పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భారత స్వచ్ఛ వంట గ్యాస్ నమూనాను కళ్లకు కడుతున్న భారత ఇంధన వారోత్సవాలు గ్లోబల్ సౌత్‌కు ఒక నమూనా
Posted On:
12 FEB 2025 3:06PM by PIB Hyderabad
ఈ సంవత్సరం నిర్వహిస్తున్న భారత ఇంధన వారోత్సవాల్లో (ఎనర్జీ వీక్ 2025) భాగంగా రెండో రోజు నిర్వహించిన మంత్రిత్వ శాఖ స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురీ అధ్యక్షత వహించారు. వంటలో స్వచ్ఛ ఇంధన (క్లీన్ కుకింగ్) వాడకంపై ఈ సమావేశంలో చర్చించారు. స్వచ్ఛ వంట గ్యాసును అందరికీ అందేటట్లు చూడడంలో భారత్ విశేష విజయాన్ని సాధించిందని మంత్రి ప్రధానంగా చెబుతూ, దీనికిగాను ఎంపిక చేసిన వర్గాల వారికి సబ్సిడీలను ఇవ్వడం, దృఢ రాజకీయ సంకల్పం, చమురు క్రయవిక్రయాల కంపెనీలు (ఓఎంసీలు) పంపిణీ యంత్రాంగ నిర్వహణకు డిజిటల్ మాధ్యమం తోడ్పాటును తీసుకోవడం, వంట చేయడానికి స్వచ్ఛ ఇంధనం వాడకాన్ని (క్లీన్ కుకింగ్) ప్రోత్సహిస్తూ దేశమంతటా ప్రచార ఉద్యమాల్ని నిర్వహించడం వంటి పద్ధతుల్ని అనుసరించినట్లు చెప్పారు.

ఈ సమావేశంలో బ్రెజిల్, టాంజానియా, మలావీ, సూడాన్, నేపాల్‌ల ప్రతినిధులతోపాటు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ), టోటల్ ఎనర్జీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) సహా బడా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
భారతదేశం అవలంబిస్తున్న నమూనా సఫలమవడం ఒక్కటే కాకుండా, ఇంధన లభ్యతపరంగా ఇదే తరహా సవాళ్లతో సతమతమవుతున్న ఇతర గ్లోబల్ సౌత్ దేశాల్లో అత్యంత అనుసరణీయం కూడా అని శ్రీ పురీ ఉద్ఘాటించారు. భారత్‌లో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)లో భాగంగా లబ్ధిదారులు ఎల్‌పీజీని కేవలం రోజుకు 7 సెంట్ల అత్యంత తక్కువ ఖరీదుకు అందుకొంటుండగా, ఇతరత్రా వినియోగదారులు రోజుకు 15 సెంట్లకు స్వచ్ఛమైన వంటింటి ఇంధనాన్ని పొందేందుకు అవకాశం ఉందని కేంద్ర మంత్రి వివరించారు. చౌకగా (ఎల్‌పీజీని) కొనగలిగే ఈ స్తోమతే ఎక్కువ మంది ఈ పద్ధతికి మారేటట్లు చూడడంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది.
వంటింట్లో పొగరాని పొయ్యిలకు బదులుగా స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించే పద్ధతుల్ని వ్యాప్తి చేయడంలో తమకు ఎదురైన అనుభవాల్నీ, సవాళ్లనూ చర్చలో పాలుపంచుకొన్న అంతర్జాతీయ ప్రతినిధులు తెలియజేశారు. 2030కల్లా టాంజానియాలో 80 శాతం కుటుంబాలు వంటిళ్లలో స్వచ్ఛ ఇంధన వినియోగ విధానానికి మారేలా ఒక వ్యూహాన్ని అమలుచేస్తున్నామని ఆ దేశ ఉప ప్రధాని, ఇంధనశాఖ మంత్రి శ్రీ దోతో మశకా బితెకో చెప్పారు. దీనికోసం సబ్సిడీల విధానాన్ని తీసుకువచ్చామని, ఎల్‌పీజీకి అదనంగా సహజ వాయువును, బయోగ్యాస్ సహా కొన్ని రకాల ఇంధన వనరులను కూడా వినియోగించుకొంటున్నామని ఆయన వివరించారు. ఏమైనా, ఆర్థిక సహాయాన్ని అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టాల్సి వస్తుండటం, ప్రైవేటు రంగ ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడానికి నియంత్రణపరమైన సంస్కరణల్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉండటం వంటి ముఖ్య సవాళ్లున్నాయని ఆయన అంగీకరించారు.
సూడాన్ ఇంధన, చమురు శాఖ మంత్రి డాక్టర్ నయీం మొహమద్ సయీద్ మాట్లాడుతూ, తమ దేశం ఇంధన అవసరాలను తీర్చుకొనేందుకు ఇప్పటికీ దిగుమతులపైనే బాగా ఆధారపడుతోందన్నారు. ఈ కారణంగా ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయాల్ని పూడ్చడానికి ప్రైవేటు రంగమూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిలిండర్లను స్థానికంగా ఉత్పత్తి చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. వంటింట్లో స్వచ్ఛ ఇంధన వినియోగం విశాల ప్రాతిపదికన అమలు కావాలంటే దిగుమతులకు తక్కువ ఖర్చు మాత్రమే అయ్యేటట్టు చూడటం ముఖ్య అవరోధంగా ఉందని ఆయన చెప్పారు. రువాండా, నేపాల్‌ల ప్రతినిధులు వంటచెరకుపై ఆధారపడడాన్ని తగ్గించడానికి తమ దేశాల్లో విద్యుత్తు కుంపట్ల వాడకం, బయోగ్యాస్ సామర్థ్య విస్తరణల మార్గాలను అనుసరించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు.
భారత్ సాధించిన విజయం ఇతర దేశాలకు విలువైన పాఠాలను అందిస్తోందని, ముఖ్యంగా వినియోగదారులకు వారు పెట్టుకోగలిగే ధరకు ఇంధనాన్ని సమకూర్చడం, లభ్యతను సులభతరం చేయడం, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకోవడంలో ఎంతో నేర్చుకోవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ బుర్స్ వార్లిక్ అన్నారు. ఆర్థిక సహాయాన్ని అందజేయడంలో రాయితీనివ్వడం, వంటింటి ఇంధన లభ్యతను ప్రపంచమంతటా విస్తరించడంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల(పీపీపీ) పద్ధతిని అవలంబించడం.. వీటి పాత్ర ఎంతో ఉందని కూడా ఆమె అన్నారు. ప్రజలు ఈ తరహా ఇంధన వాడకానికి ఆమోదం తెలపడం, పన్ను తగ్గింపుల రూపేణా నియంత్రణ సంబంధిత సర్దుబాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడడం వంటివి సైతం పెద్ద ఎత్తున ఈ విధానానికి మళ్లడంలో కీలక చర్యలే అని సమావేశంలో ప్రస్తావించారు.
స్వచ్ఛమైన వంట ఇంటి ఇంధనాన్ని వినియోగించేందుకు భారత్ మొగ్గు చూపుతున్న విషయాన్ని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) లో భాగస్వామిగా ఉన్న శ్రీ రాహుల్ పణందీకర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో రాజకీయాలపరంగా బలమైన నిబద్ధత, సబ్సిడీ అందజేతలో అది యోగ్యులకే అందేలా చూడటం, ప్రజల్లో అవగాహనను పెంచడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు. భారత్‌లో చమురు క్రయ విక్రయాల కంపెనీలు డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించుకొంటూ సమాజంలో చివరి అంచెలో ఉన్న వారికి సైతం వంటింటి ఇంధనాన్ని పక్కాగా చేరవేస్తున్నాయని ఆయన ప్రశంసలు కురిపించారు. వంట గ్యాస్ సిలిండర్లను చాలా కాలం పాటు వాడుకొనేటట్లుగా చూడడానికీ, చౌకగా సిలిండర్లను అందజేస్తూనే (సంస్థలు) ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సిలిండర్ ఒకసారి ఖాళీ అయిన తరువాత దానిని తిరిగి నింపే నమూనాలో మంచి మార్పును కూడా తీసుకువచ్చి సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని శ్రీ పణందీకర్ వ్యక్తం చేశారు.
గ్లోబల్ సౌత్ దేశాల్లో స్వచ్ఛమైన వంటింటి ఇంధన సంబంధిత టెక్నాలజీలను వ్యాప్తి చేయడంలో సోలార్ కుక్కర్ల మాధ్యమానికున్న అవకాశాలను శ్రీ పురీ వివరిస్తూ, ఐఓసీఎల్ ఆధునిక (అడ్వాన్స్‌డ్) సోలార్ కుక్కర్లను ప్రవేశపెట్టిన సంగతిని గురించి తెలిపారు. ఏకీకృత సౌర ఫలకాలతో కూడి ఉండే ఈ కుక్కర్లకు దాదాపు ఒక యూనిటుకు 500 డాలర్ల ధరను నిర్ణయించారని, ఈ కుక్కర్లకు వాటిని ఉపయోగించే కాలం పొడవునా మరే అదనపు ఖర్చులు ఉండవన్నారు. ఈ పద్ధతిని విస్తృత స్థాయిలో అనుసరించడానికి దీని ప్రస్తుత ధర ఒక అడ్డంకిగా ఉందని కేంద్ర మంత్రి చెబుతూ, కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో అందే ఆర్థికసాయాన్ని, ప్రైవేటు రంగంతో సహకారాన్ని ఏర్పరుచుకోవడం వల్ల ఖర్చులు తగ్గవచ్చని, అదే జరిగితే సౌర శక్తిని వంటింట్లో ఉపయోగించుకోవడం లక్షల మందికి ఒక ఆచరణీయ ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు.
ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ)కి తోడు ఇతరేతర వంటింటి ఇంధన ఐచ్ఛికాల వైపునకు మళ్లడానికి భారత్ చేస్తున్న ముమ్మర ప్రయత్నాలకు సరిపోలేదిగా ఈ కార్యక్రమం ఉంది. ఇది సాంప్రదాయక బయోమాస్ ప్రధాన ఇంధనాలపై ఆధారపడుతూ ఉండడాన్ని తగ్గించడంతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న భారత్ నిబద్ధతను బలపరుస్తోంది.
ప్రపంచమంతటా ఇంధన లభ్యత కార్యక్రమాలకు మద్దతివ్వడానికి భారత్ కట్టుబడి ఉందని చెబుతూ శ్రీ పురీ చర్చను ముగించారు. వంట చేయడానికి స్వచ్ఛ ఇంధనాన్ని ఉపయోగించాలన్న లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్న అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు భారతదేశ నమూనా ఒక ఆచరణసాధ్య పరిష్కారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అవసరమున్న వారికే (స్మార్ట్) సబ్సిడీలు, నిర్దిష్ట ఫలితాలనిచ్చే విధానాలు భారత్ నమూనాలో భాగమన్నారు. సాంప్రదాయకంగా వస్తున్న పొగ చూరే వంటిళ్లు మనుషుల ఆరోగ్యంపైనా, పర్యావరణంపైనా తీవ్ర దుష్ప్రభావాల్ని కలగజేస్తున్న కారణంగా అన్ని వర్గాల వారికీ స్వచ్ఛమైన వంటింటి ఇంధనం దక్కేటట్టు చూడటం ఆర్థిక కోణంలో చూసినప్పుడు తప్పనిసరి మాత్రమే కాక నైతికత కూడా ముడిపడ్డ అంశమని ఆయన అన్నారు.
ఇంధన మార్పుతోపాటు వంటింట్లో స్వచ్ఛఇంధనాన్ని మాత్రమే ఉపయోగించడం అనే విషయంలో కూడా ప్రపంచంలో ముందు నిలబడి నడిపించే దేశంగా భారత్ నిలిచిందని ఈ సమావేశం మరో మారు స్పష్టం చేసింది. అంతేకాదు, స్వచ్ఛ ఇంధనాన్ని అందరికీ అందించాలన్న లక్ష్యాన్ని సాధించడంలో అంతర్జాతీయంగా మరింత ఎక్కువ సహకారాన్ని పొందడానికి ఈ రౌండ్‌టేబుల్ అనువైన వాతావరణాన్ని కూడా ఏర్పరిచింది.
ఈ సంవత్సర భారత ఇంధన వారోత్సవాల (ఇండియా ఎనర్జీ వీక్ 2025) గురించి..
భారత ఇంధన వారోత్సవాలను ఒక పారిశ్రామిక వార్షిక సమావేశం కన్నా విస్తృత స్థాయిని కలిగి ఉండేదిగా నిర్వహించాలని సంకల్పించారు. దీనిని ప్రపంచ శ్రేణి ఇంధన సమాలోచనలకు సరికొత్త రూపునిచ్చే ఒక చైతన్యభరిత చర్చావేదికగా తీర్చిదిద్దారు. కేవలం ఈ కార్యక్రమానికయ్యే ఖర్చులను మంత్రిత్వ శాఖే సమకూర్చుకోంటోంది. రెండు సంవత్సరాల్లో, ఇది తాను అనుకొన్న సంకల్పం నెరవేరేటట్టు చూసుకొంది.. అంటే, ఇది ప్రపంచ ఇంధన రంగంలో నిర్వహించే కార్యక్రమాల్లో రెండో అతి పెద్ద కార్యక్రమం స్థాయికి ఎదిగిందన్నమాట. ఈ వార్షిక సమావేశాల పరంపరలో మూడో సమావేశాన్ని న్యూ ఢిల్లీలోని యశోభూమిలో ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ప్రపంచ ఇంధన రంగంలో ఎలాంటి మార్పులు రావాలో నిర్దేశించడంలో ఒక ముఖ్య ఘట్టంగా మారనుంది.
***
(Release ID: 2102522)
Visitor Counter : 34