ప్రధాన మంత్రి కార్యాలయం
గయానా పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
21 NOV 2024 11:35PM by PIB Hyderabad
గౌరవ స్పీకర్ మంజూర్ నదీర్,
గౌరవ ముఖ్యమంత్రి మార్క్ ఆంథోనీ ఫిలిప్స్,
గౌరవ ఉపాధ్యక్షులు భరత్ జగ్దేవ్,
గౌరవ ప్రతిపక్షనాయకుడు,
గౌరవ మంత్రులు,
పార్లమెంట్ సభ్యులు,
గౌరవ న్యాయసభ ఛాన్సలర్,
ఇతర ప్రముఖులు,
సోదర, సోదరీమణులకు,
ఈ చారిత్రక గయానా పార్లమెంట్‌కు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. నిన్న గయానా అత్యున్నత పురస్కారాన్ని నాకు అందించిన మీకు, గయానా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గయానాలోని ప్రతి పౌరుడూ నాకు ‘స్టార్ బాయ్’. ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఈ పురస్కారాన్ని భారతీయులందరికీ అంకితం చేస్తున్నాను.
స్నేహితులారా,
గయానా, భారత్ మధ్య అనుబంధం దృఢమైనది. ఇది మట్టి, శ్రమ, పట్టుదల పంచుకోవడం ద్వారా ఏర్పడిన అనుబంధం. దాదాపుగా 180 ఏళ్ల క్రితం, గయానా నేలపై ఒక భారతీయుడు మొట్టమొదటిసారి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి మంచి, చెడు ఎదురైన సమయాల్లో సైతం సాన్నిహిత్యం, పరస్పర అనురాగంతో ఈ అనుబంధం కొనసాగింది. ఆ సాన్నిహిత్యానికి భారత్ ఆగమన స్మారక చిహ్నం నిదర్శనంగా నిలుస్తుంది. మరికొంత సేపట్లో ఆ స్మారక చిహ్నాన్ని సందర్శించే భాగ్యం నాకు దక్కబోతోంది.
మిత్రులారా,
ఈ రోజు, భారత ప్రధానమంత్రిగా మీతో నేను మాట్లాడుతున్నాను. కానీ 24 ఏళ్ల క్రితం ఈ అందమైన దేశాన్ని అన్వేషకుడిగా సందర్శించే అవకాశం నాకు లభించింది. ఇక్కడ చాలా ప్రదేశాలు వాటి ప్రకృతి రమణీయతకు ఎక్కువ మంది ఆకర్షితులవుతుంటే, నేను మాత్రం గయానా చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకొనేందుకు ఆసక్తి చూపించాను. ఆ సమయంలో నాతో జరిపిన సంభాషణలను ఇప్పటికీ చాలా మంది గుర్తుచేసుకుంటూ ఉంటారు. క్రికెట్‌పై గాఢమైన ఆసక్తి నుంచి మనోహరమైన సంగీతం, పాటల వరకు గొప్ప అనుభూతులను నా వెంట తీసుకెళ్లాను. అది భారత్ అయినా, గయానా అయినా నేను చట్నీని మరచిపోలేను, ఇది నిజంగా విశేషం!
స్నేహితులారా,
స్వదేశ చరిత్రతో దగ్గరి సంబంధాలు కలిగిన మరో దేశాన్ని సందర్శించడం చాలా అరుదు. గత రెండున్నర శతాబ్ధాలుగా బానిసత్వం, పోరాటాలు, స్వాతంత్య్రం కోసం నిరంతర ఉద్యమాలతో భారత్, గయానా దేశాలు ఒకే రకమైన అనుభవాలు పంచుకుంటున్నాయి. రెండు దేశాల్లోనూ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. గాంధీజీ సన్నిహితుడు సీఎఫ్ ఆండ్రూస్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు జంగ్ బహదూర్ సింగ్ తదితర వ్యక్తులు మన ప్రజలను బానిసత్వం నుంచి విముక్తులను చేసేందుకు కలసి పోరాటం చేశారు. ఐక్యంగా మనం స్వాతంత్య్రంను సాధించాం. నేడు భారత్, గయానా రెండూ అంతర్జాతీయ వేదికపై ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున, గయానా పార్లమెంట్ వేదికగా మీ అందరికీ నా శుభకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంపై మీ అచంచలమైన అంకితభావం గయానాను బలోపేతం చేయడంతో పాటు యావత్ ప్రపంచాభివృద్ధికి దోహదపడుతోంది.
మిత్రులారా,
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మనం కృషి చేస్తున్న తరుణంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. భారత్, గయానా స్వాతంత్య్రం సాధించిన సమయంలో ప్రపంచం వివిధ సవాళ్లతో పోరాడుతోంది. ఇప్పుడు, ఈ 21వ శతాబ్దంలో మనం పూర్తిగా కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నాం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పాటైన వ్యవస్థలు, సంస్థలు ఇప్పుడు పతనమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మహమ్మారి అనంతరం, అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడానికి బదులుగా ఇతర సమస్యల్లో ప్రపంచం చిక్కుకుపోయింది. ఇలాంటి సమస్యాత్మక సమయాల్లో, అత్యంత శక్తిమంతమైన మంత్రం ‘‘ప్రజాస్వామ్యమే ముందు - మానవత్వమే ముందు’’. ‘‘ప్రజాస్వామ్యమే ముందు’’ అనే భావన ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తూ, సమ్మిళితతత్వాన్ని, సామూహిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అలాగే ‘‘మానవత్వమే ముందు’’ అనే సూత్రం మనం తీసుకునే నిర్ణయాలను నిర్దేశిస్తుంది. మనం ఎంపిక చేసుకునేవాటికి మానవత్వం పునాది అయినప్పుడు వచ్చే ఫలితాలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి.
స్నేహితులారా,
మన ప్రజాస్వామ్య విలువలు ఉన్నతమైనవి, అభివృద్ధి మార్గంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవి తోడ్పాటు అందిస్తాయి. పౌరుడి మతం, నేపథ్యంతో సంబంధం లేకుండా, అందరి హక్కుల పరిరక్షణకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రజాస్వామ్యం హామీ ఇస్తుంది. మన దేశాలు ప్రజాస్వామ్యాన్ని న్యాయపరమైన నియమావళిగా లేదా వ్యవస్థగా మాత్రమే పరిగణించలేదు. ఆ భావనను మన డీఎన్‌ఏలో, దృష్టిలో, ప్రవర్తనలో నింపేశాయి.
మిత్రులారా,
మనం అనుసరిస్తున్న మానవ కేంద్ర విధానం ప్రతి దేశానికి తనతో పాటు తన పౌరులు సైతం సమ ప్రాధాన్యం కలిగి ఉంటారని తెలియజేస్తుంది. జీ-20 దేశాలకు అధ్యక్షత వహించిన సమయంలో భారత్ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే మంత్రాన్ని సూచించింది. మహమ్మారి సమయంలో మానవాళి గొప్ప సవాలును ఎదుర్కొంటున్నప్పుడు భారత్ ఒకటే భూమి, ఒకటే ఆరోగ్యం అనే విధానాన్ని పాటించింది. వాతావరణపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సమష్టి కృషి అవసరమని చెబుతూ, ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు ఒకే గ్రిడ్ అనే విధానం పాటించడంలో సఫలీకృతమైంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు విపత్తులను తట్టుకొనే మౌలిక సదుపాయాల కల్పన సమితి (సీడీఆర్ఐ)కి భారత్ నాయకత్వం వహించింది. ప్రపంచానికి అనుకూలమైన వ్యక్తుల అసవరం ప్రపంచానికి ఎదురైనప్పుడు, లైఫ్ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించింది, ఇది సుస్థిర జీవనవిధానాన్ని ప్రోత్సహించే అంతర్జాతీయ ఉద్యమంగా మారింది.
స్నేహితులారా,
‘‘ప్రజాస్వామ్యమే ముందు - మానవత్వమే ముందు’’ అనే స్ఫూర్తిని కొనసాగిస్తూ విశ్వబంధు (ప్రపంచానికి స్నేహితుడు)గా భారత్ నిలిచింది. ప్రతి అంతర్జాతీయ సంక్షోభంలోనూ మొదటిగా స్పందించేది భారతే. కరోనా సమయంలోనూ తమ సొంత రక్షణకే దేశాలు ప్రాధాన్యమిచ్చినపుడు భారత్ 150కి పైగా దేశాలకు ఔషధాలు, టీకాలను పంపించింది. ఆ క్లిష్టమైన సమయంలో గయానా ప్రజలకు కూడా సాయం చేయగలిగిందని తెలిసి తృప్తి చెందాను. శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, టర్కీ, సిరియా ఏ దేశమైనా సరే యుద్ధం లేదా విప్తతు సంభవించినప్పుడు నిస్వార్థంగా భారత్ సాయం అందిస్తుంది. భూకంపాల నుంచి మానవత్వ సంక్షోభాల వరకు మొదట స్పందిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ స్వభావం మా సంస్కృతిలో ఇంకిపోయింది. మేము ఎప్పుడూ స్వార్థంతో ఆలోచించలేదు, విస్తరణ కాంక్షతో వ్యవహరించలేదు. మేము ఎల్లప్పుడూ వనరులను గౌరవిస్తూ, దోపీడి విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. అంతరిక్షం, సముద్రాలు ఎప్పటికీ సంఘర్షణలకు వేదికలు కాకూడదని, విశ్వ సహకారానికి చిహ్నాలుగా ఉండాలని నేను బలంగా విశ్వసిస్తాను. ఇది సంఘర్షణల యుగం కాదు, వాటికి గల కారణాలను గుర్తించి, తొలగించాలి. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి సమస్యలను మన భవిష్యత్తుకు ప్రమాదంగా మారనున్నాయి. వీటిని ఎదుర్కోవడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని మనం అందించగలం. ఈ లక్ష్యాన్ని ‘ప్రజాస్వామ్యమే ముందు - మానవత్వమే ముందు’’ అనే విధానానికి తొలి ప్రాధాన్యమిచ్చినప్పుడే సాధించగలుగుతాం.
స్నేహితులారా,
నియమాలు, విశ్వాసం, పారదర్శకత అనే విధానాలతోనే భారత్ మాట్లాడుతుంది. ఏదైనా దేశం, ప్రాంతం వెనకబడి ఉంటే ప్రపంచ లక్ష్యాలు నెరవేరవు. అందుకే ప్రతి దేశమూ ముఖ్యమైనదే అని భారత్ స్పష్టం చేస్తోంది. అందుకే ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించకుండా సుదీర్ఘ తీరప్రాంతమున్న దేశాలుగా భారత్ పరిగణిస్తోంది. ఈ ఉద్దేశంతోనే హిందూ మహా సముద్ర ప్రాంతంలోని ద్వీపదేశాలతో అనుసంధానమయ్యేందుకు సాగర్ వేదికను మేం ప్రారంభించాం. అదనంగా పసిఫిక్ మహాసముద్ర దేశాలతో సంబంధాల కోసం ప్రత్యేక ఫోరంను రూపొందించాం. ఇదే నియమం ఆధారంగా వ్యవహరించి జీ-20 దేశాలకు అధ్యక్షత వహించినప్పుడు ఆఫ్రికా దేశాలను భాగస్వాములను చేసి తన బాధ్యతను భారత్ నెరవేర్చింది.
మిత్రులారా,
ప్రస్తుతం, భారతదేశం ప్రపంచ అభివృద్ధినీ, ప్రపంచ శాంతినీ బలంగా సమర్థిస్తోంది. ఈ భావనతోనే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) వాణిగా మారింది. గత కాలంలో గ్లోబల్ సౌత్ దేశాలు పెద్ద కష్టాలనే భరించాల్సివచ్చిందని భారత్ నమ్ముతోంది. చరిత్రపరంగా చూస్తే, మనం ప్రకృతితో సామరస్యాన్ని కలిగి ఉండడం వల్ల, మన సాంస్కృతిక విలువలు మనకు మార్గాన్ని చూపించినందువల్ల ముందుకు పోగలిగాం. ఏమైనా, చాలా దేశాలు పర్యావరణ క్షీణత అనే మూల్యాన్ని చెల్లించి ముందడుగు వేశాయి. ప్రస్తుతం, గ్లోబల్ సౌత్ దేశాలు వాతావరణ మార్పు ఫలితంగా చాలా పెద్ద బరువును మోయాల్సివస్తోంది. మరి, ఈ అసమానతను సరిదిద్దడం అత్యవసరంగా మారింది.
మిత్రులారా,
అది భారత్ గాని లేదా గయానా గాని, మన ప్రజలకు మెరుగైన జీవనాన్ని ప్రసాదించాలనే కలలతో పాటు అభివృద్ధిని సాధించాలన్న ఆకాంక్షలు కూడా మన రెండు దేశాలకు ఉన్నాయి. వీటిని నెరవేర్చుకోవడానికి గ్లోబల్ సౌత్ దేశాలు ఉమ్మడి స్వరాన్ని వినిపించడం చాలా ప్రధానం. ఇది గ్లోబల్ సౌత్ దేశాలు మేలుకోవాల్సిన సమయం. ఇది మనందరం కలిసికట్టుగా, ఒక నవ ప్రపంచ వ్యవస్థకు రూపురేఖల్ని తీర్చిదిద్దేందుకు మనకు దక్కిన ఒక అవకాశం. ఈ ప్రయత్నాల్లో మీకందరికీ, గౌరవనీయులైన గయానా ప్రజల ప్రతినిధులందరికీ, ఒక ముఖ్య పాత్ర ఉందని నేను అనుకొంటున్నాను.
మిత్రులారా,
ఇక్కడ మహిళా సభ్యులు చాలా మందే నాకు కనిపిస్తున్నారు. ప్రపంచం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, ప్రపంచ వృద్ధిని ముందుకు ముందుకు నడపడంలో ప్రపంచం జనాభాలో సగభాగంగా ఉన్న వర్గానిది.. మహిళలది.. కీలక పాత్ర. శతాబ్దాల తరబడి, ప్రపంచ పురోగతిలో మహిళలు వారి వంతు తోడ్పాటును అందించే అవకాశాన్ని వారికి దక్కనీయలేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇది ఏ ఒక్క దేశ గాథో, లేక గ్లోబల్ సౌత్ దేశాల కథో కాదు. ఇది ప్రపంచమంతటా ఉన్న సరళే. ఏమైనా, 21వ శతాబ్దిలో, మహిళలు ప్రపంచ సమృద్ధి సాధనలో ఒక ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. దీనిని గుర్తించి, భారత్ జి-20 కి తాను అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన కాలంలో మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధనకు తన కార్యక్రమాల పట్టికలో ప్రాధాన్యాన్నిచ్చింది.
మిత్రులారా,
భారతదేశంలో, మేం అన్ని రంగాల్లో, ప్రతి ఒక్క స్థాయిలో నాయకత్వాన్ని మహిళలకు కట్టబెట్టేందుకు ఒక ప్రముఖ ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ, భారత్‌లో మహిళలు ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు. ప్రపంచంలో, 5 శాతం పైలట్లు మాత్రమే మహిళలుగా ఉండగా, ఇలాంటివారు భారత్‌లో 15 శాతం మంది ఉన్నారు. ఇండియాలో పోరాట విమానాలను నడిపే చోదకుల్లోనూ మహిళలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్‌టీఈఎం) పట్టభద్రుల్లో 30 శాతం నుంచి 35 శాతం మంది మహిళలున్నారు. ఏమైనా, భారత్‌లో ఇది 40 శాతాన్ని మించిపోయింది. మహిళా శాస్త్రవేత్తలు ప్రస్తుతం భారత్‌లో ప్రధాన అంతరిక్ష సాహసయాత్రల్లో సారథ్యం వహిస్తున్నారు. భారత్ తన చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ను కల్పించడానికి ఒక చట్టాన్ని ఇటీవల ఆమోదించిందన్న సంగతిని తెలుసుకొంటే మీరు కూడా సంతోషిస్తారు. ప్రస్తుతం భారత్‌లో ప్రజాస్వామిక పరిపాలనకు సంబంధించిన అన్ని స్థాయిల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. స్థానికంగా చూసినప్పుడు, మా పంచాయతీ రాజ్ వ్యవస్థలో, 1.4 మిలియన్ కు పైగా అంటే 14 లక్షల మంది ఎన్నికైన ప్రతినిధులు మహిళలే. మరో మాటలో చెప్పాలంటే, మా స్థానిక ప్రభుత్వాలలో భాగం పంచుకొంటున్న మహిళలు దాదాపుగా గయానాలోని మొత్తం జనాభాకు రెండింతల మంది వరకు ఉన్నారు.
మిత్రులారా,
గయానా సువిశాల లాటిన్ అమెరికా ఖండానికి ప్రవేశద్వారమని చెప్పాలి. భారత్‌కు, ఈ విస్తార ప్రాంతానికి మధ్య అవకాశాలు, సంభావ్యతల వంతెనగా మారగల దక్షత మీలో ఉంది. మనం కలసి భారత్‌కు, సీఏఆర్ఐసీవోఎం (‘కేరీకామ్’-CARICOM)కు మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించగలం. నిన్ననే, ఇండియా-కేరికామ్ సమిట్‌ను గయానాలో ఇక్కడ నిర్వహించారు. దీనిలో మన సహకారాన్ని ప్రతి ఒక్క కోణంలోనూ మరింత బలపర్చుకోవాలని మనం సంకల్పాన్ని చెప్పుకొన్నాం.
మిత్రులారా,
గయానా అభివృద్ధిలో సాధ్యమైన అన్ని రకాలుగానూ సాయపడాలని భారత్ కంకణం కట్టుకొంది. అది మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడి కావచ్చు లేదా సామర్థ్యాలను పెంచడం కావచ్చు.. భారత్, గయానాలు భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయి. ఇండియా అందజేసిన బల్లకట్టులు, విమానాలు గయానాకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. పునరునత్పాదక ఇంధనం రంగంలో, మరీ ముఖ్యంగా సౌర విద్యుత్తు రంగంలో కూడా భారత్ చక్కటి మద్దతును అందిస్తోంది. టి-ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్‌ను మీరు ఫలప్రదంగా నిర్వహించిన తీరు ప్రశంసనీయం. ఈ స్టేడియం నిర్మాణానికి తన వంతు పాత్రను పోషించినందుకు భారత్ గర్వపడుతోంది.
మిత్రులారా,
అభివృద్ధి జత కలసిన మన భాగస్వామ్యం ఇక ఓ కొత్త దశలోకి అడుగు పెడుతోంది. భారత్ ఇంధన అవసరాలు పెచ్చుపెరుగుతున్నందువల్ల, మేం మా ఇంధన వనరుల శ్రేణిని విస్తరించుకొంటున్నాం. మరి మేం ఈ మా కృషిలో గయానాను ఒక ముఖ్య ఇంధన మూలంగా భావిస్తున్నాం. ఇదే కాలంలో, మేం గయానాలో భారతదేశ వ్యాపార సంస్థలు ఇంకా ఎక్కువ పెట్టుబడులను పెట్టేటట్టు ప్రోత్సహించడానికి అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నాం.
మిత్రులారా,
భారత్‌లో యువత జనసంఖ్య చాలా విస్తారంగా ఉండగా, దీనిని మా దేశ యువ పెట్టుబడిగా ప్రస్తావిస్తున్న సంగతి మీకు తెలుసు. భారత్‌లో పటిష్టమైన నాణ్యమైన విద్య బోధన రంగంతోపాటు నైపుణ్యాల అభివృద్ధి రంగం కూడా ఉంది. ఈ వ్యవస్థ ప్రయోజనాలను అందుకోవడానికి గయానా నుంచి వీలయినంత ఎక్కువ మంది విద్యార్థినీవిద్యార్థులు మా దేశానికి వస్తే వారికి మేం సంతోషంగా ఆహ్వానం పలుకుతాం. భారతదేశ నవకల్పనదారుల (ఇన్నొవేటర్స్)తోనూ, శాస్త్రవేత్తలతోనూ చేయీచేయీ కలిపి ముందుకు సాగాల్సిందిగా గయానా పార్లమెంట్ వేదికగా నేను గయానా యువతీయువకులను ఆహ్వానిస్తున్నాను. కలిసికట్టుగా, మనం మన యువజనులు స్థానికంగా చెట్టపట్టాలేసుకొని పనిచేస్తూ ప్రపంచ శ్రేణిలో సహకరించుకోవడానికి ప్రేరణనివ్వగలుగుతాం. సృజనశీల సమన్వయాన్ని నెలకొల్పుకొని, మనం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుక్కోగలుగుతాం.
మిత్రులారా,
మనం మన వర్తమానాన్ని మెరుగుపర్చుకోవడానికీ, రాబోయే కాలానికి ఒక బలమైన పునాదిని వేసుకోవడానికీ గత కాలం నుంచి పాఠాలను మనం తప్పక నేర్చుకోవాలి అని గయానా ముద్దుబిడ్డ శ్రీ చేది జగన్ ఒక సందర్భంలో అన్నారు. మన ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, మనం నేర్చుకొన్న పాఠాలకు మన ప్రస్తుత ప్రయత్నాలు తోడై మనల్ని ఉజ్వల భవిష్యత్తు వైపునకు తీసుకుపోతాయి. ఇందులో అనుమానమేమీ లేదు. ఈ మాటలతో, నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భారత్‌కు రావాల్సిందిగా మీ అందరినీ నేను స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గయానా నుంచి వీలైనంత ఎక్కువ మందికి స్వాగతం పలకడం నాకు సంతోషాన్నిస్తుంది. గయానా పార్లమెంటుకూ, మీకందరికీ నేను మనస్ఫూర్తిగా మరో సారి నా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు.
***
(Release ID: 2089734)
Visitor Counter : 10