సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్‌షిప్: ఫైనలిస్టులను ఎంపిక చేయనున్న ఐదుగురు సభ్యుల జ్యూరీ
వేవ్స్ గ్రాండ్ ఫినాలేలో పోటీ పడేందుకు పది మంది సెమీ ఫైనలిస్టుల ఎంపిక
Posted On:
20 FEB 2025 7:36PM
|
Location:
PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్ షిప్ సెమీఫైనల్ విజేతలను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేశారు. ముంబయిలో మే 1 నుంచి 4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్)లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వేవ్స్ కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్షిప్‌ను ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ (ఐసీఏ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ), భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ పోటీలు జరుగుతున్నాయి.
ఈ పోటీల్లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించినవారిని ఇప్పటికే ప్రకటించారు. భారతీయ కామిక్స్ రంగాన్ని తీర్చిదిద్దిన దిగ్గజాలతో జ్యూరీ ప్యానెల్‌ను ఎంపిక చేశారు. వారు సెమీ ఫైనల్‌కు చేరుకున్న ఎంట్రీలను పరిశీలించి తుది పోటీల్లో పాల్గొనేవారిని ఎంపిక చేస్తారు. తుదిపోటీలకు ఎంపికైన 10 మంది ఫైనలిస్టులు ముంబయిలో జరిగే వేవ్స్ సదస్సులో పాల్గొంటారు.
జ్యూరీ సభ్యుల అనుభవం, కామిక్స్ పట్ల వారికున్న మక్కువ ద్వారా ఈ ఛాంపియన్ షిప్ భారతీయ కామిక్స్‌లో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని ఐసీఏ అధ్యక్షుడు అజితేష్ శర్మ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి విశిష్ట జ్యూరీ సభ్యులు మా ప్యానెల్లో ఉండటం మాకు గౌరవప్రదం’’ అని ఆయన అన్నారు.
జ్యూరీ సభ్యులు
దిలీప్ కదమ్, విస్తృత అనుభవవం ఉన్న ప్రఖ్యాత కామిక్ కళాకారుడు, చిత్రకారుడు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన కెరీర్లో పలు ప్రముఖ ప్రచురణ కర్తలతో కలసి పనిచేశారు. భోకల్‌తో సహా భారతీయులకు చేరువైన కామిక్ పాత్రలను ఆయన సృష్టించారు. తన అనుభవాన్ని ప్యానెల్‌కు జోడించారు.
నిఖిల్ ప్రాణ్, ఈయన ప్రఖ్యాత కార్టూనిస్ట్ ప్రాణ్ కుమార్ శర్మ కుమారుడు, ప్రసిద్ధ కామిక్ పాత్రల సృష్టికర్త. ఈయన ప్యానెల్‌కు ప్రత్యేక దృక్పథాన్ని జోడించారు. ఆయన తండ్రి సృష్టించిన చాచా చౌధరి, సాబు వంటి పాత్రలనుంచి స్ఫూర్తి పొందారు. తాను సైతం స్వయంగా వినూత్నతతో కథలు చెబుతూ తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.
జైజిల్ హోమవజీర్, యానిమేషన్ నిపుణుడు, భారత్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మొట్టమొదటి వెబ్ - మాంగా ‘ది బీస్ట్ లీజిన్’ సృష్టికర్త. ఈ వెబ్ మాంగాకు ఇటీవలే యాన్ అవార్డు దక్కింది. ఈ పోటీలకు కొత్తవైన, వినూత్నమైన విధానాలను ఆయన తీసుకొస్తున్నారు.
సంజయ్ గుప్తా, రాజ్ కామిక్స్ వ్యవస్థాపకుడు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోలు నాగరాజ్, డోగా, భోకల్, భేరియాతో సహా ఇతర పాత్రలను సృష్టించారు. పరిశ్రమలోని ధోరణలు, డిమాండ్లపై విలువైన సూచనలు ఇస్తారు.
ప్రీతి వ్యాస్, అమర్ చిత్ర కథ సంస్థకు అధ్యక్షురాలు, సీఈవో. కంటెంట్‌కు సంబంధించి తనకున్న విస్తృతమైన జ్ఞానం, అనుభవాలను ప్యానెల్‌కు జోడిస్తారు. పౌరాణికాల నుంచి చిత్ర కథల పుస్తకాలు, ఆరంభ అధ్యాయాల వరకు వివిధ రకాల శైలులపై ఆమె పనిచేశారు.

వేవ్స్ కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్‌షిప్
భారత్‌లో తర్వాతి తరం కామిక్ పాత్రల సృష్టికర్తలను గుర్తించి, ప్రోత్సహించే ఉద్దేశంతో వేవ్స్ కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్ షిప్‌ను ఐసీఏ 2024లో ప్రారంభించింది. దీనికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది. కథను చెప్పడంలో వినూత్నత, సృజనాత్మకత, స్ఫూర్తిని ప్రోత్సహించడం ద్వారా భారతీయ కామిక్స్ రంగంలో నూతన శకానికి నాంది పలకడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
వేవ్స్ 2025 గురించి
వేవ్స్ 2025 అంతర్జాతీయ సదస్సు మే 1 నుంచి 4 వరకు ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. మీడియా, వినోదం, సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలు, సృజనాత్మకత, సహకారాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఎక్స్ఆర్ (ఎక్సెంటెండెడ్ రియాల్టీ)ల్లో నూతన అవకాశాలను అన్వేషిస్తూనే, సృష్టికర్తలు, పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, పెట్టుబడిదారులను ఒక్క చోట చేరుస్తుంది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా మార్చే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఇతరదేశాలతో సహకారాలను వేవ్స్ ప్రోత్సహిస్తుంది.
***
Release ID:
(Release ID: 2105213)
| Visitor Counter:
27