ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 12 MAR 2025 6:07AM by PIB Hyderabad

నమస్తే!
“కీ మాణియేర్ మోరిస్?
ఆప్‌ లోగ్‌ ఠీక్‌ హవ్‌ జా నా?
ఆజ్ హమకే మోరీషస్ కే ధర్తీపర్‌
ఆప్‌ లోగోకే బీచ్‌ ఆకే బహుత్‌ ఖుషీ హోత్‌ బాతే!
హమ్‌ ఆప్‌ సబ్‌కో ప్రణామ్‌ కరత్‌ హుయీ!”

మిత్రులారా!

   పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్‌ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్‌ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్‌ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.

 రామ్‌ కే హాథే ధోలక్‌ సోహే
లక్ష్మణ్‌ హాథ్‌ మంజీరా
భరత్‌ కే హాథ్‌ కనక్‌ పిచ్‌కారీ...
శత్రుఘ్న హాత్‌ అబీరా..
జోగిరా……

   ఇక హోలీ ప్రస్తావన వచ్చినపుడు మధురమైన ‘గుజియా’ రుచిని మరువగలమా? ఇటువంటి వంటకాలకు ఆ మధురమైన రుచిని జోడించేడంలో భాగంగా ఒకప్పుడు మారిషస్ భారత్‌లోని పశ్చిమ ప్రాంతాలకు చక్కెర సరఫరా చేస్తూండేది. బహుశా అందుకేనేమో… గుజరాతీ భాషలో చక్కెరను ‘మోరాస్’ అంటారు. భారత్‌-మారిషస్‌ మధ్య ఈ మధుర బంధం కాలక్రమంలో మరింత విస్తృతం అవుతోంది. అందుకే, ఈ మధుర భాషణతో మారిషస్ జాతీయ సెలవు దినమైన ఈ రోజున ఇక్కడి పౌరులందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా!

   నేను మారిషస్‌కు వచ్చినప్పుడల్లా.. స్వజనం మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడి గాలిలో, మట్టిలో, నీటిలో, జనం ఆలపించే పాటల్లో, ధోలక్ లయలో, దాల్ పూరీ రుచిలో నా అనుభూతి ప్రతిఫలిస్తూంటుంది. ఇక్కడి ‘కుచ్చా, గెటాక్స్ పిమెంట్’ వంటకాలు భారత్‌కు సుపరిచితమైన పరిమళం వెదజల్లుతుంటాయి. మన మధ్యగల ఈ బంధం ఎంతో సహజమైనది.. ఎందుకంటే- ఈ నేల మన పూర్వికులైన వేలాది భారతీయుల రక్తం-చెమటతో మమేకమైంది. మనమంతా ఒకే కుటుంబికులమే… ఈ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి శ్రీ నవీన్ రామ్‌గులాం, ఆయన మంత్రిమండలి సహచరులు ఇవాళ ఇక్కడ మనతో ఆనందానుభూతిని పంచుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా  మీకందకీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రధానమంత్రి శ్రీ నవీన్ తన మనోభావాలను ఇప్పుడే మనతో పంచుకున్నారు. ఆయన మనఃపూర్వక ఆదరాభిమానాలకు నా హృదయాంతర్గత కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

   ప్రధానమంత్రి ఇప్పుడు ప్రకటించిన మేరకు మారిషస్ ప్రజలు, ప్రభుత్వం, నన్ను తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించారు. మీ నిర్ణయాన్ని నేను సవినయంగా అంగీకరిస్తున్నాను. ఇది భారత్‌-మారిషస్ మధ్య చారిత్రక సంబంధాలకు లభిస్తున్న గౌరవం. తరతరాలుగా ఈ భూమికి అంకితభావంతో సేవ చేయడం ద్వారా నేడు మారిషస్‌ను ఇంత గొప్ప స్థాయికి చేర్చిన భారతీయులనూ గౌరవించడమే అవుతుంది. నాకు దక్కిన గౌరవానికివాను మారిషస్‌లోని ప్రతి పౌరుడికి, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు.

మిత్రులారా!

   మారిషస్‌ జాతీయ దినోత్సవం నేపథ్యంలో గత సంవత్సరం భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇది మారిషస్-భారత్‌ సంబంధాల సౌహార్దతను, బలాన్ని సూచిస్తుంది. ఇక ఏటా మార్చి 12వ తేదీని జాతీయ దినోత్సవంగా మారిషస్‌ నిర్వహించుకోవడం రెండు దేశాల ఉమ్మడి చరిత్రకు ప్రతిబింబం. బానిసత్వ విముక్తి లక్ష్యంగా మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ప్రారంభించిన రోజు ఇదే. ఈ రెండు దేశాల స్వాతంత్ర్య పోరాటాలను గుర్తుచేసే తేదీ ఇది. మారిషస్‌కు వచ్చి ప్రజల హక్కుల కోసం పోరాటం ప్రారంభించిన బారిస్టర్ మణిలాల్ డాక్టర్ వంటి మహనీయుడిని ఎవరూ మరువలేరు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ తదితరులతో కలిసి మన చాచా రాంగులాం జీ కూడా నాటి అసాధారణ పోరుకు నాయకత్వం వహించారు. బీహార్‌లోని పాట్నాలోగల చరిత్రాత్మక గాంధీ మైదానంలోని సీవూసాగర్ జీ విగ్రహం ఈ గొప్ప సంప్రదాయానికి చిహ్నం. నవీన్ జీతోపాటు సీవూసాగర్ గారికీ నివాళి అర్పించే అదృష్టం నాకు  దక్కింది.

మిత్రులారా!

   నేను మీ మధ్యకు వచ్చి.. మిమ్మల్ని కలిసి.. మీతో ముచ్చటించిన ప్రతి సందర్భంలోనూ నేను చరిత్రలో 200 ఏళ్లు వెనక్కు… అంటే- మనం చదివిన చదువుల్లోని వలసవాద కాలంలోకి వెళ్లిపోతుంటాను. ఆనాడు అనేకానేక మంది భారతీయులను వంచనతో ఇక్కడికి తరలించి తీసుకొచ్చిన జ్ఞాపకాల్లోకి మనం పయనిస్తాం. వారెన్నో బాధలకు గురయ్యారు… ఎంతో వేదనపడ్డారు… వలస పాలకులు చేసిన ద్రోహాన్ని భరించారు. అలాంటి సంక్లిష్ట సమయాల్లో రాముడు, రామచరిత మానస్‌, రాముడి పోరాటం-విజచయం ఆయన ప్రేరణ, తపస్సు వంటివి వారికి ఆలంబనగా నిలిచాయి. రాముడిలో తమనుతాము చూసుకుంటూ ఆ పురుషోత్తముడిపై విశ్వాసంతో అన్నిటినీ ఎదిరించి, నిలదొక్కుకునే శక్తిసామర్థ్యాలను సంతరించుకున్నారు.

రామ్ బనిహై తో బన్ జయీహై,
బిగడీ బనత్ బనత్ బన జాహి.
చౌదహ్ బరిస్ రహే బన్‌వాసి,
లౌటే పుని అయోధ్యా మాంహి॥
 
ఐసే దిన్‌ హమరే ఫిర్‌ జయీహై
బంధువన్‌ కే దిన్‌ జయీహై బీత్‌
పునఃమిలన్‌ హమరే హోయీ జయీహై
జయీహై రాత్‌ భయంకర్‌ బీత్‌

మిత్రులారా!

   నాకు గుర్తున్నంత వరకూ 1998లో ‘అంతర్జాతీయ రామాయణ మహా సదస్సు’లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాను. అప్పుడు నేనెలాంటి అధికార పదవుల్లో లేను… ఓ సాధారణ కార్యకర్తగా వచ్చాను. అప్పటికి… ఇప్పటికి ఆసక్తికరమైన అంశమేమిటంటే- నవీన్ అప్పుడూ… ఇప్పుడూ  ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక నేను ప్రధానమంత్రిగా ఢిల్లీలో పదవీ బాధ్యతులు స్వీకరించినప్పుడు నా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై నన్నెంతో గౌరవించారు.

మిత్రులారా!

   రాముడు… రామాయణంపై లోతైన నా విశ్వాసం, భావోద్వేగాలు దాదాపు రెండుమూడు దశాబ్దాల కిందట ఇక్కడ నేనెలా అనుభూతి చెందానో అదే భావన ఇవాళ కూడా నాలో అదే స్థాయిలో ఉప్పొంగుతున్నాయి. అయోధ్యలో నిరుడు గత సంవత్సరం జనవరిలో 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ సమాప్తమై ప్రాణ ప్రతిష్ఠ వేడుక నిర్వహించిన సమయంలోనూ ఇలాంటి భక్తి తరంగం ఉవ్వెత్తున ఎగసింది. దేశమంతటా అలముకున్న ఉత్సాహం, సంబరం ఇప్పుడిక్కడ మారిషస్‌లో ప్రతిబింబిస్తున్నాయి. మన హృదయపూర్వక అనుబంధాన్ని అర్థం చేసుకుని, మారిషస్ ఇవాళ సగం రోజు సెలవు ప్రకటించింది. భారత్‌-మారిషస్ మధ్య ఈ ఉమ్మడి విశ్వాసమే మన శాశ్వత స్నేహానికి బలమైన పునాది.

మిత్రులారా!

   ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు మారిషస్ నుంచి వచ్చిన చాలా కుటుంబాలు ఇటీవలే తిరిగి వచ్చినట్లు నాకు తెలిసింది. మానవాళి చరిత్రలోనే అతిపెద్ద జనసందోహాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ఈ మహా క్రతువుకు 65-66 కోట్ల మంది ప్రజలు హాజరుకాగా, మారిషస్ వాసులు కూడా వారితో మమేకమయ్యారు. అయితే, ఈ మహా ఐక్యత కార్యక్రమానికి హాజరు కావాలని ఉవ్విళ్లూరిన ఎంతోమంది మారిషస్ సోదరసోదరీమణులు హాజరు కాలేకపోయారని కూడా నాకు తెలుసు. మీ మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను... అందుకే- మహా కుంభ్ సమయాన చారిత్రక త్రివేణీ సంగమం నుంచి పవిత్ర  జలాన్ని నాతో తెచ్చాను. ఇక్కడి గంగా తాలాబ్‌లో ఈ పవిత్ర జలాన్ని నిమజ్జనం చేస్తారు. లోగడ అర్ధ శతాబ్దం కిందట గోముఖ్ వద్ద నుంచి గంగా జలాన్ని ఇక్కడికి తెచ్చి, ఇదే గంగా తాలాబ్‌లో కలిపారు. అదే పవిత్ర క్షణానికి రేపు మనం ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తాం. గంగామాత ఆశీర్వాదాలతో, మహా కుంభ్ నుంచి వచ్చిన ఈ ప్రసాదంతో మారిషస్ సౌభాగ్యం సమున్నత శిఖరాలకు చేరాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా!

    మారిషస్ కు  1968లో స్వాతంత్య్రం లభించి ఉండొచ్చుగానీ, ఈ దేశం అందరి కలబోతతో ముందడుగు వేసిన తీరు ప్రపంచానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన ప్రజలు మారిషస్‌ను తమ ఆవాసం చేసుకున్నారు. సంస్కృతుల మేలు కలయిక-వైవిధ్యంతో కూడిన సుందర నందనాన్ని సృష్టించారు. మన పూర్వికులు భారత్‌లోని బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించారు. మీరిక్కడి భాష, మాండలికాలు, ఆహారపు అలవాట్లను గమనిస్తే- మారిషస్ ఓ సూక్ష్మ భారత్‌గా మనకు దర్శనమిస్తుంది. తరతరాల భారతీయులు వెండితెరపై మారిషస్‌ అందాలను ఆరాధిస్తున్నారు. బహుళ ప్రాచుర్యం పొందిన హిందీ పాటలు విన్నపుడు, వీడియోలో చూసినపుడు ఇక్కడి ఇండియా హౌస్, ఇలే ఆక్స్ సెర్ఫ్స్, గ్రిస్-గ్రిస్ బీచ్ అందమైన దృశ్యాలు, కౌడాన్ వాటర్‌ఫ్రంట్‌ను గమనించవచ్చు. అలాగే రోచెస్టర్ జలపాతాల సవ్వడి వీనులవిందు చేస్తుంది. మారిషస్‌లో దాదాపు ప్రతి మూల భారతీయ సినిమాల్లో ఒక భాగంగా ఇమిడిపోయిందని చెప్పవచ్చు. నిజానికి, సంగీతం భారతీయమై, చిత్రీకరణ ప్రదేశం మారిషస్ అయినప్పుడు ఆ సినిమా తప్పక హిట్ అవుతుందనే భరోసా ఉండేదంటే అతిశయోక్తి కాబోదు!

మిత్రులారా!

   భోజ్‌పూర్ ప్రాంతంతోపాటు బీహార్‌తో మీ లోతైన భావోద్వేగ అనుబంధాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను.
   “పూర్వాంచల్ సంస‌ద్ హోవే నాతే, హం జననీ కీ బీహార్ కో సమ‌ర్థ్య్ కేత్‌నా జ్యాదా బా... ఏక్ స‌మ‌య్ ర‌హే జ‌బ్ బీహార్‌, దునియా కా స‌మృద్ధోంకో కేంద్ర ర‌హ‌ల్‌... అబ్ హ‌మ్ మిల్‌కే, బీహార్ కో గౌర‌వ్ ఔర్ ఫిర్ సే వాప‌స్ లాయే కే కామ్ క‌ర‌త్  హుయీ జా”

మిత్రులారా!

   ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు విద్యాగంధమే అబ్బని కాలంలో భారతదేశంలోని బీహార్ రాష్ట్రం ‘నలంద’ వంటి విశ్వవిద్యాలయ కేంద్రంగా విలసిల్లింది. మా ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి నలంద స్ఫూర్తిని మళ్లీ రగిలించింది. నేడు బుద్ధ భగవానుని బోధనలు శాంతి సాధన దిశగా ప్రపంచానికి సదా స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మేమీ ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడమేగాక ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం. నేడు  బీహార్‌లో పండే మఖానా దేశవ్యాప్తంగా విస్తృత గుర్తింపును పొందడమే కాకుండా ప్రపంచ అల్పాహార జాబితాలో ఇది చోటు చేసుకోవడానికి ఇక ఎంతో కాలం పట్టదు.

హమ్ జానీలా కి హియం మఖానా కేతనా పసంద్‌ కరల్ జా లా...
హమకో భీ మఖానా బహుత్ పసంద్‌ బా....

మిత్రులారా!

   మారిషస్‌తో స్నేహ సంబంధాలను భవిష్యత్తరాల కోసం భారత్‌ మరింత విస్తృతం చేయడంతోపాటు సంరక్షించుకుంటూ వస్తోంది. మారిషస్‌లోని 7వ తరం భారత ప్రవాసులకు ‘ఒసిఐ’ కార్డుల జారీకి నిర్ణయం తీసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇందులో భాగంగా మారిషస్ అధ్యక్షుడు, ఆయన భార్య బృందాగారికి కూడా ఈ కార్డులు అందించే అవకాశం నాకు లభించింది. ఈ మేరకు ప్రధానమంత్రితోపాటు ఆయన భార్య వీణాగారికి కూడా కార్డులు ప్రదానం చేసే గౌరవం కూడా నాకు దక్కింది. ఈ ఏడాది ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా  ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన గిర్మితీయ సమాజం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నేను ప్రతిపాదించాను. ఈ సమాజం కోసం సమగ్ర సమాచార నిధి రూపకల్పనలో భారత్‌ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తున్నదని తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు. గిర్మితీయ సామాజిక సభ్యులు వలస వచ్చిన గ్రామాలు, నగరాల సమాచార సేకరణకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆనాడు వారంతా స్థిరపడిన ప్రదేశాలను గుర్తించేందుకు మేం కృషి చేస్తున్నాం. గిర్మితీయ కమ్యూనిటీ మొత్తం చరిత్ర- గతం నుంచి నేటిదాకా సాగిన వారి ప్రయాణం సంబంధిత సమాచారమంతా ఏకీకృతం చేస్తున్నాం. మా ప్రయత్నం ఏమిటంటే- ఒక విశ్వవిద్యాలయం సహకారంతో, గిర్మితీయ వారసత్వం చరిత్రపైపై అధ్యయనం సాగాలి. తదనుగుణంగా ప్రపంచ గిర్మితీయ సమావేశాలను ఎప్పటికప్పుడు నిర్వహించడం అవసరం. ఆ మేరకు భారత్‌-మారిషస్,  గిర్మితీయ సమాజంతో అనుసంధానంగల ఇతర దేశాలతో సంయుక్తంగా ‘ఒప్పంద కార్మిక మార్గాల’ను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మారిషస్‌లోని చారిత్రక అప్రవాసి ఘాట్‌ సహా ఈ మార్గాల్లోని కీలక వారసత్వ ప్రదేశాల సంరక్షణకూ లక్ష్యనిర్దేశం చేసుకున్నాం.

మిత్రులారా!

   మారిషస్ మాకు కేవలం భాగస్వామ్మ దేశం కాదు... మారిషస్ మాకొక కుటుంబం. ఈ బంధం ఎంతో లోతైనదేకాదు… మరెంతో బలమైనది కూడా. చరిత్ర, వారసత్వం, మానవ స్ఫూర్తితో వేళ్లూనుకున్న బంధం మనది. అలాగే భారతదేశాన్ని విస్తృత వర్ధమాన ప్రపంచ దేశాలతో అనుసంధానించే వారధిగానూ మారిషస్ ప్రాధాన్యం అపారం. దశాబ్దం కిందట…  2015లో ప్రధానమంత్రిగా మారిషస్‌కు నా తొలి పర్యటనలో భారత్‌ చేపట్టిన ‘సాగర్‌’ ప్రణాళికను ప్రకటించాను. ‘సాగర్‌’ అంటే- ‘ఈ ప్రాంతంలో అందరి భద్రత-వృద్ధి’ అని అర్థం. ఆ దార్శనికతకు మారిషస్ ఈనాటికీ కేంద్రకంగా ఉంది. పెట్టుబడిగానీ, మౌలిక సదుపాయాలుగానీ, వాణిజ్యంగానీ, సంక్షోభ ప్రతిస్పందనగానీ… ఏదేమైనా భారత్‌ సదా మారిషస్‌తో జోడుగా నిలుస్తుంది. సమగ్ర ఆర్థిక సహకారం-భాగస్వామ్య ఒప్పందంపై 2021లో మేం సంతకం చేసినపుడు ఆఫ్రికన్ యూనియన్లోని తొలి దేశంగా మారిషస్ కూడా సంతకం చేసింది. దీంతో కొత్త అవకాశాలు అందిరాగా, మారిషస్‌కు భారత మార్కెట్లలో విస్తృత ప్రాధాన్యం లభించింది. భారతీయ కంపెనీలు మారిషస్‌లో మిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడి పెట్టాయి. ఇక్కడి ప్రజల కోసం కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించడంలో మా విస్తృత భాగస్వామ్యం ఉంది. తద్వారా వృద్ధికి ఊతంసహా.. ఉద్యోగాల సృష్టితోపాటు పరిశ్రమల ప్రగతికి తోడ్పాటు లభిస్తోంది. మారిషస్‌లో సామర్థ్య వికాస కార్యక్రమాల నిర్వహణకు భారత్‌ గర్వించదగిన భాగస్వామిగా ఉంది.

మిత్రులారా!

   మారిషస్‌కు విశాల సముద్ర భూభాగాలున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యసంపద అక్రమ వేట, పైరసీ సహా అనేక నేరాల నుంచి తన వనరులను కాపాడుకోవడం అవశ్యం. ఆ దిశగా భారత్‌ ఒక విశ్వసనీయ, ఆధారపడదగిన మిత్రదేశంగా మారిషస్‌ జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు హిందూ మహాసముద్ర ప్రాంత రక్షణకు మీతో సంయుక్తంగా కృషిచేస్తుంది. ఇక ప్రతి సంక్షోభ సందర్భంలోనూ మారిషస్‌కు భారత్‌ అండగా నిలిచింది. ముఖ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో 1 లక్ష టీకాలతోపాటు అవసరమైన మందులు సరఫరా చేసిన తొలి దేశం భారత్‌. మారిషస్ సంక్షోభంలో పడినపుడు మొట్టమొదట స్పందించే భారతదేశమే. మారిషస్ అభివృద్ధి చెందితే ఆనందించే తొలి దేశం కూడా మాదే. అన్నింటికీ మించి, నేనింతకుముందు చెప్పినట్లు… మనమంతా ఒకే కుటుంబం!

మిత్రులారా!

   భారత్‌-మారిషస్ చారిత్రకంగానే కాకుండా ఉమ్మడి భవిష్యత్‌ అవకాశాల ద్వారానూ పరస్పర అనుసంధానితాలు. భారత్‌ వేగంగా పురోగమిస్తున్న ప్రతిచోటా, మారిషస్ వృద్ధికి కూడా చురుగ్గా మద్దతిస్తోంది. మెట్రో వ్యవస్థ, విద్యుత్‌ బస్సుల నుంచి సౌర విద్యుత్ ప్రాజెక్టులు, యూపీఐ, రూపే కార్డులు వగైరా ఆధునిక సేవలు సహా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం దాకా  భారత్‌ స్నేహ స్ఫూర్తితో మారిషస్‌కు చేయూతనిస్తోంది. నేడు, భారత్‌ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తి కాగా, త్వరలో మూడో స్థానానికి దూసుకెళ్లనుంది. ఈ పురోగమనంలో మారిషస్ కూడా తగుమేర ప్రయోజనం పొందాలని భారత్‌ సదా ఆకాంక్షిస్తోంది. భారత్‌ జి-20కి అధ్యక్షత వహించిన సందర్భంగా మారిషస్‌కు ప్రత్యేక ఆహ్వానిత దేశంగా గౌరవమిచ్చాం. మేం నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు తొలిసారి జి-20లో శాశ్వత సభ్యత్వం కల్పించాం. ఈ సుదీర్ఘకాల డిమాండ్ చివరకు భారత్‌ చొరవతో, భారత్‌ అధ్యక్షతన సాకారమైంది.

మిత్రులారా!

   నేనిప్పుడొక ప్రసిద్ధ గీతాన్ని ఉటంకిస్తున్నాను…

తార్‌ బంధీ ధర్తీ ఊపర్
ఆస్మాన్‌ గే మాయీ...
ఘూమీ ఫిరీ బాంధిలా
దేవ్ ఆస్థాన్ గే మాయీ...
గోర్ తోహర్ లాగీలా
ధర్తీ హో మాయీ...

   భూమిని మన తల్లిగా పరిగణిస్తాం… పదేళ్ల కిందట నా మారిషస్‌ పర్యటన సందర్భంగా వాతావరణ మార్పు సమస్యపై మారిషస్ మాట మనం తప్పక వినాలని యావత్‌ ప్రపంచానికీ స్పష్టం చేశాను. ఈ నేపథ్యంలో భారత్‌-మారిషస్‌ ఈ అంశంపై సంయుక్తంగా ప్రపంచవ్యాప్తం అవగాహన కోసం కృషి చేస్తుండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అంతర్జాతీయ సౌర కూటమి, ప్రపంచ జీవ-ఇంధన సంకీర్ణం, వంటి కీలక కార్యక్రమాల్లో మారిషస్, భారత్‌ కీలక సభ్యులుగా ఉన్నాయి. ఇక భారత్‌ నిర్వహిస్తున్న ‘అమ్మ పేరిట ఒక మొక్క’ ఉద్యమంలో మారిషస్ కూడా భాగస్వామిగా మారింది. ఈ మేరకు ప్రధానమంత్రి నవీన్ రామ్‌గులాం గారు, నేను సంయుక్తంగా ఒక మొక్కను నాటాం. ఇది మనకు జన్మనిచ్చిన తల్లితో మాత్రమేగాక భూమాతతో మన బంధాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది. మారిషస్ పౌరులంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని నా విజ్ఞప్తి.

మిత్రులారా!

   ప్రస్తుత 21వ శతాబ్దంలో మారిషస్‌కు అనేక అవకాశాలు అందివస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడుగడుగునా మారిషస్‌తో కలసి ముందుకు సాగుతామని భారత్‌ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. చివరగా, మారిషస్‌ ప్రధానితోపాటు ఆయన ప్రభుత్వానికి, ప్రజలకు మరోసారి నా కృతజ్ఞతలు.

అలాగే జాతీయ దినోత్సవం సందర్భంగా మీకందరికీ మళ్లీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
 
అనేకానేక ధన్యవాదాలు.
నమస్కారం.
 
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది సమీప స్వేచ్ఛానువాదం.

 

***


(Release ID: 2110743) Visitor Counter : 8