రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహాకుంభ్‌లో మూడో రోజున 137 కుంభ్ స్పెషల్ రైళ్లను నడిపిన భారతీయ రైల్వేలు.. భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవడంలో సాయపడడానికే


ప్రయాగ్‌రాజ్‌కు శాటిలైట్ స్టేషన్‌గా సుబేదార్‌గంజ్ స్టేషన్..
ప్రయాణికులకు అదనపు సౌకర్యాలతో ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలో 7 అదనపు స్టేషన్లు

కొత్తగా 17 ‘యాత్రీ ఆశ్రయ్’లను అందిస్తున్న రైల్వేలు.. వీటితో 1,10,00కు పైగా సామర్థ్యం అందుబాటులోకి.. మేలైన మార్గనిర్దేశకత్వం కోసం కలర్-కోడింగ్

మహాకుంభ్ 2025ను దృష్టిలో పెట్టుకొని భద్రతను పెంచిన రైల్వేలు..
రంగంలోకి 5900 మంది భద్రత సిబ్బంది,
కొత్తగా 764 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ ఆధారిత నిఘా వ్యవస్థ

Posted On: 15 JAN 2025 7:40PM by PIB Hyderabad

మహాకుంభ్‌కు వెళ్లే భక్తులు ఎలాంటి అసౌకర్యాన్నీ ఎదుర్కోకుండా చూడాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా భక్తజనం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవడంలో సాయపడడానికి 349 రెగ్యులర్ రైళ్లకు తోడు 137 అదనపు రైళ్లను నడపడానికి చొరవ తీసుకొంది. ప్రయాగ్‌రాజ్‌ స్టేషన్లలో మొదటి రెండు రోజుల్లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 15లక్షల 60వేల కన్నా ఎక్కువగా ఉంది. ఈ రైళ్లలో దూర ప్రాంతాల నుంచి ప్రజలను కుంభ్‌లో పాల్గొనడానికి తీసుకువస్తున్న రైళ్లే కాకుండా భక్తగణానికి ఫలానా చోటు నుంచి ఫలానా చోటుకు సంధానాన్ని సమకూర్చడానికి నడుపుతున్న రింగ్ రైల్ సర్వీసులు కూడా కలిసున్నాయి. దాంతో వారు చిత్రకూట్, అయోధ్య, వారణాసి వంటి సమీప దేవాలయ ప్రధాన పట్టణాలకు కూడా వెళ్లడానికి వీలు ఏర్పడుతుందన్నమాట.

మహాకుంభ్ 46 రోజుల పాటు కొనసాగే కాలంలో భక్తసందోహం సౌకర్యార్థం 13,100 రైళ్లకు పైగా నడపాలని భారతీయ రైల్వేలు భావిస్తోంది. వాటిలో 10,000కు పైగా రైళ్లు రెగ్యులర్ రైళ్లే. 3,100కు పైగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. ఇదివరకటి కుంభ్‌తో పోలిస్తే ప్రత్యేక రైళ్ల సంఖ్య నాలుగున్నర రెట్లుంది. వీటిలో, 1800 రైళ్లు స్వల్ప దూరాలవీ, 700 రైళ్లు దూరప్రాంతాలకు ప్రయాణించేవీనూ. భారతీయ రైల్వేలు రింగ్ రైల్ మాధ్యమం ద్వారా ప్రయాగ్‌రాజ్‌ను కలుపుతూ నాలుగు వేరు వేరు మార్గాల్లో 560 రైళ్లను కూడా నడుపుతోంది. ఆ మార్గాల్లో ప్రయాగ్‌రాజ్- అయోధ్య- వారణాసి- ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్-సంగమ్ ప్రయాగ్‌-జౌన్‌పూర్-ప్రయాగ్- ప్రయాగ్‌రాజ్, గోవింద్‌పురి- ప్రయాగ్‌రాజ్-చిత్రకూట్-గోవింద్‌పురితోపాటు గోవింద్‌పురి-ప్రయాగ్‌రాజ్-మాణిక్‌పుర్-చిత్రకూట్-ఝాన్సీ ఉన్నాయి.

మహాకుంభ్ రెండో రోజున, 3.5 కోట్ల మందికి పైగా భక్తులు మహాకుంభ్‌ మేలాకు పోటెత్తారు. వారిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. రద్దీ స్థితిని చక్కదిద్దడానికి, విభిన్న రైల్వే డివిజన్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహాకుంభ్‌కు మరిన్ని జతల ప్రత్యేక స్టేషన్లను నడుపుతున్నాయి. రాబోయే రోజుల్లో, 15 జతలకు పైగా రైళ్లను భోపాల్ డివిజన్‌లో వివిధ స్టేషన్ల నుంచి మహా కుంభ్‌కు నడపనున్నారు.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైల్వే శాఖ మహాకుంభ్ కు చుట్టుపక్కల 9 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరిచింది. ప్రయాగ్‌రాజ్ నుంచి మరిన్ని రైళ్లు నడిచేందుకు వీలుగా ప్రయాగ్‌రాజ్, ఫఫమావు, రాంబాగ్, ఝున్సీ యార్డ్ స్టేషన్ల రూపురేఖల్లో మార్పుచేర్పులు చేశారు. 2019లో కుంభ్ జరిగిన సందర్భంగా మేలాకు తరలివచ్చిన జనసందోహంలో 45 శాతం సమూహాలను ఒక్క ప్రయాగ్‌రాజ్ జంక్షనే  నిర్వహించింది. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ జంక్షనుకు సహాయంగా సుబేదార్‌గంజ్ స్టేషనును అభివృద్ధి చేశారు. ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని స్టేషన్లలో 7 ప్లాట్‌ఫారాలను నిర్మించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో 9 స్టేషన్లలో 48 ప్లాట్‌ఫారాలు సేవలందించడానికి అందుబాటులో ఉన్నాయి.

వేచి ఉండే ప్రయాణికుల కోసం రైల్వేలు సరిపడ ఏర్పాట్లను చేశాయి. 17 కొత్త శాశ్వత యాత్రీ ఆశ్రయ్‌లు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లలో యాత్రి ఆశ్రయాల సంఖ్య 28కి చేరుకొంది. ఫలితంగా, యాత్రి ఆశ్రయాల్లో బస సామర్థ్యం 21,000 నుంచి 1 లక్ష 10 వేలకు మించింది. మహాకుంభ్‌ కాలంలో భక్తకోటి ఉవ్వెత్తున ఎగసిపడతారని భావిస్తూ, అందుకు తగినట్లు సన్నాహక చర్యలను చేపట్టడంలో  భాగంగా రైల్వే శాఖ వివిధ స్టేషన్లలో యాత్రి ఆశ్రయాలకు వ్యవస్థీకృత కలర్-కోడింగ్ ప్రక్రియను తీసుకువచ్చింది. ప్రయాణికులకు సులభతర మార్గనిర్దేశం, ప్రత్యేకించిన వెయిటింగ్ ఏరియాలకు వారు ఇట్టే చేరుకోవడానికి ఉద్దేశించి చేపట్టిన చర్యే ఇది.

రైల్వే స్టేషన్లలో అదనంగా స్నానాల గదులను నిర్మించారు. ప్రతి ఒక్క స్టేషన్లోనూ చాలినంతగా తాగునీటి సరఫరా ఏర్పాట్లనూ, అలాగే ఆహార సరఫరా ఏర్పాట్లనూ సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండడానికి గదులకూ, విశ్రాంతి వసతులకూ మెరుగులు దిద్దుతున్నారు. వాటిలో సౌకర్యాలను ఉన్నతీకరిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో, ప్రయాగ్‌రాజ్ ఛివ్‌కీలో మొట్టమొదటిసారి యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని (యాత్రి సువిధ కేంద్ర) ప్రారంభించారు. దీనిలో ప్రయాణికులకు చక్రాల కుర్చీలు, సామానును చేరవేసుకొనేందుకు ఉపయోగించే చిన్న బళ్ళు, హోటల్, ట్యాక్సీ బుకింగ్ సేవలు, మందుల సరఫరా, శిశువులు తాగడానికి పాలు, రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు వినియోగించే ఇతర వస్తువులు లభిస్తాయి.

భక్తుల, రైళ్ల రాకపోకలకు సురక్ష సేవలను అందించడానికి ఇప్పటివరకు 3,200 మంది రైల్వే పోలీస్ దళం (ఆర్‌పీఎఫ్) సహా సుమారు 5,900 భద్రత సిబ్బందిని ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 9 రైల్వే స్టేషన్లలో నియమించారు. ఈ ప్రాంతాలు ఎన్‌సీఆర్, ఎన్ఈఆర్, ఎన్ఆర్ జోన్లకు చెందినవి. 764 క్లోజ్‌డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరాలను ఇటీవలే అమర్చారు. దీంతో ఈ సీసీటీవీ కెమెరాల సంఖ్య 1186కు చేరింది. దీనిలో 116 ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్..ఎఫ్ఆర్ఎస్) కెమెరాలు కూడా కలిసున్నాయి. ఈ రకం కెమెరాలను దుండగులను గుర్తించడం కోసం మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ఇదే మాదిరిగా, మొట్టమొదటిసారిగా రైలుపట్టాలపై నిఘా ఉంచడానికీ, స్టేషన్లకు దారితీసే రహదారులపై గుంపులను పర్యవేక్షించడానికీ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

 


 

***


(Release ID: 2093588) Visitor Counter : 33