రక్షణ మంత్రిత్వ శాఖ
60 రోజుల కార్యక్రమం: మానసిక ఆరోగ్యంపై భారత నావికా దళం వర్క్‌షాప్
Posted On:
08 JAN 2025 11:58AM by PIB Hyderabad
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆధ్యాత్మిక గురువు సోదరి బీకే శివాని ఆధ్వర్యంలో భారత నావికా దళానికి ‘స్వీయ-పరివర్తన, అంతర్గత చైతన్యం’ అనే అంశంపై కార్యశాల (వర్క్‌షాప్) ను నిర్వహించారు. ఈ నెల ఏడో తేదీన డీఆర్‌డీవో భవన్లోని డా. డీఎస్ కొఠారి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మీ అధికారుల్లో మానసిక, భావోద్వేగ స్థైర్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యశాలను ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ ఆఫ్ మెటీరియల్ వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్‌ముఖ్ హాజరయ్యారు.
స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌లో సోదరి బీకే శివాని రెండు గంటల పాటు శిక్షణ ఇచ్చారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని, భావోద్వేగ సమతౌల్యం గురించి వివరించారు. ముఖ్యంగా నౌకాదళంలో అధిక ఒత్తిడితో నిండిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు అనుసరించాల్సిన ఆచరణాత్మక విధానాలను వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.
మెదడు పనితీరు, మానసిక ప్రశాంతత ప్రాముఖ్యత గురించి కార్యక్రమానికి హాజరైన నావికా సిబ్బందిని ఆకట్టుకొనేలా సోదరి బీకే శివాని వివరించారు. మానసిక ఒత్తిడికి మూల కారణాలను అర్థం చేసుకోవడంతో పాటు స్వీయ అవగాహన, ధ్యానం, సానుకూల ఆలోచనాధోరణి ద్వారా దాన్ని అధిగమించేందుకు అవసరమైన మార్గాలను చర్చించారు. మన ఆలోచనల ద్వారానే మానసిక ఆరోగ్యం మొదలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రశాంతమైన, సానుకూల, సాధికారత కల్పించే ఆలోచనలను ఎంచుకోవడం ద్వారా మన అనుభవాలు మారతాయి, సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని రూపొందించుకోవచ్చు.
చీఫ్ ఆఫ్ మెటీరియల్ ముగింపు ఉపన్యాసమిస్తూ వృత్తి, వ్యక్తిగత జీవితాలు సంతృప్తికరంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. శాంతియుతమైన, సమష్టి పని వాతావరణానికి నౌకాదళ అధికారులకు మానసిక ప్రశాంతతే ప్రాథమికమని ఆయన అన్నారు. మానసిక ఆరోగ్య సంరక్షణకు అంకితమైన సోదరి బీకే శివానిని చీఫ్ ఆఫ్ మెటీరియల్ ప్రశంసించారు. ఇక్కడ నేర్చుకున్న వాటిని వారి దైనందిన జీవితాల్లో అమలుచేయాలని కార్యశాలకు హాజరైనవారికి సూచించారు.
నావికా దళ అధికారులు, వారి కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి, వారి మధ్య సుహృద్భావానికి ప్రాధాన్యమిస్తూ 60 రోజుల కార్యక్రమంలో భాగంగా భారత నౌకాదళం ఈ వర్క్ షాపును చేపట్టింది. జీవితంలో మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది తెలియజేసింది. అలాగే సానుకూల ఆలోచనలతో ముందుకు సాగేలా ప్రేరణ ఇచ్చింది. ఈ కార్యశాలకు నౌకాదళ అధికారులు, నావికులు, రక్షణ రంగంలో ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు.
సిబ్బంది శ్రేయస్సుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్న నౌకా దళం దృఢ సంకల్పానికి... విజయవంతంగా నిర్వహించిన ఈ వర్క్ షాపే ప్రబల నిదర్శనం
సామాన్యులకు సైతం ఈ కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చే ఉద్దేశంతో భారతీయ నౌకాదళం అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
***
(Release ID: 2091654)
Visitor Counter : 5