ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
‘సుపోషిత్ గ్రామ పంచాయత్ అభియాన్’ ను ప్రారంభించిన పీఎం
వీర బాల దివస్ సందర్భంగా సాహిబ్‌జాదాల సాహసం, త్యాగాలను స్మరించుకుందాం, మాతా గుజ్రీజీ, శ్రీ గురు గోవింద్‌జీకి నివాళి అర్పిద్దాం: పీఎం
సాహిబ్‌జాదా జొరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతే సింగ్ వయసులో చిన్నవారే కానీ వారిది తిరుగులేని ధైర్యం: పీఎం
ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశం, దేశ ప్రయోజనాలను మించినదేదీ లేదు: పీఎం
గురువుల బోధనలపై, సాహిబ్‌జాదాల త్యాగం పై, దేశ ఐక్యతా మంత్రంపైనే మన ప్రజాస్వామ్య గొప్పతనం ఆధారపడి ఉంది: పీఎం
చారిత్రక కాలం నుంచి నేటి వరకు భారత దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించింది: పీఎం
ఇప్పుడు అత్యుత్తమైనది మాత్రమే మనకు ప్రామాణికంగా మారాలి: పీఎం
Posted On:
26 DEC 2024 2:25PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మూడో వీర బాల దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. సాహిబ్‌జాదాల అసమాన సాహసం, త్యాగాలకు గుర్తుగా వీర బాల దివస్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలియజేశారు. కోట్లాది మంది భారతీయులకు జాతీయ స్ఫూర్తిని కలిగించే పండుగగా ఇది మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సవం చిన్నారులు, యువతలో ధైర్యాన్ని నింపుతోందని అన్నారు. సాహసం, ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతికత, క్రీడలు, కళల్లో వీర బాల పురస్కారం అందుకున్న 17 మంది చిన్నారులను ప్రశంసించారు. ఈ దేశపు చిన్నారులు, వివిధ రంగాల్లో రాణించేలా యువతలో నిండిన సామర్థ్యాన్ని ఈ పురస్కారాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గురువులు, వీర సాహిబ్‌జాదాలకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వీర సాహిబ్‌జాదాల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, వారి ధైర్యసాహసాలను గురించి నేటి యువత తెలుసుకోవాలని, ఆ సంఘనటనలు కూడా గుర్తు చేసుకోవాలని శ్రీ మోదీ అన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఇదే రోజున సాహిబ్‌జాదాలు చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశారని వివరించారు. సాహిబ్ జొరావర్ సింగ్, సాహిబ్ ఫతే సింగ్‌ల వయసు చిన్నదే అయినప్పటికీ వారి ధైర్యానికి అవధులు లేవని అన్నారు. మొగలు సుల్తాన్ ఆశ చూపిన అన్ని ప్రలోభాలను తిరస్కరించి, వారి దురాగతాలను భరించి, వజీర్ ఖాన్ ఆదేశాల ప్రకారం మరణ శిక్షను అనుభవించేందుకు సిద్ధపడ్డారని అన్నారు. గురు అర్జన్ దేవ్, గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్‌ల ధైర్యాన్ని సాహిబ్‌జాదాలు గుర్తు చేస్తారని, ఈ సాహసం.. మన ఆధ్యాత్మికత గొప్పతనమని శ్రీమోదీ పేర్కొన్నారు. సాహిబ్‌జాదాలు తమ ప్రాణాలను త్యాగం చేయడానికే సిద్ధపడ్డారు కానీ తాము నమ్మిన మార్గాన్ని వదులుకోలేదని వివరించారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినమైనవి అయినప్పటికీ దేశం, దేశ ప్రయోజనాలకంటే ఏదీ ఎక్కువ కాదని వీర బాల దివస్ సూచిస్తుందని ప్రధాని అన్నారు. ‘‘ఈ దేశం కోసం చేసే ప్రతి పని ధైర్యంతో కూడుకున్నదే, అలాగే మన దేశం కోసం జీవించే ప్రతి చిన్నారి, యువత వీరబాలకులే’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ వీర బాల దివస్ చాలా ప్రత్యేకం ఎందుకంటే 75 ఏళ్ల స్వాంతంత్ర్య, రాజ్యాంగ ఉత్సవాలను మనం జరుపుకొంటున్నాం’’ అని ప్రధానమంత్రి అన్నారు. భారత రాజ్యాంగ రచన పూర్తయి 75 ఏళ్ల ఉత్సవాలను జరుపుకొంటున్న ఈ సమయంలో దేశంలోని ప్రతి పౌరుడూ వీర సాహిబ్‌జాదాల నుంచి స్ఫూర్తి పొంది దేశ ఐక్యత, సమగ్రత కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో చివరి అంచున ఉన్నవారు కూడా అభ్యున్నతి సాధించాలనే స్ఫూర్తిని ప్రజాస్వామ్యం మనకు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశంలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అని రాజ్యాంగం మనకు బోధిస్తుంది’’ అని శ్రీమోదీ వివరించారు.
ఈ సూత్రం అందరి సంక్షేమం కోసం కృషి చేసిన మన గురువుల బోధనలకు అనుగుణంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, ఆశయాల కోసం రాజీ పడకూడదని సాహిబ్‌జాదాల జీవితం మనకు బోధిస్తుందని ప్రధాని తెలియజేశారు. అదేవిధంగా భారత సౌర్వభౌమత్వం, సమగ్రత నియమాన్ని రాజ్యాంగం సమర్థిస్తుందని అన్నారు. గురువుల బోధనలు, సాహిబ్‌జాదాల త్యాగం, దేశ ఐక్యతా మంత్రాన్ని తనలో నింపుకొన్న మన ప్రజాస్వామ్యం గొప్పదని ఆయన పేర్కొన్నారు.
‘‘గడచిన కాలం నుంచి ప్రస్తుత సమయం వరకు భారత్ అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించింది’’ అని శ్రీ మోదీ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాల నుంచి 21వ శతాబ్దంలో చేస్తున్న ఉద్యమాల వరకు భారతీయ యువత తన పాత్ర పోషించిందని ఆయన వివరించారు. ప్రస్తుత ప్రపంచం ఎన్నో ఆశలు, అంచనాలతో భారత్ వైపు చూస్తోందని, దానికి కారణం దేశ యువశక్తేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంకుర సంస్థల నుంచి విజ్ఞాన శాస్త్రం వరకు, క్రీడల నుంచి ఔత్సామిక పారిశ్రామిక రంగం వరకు, యువశక్తి సరికొత్త విప్లవాలకు నాంది పలుకుతోందని ఆయన అన్నారు. అందుకే యువసాధికారతను పెంపొందించే విధానాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించిందని అన్నారు. అంకుర సంస్థల వ్యవస్థ, అంతరిక్ష ఆర్థికరంగం, భవిష్యత్తు, క్రీడలు, శారీరక ధారుడ్య రంగం, ఫిన్టెక్, తయారీ రంగం, నైపణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్ పథకాలు ఏవైనా సరే అన్ని విధానాలు యువత కేంద్రంగా ఉంటూ వారికి లబ్ధి చేకూర్చేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి యువతకు తగిన ప్రోత్సాహం దక్కుతోందని, దేశాభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగంలోనూ వారికి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో కొత్త అవసరాలు, ఆకాంక్షలు, భవిష్యత్తు కోణాలు పుట్టుకొస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. సంప్రదాయ సాఫ్ట్ వేర్ నుంచి ఏఐకి మారడం, మెషీన్ లెర్నింగ్ పెరుగుతున్న నేపథ్యంలో మన యువతను భవిష్యత్తు కోసం సిద్ధం చేయాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తించాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంతో దేశం చాలా కాలం క్రితం నుంచే దానికి తగినట్టుగా సిద్ధమవుతోందని, ఇది విద్యను ఆధునికీకరించి, నేర్చుకునేందుకు హద్దులు లేని అవకాశాలను అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి 10,000 అటల్ టింకరింగ్ ల్యాబులను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ‘మేరా యువ భారత్’ కార్యక్రమం చదువుతో పాటు ప్రయోగాత్మక అవకాశాలను, సమాజం పట్ల బాధ్యతను పెంచుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
శారీరక దృఢత్వ ప్రాధాన్యత గురించి వివరిస్తూ ఆరోగ్యంతో నిండిన యువత సామర్థ్యమున్న దేశాన్ని తయారు చేస్తుందని శ్రీమోదీ అన్నారు. అందుకే యువతలో శారీరక సామర్థ్యంపై అవగాహన పెంచేందుకు ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలను ప్రారంభించామని ఆయన తెలిపారు. గ్రామాల్లో పోషకాహార లోపాన్ని తొలగించి అభివృద్ది చెందిన భారత్‌ను సాధించే దిశగా గ్రామాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు ‘సుపోషిత్ గ్రామ పంచాయత్ అభియాన్’ ప్రారంభించామని వివరించారు.
‘‘వీర బాల దివస్ మనలో స్ఫూర్తి నింపడంతో పాటు కొత్త నిర్ణయాలు తీసుకొనేలా మనల్ని ప్రోత్సహిస్తుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు మనం అనుసరించే ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండాలి. వారు పనిచేస్తున్న రంగాలను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘మనం మౌలిక వసతుల రంగంలో పని చేస్తుంటే మన రోడ్లు, రైళ్ల వ్యవస్థ, విమానయాన సౌకర్యాలు ప్రపంచంలోనే మిన్నగా ఉండాలి. తయారీ రంగంలో మనం పనిచేస్తుంటే సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి. పర్యాటక రంగంలో పని చేస్తుంటే మన పర్యాటక ప్రాంతాలు, ప్రయాణ, ఆతిథ్య సదుపాయాలు గొప్పగా ఉండాలి. అంతరిక్ష రంగంలో పనిచేస్తుంటే మన ఉపగ్రహాలు, నావిగేషన్ సాంకేతికత, ఖగోళ పరిశోధనలు అత్యుత్తమంగా ఉండాలి’’ అని అన్నారు. ఇలాంటి గొప్ప లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ప్రేరణ సాహిబ్‌జాదాల తెగువ నుంచి పొందవచ్చని వివరించారు. అలాంటి గొప్ప లక్ష్యాలు ఇప్పుడు తీర్మానాలుగా మారతాయని ఆయన అన్నారు. యువత సామర్థ్యంపై దేశానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, వారికి నూతన అవకాశాలను అందించినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థలకు నాయకత్వం వహిస్తూ, ఆవిష్కరణలతో ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తూ, ప్రతి ప్రధాన దేశంలోనూ, రంగంలోనూ తమ సత్తాను నిరూపించుకుంటూ, దేశం కోసం యువత ఏదైనా సాధించగులుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడం తథ్యమని, ఆత్మ నిర్భర భారత్ విజయం ఖాయమని అన్నారు.
దేశ భవిష్యత్తును మార్చేందుకు ప్రతి శకం యువతకు అవకాశమిచ్చిందన్న శ్రీ మోదీ, స్వాతంత్ర్య సమరం విదేశీ పాలన దురహంకారాన్ని ఛేదించి తమ లక్ష్యాలను సాధించారని, నేటి యువత అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యంతో ఉందని అన్నారు. ఈ దశాబ్దంలోనే రాబోయే 25 ఏళ్ల పాటు సాగే వేగవంతమైన అభివృద్దికి పునాది వేయాలని ఆయన అన్నారు. యువత వీలైనంత వరకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి రంగంలోనూ అభివృద్ధి సాధించి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రాజకీయాలతో ఇంతకుముందు సంబంధం లేని కుటుంబాల నుంచి లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తన ఆలోచనను ప్రధానంగా వివరించారు. ఇది రాబోయే 25 ఏళ్లకు చాలా కీలకమని, రాజకీయాల్లోకి కొత్త తరాన్ని తీసుకురావడానికి, యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరారు. వచ్చే ఏడాది స్వామి వివేకానంద జయంతి నాడు ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు శ్రీ మోదీ ప్రకటించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి మిలియన్ల మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే ప్రణాళికపై చర్చిస్తారని వివరించారు.
అమృత్ కాల్ కి సంబంధించిన 25 ఏళ్ల లక్ష్యాలను పూర్తి చేయడంలో రానున్న దశాబ్దం, ముఖ్యంగా వచ్చే ఐదేళ్లు అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీనికోసం దేశంలోని యువశక్తిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా యువత అందించే తోడ్పాటు, సహకారం, వారి శక్తి భారత్‌ను సరికొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. వీర సాహిబ్‌జాదాలు, మాతా గుజ్రీజీకి నివాళులు అర్పించి ప్రసంగాన్ని ముగించారు.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
భారతదేశ భవిష్యత్తుకు పునాదిగా చిన్నారులను సత్కరిస్తూ దేశవ్యాప్తంగా జరుపుకొనే వేడుక వీర బాల దివస్. ‘సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్’ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పోషకాహార సంబంధిత సేవలను మెరుగ్గా అమలుచేసి, వీటిలో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చేసి మంచి ఫలితాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దినోత్సవ ప్రాధాన్యం గురించి యువతలో అవగాహన పెంచడానికి, ఈ కార్యక్రమంలో వారిని నిమగ్నం చేసేందుకు, ధైర్యాన్ని, దేశం పట్ల అంకితభావాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తారు. మైగవ్, మై భారత్ పోర్టళ్లల ద్వారా క్విజ్ తరహా ఆన్‌లైన్ పోటీలు నిర్వహిస్తారు. పాఠశాలలు, చిన్నారుల సంరక్షణ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో కథలు చెప్పడం, సృజనాత్మక రచన, పోస్టర్ తయారీ వంటి ఆసక్తికరమైన పోటీలు నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎంఆర్బీపీ) పురస్కార గ్రహీతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2088547)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam