సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నాటి డాక్యుమెంట్ల ఆధారంగా మహాత్ముడి ప్రయాణంపై ఎగ్జిబిషన్
అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. రాజ్‌ఘాట్‌లోని నేషనల్ గాంధీ మ్యూజియంలో ఏర్పాటు
Posted On:
29 JAN 2025 2:56PM by PIB Hyderabad
అమరవీరుల దినోత్సవం సందర్భంగా, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐ), నేషనల్ గాంధీ మ్యూజియం య(ఎన్జీఎమ్)లు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా ప్రసార భారతి ఆర్కైవ్స్ సహకారంతో ‘‘జర్నీ ఆఫ్ ది మహాత్మ : త్రూ హిజ్ ఓన్ డాక్యుమెంట్స్’’ పేరుతో ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రదర్శనను
న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియమ్‌కు చెందిన ఎగ్జిబిషన్ హాల్లో ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు మహాత్మ గాంధీ మునిమనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ ప్రారంభించనున్నారు.
ఎంతో శ్రద్ధగా సన్నద్ధపరచిన ఈ ప్రదర్శన మహాత్మ గాంధీ జీవనంలో చోటుచేసుకొన్న గణనీయ మార్పులను వివరించనుంది. దీంతో జాతిపిత జీవనం, వారసత్వాల గురించి తెలుసుకొనే అవకాశం సందర్శకులకు లభించనుంది. అరుదైన ఛాయాచిత్రాలు, ఆధికారిక దస్తావేజులు, దృశ్య-శ్రవణ నివేదికలు, వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలను ఏర్చి కూర్చిన తీరుతెన్నులతో ఈ ప్రదర్శన పోర్బందర్లో గాంధీ ప్రారంభ జీవనం మొదలుకొని భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన ముఖ్య భూమిక వరకు ఆయన అనుసరించిన మార్గాన్ని సుందరంగా ఆవిష్కరిస్తుంది.
ఈ ప్రదర్శనలో 30 ఫలకాలను ఏర్పాటు చేశారు. అవి మహాత్ముని జీవన యాత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలను కళ్లకు కడుతున్నాయి. వాటిలో ఇంగ్లాండులో ఆయన విద్యార్జన, దక్షిణాఫ్రికాలో ఆయన గడిపిన కాలం, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చంపారణ్ సత్యాగ్రహం, దండీ మార్చ్ (ఉప్పు సత్యాగ్రహం), క్విట్ ఇండియా ఉద్యమం వంటివి భాగంగా ఉన్నాయి. సామాజిక న్యాయం, సాముదాయిక సద్భావన, అంటరానితనం నిర్మూలనలకు తోడు దేశ విభజన కాలంలో శాంతి పరిరక్షణకు ఆయన చేసిన తుది ప్రయత్నాలు, స్వాతంత్ర్యం అనంతర కాలంలోనూ చెక్కుచెదరక నిలిచిన ఆయన వారసత్వంపైన కూడా ఈ ప్రదర్శనలో ప్రముఖంగా ప్రస్తావనలున్నాయి.
అహింస, న్యాయం, శాంతి.. ఈ గాంధీ మహాత్ముని ప్రబోధాల్ని గురించి ప్రతీకాత్మకంగా వివరించే పురావస్తు సామగ్రి భారీ సంచయాన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను ప్రజలు చూడడానికి వీలుగా పరిమిత కాలానికి తెరచి ఉంచుతారు. మహాత్మునికి శ్రద్ధాంజలిగా ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషనుకు వచ్చి ఇక్కడున్న వస్తువులను సందర్శించి గాంధీజీ జీవనాన్ని గురించి, గొప్పతనం గురించి లోతుగా అర్థం చేసుకోవాల్సిందిగా పౌరులనీ, విద్యార్థులనూ, చరిత్రకారులనూ, గాంధీని గురించి తెలుసుకోవాలనుకొనే ఉత్సాహం ఉన్న వారినీ ఆహ్వానిస్తున్నారు.
***
(Release ID: 2097390)
Visitor Counter : 26