ప్రధాన మంత్రి కార్యాలయం
కెన్ – బెత్వా నదీ అనుసంధాన జాతీయ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కజురహోలో ప్రధాని ప్రసంగం
Posted On:
25 DEC 2024 4:02PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
వీరభూమి అయిన బుందేల్ ఖండ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవనీయ మధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, కార్యశీలుడైన ముఖ్యమంత్రి- సోదరుడు మోహన్ యాదవ్, కేంద్ర మంత్రులు సోదరులు శివరాజ్ సింగ్, వీరేంద్ర కుమార్, సీఆర్ పాటిల్, ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవడా, రాజేంద్ర శుక్లా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశిష్ట అతిథులు, పూజనీయ సాధుసంతులు, ప్రియమైన మధ్రప్రదేశ్ సోదరీ సోదరులు... అందరికీ నా శుభాకాంక్షలు.
నేడు ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకను జరుపుకొంటోంది. దేశ వ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న క్రైస్తవ సమాజానికి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. దీనికి తోడు మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రజలకు, అంకితభావం కలిగిన బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. గత ఏడాది కాలంగా మధ్యప్రదేశ్ అభివృద్ధిలో కొత్త ఒరవడిని గమనించవచ్చు. ఈరోజు కూడా వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ముఖ్యంగా కెన్-బెట్వా అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన చారిత్రక దౌధాన్ ఆనకట్టకు శంకుస్థాపన జరిగింది. అదేకాకుండా మధ్యప్రదేశ్ లో తొలి తేలియాడే సోలార్ ప్లాంటును ఓంకారేశ్వర్ లో ప్రారంభించాం. ఈ విజయాల పట్ల మధ్యప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
ఈ రోజు మనందరికీ స్ఫూర్తిదాయకమైన రోజు. నేడు మనందరికీ పూజనీయుడైన అటల్ జీ జయంతి. ఇది భారతరత్న అటల్ జీ శతజయంతి సందర్భం. అటల్ జీ జయంతి వేడుకలు సుపరిపాలనకు, అంకితభావంతో కూడిన సేవలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈరోజు ఆయన జ్ఞాపకార్థం ఒక స్మారక పోస్టల్ స్టాంపును, నాణేన్ని విడుదల చేశాను. ఎప్పటికీ నిలిచి ఉండే జ్ఞాపకాలు ఈవేళ నన్ను ముంచెత్తాయి. ఏళ్ల తరబడి నాలాంటి ఎంతో మందికి అటల్ జీ మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపించారు. దేశాభివృద్ధి కోసం ఆయన అందించిన అమూల్యమైన సేవలను మనం ఎప్పటికీ మరువలేము.
అంతేకాకుండా, మధ్యప్రదేశ్ లో 1,100కు పైగా అటల్ గ్రామ సేవా సదన్ ల నిర్మాణం నేటి నుంచీ ప్రారంభమవుతున్నది. వీటికి సంబంధించిన మొదటి విడత నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ అటల్ గ్రామ సేవా సదన్ లు మన గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మిత్రులారా,
సుపరిపాలన దినోత్సవమన్నది మనకు ఒక రోజు చేసుకునే కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది మన జీవన విధానం, బీజేపీ ప్రభుత్వాలకు ప్రామాణికం. ఈ దేశ ప్రజలు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకున్నారు. మధ్యప్రదేశ్ లో వరుసగా మరోసారి బీజేపీపై మీరు నమ్మకాన్ని చాటారు. సుపరిపాలనపై గల ఈ అచంచల విశ్వాసమే మన విజయానికి మూలాధారం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. లిఖితపూర్వక రికార్డుల ద్వారా పాలనను అంచనా వేయడంలో నిష్ణాతులైన మేధావులు, విశ్లేషకులు సమీక్ష నిర్వహించాలని కోరుతున్నాను. అభివృద్ధి, ప్రజాసంక్షేమం, సుపరిపాలనకు సంబంధించి 100-200 ప్రమాణాలను గుర్తించి.. కాంగ్రెస్ పాలించిన ప్రాంతాల్లో, వామపక్ష లేదా కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో, కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలు పాలించిన ప్రాంతాల్లో, సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఏం సాధించారో సమీక్షిద్దాం. మరీ ముఖ్యంగా ప్రజాసేవ కోసం బీజేపీకి అవకాశం ఇచ్చిన ప్రాంతాల్లో పరిస్థితినీ అంచనా వేద్దాం.
బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిచోటా ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, దేశసేవలో గత రికార్డులన్నింటినీ మేం అధిగమించామని ధీమాగా చెప్పగలను. ఈ ప్రమాణాలను నిష్పాక్షికంగా మదింపు చేస్తే సామాన్యులపై బీజేపీ ప్రభుత్వాలకు గల అచంచల అంకితభావం దేశానికి తెలుస్తుంది. మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయడం కోసం మేం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాం. ఈ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి ఆశయాలు తప్పకుండా నెరవేరాలి. అలుపెరగని కృషితో ఆ కలలను సాకారం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.
సుపరిపాలన అంటే అద్భుతమైన పథకాలను రూపొందించడం మాత్రమే కాదు.. వాటిని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడం. ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేదే పాలనకు అసలైన కొలమానం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు- శంకుస్థాపనలు చేయడం, రిబ్బన్లు కత్తిరించడం, జ్యోతి ప్రజ్వలనలు చేస్తూ తమ ఫొటోలు ప్రచురితమయ్యేలా చూసుకుంటూ.. ప్రకటనలూ, ఆర్భాటాలకే పరిమితమయ్యాయి. అంతటితో ఆగిపోయి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వదిలేసేవారు.
ప్రధానమంత్రినయ్యాక ప్రగతి కార్యక్రమం ద్వారా పాత ప్రాజెక్టులపై నేను సమీక్షించాను. 35-40 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. కాంగ్రెస్ పాలనలో పథకాల అమలులో చిత్తశుద్ధి, అంకిత భావం లేదనడానికి ఇది నిదర్శనం.
నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల స్పష్టమైన ప్రయోజనాలను మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లోని రైతులకు ఈ పథకం కింద ఏటా రూ.12,000 అందుతున్నాయి. జనధన్ బ్యాంకు ఖాతాలు తెరవడం వల్లనే ఇది సాధ్యమైంది. మధ్యప్రదేశ్ లో లాడ్లీ బెహనా యోజన జీవితాలను మారుస్తోంది. మహిళలకు బ్యాంకు ఖాతాలు తెరవకుండా.. ఆధార్, మొబైల్ నంబర్లతో వాటిని అనుసంధానం చేయకుండా ఇలాంటి పథకాలను అమలు చేయడం అసాధ్యం.
గతంలో సబ్సిడీపై రేషన్ అందించడం వంటి పథకాలు అమల్లో ఉన్నప్పటికీ, తమ హక్కులను పొందడానికి పేదలు అవస్థలు పడాల్సి వచ్చేది. నేడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థత కనిపిస్తోంది. ఇప్పుడు పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత రేషన్ అందుతోంది. ‘ఒక దేశం, ఒకే రేషన్ కార్డు’ వంటి కార్యక్రమాల వల్లనే ఈ మార్పు సాధ్యమైంది. ఇవి అవకతవకలను నిర్మూలించడంతోపాటు అత్యవసర సేవలు దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేలా అవకాశం కల్పించాయి.
మిత్రులారా,
సుపరిపాలన అంటే – పౌరుడు హక్కుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి రాకూడదు, లేదా ఓ ప్రభుత్వ కార్యాలయం నుంచి మరోదానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండొద్దు. మన ‘సంపూర్ణతా’ విధానం వల్ల లబ్ధిదారులందరికీ 100% ప్రయోజనాలు అందుతాయి. ఈ సుపరిపాలన అనే మంత్రమే బీజేపీ ప్రభుత్వాలను ఇతర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా నిలుపుతుంది. నేడు దేశం మొత్తం దీన్ని గుర్తించింది. అందుకే అధికారంలో ఉండేలా బీజేపీని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్నారు.
మిత్రులారా,
సుపరిపాలన ఉన్న చోట.. ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడమే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను కూడా ముందే గుర్తించి ప్రణాళికలు రూపొందిస్తారు. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించినా సరైన పాలన అందించడంలో విఫలమైంది. అధికారంలో ఉండడాన్ని తమ జన్మహక్కుగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ భావించింది. కానీ పాలనను వారు పట్టించుకోలేదు. పరిపాలన, కాంగ్రెస్ కలిసి ఉండలేవు. బుందేల్ ఖండ్ ప్రజలు తరాల పాటు ఈ నిర్లక్ష్యపు పర్యవసానాలను అనుభవించారు. ఇక్కడి రైతులు, తల్లులు, అక్కాచెల్లెల్లు ఒక్కో నీటిబొట్టు కోసం అవస్థలు పడ్డారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదు.
మిత్రులారా,
భారతదేశ అభివృద్ధికి నదీ జలాల ప్రాధాన్యాన్ని గుర్తించిన మొదటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ‘‘స్వాతంత్య్ర అనంతరం ‘జల శక్తి’ గురించి మొదట ఆలోచించినదెవరు? భారత జలవనరుల కోసం దార్శనికతతో కూడిన ప్రణాళికలు రూపొందించినదెవరు? ఈ అంశాల్లో కృషి చేసినదెవరు?’’ – ఇవి నేనడిగితే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ ప్రశ్నకు జవాబివ్వడం నా పాత్రికేయ మిత్రులకు కూడా కష్టమే. ఎందుకంటే, సత్యాన్ని కావాలనే అణచి ఉంచారు. ఆ ఘనతనంతా ఓ వ్యక్తికి కట్టబెట్టే ఆలోచనతో, అసలైన దార్శనికుడిని మరచిపోయేలా చేశారు. ఆయనెవరో నేనిప్పుడు మీతో చెప్పదలచుకున్నాను. స్వాతంత్య్రం తర్వాత- భారత జల వనరుల పట్ల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించిన వ్యక్తి, ఆనకట్టలు నిర్మించడంతోపాటు జల శక్తి భావనకు నాంది పలికిన వ్యక్తి మరెవరో కాదు.. ఆయన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.
భారత్ లోని భారీ నదీ లోయ ప్రాజెక్టులు డాక్టర్ అంబేద్కర్ ఆలోచనల ఫలితమే. ఇప్పుడున్న కేంద్ర జలసంఘం కూడా ఆయన కృషి ఫలితమే. కానీ జలసంరక్షణ కోసం, ప్రధాన ఆనకట్టల నిర్మాణం కోసం ఆయన చేసిన కృషిని కాంగ్రెస్ ఎన్నడూ గుర్తించలేదు. ఆయన చేసిన కృషిని ప్రజలకు తెలియకుండా దాచిపెట్టారు. కాంగ్రెస్ ఎన్నడూ బాబా సాహెబ్ కు తగిన గుర్తింపు ఇవ్వలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత నేటికీ దేశంలోని పలు రాష్ట్రాల మధ్య నీటిపై వివాదాలు కొనసాగుతున్నాయి. పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ వివాదాలను పరిష్కరించి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ఉద్దేశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఏనాడూ గట్టిగా ప్రయత్నించలేదు.
మిత్రులారా,
శ్రీ అటల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలోని నీటి సంబంధిత సవాళ్లను వేగంగా పరిష్కరించడం మొదలుపెట్టారు. అయితే, 2004 అనంతరం అటల్ జీ ప్రభుత్వం స్థానంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికలు, స్వప్నాలు, ప్రయత్నాలన్నింటినీ పక్కన పెట్టింది. నేడు మా ప్రభుత్వం నదుల అనుసంధానానికి సంబంధించి జాతీయ స్థాయిలో వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టు స్వప్నం ఇప్పుడు సాకారమయ్యేందుకు సిద్ధంగా ఉంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రజల శ్రేయస్సుకూ, సంతోషానికీ ఈ ప్రాజెక్టు కొత్త తోవలను పరుస్తుంది. మెరుగైన నీటిపారుదల సౌకర్యాల వల్ల మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్, తికమ్‌గఢ్, నివారి, పన్నా, దామోహ్, సాగర్ సహా పది జిల్లాలు ప్రయోజనం పొందుతాయి.
వేదికపైకి వస్తున్న సమయంలో వివిధ జిల్లాల రైతులను కలిసే అవకాశం వచ్చింది. వారి ముఖాల్లో సంతోషం, ఆనందం స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రాజెక్టు ముందు తరాల భవిష్యత్తుకు భరోసానిస్తుందని వారు చెప్పారు.
మిత్రులారా,
ఉత్తరప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బందా, మహోబా, లలిత్‌పూర్, ఝాన్సీ వంటి జిల్లాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా లాభపడతాయి.
మిత్రులారా,
నదుల అనుసంధానానికి సంబంధించిన బృహత్తర కార్యక్రమం కింద రెండు ప్రాజెక్టులను ప్రారంభించిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్. కొన్ని రోజుల క్రితం నేను రాజస్థాన్‌లో ఉన్న సమయంలో, మోహన్ జీ ఈ విషయాన్ని వివరించారు. పార్వతి-కాళీసింధ్-చంబల్- కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టుల ద్వారా వివిధ నదుల అనుసంధానం కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని ద్వారా గణనీయమైన ప్రయోజనాలను పొందేందుకు మధ్యప్రదేశ్ సిద్ధంగా ఉంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు అతిపెద్ద సవాళ్లలో నీటి భద్రత ఒకటి. పుష్కలంగా నీరు, సమర్థవంతమైన నీటి నిర్వహణ ఉన్న దేశాలు, ప్రాంతాలే ఈ శతాబ్దంలో అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయం, పశుసంపద నీటి ద్వారానే పెంపొందుతాయి. పరిశ్రమలు, వ్యాపారాలు నీటితోనే అభివృద్ధి చెందుతాయి.
నేను గుజరాత్ నుంచి వచ్చాను. సాధారణంగా ఏడాదిలో ఎక్కువ భాగం అక్కడ కరువే ఉండేది. అయితే, మధ్యప్రదేశ్‌లో ఉద్భవించిన నర్మదా మాత ఆశీస్సులు గుజరాత్ గతిని మార్చాయి. మధ్యప్రదేశ్‌లోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సంక్షోభం నుంచి విముక్తి కల్పించడాన్ని నేను బాధ్యతగా భావిస్తున్నాను. అందుకే, మీ కష్టాలను తగ్గించడానికి అవిశ్రాంతంగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని బుందేల్‌ఖండ్ అక్కాచెల్లెల్లకు, ఇక్కడి రైతులకు నేను వాగ్దానం చేశాను.
ఈ దృక్పథంతోనే బుందేల్‌ఖండ్ నీటి సమస్యలను పరిష్కరించడానికి దాదాపు రూ. 45,000 కోట్ల విలువైన ప్రణాళికను మేం రూపొందించాం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాలను ఇదే దృక్పథంతో పనిచేసే విధంగా మేం నిరంతరం ప్రోత్సహించాం. ఈ రోజు కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా దౌధన్ ఆనకట్టకు శంకుస్థాపన జరిగింది. ఈ ఆనకట్ట వందల కిలోమీటర్ల మేర కాల్వల ఏర్పాటు చేయడంతోపాటు దాని నీరు దాదాపు 11 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తుంది.
మిత్రులారా,
నీటి భద్రత మరియు పరిరక్షణలో పురోగతి సాధించిన అసాధారణ కాలంగా భారత చరిత్రలో గత దశాబ్దం గుర్తుండిపోతుంది. గత ప్రభుత్వాల్లో నీటికి సంబంధించిన బాధ్యతలన్నీ ఒకచోట కాకుండా, వివిధ శాఖల మధ్య ఉండేవి. దీనిని పరిష్కరించడం కోసం మేము జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించడం కోసం మొదటిసారిగా ఓ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో కేవలం మూడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది. గత ఐదేళ్లలో అదనంగా 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. ఇప్పటివరకు ఈ పథకం కోసం రూ.3.5 లక్షల కోట్లకు పైగా వెచ్చించాం.
నీటి నాణ్యత పరీక్షపై దృష్టిపెట్టడమన్నది జల జీవన్ మిషన్ లోని మరో అంశం. దీనిపై ఎక్కువగా చర్చలు జరగలేదు. దేశవ్యాప్తంగా 2,100 నీటి నాణ్యత ప్రయోగశాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లో 25 లక్షల మంది మహిళలు తాగునీటిని పరీక్షించడంలో శిక్షణ పొందారు. ఫలితంగా, వేలాది గ్రామాలు ఇప్పుడు కలుషిత నీటిని వినియోగించడం నుంచి విముక్తి పొందాయి. నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుంచి పిల్లలను, సమాజాన్నీ రక్షించడంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని ఊహించండి.
మిత్రులారా,
2014కు ముందు దేశంలో దాదాపు 100 భారీ నీటిపారుదల ప్రాజెక్టులు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్నాయి. దీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం మేం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అంతేకాకుండా, ఆధునిక నీటిపారుదల పద్ధతులను మేం ప్రోత్సహిస్తున్నాం. గత దశాబ్ద కాలంలో దాదాపు కోటి హెక్టార్ల భూమి సూక్ష్మ నీటిపారుదల సదుపాయాల పరిధిలోకి వచ్చింది. అదే కాలంలో, ఒక్క మధ్యప్రదేశ్ లోనే దాదాపు ఐదు లక్షల హెక్టార్ల భూమికి సూక్ష్మ నీటిపారుదల సదుపాయం అందింది. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్‌లను నిర్మించాలనే ప్రచారాన్ని మేం ప్రారంభించాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60,000కు పైగా అమృత్ సరోవర్ ల నిర్మాణం జరిగింది. జలశక్తి అభియాన్: వర్షాన్ని ఒడిసిపడదాం కార్యక్రమాన్ని కూడా మేం దేశవ్యాప్తంగా ప్రారంభించాం. మూడు లక్షలకు పైగా పునరుద్ధరణ బావులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే- పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు చురుగ్గా పాల్గొనడం. అమితమైన ఉత్సాహంతో వారు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
మధ్యప్రదేశ్ సహా భూగర్భజలాలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అటల్ భూజల యోజనను అమలు చేయడం ద్వారా ఈ సవాళ్లను మేం పరిష్కరిస్తున్నాం.
మిత్రులారా,
పర్యాటక రంగంలో మధ్యప్రదేశ్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంది. పర్యాటకం గురించి ప్రస్తావించకుండా నేను ఖజురహోకు ఎలా రాగలను? పర్యాటకం యువతకు ఉపాధిని కల్పించడమే కాకుండా జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే రంగం. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతున్న నేపథ్యంలో.. భారత్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్సుకత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మన దేశం గురించి తెలుసుకోవడానికి, మన దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా చూపుతున్నారు. దీని ద్వారా మధ్యప్రదేశ్ గణనీయంగా లాభపడుతుంది.
ఇటీవల, ఓ అమెరికన్ వార్తాపత్రికలో ఒక నివేదిక ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన పది పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా మధ్యప్రదేశ్ ను ప్రముఖంగా పేర్కొన్నది. ఈ గుర్తింపును మధ్యప్రదేశ్ వార్త పత్రికలు కూడా విశేషంగా ప్రచురించాయి. మధ్యప్రదేశ్ ప్రజల ఎంత గర్వించారో, ఎంతలా ఆనందించారో ఊహించండి! మీ అస్తిత్వాన్నీ, గౌరవాన్ని ఇది మెరుగుపరచలేదా? ఈ ప్రాంతంలో పర్యాటకానికి ఇది ఊతంగా నిలవదా? అత్యంత పేద ప్రజలకు కూడా ఇది ఉపాధి అవకాశాలను కల్పించదా?
మిత్రులారా,
భారత్, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రయాణ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సందర్శకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మేము ఇ-వీసా వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. భారత్ లో వారసత్వం, వన్యప్రాణి పర్యాటకం విస్తృతమవుతున్నది. ఈ విషయంలో మధ్యప్రదేశ్ కు అసమానమైన అవకాశాలున్నాయి. ఉదాహరణకు ఖజురహోనే తీసుకోండి – అమూల్యమైన చారిత్రక సంపదకూ, భక్తి భావానికీ ఇది నిలయం. కందారియా మహాదేవ్, లక్ష్మణ్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం వంటి ప్రదేశాలు ముఖ్యమైన యాత్రాస్థలాలు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం.. జీ-20 సమావేశాలను మేం దేశవ్యాప్తంగా నిర్వహించాం. వాటిలో ఒకదానిని ఖజురహోలో కూడా నిర్వహించాం. ఇందుకోసం ఖజురహోలో అత్యాధునిక అంతర్జాతీయ సమావేశ కేంద్రాన్ని నిర్మించాం.
మిత్రులారా,
కేంద్రప్రభుత్వ స్వదేశ్ దర్శన్ యోజన కింద, పర్యావరణ హిత పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, కొత్త ఆకర్షణీయ ప్రదేశాలను పర్యాటకులకు పరిచయం చేయడానికి మధ్యప్రదేశ్‌కు వందల కోట్ల రూపాయలను కేటాయించాం. సాంచి వంటి ప్రాంతాలు, ఇతర బౌద్ధ ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలూ బౌద్ధ పథం (బుద్ధిస్ట్ సర్క్యూట్) ద్వారా అనుసంధితమవుతున్నాయి. గాంధీసాగర్, ఓంకారేశ్వర్ ఆనకట్ట, ఇందిరా సాగర్ ఆనకట్ట, భేదా ఘాట్, బాన్ సాగర్ ఆనకట్టలు ఇప్పుడు ఎకో సర్య్కూట్ లలో ఉన్నాయి. అదేవిధంగా, పన్నా జాతీయ పార్కు వన్యప్రాణి సర్క్యూట్ లో అంతర్భాగం కాగా.. ఖజురహో, గ్వాలియర్, ఓర్చా, చందేరీ, మాందు వంటి ప్రదేశాలను వారసత్వ సర్య్యూట్ లు అనుసంధానం చేస్తున్నాయి.
ఒక్క గత ఏడాది కాలంలోనే దాదాపు 2.5 లక్షల మంది పర్యాటకులు పన్నా పులుల అభయారణ్యాన్ని (టైగర్ రిజర్వ్) సందర్శించారు. ఇక్కడ నిర్మిస్తున్న అనుసంధాన కాలువ కూడా పన్నా పులుల అభయారణ్యంలో వన్యప్రాణులకు ఉపయోగకరంగా ఉంటుంది.
మిత్రులారా,
పర్యాటకాన్ని పెంచే ఈ చర్యలు స్థానిక ఆర్థిక వ్యవస్థను విశేషంగా ప్రభావితం చేస్తాయి. పర్యాటకులు స్థానిక వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆటో, టాక్సీ సేవల నుంచి హోటళ్లు, దాబాలు, వసతి గృహాలు, అతిథి గృహాల వరకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయల వంటి ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడం ద్వారా రైతులకు కూడా లాభం కలుగుతుంది.
మిత్రులారా,
గత రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. మున్ముందు ఈ రాష్ట్రం దేశంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించబోతున్నది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణం కోసం మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో విశేష తోడ్పాటునందిస్తూ.. ఈ పరివర్తనలో బుందేల్ ఖండ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈరోజు జరిగిన కార్యక్రమం ఎన్నటికీ గుర్తుండిపోతుంది. ఇది ఎంత విశేషమైనదో నాకు బాగా తెలుసు. ఇంత పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరావడం.. ముఖ్యంగా తల్లులు, అక్కాచెల్లెల్లూ భారీగా హాజరవడాన్ని బట్టి నీరు ఎంత ప్రధానమైనదో అవగతమవుతుంది. నీరే జీవనం. ఈ విషయంలో మా కృషిని కొనసాగించేలా మీ దీవెనలు మాకు స్ఫూర్తినిస్తాయి. అందరం కలిసి ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేద్దాం. నాతో కలిసి నినదించండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో చేశారు.
***
(Release ID: 2088381)
Visitor Counter : 10
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada