సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025: ప్రభుత్వ కార్యక్రమాలు ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నాయో ప్రధానంగా చెబుతున్న ప్రయాగ్‌రాజ్ లోని డిజిటల్ ఎగ్జిబిషన్
ఔత్సాహిక పారిశ్రామికత్వం అంశంపై ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని కూడా అందిస్తోందీ ఎగ్జిబిషన్
Posted On:
28 JAN 2025 3:37PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక కార్యక్రమాల ద్వారా ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని ప్రధానంగా చాటిచెబుతూ, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయాగ్‌రాజ్‌లోని ‘మహాకుంభ్ 2025’లో ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ ఎగ్జిబిషన్ అశేష జనాన్ని విశేషంగా ఆకట్టుకొంటోంది.
‘వన్ నేషన్, వన్ ట్యాక్స్’ (ఒకే దేశం, ఒకే తరహా పన్ను), ‘వన్ నేషన్, వన్ పవర్ గ్రిడ్’ (ఒకే దేశం, ఒకే విద్యుత్తు గ్రిడ్), ఇంకా ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ (ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు) మొదలైన కార్యక్రమాల ద్వారా సందర్శకులలో ‘‘ఐక్యం బలం సామంజస్యం’’ పదబంధ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఐకమత్యాన్ని బలపరుస్తున్న ఈ కార్యక్రమాలను గురించి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ నగరం త్రివేణి మార్గ్‌లో కేంద్ర సమాచార- ప్రసార శాఖ ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషనుకు వెల్లువెత్తుతున్న సందర్శకులకు తెలియజేస్తున్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలచే సర్దార్ పటేల్ విగ్రహంతో ఉన్న ఒక చిత్రం కూడా ఐక్యతా సందేశాన్ని చాటిచెబుతోంది.
జమ్మూ కాశ్మీర్లో 370వ అధికరణాన్ని తొలగించడంతో ‘వన్ నేషన్, వన్ కాన్స్టిట్యూషన్’ (ఒకే దేశం, ఒకే రాజ్యాంగం) ప్రతినను నెరవేర్చినట్లయింది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను పండించే దిశగా ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ (ఒకే దేశం, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు)తోపాటు ‘వన్ నేషన్, వన్ సివిల్ కోడ్’ (ఒకే దేశం, ఒకే పౌర స్మృతి)లను ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జోరందుకొంటున్నాయి. ఈ అంశాలను సైతం మహాకుంభ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆకర్షణీయ తీరులో కళ్లకు కడుతున్నారు.
ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, విధానాలు, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి తెలియజేస్తున్న ఈ ప్రదర్శన ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని గురించి, స్వయం- ఉపాధి మార్గాలను గురించి ప్రచారం చేస్తోంది. ‘ముద్ర పథకం’, ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, ప్రధాన మంత్రి ఉపాధికల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)లతోపాటు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీములు ఈ ప్రచారంలో భాగంగా ఉన్నాయి.
ఈ నెల 13న ఈ ప్రదర్శనను మొదలుపెట్టినప్పటి నుంచి దీనిని భక్తజనం పెద్ద సంఖ్యలో చూశారు. దృశ్య, శ్రవణ మాధ్యమాల సాయంతో వారు దేశాభివృద్ధి తీరుతెన్నులను గురించి, వారసత్వాన్ని గురించి అనేక విషయాలను తెలుసుకొంటున్నారు. వేరు వేరు ప్రభుత్వ పథకాలను వివరించే డాక్యుమెంటరీలను ఎగ్జిబిషన్లో ఎల్ఈడీ తెరపై ప్రదర్శిస్తున్నారు. వీటిని చూడడానికి చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఆ తెర పక్కన నిల్చొని వారు తమ సెల్ఫీలను (స్వీయ ఛాయాచిత్రాలను) కూడా తీసుకొంటున్నారు.
***
(Release ID: 2097169)
Visitor Counter : 18