జల శక్తి మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025: గంగానది సంరక్షణ, చైతన్య కేంద్రంగా మారిన నమామి గంగే మండపం
గంగానది స్వచ్ఛత, సంరక్షణల కోసం చేపడుతున్న ప్రయత్నాలను గురించి డిజిటల్ ఎగ్జిబిషన్ సాయంతో తెలుసుకుంటున్న సందర్శకులు
Posted On:
23 JAN 2025 11:03AM by PIB Hyderabad
మహాకుంభ్-2025 సందర్బంగా ప్రయాగ్‌రాజ్‌లో నమామి గంగే మిషన్ ఏర్పాటు చేసిన నమామి గంగే మండపాన్ని ప్రతి రోజూ చాలా మంది సందర్శకులు చూస్తున్నారు. గంగా నదిని కాపాడడానికి ప్రభుత్వం ఆ నదిలో స్వచ్ఛత పరిరక్షణ దిశగా ఎలాంటి చర్యలను తీసుకొంటోందో ప్రజలకు చాటిచెప్పే ఒక వినూత్న మాధ్యమంగా ఈ మండపం పేరు తెచ్చుకొంటోంది. గంగానదిలో ప్రాకృతిక శోభతోపాటు జీవ వైవిధ్యం ఏ స్థాయిలో మనగలుగుతోందో చూపరులకు తెలియజేసేందుకు ఈ మండపం మొదట్లో ఒక ఇంటరాక్టివ్ బయోడైవర్సిటీ టనల్‌ను ఏర్పాటు చేశారు. ఆధునిక ప్రొజెక్షన్ టెక్నాలజీ దన్నుగా నిలుస్తున్న ఈ సొరంగ మార్గ నిర్మాణం గంగ తీర ప్రాంతాల్లో పక్షుల కిలకిల రవాలను వినిపించడంతోపాటు జీవనదాయినిగా గంగకున్న ప్రాధాన్యాన్ని కూడా ప్రస్ఫుటం చేస్తోంది.
ప్రధాన ఆకర్షణగా డిజిటల్ ఎగ్జిబిషన్
డిజిటల్ ఎగ్జిబిషన్ ఈ పెవిలియన్‌కు ప్రదానాకర్షణగా ఉంది. గంగానది జలాల స్వచ్ఛతను సంరక్షించడానికి చేపడుతున్న వివిధ చర్యలను సందర్శకులు గమనించి ముచ్చటపడేవిధంగానూ, చాలా విషయాల్ని వారు నేర్చుకొనే విధంగానూ ఈ డిజిటల్ ఎగ్జిబిషనును తీర్చిదిద్దారు. ప్రయాగ్ ప్లాట్‌ఫామ్ మరొక విశేషాంశంగా ఉంది. ఇది గంగ, యమున నదులకు, వాటి ఉపనదులకు సంబంధించిన సమాచారాన్ని వాస్తవ కాల ప్రాతిపదికన అందిస్తోంది. నదులలో నీటి స్థాయిలు, జల స్వచ్ఛత, కాలుష్యానికి సంబంధించిన గణాంక వివరాల్ని ఈ ప్లాట్‌ఫామ్ తెలియజేస్తోంది.
గంగ స్వచ్ఛత పరిరక్షణ దిశగా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు హైలైట్
ఈ మండపం నదితీర ప్రాంత అభివృద్ధిని, గంగ ఒడ్డు వెంబడి మురికినీటి శుద్ధి ప్లాంటులు పనిచేస్తున్న తీరును కూడా కళ్లకు కడుతోంది. నదిలో శుభ్రతను పరిరక్షించడానికి ప్రభుత్వం, వివిధ సంస్థలు ఏయే రకాలైన సాంకేతిక ప్రధాన, వ్యవస్థీకృత చర్యల్ని చేపడుతున్నాయో ఈ ప్రదర్శనను చూసి సందర్శకులు తెలుసుకోగలుగుతున్నారు. గంగానదిలో మనుగడ సాగిస్తున్న డాల్ఫిన్లు, సముద్రపు తాబేళ్లు, మొసళ్లు, చేపల వంటి ప్రాణుల ప్రతిరూపాలను ఈ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు. ఇది బాలలకు, యువతకు అనేక అంశాలను తెలుసుకోవడానికి, ముఖ్యంగా జీవ వైవిధ్య సంరక్షణకు గంగానది ఎంతో తోడ్పడుతోందని, భావితరాల వారిని దృష్టిలో పెట్టుకొని ఆ నదిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకొనే అవకాశాన్ని ఈ పెవిలియన్ అందిస్తోంది.
చదువుకోవడానికంటూ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌బీటీ
ఈ ప్రదర్శనలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) ఒక ప్రత్యేక రీడింగ్ కార్నర్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో గంగ, మహాకుంభ్, సామాజిక విధానాలు, జాతీయ గౌరవం వంటి అంశాలకు చెందిన అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గంగానదికి సంబంధించిన సంస్కృతిప్రధాన అంశాలను, ఆ నదికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి గల వారిని ఈ విభాగం విశేషంగా ఆకట్టుకొంటోంది.
భావోద్వేగాలను పెనవేస్తున్న గణపతి విగ్రహం
గంగానదిలో నానాటికీ అంతరించిపోతున్న ప్రాణి జాతుల సంరక్షణ, ప్రజాచైతన్యం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, గంగ టాస్క్ ఫోర్స్, ఐఐటీ ఢిల్లీ వంటి సంస్థలు ఈ ప్రదర్శనలో కీలక సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. గంగకు మన దేశంలో ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధానంగా చెప్పడంలోనూ, ప్రజల్లో అవగాహనను పెంచడంలోనూ ఈ సమాచారం తన వంతు కీలక పాత్రను పోషిస్తోంది. గంగా నది నిర్మలత్వానికి, శుభ్రతకు ప్రతీకగా భగవాన్ గణేశ్ విగ్రహాన్ని కూడా ఈ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం సాంస్కృతిక బంధాలతోపాటు ఉద్వేగభరిత బంధాలను బలోపేతం చేసేదిగా ఉంది.
చాలా మందిని తన వైపునకు తిప్పుకొంటున్న మండపం
గంగను కేవలం ఓ నదిలా చూడకండి, గంగ మన దేశ సంస్కృతిలో, చరిత్రలో, ఆర్థిక జీవనంలో ఓ విడదీయలేని భాగమని గ్రహించండి అంటూ నమామి గంగే మిషన్ మహాకుంభ్‌కు తరలివస్తున్న భక్తులకు విజ్ఞప్తి చేసింది.
ఆ నదిని స్వచ్ఛంగా అట్టిపెడుతూ, ఆ నది పది కాలాలపాటు ప్రవహిస్తూ ఉండేటట్లు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం దేశ పౌరులందరి బాధ్యత. ఈ అత్యాధునిక, సృజనశీల మండపం గంగానదికున్న ప్రాముఖ్యాన్ని ప్రజలకు వివరించడంలో సఫలమవడం ఒక్కటే కాకుండా మహాకుంభ్‌లో ప్రధాన ఆకర్షక బిందువుల్లో ఒకటిగా కూడా మారిపోతోంది.
***
(Release ID: 2095459)
Visitor Counter : 11