సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ ఎక్స్‌ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ 2025
Posted On:
13 FEB 2025 6:20PM by PIB Hyderabad
వేవ్స్ వీఈఎస్ ఎక్స్‌ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ (ఎక్స్‌సీహెచ్) ఇది వరకు ఎరుగని ఒక చాలెంజ్. ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీలో కొత్త శైలులను అన్వేషించాల్సిందిగా భారత్‌లోని డెవలపర్లను ఈ చాలెంజ్ ఆహ్వానిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ భాగస్వామ్యంతో వేవ్ల్యాప్స్, భారత్ఎక్స్ఆర్, ఎక్స్డీజీలు ఎక్స్ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ (ఎక్స్‌సీహెచ్) ను నిర్వహిస్తున్నాయి. ఇది అత్యాధునిక నవకల్పనలకు ఒక వేదికగా ఉపయోగపడనుంది. టెక్నాలజీతో మనిషికున్న సంబంధాల్ని ఎక్స్‌సీహెచ్ పునర్నిర్వచిస్తుంది. దీనిలో పాల్గొనేవారు తమ ముందుచూపుతో కూడిన సొల్యూషన్స్‌ను వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (డబ్ల్యూఏవీఈఎస్.. వేవ్స్) 2025లో ఆవిష్కరించేందుకు అవకాశాల్ని పొందుతారు. ఈ శిఖరాగ్ర సదస్సు ముంబయిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోనూ, జియో వరల్డ్ గార్డెన్స్‌లోనూ ఈ ఏడాది మే 1 మొదలు 4 వరకు నిర్వహించనున్న ఒక ప్రధాన పారిశ్రామిక సమావేశం కానుంది.
వేవ్స్ ఒక ప్రధాన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. భారతదేశ మీడియా, వినోద (ఎం అండ్ ఇ) పరిశ్రమ వృద్ధికి వేగాన్నివ్వాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరిశ్రమ దిగ్గజాలు, ఆసక్తిదారులు, నూతన ఆవిష్కర్తల మధ్య సహకార, సమన్వయాల్ని పెంచాలన్న ఉద్దేశం కూడా ఉంది. ఈ శిఖరాగ్ర సదస్సు ముఖ్య ఆకర్షణబిందువుల్లో ఒకటైన క్రియేట్ ఇన్ ఇండియా పోటీలకు గొప్ప స్పందన లభించింది. ఇప్పటికే 70,000 నమోదులు పూర్తయ్యాయి. ఇంతవరకు 31 పోటీలను ప్రారంభించారు. ప్రతిభావంతులకు, సాంకేతిక పురోగతికి ఒక హుషారైన వేదికను వేవ్స్ అందిస్తోంది. మీడియా, వినోద పరిశ్రమలో సృజనాత్మకతకు, నవకల్పనలకు ప్రపంచంలో భారత్‌ను ఒక కూడలిగా నిలపాలన్నదే వేవ్స్ ధ్యేయంగా ఉంది.
ప్రాతినిధ్యం, మూల్యాంకనం
ముగ్గురు లేదా నలుగురు సభ్యులుండే జట్లు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. డిజైనర్లు, డెవలపర్లు, సబ్జెక్టు నిపుణులు .. వీరితో పాటు వివిధ నేపథ్యాలకు చెందినవారు దీనిలో పాల్గొనడానికి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. సాంకేతికంగా ప్రత్యేక జ్ఞానమంటూ అక్కరలేదు. అయితే ఎక్స్ఆర్ టెక్నాలజీలు, నవకల్పనలంటే తరగని ఆసక్తి మాత్రం ఉండి తీరాలి.
ప్రాజెక్టులను నవకల్పన, వినియోగదారులకు ఎదురయ్యే అనుభూతి, సాంకేతికంగా ఆ ప్రాజెక్టు ఆచరణీయత, అది ప్రసరించగల ప్రభావం.. వంటివి సహా ముఖ్య ప్రమాణాల ఆధారంగా మదింపు చేయనున్నారు. సొల్యూషన్ ఇవ్వజూపే సాధ్యాసాధ్యాలు, దానిని ఏ స్థాయి వరకు వినియోగించవచ్చనే పరిశీలన, మొత్తంమీద అందులో సృజనాత్మకత, అది ఎంత నికార్సైంది అనే అంశాల్ని కూడా జడ్జీలు గమనిస్తారు.
Themes
ఇతివృత్తాలు
ఆరోగ్యం, దేహదారుఢ్యం, శ్రేయం
ఈ ఇతివృత్తం ఆరోగ్య సంరక్షణలో ఎక్స్‌ఆర్ టెక్నాలజీల ఏకీకరణకున్న అవకాశాల్ని కూలంకషంగా పరిశీలిస్తుంది. రోగుల పట్ల తీసుకొనే శ్రద్ధను మరింతగా మెరుగుపరచడం, వైద్యచికిత్స సంబంధిత శిక్షణను పెంచడం, దేహదారుఢ్యానికి ప్రాముఖ్యాన్నివ్వాలని చాటడం, సమగ్ర శ్రేయాన్ని లక్ష్యంగా చేసుకోవడం.. ఈ అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. థెరపీ, పునరావాసం, మానసిక స్వస్థత విషయంలో అవసరమైన సహాయం, దృశ్య మాధ్యమ ఆధారిత కార్యక్రమాల కోసం లోతైన అనుభవాలను ప్రసాదించే పరిష్కారాలను హ్యాకథన్‌లో పాల్గొనే వారు రూపొందిస్తారు.
విద్య రంగంలో మార్పులు
నేర్చుకొనే ప్రక్రియలో క్రాంతిని తీసుకువచ్చే శక్తితోపాటు, ఇంటరాక్టివ్, అనుభవపూర్వక తరహా విద్యాబోధనలకు ఎక్స్‌ఆర్ వీలు కల్పిస్తుంది. ఈ ఇతివృత్తం తరగతి గదుల మొదలు వృత్తి విద్య ప్రధాన శిక్షణ, కార్పొరేట్ లెర్నింగ్ వరకు వివిధ విద్యాబోధన సంబంధిత రంగాల్లో అందుబాటునూ, సంబంధాల్నీ, నైపుణ్యాభివృద్ధినీ పెంచే విస్త్తృత సొల్యూషన్లను ఆవిష్కరించండంటూ హ్యాకథాన్‌లో పాల్గొనే వారిని ప్రోత్సహిస్తుంది.
తన్మయుల్ని చేసే పర్యాటక రంగం
ప్రజలు ప్రపంచాన్ని చూసే తీరునీ, పరిశీలించే విధానాన్నీ మరింతగా తెలుసుకునేందుకు ఎక్స్ఆర్ దోహదపడుతుంది. వర్చువల్ టూరిజం, చారిత్రిక పునర్నిర్మాణాలు, ఇంటరాక్టివ్ సాంస్కృతిక కథనరీతులు, భౌతిక-డిజిటల్ వాస్తవికతలను జతపరచే లోతైన యాత్రానుభూతుల మాధ్యమం ద్వారా గమ్యస్థానాలను పరిచయం చేసే సరికొత్త పద్ధతుల్ని అభివృద్ధిపరచాల్సిందిగా ఈ ఇతివృత్తం హ్యాకథాన్‌లో పాల్గొనే వారిని కోరుతోంది.
డిజిటల్ మీడియా, వినోదం
ఎక్స్ఆర్ నేపథ్యంలో కథను చెప్పడం, గేమింగ్, ఇంకా కంటెంటు వినియోగం.. ఈ ధోరణులతో వినోద పరిశ్రమ మున్ముందుకు దూసుకుపోతోంది. ఈ ఇతివృత్తం ఈ హ్యాకథాన్‌లో పాల్గొనే వారికి ప్రేక్షకులను మమేకం చేసే తీరులో మార్పును తీసుకురావడానికి, ఇంటరాక్టివ్ కథనాలను, వర్చువల్ కన్సర్టులను, తరువాతి తరానికి చెందిన మీడియా ప్లాట్‌ఫారాలను.. వీటిని మార్చేసే అనుభవాల్ని ఆవిష్కరించి సృజనాత్మకతకు సంబంధించిన హద్దులను విస్తరించండి అనే సవాలును విసురుతోంది.
ఈకామర్స్ , రిటైల్ రంగంలో మార్పు
కొనుగోళ్లు చేయడానికి రోజురోజుకూ డిజిటల్ మాధ్యమంపై ఆధారపడే ధోరణి పుంజుకుంటున్నందువల్ల, వినియోగదారులతో అనుబంధాల్ని, వ్యక్తిగత అనుభూతినీ పెంచడానికి కొత్త పద్ధతుల్ని ఎక్స్ఆర్ అందిస్తుంది. ఈ ఇతివృత్తం వర్చువల్ షోరూములు, ఇంటరాక్టివ్ షాపింగ్ అనుభవంతోపాటు ఉన్నత బ్రాండ్ ఇంటరాక్షన్లను రూపొందించడానికి ఎలక్ట్రానిక్ కామర్స్ (ఈ-కామర్స్), రిటైల్, స్థిరాస్తి వంటి ఇమర్సివ్ టెక్నాలజీలను వినియోగించుకోవడంపై దృష్టి సారిస్తుంది.
ముఖ్య ఘట్టాలు, మార్గసూచీ
రెండో దశ ఫలితాలను ఇప్పటికే ప్రకటించారు. 40 జట్లు మూడో దశలో ప్రవేశించాయి. ఫలితాలను చూడడానికి here ను క్లిక్ చేయండి
ఫైనల్ విజేతలకు వేవ్స్ 2025లో తమ అపూర్వ ఎక్స్ఆర్ సొల్యూషన్స్ను ప్రదర్శించే అవకాశం దక్కుతుంది.
పురస్కారాలు, గుర్తింపు
ఎక్స్ఆర్ క్రియేటర్ హ్యాకథాన్‌లో మొత్తం రూ.5 లక్షల విలువైన నగదు బహుమతులు, ఇంకా మరెన్నో విశిష్ట పారితోషికాలు కూడా ఉంటాయి. విజేతలు ఖరీదైన వస్తువులను వాడుకొనే అవకాశాల్ని, ఎంఐటీ రియాలిటీ హ్యాక్, ఏడబ్ల్యూఈ ఏషియా వంటి ప్రపంచ అగ్రగామి ఎక్స్‌ఆర్ ఈవెంట్లకు ప్రాయోజకుల సౌజన్యంతో హాజరయ్యే అవకాశాలను అందుకోవడంతోపాటు ఇతరుల పెట్టుబడితో తమ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చే సౌలభ్యాన్నీ పొందగలుగుతారు. వీటికి అదనంగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ఎక్స్‌ఆర్ టెక్నాలజీ క్రమవికాసానికి తోడ్పాటును అందించినందుకు వారి కృషిని గుర్తిస్తూ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రముఖులు ప్రశంసాపూర్వక లేఖలను అందిస్తారు.
అదనపు సమాచారం కోసం:
· https://wavesindia.org/challenges-2025
· https://wavelaps.com/xrcreatorhackathon/
· https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2090278
Click here to download PDF
***
(Release ID: 2103313)
Visitor Counter : 21