ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వృద్ధి కూడళ్లుగా నగరాలు’ కార్యక్రమం కోసం రూ.1లక్ష కోట్లతో ‘అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌’


ప్రాథమిక భూగోళ-ప్రాదేశిక మౌలిక సదుపాయాలు-సమాచార నిధి రూపకల్పన కోసం ‘నేషనల్‌ జియోస్పేషియల్‌ మిషన్‌’;

ఆన్‌లైన వేదికల ద్వారా ఉపాధి పొందే (గిగ్‌) కార్మికులకు ఇ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా గుర్తింపు కార్డులు... రిజిస్ట్రేషన్‌;

‘పిఎం జనారోగ్య యోజన’ కింద వారికి ఆరోగ్య సంరక్షణ సదుపాయం; సుమారు కోటిమందికి ప్రయోజనం;

‘పిఎం స్వానిధి’ పథకం కింద రూ.30 వేల పరిమితితో యూపీఐ సంధానిత క్రెడిట్‌ కార్డులు

Posted On: 01 FEB 2025 1:13PM by PIB Hyderabad

   దేశంలోని నగరాలను ‘వృద్ధి కూడళ్లు’గా రూపుదిద్దే కార్యక్రమం కోసం రూ.1 లక్ష కోట్లతో ‘అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌’ పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంటులో ఈ రోజు 2025-26 బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా ఆమె ఈ మేరకు వెల్లడించారు. అలాగే గత జూలై నెల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘నగరాల సృజనాత్మక పునర్నవీకరణ’, ‘నీటి సరఫరా-పారిశుధ్యం’ కార్యక్రమాలను కూడా ఈ ప్రత్యేక నిధితో అమలు చేస్తామని తెలిపారు.


   ఆచరణాత్మక ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 25 శాతందాకా సొమ్ము ఈ నిధి ద్వారా సమకూరుతుందని, మరో  50 శాతాన్ని బాండ్లు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10,000 కోట్లు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు.


   ప్రాథమిక భూగోళ-ప్రాదేశిక మౌలిక సదుపాయాలు-సమాచార నిధి రూపకల్పన కోసం ‘నేషనల్‌ జియోస్పేషియల్‌ మిషన్‌’ ఏర్పాటు చేయనున్నట్లు ఈ బడ్జెట్‌ ప్రతిపాదించింది. ‘పిఎం గతిశక్తి’ పథకం ద్వారా భూమి రికార్డుల ఆధునికీకరణ, పట్టణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో ఈ మిషన్‌ తోడ్పడుతుందని వెల్లడించింది.

 


   దేశంలోని పట్టణ పేదలు, దుర్బల వర్గాలకు చేయూతపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని శ్రీమతి సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా పట్టణ కార్మికుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి దిశగా వారి ఆదాయాల మెరుగుకు, సుస్థిర జీవనోపాధికి తోడ్పడటం ద్వారా జీవన నాణ్యత మెరుగుపరిచేలా ఒక పథకం అమలు చేస్తామని ఆమె ప్రకటించారు.


   ఆన్‌లైన్ వేదికల ద్వారా ఉపాధి పొందుతున్న (గిగ్‌) కార్మికులు నవశకం సేవల ఆర్థిక వ్యవస్థకు ఎనలేని ఉత్తేజమిస్తున్నారని బడ్జెట్‌ అభివర్ణించింది. ఈ దిశగా పోషిస్తున్న పాత్రకు గుర్తింపునిస్తూ ఇ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా గుర్తింపు కార్డులతోపాటు రిజిస్ట్రేషన్‌కు తమ ప్రభుత్వం వీలు కల్పిస్తుందని శ్రీమతి సీతారామన్‌ వెల్లడించారు. అంతేకాకుండా ‘పిఎం జనారోగ్య యోజన’ కింద ఆరోగ్య సంరక్షణ సదుపాయం కల్పిస్తామని, తద్వారా దాదాపు కోటి మందికి ప్రయోజనం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

 


   ‘పిఎం స్వానిధి’ పథకంతో ఇప్పటిదాకా దేశంలోని 68 లక్షల మందికిపైగా వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరిందని ఆర్థికశాఖ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనివల్ల అనధికార రంగం నుంచి అధిక వడ్డీ భారంతో కూడిన రుణాల బెడద తప్పిందని తెలిపారు. ఈ విజయం ప్రాతిపదికగా ‘స్వానిధి’ పథకాన్ని  బ్యాంకుల నుంచి మరింత రుణ సౌకర్యం, రూ.30,000 పరిమితితో యూపీఐ సంధానిత క్రెడిట్ కార్డుల జారీసహా సామర్థ్య వికాసానికి మద్దతిచ్చేలా ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు.


   అందుబాటు ధర-మధ్యాదాయ వర్గాల గృహ వసతి (స్వామిహ్‌) పథకం కింద ఆలస్యమవుతున్న ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక గవాక్షం ద్వారా సాయంతో 50 వేల నివాస యూనిట్ల నిర్మాణం పూర్తయిందని ఆమె ప్రకటించారు. ఈ ఇళ్లన్నిటినీ కొనుగోలుదారులకు స్వాధీనం చేశారని, ఈ ఏడాది (2025)లో మరో 40 వేల యూనిట్లు పూర్తవుతాయని తెలిపారు. తద్వారా అపార్ట్‌మెంట్ల కోసం తీసుకున్న రుణాలపై నెలవారీ వాయిదాలతోపాటు ప్రస్తుతం నివసించే ఇళ్లకు అద్దె చెల్లిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు మరింత తోడ్పాటు లభిస్తుందని చెప్పారు.


   ఇది విజయవంతమైన నేపథ్యంలో ‘స్వామిహ్‌ 2’ పేరిట తాజా పథకం అమలు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిద్వారా ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేట్ పెట్టుబడిదారుల సహకారంతో మిశ్రమ ఆర్థిక సహాయం సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మరో లక్ష నివాస యూనిట్ల నిర్మాణం లక్ష్యంగా రూ.15,000 కోట్లతో ఈ నిధి ఏర్పాటవుతుందని వెల్లడించారు.
 

****


(Release ID: 2098707) Visitor Counter : 42