వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
విప్లవాత్మక మార్పులు తెచ్చిన జీఈఎంలో స్వాయత్ కార్యక్రమానికి ఆరేళ్లు
జీఈఎంలో నమోదైన విక్రేతల్లో మహిళా పారిశ్రామికవేత్తలు 8 శాతం
Posted On:
25 FEB 2025 2:44PM by PIB Hyderabad
ఇ-లావాదేవీల ద్వారా అంకుర సంస్థలు, మహిళలు, యువత పురోగతి (స్వాయత్) కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఇ- మార్కెట్ ప్లేస్ (జీఈఎం) న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ సేకరణలో మహిళల నేతృత్వంలోని సంస్థలు, యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 2019 ఫిబ్రవరి 19న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అందరికీ సమానావకాశాలను కల్పించాలన్న ఉద్దేశంతో జీఈఎం పోర్టల్ లో ‘స్వాయత్’ను ప్రారంభించారు. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడంతోపాటు.. అంకుర సంస్థలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ-చిన్న తరహా సంస్థలు, స్వయంసహాయక బృందాలు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన యువతను నేరుగా మార్కెట్ తో అనుసంధానం చేయడంలో జీఈఎం పోర్టల్ కట్టుబడి ఉందనడానికి స్వాయత్ నిదర్శనం. ప్రారంభించినప్పటి నుంచి క్షేత్రస్థాయి విక్రేతలకు శిక్షణ, వారిని అనుసంధానం చేయడం, మహిళల్లో వ్యవస్థాపకతను పెంపొందించడం, ప్రభుత్వ సేకరణలో భాగస్వామ్యాలను, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.
ఈ సందర్భంగా భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) మహిళా సంస్థ (ఫిక్కీ-ఎఫ్ఎల్వో)తో జీఈఎం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫిక్కీ ఎఫ్ఎల్ వో 9,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలతో కూడిన జాతీయ స్థాయి వేదికగా ఉంది. మధ్యవర్తులతో సంబంధంలేకుండా, ప్రభుత్వ కొనుగోలుదారులూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలూ లావాదేవీలను నిర్వహించుకోవాలని జీఈఎం భావిస్తోంది. తద్వారా ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభిస్తాయనీ, స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయనీ, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తగిన శిక్షణ, సమీకరణ, అనుసంధానాల ద్వారా.. ఈ భాగస్వామ్యం స్థానిక వ్యాపారాలకు సాధికారత కల్పించి, స్మమిళిత ఆర్థిక వృద్ధిని సాధించబోతోంది. అంతేకాకుండా పోటీని పెంచి, ప్రభుత్వ వ్యయంలో అదనపు విలువను పెంచడానికి ఉపయోగపడుతుంది.
“స్వాయత్ ను ప్రారంభించిన సమయంలో కేవలం 6300 మంది మహిళా నేతృత్వంలోని సంస్థలు, దాదాపు 3400 అంకుర సంస్థలు మాత్రమే జీఈఎంలో ఉన్నాయి. నాటి నుంచి ఈ వేదిక అనేక రెట్లు పెరిగింది” అని జీఈఎం సీఈవో శ్రీ ఎల్. సత్య శ్రీనివాస్ తెలిపారు.
‘‘ప్రభుత్వ సేకరణలో సరైన ఇ-మార్కెట్ అనుసంధానాల ద్వారా ‘మార్కెట్ సదుపాయం’, ‘పెట్టుబడి సదుపాయం’, ‘అదనపు విలువను సమకూర్చుకునే సదుపాయం’లో సవాళ్లను పరిష్కరించడం ద్వారా రూ. 35,950 కోట్ల విలువైన ఆర్డర్లను పూర్తి చేయడానికి అంకుర సంస్థలకు జీఈఎం వీలు కల్పించింది. జీఈంలోని విక్రేతల్లో 8 శాతం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలున్నారు. ఈ పోర్టల్లో ఉద్యమ్ ద్వారా ధ్రువీకరించిన 1,77,786 మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు నమోదయ్యాయి. అవి మొత్తంగా రూ.46,615 కోట్ల ఆర్డర్ విలువను పూర్తిచేశాయి” అని శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా ఫిక్కీ-ఎఫ్ఎల్ వో అధ్యక్షురాలు శ్రీమతి జోయశ్రీ దాస్ వర్మ మాట్లాడుతూ.. జీఈఎం వంటి డిజిటల్ వేదికలు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం అవకాశాలను ఎలా ప్రజస్వామ్యీకరించాయో వివరించారు. వివిధ ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధి, మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్నతరహా సంస్థల పట్ల సానుకూల ధోరణి, వాటిని సమీకరించడం ద్వారా ఈ వేదిక అవకాశాలను మెరుగుపరిచిందని పునరుద్ఘాటించారు. సంస్థ సభ్యుల్లో జీఈఎం పోర్టల్ పరిధిని విస్తరించడంలో శిక్షణ అత్యావశ్యకమని ఆమె స్పష్టం చేశారు.
ప్రాథమికంగా స్వాయత్ గా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ‘అంకుర సంస్థల రన్ వే’గా, ప్రత్యేక సంస్థలతో ‘ఉమేనియా’ ప్రవేశ ద్వారంగా నిలిచింది. దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ కొనుగోలుదారుల్లో.. అంకుర సంస్థలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, యువత విస్తృతంగా కనిపించేలా చూస్తోంది. ప్రవేశ అవరోధాలను తొలగించడం ద్వారా.. జీఈఎమ్ వేదికపై 29,000కు పైగా అంకుర సంస్థలకు వ్యాపార అవకాశాలను కల్పించి వాటికి సాధికారతను కలిగిస్తోంది.
పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగంలో నమోదై ఉన్న లక్ష అంకుర సంస్థలను పోర్టల్ తో అనుసంధానం చేయాలన్న ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో.. ప్రభుత్వ సేకరణలో ఉత్తేజకరమైన అంకుర సంస్థల ప్రోత్సాహక వ్యవస్థగా నిలవాలన్న కృతనిశ్చయంతో జీఈఎం పనిచేస్తోంది. క్షేత్రస్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్నతరహా సంస్థలు, ఎఫ్ పీవోలు, స్వయంసహాయక బృందాలు, అంకుర సంస్థలు, సహకార సంఘాలతో అర్థవంతమైన సహకారం, సామర్థ్యాభివృద్ధి చర్యల ద్వారా.. పోర్టలులో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్యను రెట్టింపు చేయాలని, దేశంలో మొత్తం సేకరణలో వారి వాటాను ప్రస్తుతమున్న 3.78% కన్నా ఎక్కువగా పెంచాలని జీఈఎం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2106196)
Visitor Counter : 15