హోం మంత్రిత్వ శాఖ
జమ్మూ కాశ్మీర్‌లో భద్రత స్థితిపై న్యూ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత
జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది
మోదీ ప్రభుత్వం అదేపనిగా, సమన్వయభరితంగా చేస్తున్న ప్రయత్నాలు
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద అనుబంధ విస్తారిత వ్యవస్థను దెబ్బతీశాయి
‘చొరబాట్లకు తావివ్వకూడద’న్న లక్ష్యంతో ఉగ్రవాదంపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాలంటూ
అన్ని భద్రతాసంస్థలకు కేంద్ర హోం మంత్రి ఆదేశాలు
ఉగ్రవాదుల ఉనికిని రూపుమాపడమే మన లక్ష్యం కావాలి
మత్తుమందుల వ్యాపారం నుంచి సొమ్ము ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లకుండా
అప్రమత్తంగా ఉంటూ, కఠిన చర్యలు తీసుకొంటూ
మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టాలి
Posted On:
05 FEB 2025 3:40PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్‌లో భద్రత స్థితిపై న్యూ ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఒక సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టరు, జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి, జమ్మూ కాశ్మీర్ డీజీపీలతోపాటు, హోం శాఖకు. జమ్మూ కాశ్మీర్ పాలనయంత్రాంగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిన్న కూడా జమ్మూ కాశ్మీర్‌లో భద్రత స్థితిపై ఒక ముఖ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సైన్య దళ ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది, హోం శాఖ కార్యదర్శిలతోపాటు సైన్యానికి, హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం సంకల్పం చెప్పుకొందన్నారు. మోదీ ప్రభుత్వం తదేకంగా, సమన్వయపూర్వకంగా కషి చేస్తన్నందువల్ల జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద అనుబంధ విస్తారిత వ్యవస్థను చాలావరకు బలహీనపరచగలిగినట్లు ఆయన చెప్పారు. ‘చొరబాట్లకు ఏ మాత్రం అవకాశాలను వదలొద్ద’నేదే ధ్యేయంగా పెట్టుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరును ఉద్ధృతం చేయాల్సిందిగా భద్రతా సంస్థలన్నిటికి హోం మంత్రి ఆదేశాలిచ్చారు. చొరబాట్లపైనా, భయాన్ని పెంచే చర్యలపైనా నిర్దాక్షిణ్యంగా విజృంభించాల్సిందిగాను, మరింత కఠినచర్యల్ని తీసుకోవాల్సిందిగాను అన్ని భద్రతాసంస్థలకు ఆయన సూచించారు. ఉగ్రవాదుల జాడే లేకుండా చేయడమే మన లక్ష్యం కావాలి అని ఆయన అన్నారు.
చొరబాటుదారులతోపాటు ఉగ్రవాదులు వారి కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి మాదకద్రవ్యాల మూకల నెట్‌వర్క్ కొమ్ముకాస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు. మత్తుమందుల వ్యాపారంలో సంపాదిస్తున్న డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించడాన్ని అడ్డుకోవడానికి సర్వత్రా డేగకళ్లతో నిఘా పెడుతూ కఠిన చర్యల్ని సరైన సమయంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
కొత్త నేరవిచారణ సంబంధిత చట్టాలను సకాలంలో అమలుపరచే దృష్టితో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో ఉద్యోగాలకు కొత్తవారిని నియమించుకోవాలని ఏజెన్సీలకు శ్రీ అమిత్ షా ఆదేశాలిచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాదం ఆనవాళ్లనేవే ఉండకుండా తీర్చిదిద్దాలి అనే లక్ష్యాన్ని సాధించడానికి మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ‘ఎంతమాత్రం సహించని విధానాన్ని’ అనుసరిస్తోందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అప్రమత్తంగా ఉంటూ అన్ని శక్తులను కూడగట్టుకొని ముందుకు కదులుతూ ఉండాల్సిందిగా అన్ని భద్రతా సంస్థలనూ ఆయన ఆదేశించారు.
జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిరక్షణకు సంబంధించి అన్ని ప్రమాణాల్లో చెప్పుకోదగ్గ మెరుగుదలను నమోదు చేయడానికి భద్రతాసంస్థలు నడుంబిగించి చేపట్టిన ప్రయత్నాల్ని కేంద్ర హోం మంత్రి ప్రశంసించారు.
***
(Release ID: 2100136)
Visitor Counter : 9