ప్రధాన మంత్రి కార్యాలయం
19 జనవరి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 118 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
19 JAN 2025 11:46AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 2025 సంవత్సరంలో మొదటి ‘మన్ కీ బాత్’ ఈరోజు జరుగుతోంది. మీరందరూ ఒక విషయం గమనించి ఉంటారు. ‘మన్ కీ బాత్’ ప్రతిసారీ నెలలో చివరి ఆదివారం జరుగుతుంది. కానీ ఈసారి మనం ఒక వారం ముందుగానే- నాల్గవ ఆదివారం కాకుండా మూడవ ఆదివారం సమావేశమవుతున్నాం. ఎందుకంటే వచ్చే ఆదివారం గణతంత్ర దినోత్సవం. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మిత్రులారా! ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఇది భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం. ఈ సంవత్సరానికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలవుతోంది. పవిత్ర రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ సభలోని గొప్ప వ్యక్తులందరికీ నేను నమస్కరిస్తున్నాను. రాజ్యాంగ సభ సమయంలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ చర్చలు, రాజ్యాంగ సభ సభ్యుల ఆలోచనలు, వారి మాటలు మన గొప్ప వారసత్వం. ఈరోజు 'మన్ కీ బాత్' లో కొంతమంది గొప్ప నాయకుల గొంతులను మీకు వినిపించేందుకు ప్రయత్నిస్తాను.
మిత్రులారా! రాజ్యాంగ సభ పనులు ప్రారంభమైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ పరస్పర సహకారం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఆయన చేసిన ఈ ప్రసంగం ఇంగ్లీషులో ఉంది. దాని నుండి కొంత భాగాన్ని నేను మీకు వినిపిస్తాను.-
"అంతిమ లక్ష్యం విషయానికొస్తే మనలో ఎవరికీ ఎటువంటి భయాలూ ఉండనవసరం లేదని నేను భావిస్తున్నాను. మనలో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ నేను స్పష్టంగా వ్యక్తపరచాల్సిన భయం ఏమిటంటే నేను చెప్పినట్లుగా మన బాధంతా అంతిమ భవిష్యత్తు గురించి కాదు. నేడు మనకున్న వైవిధ్యభరితమైన సమాజాన్ని ఎలా ముందుకునడపాలనేదే అసలు సమస్య. ఉమ్మడి నిర్ణయం తీసుకొని, మనల్ని ఐక్యత దిశగా నడిపించే మార్గంలో సహకార ధోరణితో ముందుకుసాగడమే అసలు సమస్య. మన ఇబ్బంది అంతిమ లక్ష్యానికి సంబంధించింది కాదు; మన సమస్య ప్రారంభం గురించే.”
మిత్రులారా! బాబా సాహెబ్ రాజ్యాంగ సభ ఐక్యంగా, ఏకాభిప్రాయంతో ఉండాలని, అందరి హితం కోసం కలిసి పనిచేయాలని భావించారు. రాజ్యాంగ సభకు చెందిన మరొక ఆడియో క్లిప్‌ను వినిపిస్తాను. ఈ ఆడియో మన రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు విందాం –
“మనం శాంతి కాముకులమని మన చరిత్ర చెప్తోంది. మన సంస్కృతి నేర్పేది కూడా శాంతి కాముకతే. మన సామ్రాజ్యం, మన విజయాలు విభిన్నమైనవి. మనం ఎప్పుడూ ఇతరులను- ఇనుప సంకెళ్లతోనో బంగారు సంకెళ్లతోనే బంధించడానికి ప్రయత్నించలేదు. అంతకంటే దృఢమూ సుందరమూ ఆహ్లాదకరమూ అయిన పట్టు దారంతో అనుసంధానించాం. ఆ బంధం ధర్మానికి, సంస్కృతికి, జ్ఞానానికి సంబంధించినది. మనం ఇప్పుడు అదే దారిలో నడుస్తూనే ఉంటాం. మనకు ఒకే ఒక కోరిక ఉంది. ఒకే ఒక అభిలాష ఉంది. ఆ కోరిక ఏమిటంటే ప్రపంచంలో ఆనందాన్ని, శాంతిని నెలకొల్పడంలో సహాయపడాలని; మనకు బలాన్ని, స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన సత్యం, అహింస అనే అమోఘమైన ఆయుధాలను ప్రపంచానికి అందించాలని. కాలం చేసిన గాయాలను కూడా తట్టుకుని నిలబడేలా మన జీవితంలో, సంస్కృతిలో ఏదో బలం ఉంది. మన ఆదర్శాలను మన ముందు ఉంచుకుంటే, మనం ప్రపంచానికి గొప్ప సేవ చేయగలుగుతాం.”
మిత్రులారా! డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మానవ విలువల పట్ల దేశం నిబద్ధత గురించి మాట్లాడారు. ఇప్పుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి స్వరాన్ని మీకు వినిపించనివ్వండి. అవకాశాల సమానత్వం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇలా అన్నారు –
"అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ మనం మన కృషిని ముందుకు తీసుకెళ్ళాలి. గొప్ప భారతదేశ నిర్మాణానికి సహాయం చేయాలి. ఈ భారతదేశం మనందరి మాతృ భూమి. ఏదో ఒక సమాజానికో, ఒక వర్గానికో మాత్రమే కాదు- జాతి, కులం, మతం లేదా సమాజంతో సంబంధం లేకుండా ఈ గొప్ప భూమిలో నివసించే ప్రతి వ్యక్తికి, ప్రతి పురుషుడికి, ప్రతి మహిళకు, ప్రతి బిడ్డకు మాతృభూమి. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభకు అనుగుణంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఇక్కడ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం ఉంటుంది. తద్వారా వారు భారతదేశం అనే గొప్ప ఉమ్మడి మాతృభూమికి సేవ చేయగలరు.”
మిత్రులారా! రాజ్యాంగ సభ చర్చ నుండి ఈ అసలు ఆడియోను వినడాన్ని మీరు కూడా ఆనందించి ఉంటారని నేను ఆశిస్తున్నాను. మన దేశ పౌరులమైన మనం ఈ ఆలోచనల నుండి ప్రేరణ పొంది, మన రాజ్యాంగ నిర్మాతలు కూడా గర్వపడే భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేయాలి.
మిత్రులారా! గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం. ఆ రోజు ముఖ్యమైనది. ఎందుకంటే ఆ రోజున 'భారత ఎన్నికల సంఘం' స్థాపన జరిగింది. మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల సంఘానికి , ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారు. 1951-52లో దేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు, దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా లేదా అని కొంతమందికి సందేహం ఉండేది. కానీ, మన ప్రజాస్వామ్యం అన్ని భయాలనూ తప్పని నిరూపించింది. అన్నింటికంటే ముఖ్యంగా భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. గత దశాబ్దాలుగా దేశ ప్రజాస్వామ్యం బలపడింది. అభివృద్ధి చెందింది. మన ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి బలోపేతం చేసిన ఎన్నికల సంఘానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాశక్తికి మరింత బలాన్ని అందించడానికి కమిషన్ సాంకేతిక శక్తిని ఉపయోగించుకుంది. నిష్పాక్షికమైన ఎన్నికలకు నిబద్ధత చూపినందుకు ఎన్నికల సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. నా దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును ఎల్లప్పుడూ గరిష్ట సంఖ్యలో వినియోగించుకోవాలని, దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని, ఈ ప్రక్రియను బలోపేతం చేయాలని నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఎప్పుడూ గుర్తుంచుకునే జనసమూహం. ఊహకు అందని దృశ్యం. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమం! ఈసారి కుంభమేళా లో అనేక దివ్య యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటుంది. భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పవిత్ర సంగమ ఇసుక తిన్నెలపై గుమిగూడతారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఎక్కడా వివక్ష లేదా కులతత్వం లేదు. ఇందులో భారతదేశ దక్షిణ ప్రాంతం నుండి ప్రజలు వస్తారు. భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి కూడా వస్తారు. కుంభమేళాలో ధనిక, పేద అందరూ ఒక్కటి అవుతారు. అందరూ సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. భండారాలలో కలిసి భోజనం చేస్తారు. ప్రసాదాలు తీసుకుంటారు. అందుకే 'కుంభ మేళా’ ఐక్యతకు సంబంధించిన మహాకుంభమేళా. కుంభమేళా వేడుక మన సంప్రదాయాలు మొత్తం భారతదేశాన్ని ఎలా ఏకం చేస్తాయో కూడా మనకు తెలియజేస్తుంది. ఉత్తరం నుండి దక్షిణం వరకు నమ్మకాలను అనుసరించే మార్గాలు ఒకేలా ఉంటాయి. ఒకవైపు ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్ , హరిద్వార్‌లలో కుంభమేళా నిర్వహిస్తుండగా, దక్షిణ భాగంలో గోదావరి, కృష్ణ, నర్మద , కావేరి నదుల ఒడ్డున పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ రెండు పండుగలు మన పవిత్ర నదులు, వాటి నమ్మకాలతో ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా కుంభకోణం నుండి తిరుక్కడ్-యూర్ వరకు, కూడ-వాసల్ నుండి తిరుచెరై వరకు కుంభమేళాతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు అనేకం ఉన్నాయి.
మిత్రులారా! ఈసారి కుంభమేళాలో యువత భాగస్వామ్యం చాలా విస్తృత రూపంలో కనిపిస్తుందని మీరందరూ గమనించి ఉంటారు. యువతరం నాగరికతతో గర్వంగా అనుసంధానమైనప్పుడు మూలాలు బలపడతాయన్నది కూడా నిజం. ఆపై వారి బంగారు భవిష్యత్తు కూడా నిర్ధారణ అవుతుంది. ఈసారి మనం కుంభమేళా డిజిటల్ పాదముద్రలను కూడా భారీ స్థాయిలో చూస్తున్నాం. కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రజాదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణం.
మిత్రులారా! కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో కూడా గొప్ప ‘గంగా సాగర్’ ఉత్సవం జరిగింది. సంక్రాంతి శుభ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో స్నానమాచరించారు. 'కుంభ', 'పుష్కరం' 'గంగా సాగర్ మేళా' - ఈ మన పండుగలు మన సామాజిక పరస్పర చర్య, సామరస్యం , ఐక్యతను పెంపొందిస్తాయి. ఈ పండుగలు భారతదేశ ప్రజలను భారతదేశ సంప్రదాయాలతో అనుసంధానిస్తాయి. మన గ్రంథాలు ప్రపంచంలోని నాలుగు అంశాలు - ధర్మం, అర్థ, కామ, మోక్షాలను నొక్కి చెప్పుతాయి. అదేవిధంగా మన పండుగలు , సంప్రదాయాలు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక- ఇలా ప్రతి అంశాన్ని కూడా బలోపేతం చేస్తాయి.
మిత్రులారా! ఈ నెల మనం ' పుష్య శుక్ల ద్వాదశి' రోజున రామ్‌లాలా ప్రాణ ప్రతిష్ఠ పండుగ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సంవత్సరం ' పుష్య శుక్ల ద్వాదశి' జనవరి 11న వచ్చింది. ఈ రోజున లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యలో రామ్ లల్లా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి భారతదేశ సాంస్కృతిక చైతన్య పునఃస్థాపనకు ద్వాదశి. కాబట్టి ఈ పుష్య శుక్ల ద్వాదశి రోజు ఒక విధంగా ప్రతిష్ఠ ద్వాదశి రోజుగా కూడా మారింది. అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పుడు, మనం మన వారసత్వాన్ని కాపాడుకుంటూ దాని నుండి ప్రేరణ పొంది ముందుకు సాగాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! 2025 సంవత్సరం ప్రారంభంలోనే భారతదేశం అంతరిక్ష రంగంలో అనేక చరిత్రాత్మక విజయాలు సాధించింది. ఆ రోజు బెంగళూరుకు చెందిన భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి - 'ఫైర్‌ఫ్లై'ని విజయవంతంగా ప్రయోగించిందని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. ఈ ఉపగ్రహ కూటమి ప్రపంచంలోనే అత్యంత అధిక రిజల్యూషన్ ఉన్న హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహ కూటమి.
ఈ విజయం భారతదేశాన్ని ఆధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా మార్చడమే కాకుండా స్వావలంబన భారతదేశం వైపు ఒక పెద్ద అడుగు కూడా. ఈ విజయం మన ప్రైవేట్ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న బలం , ఆవిష్కరణలకు చిహ్నం. ఈ ఘనత సాధించినందుకు పిక్సెల్, ఇస్రో , ఇన్-స్పేస్ బృందాన్ని యావద్దేశం తరపున నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! కొన్ని రోజుల క్రితం మన శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. మన శాస్త్రవేత్తలు ఉపగ్రహాల అంతరిక్ష డాకింగ్ చేశారు. రెండు అంతరిక్ష నౌకలు అంతరిక్షంలో అనుసంధామైనప్పుడు జరిపే ప్రక్రియను డాకింగ్ అంటారు. అంతరిక్ష కేంద్రాలకు, అంతరిక్షంలోని సిబ్బంది మిషన్లకు సామాగ్రిని పంపడానికి ఈ సాంకేతికత ముఖ్యమైనది. ఈ విజయాన్ని సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది.
మిత్రులారా! మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కూడా మొక్కలను పెంచి వాటిని సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఇస్రో శాస్త్రవేత్తలు డిసెంబర్ 30న పంపిన విత్తనాలు అంతరిక్షంలోనే మొలకెత్తాయి. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయోగం, ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో కూరగాయలను పెంచడానికి మార్గం ఏర్పరుస్తుంది. ఇది మన శాస్త్రవేత్తలు ఎంత ముందుచూపుతో ఆలోచిస్తున్నారో చూపిస్తుంది.
మిత్రులారా! నేను మీకు మరొక స్ఫూర్తిదాయకమైన చొరవ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఐఐటీ మద్రాస్‌లోని ఎక్స్‌టెమ్ సెంటర్ అంతరిక్షంలో తయారీ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తోంది. ఈ కేంద్రం 3D-ప్రింటెడ్ భవనాలు, మెటల్ ఫోమ్‌లు , అంతరిక్షంలో ఆప్టికల్ ఫైబర్స్ వంటి సాంకేతికతలపై పరిశోధన జరుపుతోంది. ఈ కేంద్రం నీరు లేకుండా కాంక్రీటు తయారు చేయడం వంటి విప్లవాత్మక పద్ధతులను కూడా అభివృద్ధి చేస్తోంది. ExTeM చేస్తోన్న ఈ పరిశోధన భారతదేశ గగన్‌యాన్ మిషన్, భవిష్యత్ అంతరిక్ష కేంద్రాన్ని బలోపేతం చేస్తుంది. ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త మార్గాలను కూడా తెరుస్తుంది.
మిత్రులారా! ఈ విజయాలన్నీ భారతదేశ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు భవిష్యత్ సవాళ్లకు పరిష్కారాలను అందించడంలో ఎంత దార్శనికత కలిగినవారో రుజువు చేస్తున్నాయి. నేడు మన దేశం అంతరిక్ష సాంకేతికతలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, యువ పారిశ్రామికవేత్తలకు యావద్దేశం తరపున నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! మీరు చాలాసార్లు మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న అద్భుతమైన స్నేహానికి సంబంధించిన చిత్రాలను చూసి ఉంటారు. జంతువుల విశ్వసనీయతకు సంబంధించిన కథలను మీరు విని ఉంటారు. పెంపుడు జంతువులైనా, అడవి జంతువులైనా, మనుషులతో వాటి సంబంధం కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. జంతువులు మాట్లాడలేకపోయినా మనుషులు వాటి భావోద్వేగాలను, హావభావాలను బాగా అర్థం చేసుకోగలరు. జంతువులు కూడా ప్రేమ భాషను అర్థం చేసుకుని, అనుసరిస్తాయి. అస్సాం నుండి ఒక ఉదాహరణను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అస్సాంలో 'నౌగావ్' అనే ప్రదేశం ఉంది. ‘నౌగావ్’ మన దేశపు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శంకర్‌దేవ్ గారి జన్మస్థలం కూడా. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఏనుగులకు చెందిన భారీ నివాస ప్రదేశం కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేసే అనేక సంఘటనలు జరుగుతూ ఉండేవి. రైతులు ఇబ్బంది పడేవారు. దీని కారణంగా చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 గ్రామాల ప్రజలు చాలా కలత చెందారు. కానీ గ్రామస్తులు కూడా ఏనుగుల నిస్సహాయతను అర్థం చేసుకున్నారు. ఏనుగులు తమ ఆకలి తీర్చుకోవడానికి పొలాల వైపు వెళ్తున్నాయని వారికి తెలుసు. కాబట్టి గ్రామస్తులు దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని ఆలోచించారు. వారి ఆలోచనలతో 'హాతి బంధు' అనే గ్రామస్తుల బృందం ఏర్పడింది. గ్రామస్తులు తమ తెలివితేటలను ఉపయోగించి, దాదాపు 800 ఎకరాల బంజరు భూమిలో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేశారు. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి నేపియర్ గడ్డిని నాటారు. ఏనుగులకు ఈ గడ్డి అంటే చాలా ఇష్టం. దీని ప్రభావంతో ఏనుగులు పొలాల వైపు వెళ్లడం తగ్గించాయి. ఇది వేలాది మంది గ్రామస్తులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఏనుగులకు కూడా వారి ప్రయత్నాలు చాలా నచ్చాయి.
మిత్రులారా! మన సంస్కృతి, వారసత్వం మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులతో ప్రేమతో జీవించడాన్ని నేర్పుతాయి. గత రెండు నెలల్లో మన దేశంలో రెండు కొత్త పులుల అభయారణ్యాలు ఏర్పాటు కావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. వీటిలో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని గురు ఘాసిదాస్-తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. మరొకటి మధ్యప్రదేశ్‌లోని రాతాపాణి టైగర్ రిజర్వ్.
నా ప్రియమైన దేశప్రజలారా! తన ఆలోచన పట్ల మక్కువ ఉన్న వ్యక్తి మాత్రమే తన లక్ష్యాన్ని సాధించగలడని స్వామి వివేకానంద అన్నారు. ఏదైనా ఆలోచన విజయవంతం కావాలంటే మన అభిరుచి, అంకితభావం అత్యంత ముఖ్యమైనవి. పూర్తి అంకితభావం, ఉత్సాహంతో మాత్రమే ఆవిష్కరణ, సృజనాత్మకత, విజయాలకు మార్గం లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం స్వామి వివేకానంద జయంతి నాడు 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. దేశంలోని ప్రతి మూల నుండి వచ్చిన యువ స్నేహితులతో రోజంతా అక్కడ గడిపాను. స్టార్టప్‌లు, సంస్కృతి, మహిళలు, యువత, మౌలిక సదుపాయాలు వంటి వివిధ రంగాలపై యువతరం తమ ఆలోచనలను పంచుకుంది. ఈ కార్యక్రమం నాకు చాలా గుర్తుండిపోయింది.
మిత్రులారా! కొన్ని రోజుల క్రితం స్టార్టప్ ఇండియా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత 9 సంవత్సరాలలో మన దేశంలో రూపొందిన స్టార్టప్‌లలో సగానికి పైగా టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వచ్చాయి. ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం ఆనందంగా ఉంటుంది. అంటే మన స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. చిన్న పట్టణాల్లోని సగానికి పైగా స్టార్టప్‌లకు అమ్మాయిలు నాయకత్వం వహిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంబాలా, హిసార్, కాంగ్రా, చెంగల్పట్టు, బిలాస్‌పూర్, గ్వాలియర్, వాషిమ్ వంటి నగరాలు స్టార్టప్‌లకు కేంద్రాలుగా మారుతున్నాయని విన్నప్పుడు మన మనసు ఆనందంతో నిండిపోతుంది. నాగాలాండ్ వంటి రాష్ట్రంలో గత ఏడాది స్టార్టప్‌ల నమోదు 200% కంటే ఎక్కువ పెరిగింది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్నాలజీ, లాజిస్టిక్స్ రంగాలలో స్టార్టప్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి సాంప్రదాయిక రంగాలు కావు. కానీ మన యువ స్నేహితులు కూడా సంప్రదాయానికి మించి ఆలోచిస్తారు. అందువల్ల వారు విజయం సాధిస్తున్నారు.
మిత్రులారా! పదేళ్ల కిందట ఎవరైనా స్టార్టప్ రంగంలోకి వెళ్లడం గురించి మాట్లాడినప్పుడు అనేక రకాల మాటలు వినవలసి వచ్చేది. ఎవరో ఒకరు అసలు స్టార్టప్ అంటే ఏమిటని అడిగేవారు. దీనితో ఏమీ ప్రయోజనం లేదని మరొకరు అనేవారు. కానీ ఇప్పుడు చూడండి. ఒక దశాబ్దంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో! భారతదేశం సృష్టిస్తున్న కొత్త అవకాశాలను మీరు కూడా పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీకు మీ మీద నమ్మకం ఉంటే మీ కలలు కూడా కొత్త ఊపును పొందుతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! మంచి ఉద్దేశ్యాలతో, నిస్వార్థ భావనతో చేసే పనుల చర్చ సుదూర తీరాలను చేరుతుంది. మన ‘మన్ కీ బాత్’ దీనికి చాలా పెద్ద వేదిక. మన దేశంలాంటి విశాలమైన దేశంలో, మారుమూల ప్రాంతాలలో కూడా మంచి పనులు, కర్తవ్య భావానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే పనులు జరుగుతుంటే వారి ప్రయత్నాలను ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. అరుణాచల్ ప్రదేశ్ లో దీపక్ నాబామ్ గారు సేవకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణను మన ముందుంచారు. దీపక్ గారు అక్కడ ఒక లివింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. అక్కడ మానసిక రోగులు, శారీరక దివ్యాంగులు, వృద్ధులకు సేవలు అందిస్తారు. మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులను కూడా ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటారు. దీపక్ నాబామ్ గారు ఎటువంటి సహాయం ఆశించకుండా ఈ సేవలందిస్తున్నారు. సమాజంలో అణగారిన ప్రజలకు, హింసకు గురైన కుటుంబాలకు, నిరాశ్రయులైన వారికి సహకారం అందించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. నేడు ఆయన సేవ ఒక సంస్థ రూపాన్ని సంతరించుకుంది. ఆయన సంస్థకు అనేక పురస్కారాలు కూడా లభించాయి. లక్షద్వీప్‌లోని కవరత్తి ద్వీపంలో నర్సుగా పనిచేస్తున్న కె. హిండుంబీ గారి కృషి కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఆమె 18 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగం నుండి విరమణ పొందారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ నేటికీ ఆమె మునుపటిలాగే అదే కరుణ, ఆప్యాయతలతో ప్రజలకు సేవ చేస్తోంది. లక్షద్వీప్ కి చెందిన కె.జి. మొహమ్మద్ గారి ప్రయత్నాలు కూడా అద్భుతమైనవి. వారి కృషి కారణంగా మినికాయ్ ద్వీపం సముద్ర పర్యావరణ వ్యవస్థ బలపడుతోంది. పర్యావరణం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన అనేక పాటలు రాశారు. ఆయన లక్షద్వీప్ సాహిత్య కళా అకాడమీ నుండి ఉత్తమ జానపద గీతానికి పురస్కారాన్ని కూడా స్వీకరించారు. ఉద్యోగ విరమణ తర్వాత, కె.జి. మొహమ్మద్ గారు అక్కడి మ్యూజియంలో పనిచేస్తున్నారు.
మిత్రులారా! అండమాన్ - నికోబార్ దీవుల నుండి మరొక శుభవార్త ఉంది. నికోబార్ జిల్లాలోని వర్జిన్ కొబ్బరి నూనె ఇటీవలే GI ట్యాగ్‌ను పొందింది. వర్జిన్ కొబ్బరి నూనెకు GI ట్యాగ్ తర్వాత మరొక కొత్త చొరవ తీసుకున్నారు. ఈ నూనె ఉత్పత్తిలో పాల్గొన్న మహిళలను సంఘటితం చేసి, స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి మార్కెటింగ్, బ్రాండింగ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. మన ఆదివాసీ వర్గాలను ఆర్థికంగా సాధికారపరిచే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు. నికోబార్ వర్జిన్ కొబ్బరి నూనె భవిష్యత్తులో ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇందులో అతిపెద్ద భాగస్వామ్యం అండమాన్, నికోబార్ మహిళా స్వయం సహాయక బృందాలదే.
నా ప్రియమైన దేశప్రజలారా! ఒక్క క్షణం ఒక దృశ్యాన్ని ఊహించుకోండి- కోల్‌కతాలో అప్పుడు జనవరి సమయం. రెండవ ప్రపంచ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. భారతదేశంలో బ్రిటిష్ వారిపై కోపం హెచ్చుస్థాయికి చేరుకుంది. ఈ కారణంగా నగరంలోని ప్రతి మూలమూలలో పోలీసులను మోహరించారు. కోల్‌కతా నడిబొడ్డున ఉన్న ఒక ఇంటి చుట్టూ పోలీసుల బందోబస్తు మరింత అప్రమత్తంగా ఉంది. ఇంతలో... రాత్రి చీకటిలో ఒక బంగ్లా నుండి ఒక వ్యక్తి పొడవాటి గోధుమ రంగు కోటు, ప్యాంటు , నల్ల టోపీ ధరించి కారులో బయటకు వస్తాడు. అధిక భద్రత ఉన్న వివిధ చెక్‌పోస్టులను దాటిన తర్వాత అతను గోమో అనే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాడు. ఈ స్టేషన్ ఇప్పుడు జార్ఖండ్‌లో ఉంది. ఇక్కడి నుండి అతను రైలులో ముందుకు కదులుతాడు. తరువాత ఆఫ్ఘనిస్తాన్ ద్వారా యూరప్ చేరుకుంటాడు. ఇదంతా బ్రిటిష్ పాలనలో అభేద్యమైన కోటలు ఉన్నప్పటికీ జరిగింది.
మిత్రులారా! ఈ కథ మీకు సినిమా సన్నివేశంలా అనిపించవచ్చు. అంత ధైర్యం చూపించే ఆ వ్యక్తి ఏ నేలకు చెందినవాడో అని మీరు ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ వ్యక్తి మరెవరో కాదు- మన దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మనం ఆయన జయంతి అయిన జనవరి 23వ తేదీని 'పరాక్రమ్ దివస్'గా జరుపుకుంటున్నాం. ఆయన ధైర్యసాహసాలకు సంబంధించిన ఈ గాథ ఆయన పరాక్రమాన్ని కూడా చూపిస్తుంది. బ్రిటిష్ వారి నుండి ఆయన తప్పించుకున్న అదే ఇంటికి కొన్ని సంవత్సరాల కిందట నేను వెళ్ళాను. ఆ కారు ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ అనుభవం నాకు చాలా ప్రత్యేకమైంది. సుభాష్ బాబు ఒక దార్శనికుడు. ఆయన స్వభావంలోనే ధైర్యం దాగి ఉంది. ఇది మాత్రమే కాదు- ఆయన చాలా సమర్థవంతమైన కార్యనిర్వహణాదక్షుడు కూడా. కేవలం 27 సంవత్సరాల వయస్సులో ఆయన కోల్‌కతా కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయ్యారు. ఆ తరువాత మేయర్ బాధ్యతలను కూడా స్వీకరించారు. పరిపాలకుడిగా అనేక గొప్ప పనులు చేశారు. పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు పాలు అందించారు. స్వచ్చతకు సంబంధించి ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తుండిపోతుంది.
నేతాజీ సుభాష్ కు రేడియోతో కూడా గాఢమైన సంబంధం ఉంది. ఆయన 'ఆజాద్ హింద్ రేడియో'ని స్థాపించారు. అందులో ఆయన మాట వినడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆయన ప్రసంగాలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి కొత్త బలాన్నిచ్చాయి. ‘ఆజాద్ హింద్ రేడియో’లో ఇంగ్లీషు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, పష్తో, ఉర్దూ భాషలలో వార్తా బులెటిన్‌ల ప్రసారం జరిగేది. నేతాజీ సుభాష్ చంద్రబోసు కు నా వందనం. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆయన గురించి వీలైనంత ఎక్కువగా చదవాలని, ఆయన జీవితం నుండి ప్రేరణ పొందడం కొనసాగించాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా! ఈ 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రతిసారీ నన్ను దేశ సామూహిక ప్రయత్నాలతో, మీ అందరి సామూహిక సంకల్ప శక్తితో అనుసంధానిస్తుంది. ప్రతి నెలా నాకు మీ సూచనలు, ఆలోచనలు పెద్ద సంఖ్యలో అందుతాయి. ఈ ఆలోచనలను చూసిన ప్రతిసారీ వికసిత భారత సంకల్పంపై నా విశ్వాసం మరింత పెరుగుతుంది. మీరందరూ మీ ప్రయత్నాల ద్వారా భారతదేశాన్ని సర్వశ్రేష్ఠంగా మార్చడానికి ఇలాగే కృషి చేస్తూనే ఉండాలి. ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ లో ఇంతే. భారతీయుల విజయాలు, తీర్మానాలు, సఫలతల గురించి కొత్త విషయాలతో వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
*****
(Release ID: 2094263)
Visitor Counter : 21
Read this release in:
Odia
,
Urdu
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam