వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, తయారీ, ఫిన్ టెక్ స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు డీపీఐఐటీ, పేటీఎం ఒప్పందం
Posted On:
26 FEB 2025 11:13AM by PIB Hyderabad
దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, తయారీ, ఫిన్ టెక్ అంకుర సంస్థల వృద్ధిని వేగవంతం చేయడానికి పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్)తో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది.
ఈ సహకారంలో భాగంగా అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం, మౌలిక సదుపాయాల మద్దతు, మార్కెట్ లభ్యత, నిధుల సమీకరణ అవకాశాలను పేటీఎం అందిస్తుంది. ఈ కార్యక్రమం అవసరమైన వనరులతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సన్నద్ధం చేయడం, అత్యాధునిక చెల్లింపులు, ఆర్థిక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో వారి సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
డిపిఐఐటి ప్రకారం, ఆవిష్కరణల్లో మార్గనిర్దేశం చేయడం ద్వారా ఫిన్ టెక్ హార్డ్ వేర్ రంగంలో అంకుర సంస్థలకు ఈ భాగస్వామ్యం మద్దతు ఇస్తుంది. అలాగే చెల్లింపులు, ఆర్థిక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, వాటిని విస్తరించడానికి తోడ్పడటమే లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్‌షాపులను నిర్వహించడం, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల సహకారంతో మార్గదర్శకత్వం అందించడం ద్వారా నియంత్రణ, అమలు సహాయంపై కూడా దృష్టి పెడుతుంది. దీనికి అదనంగా విస్తృతమైన పేటీఎం వ్యాపార వ్యవస్థను ఉపయోగించుకుంటూ అంకురసంస్థలకు మౌలిక సదుపాయాలు, మార్కెట్ మద్దతును అందిస్తుంది. తమ ఉత్పత్తులను పరీక్షించడానికి, ధ్రువీకరించడానికి, మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది.
డీపీఐఐటీ డైరెక్టర్ డా. సుమీత్ కుమార్ జరంగాల్, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ రెండు సంస్థలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
‘‘పేటీఎంతో ఈ భాగస్వామ్యం భారత అంకుర సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమైన దశను సూచిస్తుంది. పేటీఎం సంస్థకున్న ఫిన్ టెక్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సవాళ్లను అధిగమించడంలో, వారి వెంచర్లను విస్తరించడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తాం’’ అంటూ ఈ భాగస్వామ్య ప్రాధాన్యాన్ని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ వివరించారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో... అంకుర సంస్థలను ప్రారంభించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి ఇదే సరైన సమయం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం, ఆర్థిక సహకారం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారిని శక్తిమంతం చేసేందుకు పేటీఎం కట్టుబడి ఉంది. ఈ సహకారం ద్వారా అంకుర సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి విజయవంతమయ్యే వరకు అవసరమైన సాధనాలను మేం అందిస్తాం.’’ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
అంకుర సంస్థలను ప్రోత్సహించే ఈ చొరవలో భాగంగా సౌండ్ బాక్స్, పిఒఎస్/ఇడిసి వంటి పరికరాలను తయారుచేసే ఫిన్‌టెక్ హార్డ్వేర్ సంస్థలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రత్యేక కార్యక్రమాలను పేటీఎం ప్రారంభిస్తుంది. వీటిలో మార్గదర్శక కార్యక్రమాలు, పెట్టుబడిదారులతో అనుసంధానం, ఇంక్యుబేషన్ కార్యక్రమాల ద్వారా నిధులు సమకూర్చడం, నియంత్రణలపై మార్గనిర్దేశం, పరిశ్రమ-కేంద్రీకృత వర్క్ షాపులు, నిర్ణీత కాల వ్యవధిలో సాధించిన అభివృద్ది, ప్రభావంపై సమీక్షలు ఉన్నాయి. వీటికి అదనంగా, సంస్థ సిఎస్ఆర్ విభాగం, పేటీఎం ఫౌండేషన్ ద్వారా క్లైమేట్ టెక్, వెబ్3, అగ్రిటెక్, మొబిలిటీల్లో డీప్-టెక్ స్టార్టప్లను పేటీఎం ప్రోత్సహిస్తోంది.
ఈ సహకారం ద్వారా భారత్‌ను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడం, సాంకేతిక పురోగతనులను పెంపొందించడం, ఆర్థిక వృద్దిని నడిపించడంలో డిపిఐఐటి, పేటీఎం తమ అంకితభావాన్ని తెలియజేస్తున్నాయి.
***
(Release ID: 2106543)
Visitor Counter : 39