కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (పీఓఎస్ఏ)లతో ఖాతాల అనుసంధానాన్ని
సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు
Posted On:
06 FEB 2025 3:11PM by PIB Hyderabad
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)కు దేశవ్యాప్తంగా 650 శాఖలు, 1.63 లక్షలకు పైగా సేవా కేంద్రాలు (యాక్సిస్ పాయింట్లు) ఉన్నాయి. ఖుషీనగర్ జిల్లాలో ఒక శాఖతో పాటు 224 సేవా కేంద్రాలు ఉన్నాయి.
పొదుపు, కరెంటు ఖాతాలు, వర్చువల్ డెబిట్ కార్డులు, దేశీయంగా నగదు బదిలీ సేవలు, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, ఐఐపీబీ వినియోగదారులకు బీమా సేవలు, ఐఐపీబీ ఖాతాతో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (పీఓఎస్ఏ) అనుసంధానం, పోస్టాఫీసు పొదుపు పథకాలకు ఆన్ లైన్ చెల్లింపులు, డిజిటల్ జీవన ధ్రువీకరణ పత్రం (డీఎల్‌సీ), ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్), పౌరుల ఆధార్‌లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం, 0-5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు తదితర సేవలను ఐపీపీబీ అందిస్తోంది.
ఐపీపీబీ ఖాతాలతో పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ అకౌంట్ (పీవోఎస్ఏ) అనుసంధానాన్ని సులభతరం చేయడానికి అవససరమైన చర్యలను ఐపీపీబీ చేపట్టింది. దీంతో పాటుగా అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లో వినియోగదారుల్లో అవగాహన పెంపొందించే కర పత్రాలను ప్రదర్శిస్తోంది. అలాగే తపాలా కార్యాలయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ వినియోగదారుల్లో ఆర్థికపరమైన అవగాహనను పెంచేందుకు 25000కు శిబిరాలను నిర్వహించింది. తద్వారా పీఓఎస్ఏ-ఐపీపీబీ ఖాతాలను అనుసంధానించేలా వినియోగదారులను ప్రోత్సహించింది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, చైల్డ్ ఎన్రోల్మెంట్ లాంటి ఆధార్ సంబంధిత సేవలను తపాలా బంట్రోతు, గ్రామీణ డాక్ సేవక్‌ల ద్వారా ఇంటి వద్దే ఐపీపీబీ అందజేస్తోంది. ఈ సేవలను సామాన్యులకు, ఫించనుదారులకు, చిన్నారులకు అందించేందుకు కేంద్ర/రాష్ట్ర స్థాయిల్లో వివిధ విభాగాలతో ఒప్పందం కుదుర్చుకుంది. 31.12.2024 వరకు 7.03 కోట్ల ఆధార్ సీడెడ్ బ్యాంకు ఖాతాలు తెరిచారు. 7.68 కోట్ల మంది వినియోగదారులు ఆధార్లో మొబైల్ నంబర్లను అప్డేట్ చేశారు. 81.17 లక్షల మంది వినియోగదారులు చిన్నారుల ఆధార్ నమోదు సేవలను వినియోగించుకున్నారు. ఫించనుదారులకు 24 లక్షల డిజిటల్ జీవన ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది.
ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2100485)
Visitor Counter : 24