సృజనాత్మకత, కృత్రిమ మేధ సంగమానికి శ్రీకారం
పరిచయం
సమాచార, ప్రసార శాఖ సహకారంతో ది ఇంటర్‌నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ‘ది ఏఐ ఆర్ట్ ఇన్‌స్టలేషన్ చాలెంజ్’ను నిర్వహించనుంది. ఈ తరహా పోటీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. కృత్రిమ మేధ, కళాత్మక అభివ్యక్తీకరణలను కలగలిపితే ఎలాంటి ఫలితాలను రాబట్టుకోవచ్చో తెలుసుకోవడానికి కళాకారులను, డిజైనర్లను, కృత్రిమ మేధ రంగం పట్ల ఉత్సాహం కలిగి ఉన్న వారిని ఈ పోటీ ఒక చోటుకు చేర్చనుంది. కృత్రిమ మేధ చోదకశక్తిగా ఉండే సాధనాలను, పద్ధతులను ఉపయోగించుకొంటూ మమేకంకాగల, ముఖాముఖి మాట్లాడుకోవడానికి అవకాశం ఉండే తరహా ఆవిష్కరణలను అందిస్తూ సృజనాత్మకత, నవకల్పనల పరిధుల్ని విస్తరించాల్సిందిగా ఈ పోటీలో పాల్గొనే వారిని నిర్వహకులు కోరుతున్నారు. మార్పునకు దారితీసే సామర్థ్యం కృత్రిమ మేధకు ఉందని ప్రధానంగా చాటిచెప్పడం ఈ పోటీ ధ్యేయం. అదే సమయంలో పెట్టుబడిదారులు, సహకారాన్ని అందించడానికి సిద్ధమయ్యే వారు, పరిశ్రమ ప్రముఖులతో సంబంధాల్ని పెంపొందింపచేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీల్లో ఈ పోటీ ఒక భాగం. క్రియేట్ ఇన్ ఇండియా అనేది వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (డబ్ల్యూఏవీఈఎస్..‘వేవ్స్’) పర్యవేక్షణలో అమలు చేస్తున్న ఒక ప్రధాన కార్యక్రమం. ప్రసార మాధ్యమాలు, వినోదం (మీడియా, ఎంటర్టైన్మెంట్.. ‘ఎంఅండ్ ఈ’) పరిశ్రమలో నవకల్పనలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఒక ప్రపంచ శ్రేణి వేదికగా వేవ్స్ పనిచేస్తోంది. సమాచార, ప్రసార శాఖ నాయకత్వంలో ఇది 70,000కు పైగా రిజిస్ట్రేషన్లను రాబట్టుకొంది. ఇంతవరకు 31 పోటీలను ప్రారంభించారు. సృజనశీలతనీ, ప్రపంచ దేశాల ప్రాతినిధ్యాన్నీ ఇది ప్రోత్సహిస్తోంది. పరిశ్రమలో ఒక ప్రధాన వేదికగా ఇది- సహకారాన్ని, వ్యాపార అవకాశాలను పెంచుతూ, భారత్ ప్రపంచ శ్రేణి సృజనాత్మక కూడలిగా ఆవిర్భవించడంలోనూ తోడ్పడుతుంది. ఈ సమ్మిట్‌ను ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌తోపాటు జియో వరల్డ్ గార్డెన్స్‌లో 2025 మే 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కొత్త ఆలోచనలతో ఉరకలెత్తే యువతనీ, ఔత్సాహిక ప్రతిభావంతులనూ ప్రపంచానికి పరిచయం చేసే ఒక వేదిక కానుంది.

అర్హతలు..

కనీస అర్హతలు:
• ఇన్‌స్టలేషన్ ఎంతవరకు ఆచరణ యోగ్యమో, ముఖాముఖి పద్ధతిలో పాలుపంచుకోవడానికి దానిలో అవకాశం ఉందని తెలిపే తరహా ప్రోటోటైప్ లేదా మాకప్ (మాక్అప్)ను గాని పంపాల్సి ఉంటుంది.
• ప్రాజెక్టును రూపొందించిన క్రమాన్ని, అందుకు పొందిన ప్రేరణను, ఉపయోగించిన కృత్రిమ మేధ సంబంధిత సాంకేతిక ప్రక్రియను దరఖాస్తులో వివరించాలి.
• రేఖాచిత్రాలు గాని లేదా 3డీ నమూనాల వంటి దృశ్య ప్రధాన నివేదనలను అందజేయాలి.
• ఆలోచననను విపులంగా కళ్లకు కట్టే, ఏవైనా మూల రచనలు, లేదా నమూనాల (ప్రోటోటైప్స్)ను లేదంటే అనుకరణలను (సిమ్యులేషన్స్)ను ప్రదర్శించే ఒక చిన్న వీడియో (ఇది 5 నిమిషాల వరకు ఉండవచ్చు)ను అప్‌లోడ్ చేయాలి.
• ఎంట్రీని పంపించడానికి చివరి గడువు: మార్చి 15, 2025.
మదింపు చేసేందుకు ఉద్దేశించిన ప్రమాణాలు
అనర్హతకు సంబంధించిన ప్రమాణాలు
• కాపీ లేదా చట్టపరమైన అనుమతిలేకుండా ఉపయోగించడం.
• దరఖాస్తును సమర్పించేందుకు, అర్హతలకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను పాటించకపోవడం.

***