ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ను ప్రారంభించనున్న ప్రధాని
మొత్తం రవాణా రంగ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకి తేవడం ఈ ప్రదర్శన లక్ష్యం
9 ప్రదర్శనలు, 20కి పైగా సదస్సుల నిర్వహణ.. వివిధ స్టాళ్ల ఏర్పాటు: రవాణా రంగంలో విధానాలు, చర్యలను వివరించేలా రాష్ట్రాల సదస్సులు
Posted On:
16 JAN 2025 4:35PM by PIB Hyderabad
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025ను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రారంభిస్తారు. ఈ రంగానికి సంబంధించి దేశంలో ఇదే అతిపెద్ద ప్రదర్శన.
శుక్రవారం నుంచి ఈనెల 22 వరకు మూడు ప్రత్యేక వేదికల్లో ఈ ప్రదర్శన జరుగుతుంది. భారత్ మండపంతోపాటు ఢిల్లీలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్-మార్ట్ వీటికి వేదికలవుతున్నాయి. ఇందులో 9 ఏకకాల ప్రదర్శనలు, 20కి పైగా సదస్సులు జరుగుతాయి. పలు స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు సంబంధిత రంగంలో ప్రాంతీయ స్థాయుల్లోనూ సహకారం దిశగా రవాణా రంగంలో తమ విధానాలు, కార్యక్రమాల వివరాలను ప్రదర్శించడం కోసం రాష్ట్రాలు నిర్వహించే సదస్సులు కూడా ఇందులో ఉంటాయి.
మొత్తం రవాణా రంగ వ్యవస్థలను ఒకే గొడుగు కిందికి తేవడం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రదర్శకులు, సందర్శకులు భాగస్వాములవుతున్న ఈ ఏడాది ప్రదర్శన అంతర్జాతీయ ప్రాధాన్యంపై ప్రత్యేకంగా దృష్టి నిలుపుతుంది. ఇది సంబంధిత రంగం నేతృత్వంలో, ప్రభుత్వ సహకారంతో నిర్వహించే కార్యక్రమం. ఈ రంగంలోని ముఖ్య విభాగాలు, భాగస్వామ్య సంస్థల సంయుక్త సహకారంతో భారత ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి దీనిని సమన్వయం చేస్తుంది.
***
(Release ID: 2093587)
Visitor Counter : 8
Read this release in:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Malayalam