సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2025 సదస్సులో పాల్గొననున్న కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్


దావోస్ లో భారత అభివృద్ధి నమూనాను వివరించనున్న అశ్విని వైష్ణవ్: సమ్మిళిత వృద్ధి, డిజిటల్ మార్పు దిశగా భారతదేశ దార్శనికత పై ప్రధానంగా దృష్టి పెట్టనున్న డబ్ల్యూఈఎఫ్ ౨౦౨౫

Posted On: 19 JAN 2025 7:54AM by PIB Hyderabad

కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) 2025లో పాల్గొంటారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న సమ్మిళిత వృద్ధి, పరిణామాత్మక అభివృద్ధి పట్ల భారతదేశ నిబద్ధతను ఆయన ఈ పర్యటనలో ప్రముఖంగా వివరిస్తారు.

భారత సమ్మిళితవృద్ధి నమూనా

అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిని సాధించడంలో, ముఖ్యంగా గతంలో పురోగతికి దూరంగా ఉన్నవారికి  భారత్ ఇస్తున్న ప్రాముఖ్యత దావోస్‌కు బయలుదేరే ముందు శ్రీ వైష్ణవ్ పురోగతిని ప్రస్తావించారు. “అభివృద్ధికి దూరంగా ఉన్న వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంపై ప్రధానమంత్రి దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక సమ్మిళితం మొదలుకొని మరుగుదొడ్లు, గ్యాస్, మంచి నీటి కనెక్షన్ల వరకు అవసరమైన సేవలను అందించడం, గ్రామీణ,  పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి అంశాలు ప్రపంచం అర్థం చేసుకోవాలనుకుంటున్న విషయాలు,” అని ఆయన తెలిపారు. సమ్మిళిత వృద్ధి గురించి, సామాజిక, భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల గురించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సవివరంగా చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భారత డిజిటల్ విప్లవంపై ప్రధాన దృష్టి

దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌కు పయనమయ్యే ముందు, కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న భారతదేశ డిజిటల్ ప్రయాణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక విధానాలు, డిజిటల్ ఇండియా కార్యక్రమం తెచ్చిన మార్పులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సాధికారత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరును అర్థం చేసుకోవడానికి ప్రపంచం ఆసక్తిగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

“భారతదేశ ఆర్థిక విధానాలు, డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా జరిగిన అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సాధికారత ఇవ్వడంలో సాంకేతికత ఎలా ప్రజాకేంద్రీకృతమైందో తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తి చూపుతోంది,” అని మంత్రి తెలిపారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన భారతదేశ వినూత్న డిజిటల్ స్వరూపం సాంకేతికతను వినియోగించి సమగ్ర అభివృద్ధిని నడిపించడానికి ప్రపంచ ప్రామాణికంగా నిలిచింది, ఇది ఫోరమ్‌లో చర్చల ముఖ్యాంశంగా ఉంది.

డబ్ల్యూఈఎఫ్ 2025లో భారత్ పాల్గొనడం భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలలో దేశాన్ని ప్రపంచ నాయకత్వ హోదాలో నిలబెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.


 

***


(Release ID: 2094374) Visitor Counter : 18