వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
39వ ఆహార్-2025లో భారతీయ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార పదార్థాల నాణ్యతను ప్రదర్శించిన ఏపీఈడీఏ
17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 95 మంది ప్రదర్శకులతో
భారతీయ వ్యవసాయ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఏపీఈడీఏ
వ్యవసాయ ఎగుమతులు, మొక్కల ఆధారిత ఆహార రంగంలో విస్తరిస్తున్న భారత్ సామర్థ్యాన్ని తెలియజెప్పిన ఆహార్ 2025
Posted On:
11 MAR 2025 12:18PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాల నాణ్యతను 39వ సంచిక ఆహార్ - 2025లో వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) ప్రదర్శించింది. మార్చి 4 నుంచి 8 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) నిర్వహించింది. వ్యవసాయ, ఆహార శుద్ధి రంగంలో దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో ఈ కార్యక్రమం కీలకమైన మైలురాయిని సూచిస్తుంది.
ఏపీఈడీఏ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీసీలు), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు సహా 17 రాష్ట్రాలు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన తయారీ సంస్థలకు చెందిన 95 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
ప్లాంట్-బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అసోషియేన్ ఆహార్ 2025లో నిర్వహించిన ‘ఇండియా ఫ్లాంట్-బేస్డ్ ఫుడ్స్ షో’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ప్రసంగించారు. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ తన ప్రభావాన్ని విస్తరిస్తోందని అన్నారు. ప్రపంచ పర్యావరణ లక్ష్యాలను సాధించే విధంగా మొక్కల ఆధారిత ఎగుమతులను సుస్థిర ప్రత్యామ్నాయాలుగా అన్వేషించాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన పెవిలియన్లో సేంద్రీయ, శుద్ధి చేసిన ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, పానీయాలు, సుగంధ ద్రవ్యాలు, మాంస ఉత్పత్తులను ప్రదర్శించారు. చిరు ధాన్యాలు, విలువను జోడించిన ఉత్పత్తులు, ఎండబెట్టిన ఉల్లి - వెల్లుల్లి, ఘనీభవింపచేసిన శాఖాహార, మాంసాహర పదార్థాలు, డబ్బాల్లో నిల్వ చేసిన పండ్లు , వెజిటబుల్ సాస్లు, రుచి జోడించిన జీడిపప్పు, చాక్లెట్లు, మిఠాయిలు, తేనె, వంట నూనెలు, తృణధాన్యాలు, ఇతర పదార్థాలను ఎగ్జిబిటర్లు ప్రదర్శించారు. వినూత్న ఆహార పదార్థాలు, అత్యంత నాణ్యమైన సేంద్రీయ సుగంధ ద్రవ్యాలు, ఆరోగ్యాన్నిచ్చే పానీయాలను ప్రదర్శిస్తూనే, దేశంలో విస్తరించిన బలమైన ఆహార శుద్ధి రంగం గురించి తెలుసుకొనే గమ్యస్థానంగా ఏపీఈడీఏ పెవిలియన్ నిలిచింది.
పెవిలియన్లో ఆకర్షణీయమైన నమూనా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రఖ్యాత భారతీయ షెఫ్, అతని బృందం ఆరోగ్యకరమైన దేశీయ వంటలను ప్రత్యక్షంగా తయారు చేసి చూపించారు. విస్తృత ప్రజాదరణ పొందిన ఈ విభాగం, మిల్లెట్ మాత్రి పై, రాగి - మ్యాంగో స్మూతీ, ఫాక్స్టైల్ కార్న్ రిసోట్టో, ఆరోమాటిక్ బిర్యాని, ముడిబియ్యం జావ, ఇతర వంటకాలను రుచి చూసే అవకాశాన్ని సందర్శకులకు కల్పించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి భారతీయ వంటకాల వారసత్వ సంస్కృతిని, సృజనాత్మకతను తెలుసుకొనే వీలు కలిగింది.
అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ ప్రారంభించారు. ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు (సైన్స్, ప్రమాణాలు, నిబంధనలు) డాక్టర్ అల్కారావు, సంస్థకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు ఏపీఈడీఏ పెవిలియన్‌ను మార్చి 4, 2025న ప్రారంభించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యవసాయ, ఆహార శుద్ధి ఉత్పత్తులతో పాటు అంతర్జాతీయ ఆహార మార్కెట్లలో పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని ఈ పెవిలియన్ తెలియజేస్తుంది.
ఆహార్ 2025లో పాల్గొన్న ఏపీఈడీఏ నాణ్యమైన, సుస్థిరమైన, ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఆహార ఉత్పత్తుల విషయంలో భారత్ నిబద్ధతను తెలియజేసింది. దేశీయ, అంతర్జాతీయ సహకారాలను ప్రోత్సహిస్తూ, ప్రపంచ ఆహార, పానీయ రంగంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన కార్యక్రమంగా ఇది పనిచేసింది.
వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే చట్టబద్ధమైన సంస్థ. దేశంలో వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఎగుమతులను సులభతరం చేసి ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయ ఆహార, పానీయాల రంగంలో దేశ ప్రభావాన్ని పెంపొందింప చేయడమే ఈపీఈడీఏ లక్ష్యం.
***
(Release ID: 2110313)
Visitor Counter : 13