్ణాన్ని 2014 తదనంతర కాలంలో అన్వేషణకు అనుమతించారంటే, ఇది ఈ ప్రధాన సంస్కరణల వల్ల ఒనగూరిన కీలక ఫలితమేనని చెప్పుకోవాలి.

చట్ట సంస్కరణలలో అతి పెద్ద సంస్కరణ అని ప్రస్తావించదగ్గ ఈ చారిత్రక సవరణ బిల్లును పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం లైసెన్సుల మంజూరు, నియంత్రణకు పెద్దపీట వేయడం, రాయల్టీల వసూలు.. వీటిపై దృష్టిని కేంద్రీకరిస్తోందని, ప్రభుత్వానికీ కాంట్రాక్టర్లకు మధ్య సహకారాన్ని, వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని పెంచాలంటే నవీకరణకు చోటుఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.  వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి పరిశ్రమలోని ప్రముఖులతో, పెట్టుబడికి ఆసక్తిని కనబరుస్తున్న సంస్థల ప్రతినిధులతో, ఆసక్తిదారులతో విస్తృతంగా చర్చించామని మంత్రి తెలిపారు. ఆశించిన ఫలితాలను అందుకోవడానికి దీర్ఘకాలం పట్టడం, ప్రాజెక్టు పరంగా రిస్కులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల సరళమైన, నిలకడతనంతో కూడిన, అంచనాకు అందగలిగిన తరహా చట్ట స్వరూపం ఉండాలని పెట్టుబడిదారులు ఆశించారు. అంతేకాక వివాదాలంటూ తలెత్తితే వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక సమర్ధ యంత్రాంగాన్ని ఆశ్రయించే వీలు కూడా ఉండాలని వారు కోరుకుంటున్నారు.  భారత్ ప్రయోజనాలను పెంపొందించే, పరిరక్షించే, ఆ ప్రయోజనాలకు పెద్దపీట వేసే సవరణలను బిల్లులో ప్రతిపాదించారు. ఈ సవరణలు పెట్టుబడిదారులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేవిగా కూడా ఉన్నాయి.

గనుల తవ్వకాలను, పెట్రోలియమ్ కార్యకలాపాలను ఒకే గాటకు కడుతూ మునుపు జరిగిన తప్పు పద్ధతిని తొలగించాలన్నది ఈ సవరణ బిల్లు ఉద్దేశాల్లో ఒకటి. వివిధ రకాల హైడ్రోకార్బన్ల సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి కాంట్రాక్టర్లు అనేక లైసెన్సులను తీసుకోవాల్సి వచ్చే ప్రస్తుత వ్యవస్థకు బదులు పెట్రోలియం లీజులకు ఒకే అనుమతి వ్యవస్థను సైతం ఈ బిల్లులో ప్రతిపాదించారు. సమగ్ర ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధిచేయడానికి, కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్-సిక్వెస్ట్రేషన్ (సీసీయూఎస్), గ్రీన్ హైడ్రోజన్ వంటి కొత్త టెక్నాలజీలను అనుసరించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

2014 తరువాతి కాలంలో, పెట్రోలియం, సహజవాయు  శాఖ (ఎంఓపీఎన్‌జీ) అన్వేషణ కార్యకలాపాల నుంచి ఆదాయాన్ని ఆర్జించే యత్నాలను వేగవంతం చేయడం మొదలుపెట్టింది. ఈ గమ్యం వైపు పయనించడంలో భాగంగానే, 2015లో చిన్న క్షేత్రాల విధానాన్ని నోటిఫై చేశారు. ఇదివరకటి ఆపరేటర్లు దృష్టి సారించని క్షేత్రాలను అనేక మంది చిన్న చిన్న ఆపరేటర్లకు మంజూరు చేశారు. అక్కడొకటీ, ఇక్కడొకటీగా విస్తరించి ఉన్న ఈ క్షేత్రాలు సరైన మౌలిక సదుపాయాలకు నోచుకోక సతమతమవుతున్నాయి. చమురు బ్లాకుల లాభదాయకతను మెరుగుపరచడానికి వివిధ ఆపరేటర్ల మధ్య వనరులతోపాటు మౌలిక సదుపాయాల సంబంధిత తోడ్పాటును పరస్పరం అందించుకొనే వెసులుబాటును కల్పించి తద్వారా చిన్న ఆపరేటర్లకు సాయపడాలని బిల్లులో ప్రతిపాదించారు.

భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్న ప్రపంచ స్థాయి చమురు కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులలో కార్యకలాపాల నిర్వహణలో స్థిరత్వలోపం ఒకటి. లీజు కాలం, లీజు షరతులు.. వీటి విషయంలో నిలకడతనానికి ఆస్కారం కల్పించి ఈ ప్రధాన సమస్యను పరిష్కరించాలన్నది కూడా బిల్లు లక్ష్యాలలో ఒక లక్ష్యం. వివాదాలు తలెత్తిన పక్షంలో వాటిని ఒక నిర్దిష్ట కాలంలోపల, నిష్పక్షపాతంగా, తక్కువ ఖర్చులో పరిష్కరించుకోగలిగేటట్లు సమర్ధ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో స్పష్టం చేశారు.

చట్ట నిబంధనలకు ఆచరణ రూపాన్ని ఇవ్వడాన్ని ప్రోత్సహించే క్రమంలో, అదే పనిగా నియమోల్లంఘనలకు పాల్పడితే ఒక్కో రోజు లెక్కన విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. నియమాల అతిక్రమణను నివారించాలనేదే దీని వెనుక ఉన్న ప్రధానోద్దేశం. వ్యవస్థను ప్రభావశీలమైందిగా, శీఘ్ర ఫలితాలనిచ్చేదిగా మలచడానికి పెనాల్టీలు విధించడానికి ఒక న్యాయ నిర్ణయాధికార ప్రాధికరణ సంస్థతోపాటు పునర్విచారణాధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు బిల్లులో వీలు కల్పించారు.

సహకారపూర్వక సమాఖ్యవాదాన్ని నిలబెట్టాలనేది ఈ బిల్లు ఉద్దేశమని, ఇది రాష్ట్రాల హక్కులపై ఏ విధంగానూ ప్రభావాన్ని కలగజేయదని మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. పెట్రోలియమ్ లీజులను, అవసరపడే చట్టబద్ధ క్లియరెన్సులను ఇదివరకటి తరహాలోనే రాష్ట్రాలే మంజూరు చేస్తుంటాయని,  రాయల్టీలను అందుకొంటూ ఉంటాయన్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడం వల్ల, దీనిలోని నిబంధనలు ‘‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని’’ మెరుగుపరుస్తాయని, చమురు- సహజవాయు ఉత్పత్తికి భారత్‌ను ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తాయని, వనరులు సమృద్ధంగా ఉన్న మన దేశంలో హైడ్రోకార్బన్ల సామర్థ్యాన్ని వెలికితీయడంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.


 

***


(Release ID: 2111213) Visitor Counter : 13