సహకార మంత్రిత్వ శాఖ
25 డిసెంబరు, బుధవారం న్యూఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో 10,000 ఎం-పీఏసీఎస్ లు, డెయిరీ, మత్స్య సహకార సంఘాలను జాతికి అంకితం చేయనున్న కేంద్ర హోం, సహకార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
కొత్తగా ఏర్పాటైన సంఘాలకు నమోదు ధ్రువపత్రాలు, రూపే కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ), మైక్రో ఏటీఎంలను అందించనున్న శ్రీ అమిత్ షా
ప్రతి పంచాయతీలో సహకార సంఘాల ఏర్పాటుకూ, తద్వారా స్థానిక అభివృద్ధికీ – స్వావలంబనకూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కట్టుబడి ఉన్న సహకార మంత్రిత్వ శాఖ
గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంబననూ, ఆర్థిక సాధికారతనూ ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్న కొత్తగా ఏర్పడిన ఎం-పీఏసీఎస్ లు
ఆర్థిక సేవలను అందించడం మాత్రమే కాకుండా.. గ్రామీణ సమాజం ఏకతాటిపైకి వచ్చి, సహకారంతో పని చేసే వేదికగానూ నిలవనున్న ఎం-పీఏసీఎస్ లు
రైతులు, గ్రామీణ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం, వారికి అదనపు ఆదాయ వనరులను అందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం వంటి అవకాశాలపైనా చర్చించనున్న సదస్సు
Posted On:
24 DEC 2024 3:16PM by PIB Hyderabad
కొత్తగా ఏర్పాటైన 10,000కు పైగా బహుళ ప్రయోజన వ్యవసాయ సహకార సంఘాలను (ఎం-పీఏసీఎస్ లు), డెయిరీ, మత్స్య సహకార సంఘాలను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. న్యూఢిల్లీలోని పూసాలో ఉన్న ఐసీఏర్ కన్వెన్షన్ సెంటర్‌లో సహకార సంఘాల జాతీయ సదస్సు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పాటైన సహకార సంఘాలకు నమోదు ధ్రువపత్రాలు, రూపే కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ), మైక్రో ఏటీఎంలను శ్రీ అమిత్ షా పంపిణీ చేస్తారు. పంచాయితీలలో పరపతి సేవలను సులభంగా అందుబాటులోకి తేవడానికీ, ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ ఆర్థిక సాధనాలను రూపొందించారు. గ్రామీణ ప్రజలు వివిధ పథకాల ద్వారా ప్రయోజనం పొంది, దేశ ఆర్థిక పురోగతిలో పాలుపంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ హాజరవుతారు. ఆయనతోపాటు పలువురు సీనియర్ అధికారులు, ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో.. ప్రతి పంచాయతీలోనూ సహకార సంఘాల ఏర్పాటుకూ, తద్వారా స్థానిక స్థాయిలో అభివృద్ధికీ – స్వావలంబనకూ సహకార మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
కొత్త ఎం-పీఏసీఎస్ ల ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొత్తగా నెలకొల్పిన బహుళ ప్రయోజన పీఏసీఎస్ లలో పరపతి సంఘాలు, డెయీ సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి.
సహకార సంఘాల ద్వారా స్థానిక ప్రజలనూ, ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని పంచాయతీలను సాధికారికంగా తీర్చిదిద్దడంపై కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిసారించారు. కొత్తగా నెలకొల్పిన ఎం-పీఏసీఎస్ లు గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంననూ, ఆర్థిక సాధికారతనూ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
ఆర్థిక సేవలను అందించడం మాత్రమే కాకుండా.. గ్రామీణ సమాజం ఏకతాటిపైకి వచ్చి, సహకారంతో పని చేసే వేదికగానూ ఈ సంఘాలు నిలవనున్నాయి.
ఇటీవల త్రిపుర పర్యటన సందర్భంగా.. ఈశాన్య రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సహకార సంఘాలను బలోపేతం చేయడంపై ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం వెన్నెముక వంటిదనీ.. ఆర్థిక సమ్మిళితత్వానికీ, గ్రామీణ వ్యవసాయం, కుటీర పరిశ్రమల అభివృద్ధికీ, ఉపాధి కల్పనకూ, మహిళలు, సమాజ సాధికారతకు కీలకమైన చోదకంగా పనిచేస్తుందని శ్రీ షా విశ్వాసం వ్యక్తపరిచారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో.. 2021 జూలైలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. సహకార రంగంలోని క్షేత్రస్థాయి సంస్థ అయిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) పునరుజ్జీవింపజేసే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.
పీఏసీఎస్ లకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం కొత్త తరహా ఉప-చట్టాలను ప్రవేశపెట్టారు. ఆ సంఘాల కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వాటిని ఆత్మనిర్భరంగానూ, సుస్థిరంగానూ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది.
‘సహకార్ సే సమృద్ధి’ అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడం కోసం.. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీలోనూ సహకార సంస్థను నెలకొల్పాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
దీనిని సాకారం చేసే దిశగా బహుళ ప్రయోజన పీఏసీఎస్ (ఎం-పీఏసీఎస్)ల ఏర్పాటు కోసం ఈ ఏడాది సెప్టెంబరులో ‘మార్గదర్శిక’ను జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే రెండు లక్షల కొత్త ఎం-పీఏసీఎస్ లు సమర్థవంతంగా పనిచేసేలా ఈ మార్గదర్శికను రూపొందించారు.
ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటు చేసిన 10,496 బహుళ ప్రయోజన పీఏసీఎస్ లు, డెయిరీ, మత్స్య సహకార సంఘాలలో.. 3,523 ఎం-పీఏసీఎస్ లు కాగా, 6,288 డెయిరీ సహకార సంఘాలుగా నమోదయ్యాయి. అదనంగా 685 కొత్త మత్స్య సహకార సంఘాలు కూడా నమోదయ్యాయి.
ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా దాదాపు 1,200 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వారిలో ఎం-పీఏసీఎస్ లు, డెయిరీ, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు ఉంటారు. వారిలో 400 మంది ప్రతినిధులు ఎం-పీఏసీఎస్ ల నుంచి ఉండగా, 700 మంది సహకార డెయిరీల నుంచి, 100 మంది మత్స్య సహకార సంఘాల నుంచి ఉన్నారు. వారితోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార మంత్రిత్వ శాఖ, వివిధ సంబంధిత సంస్థల అధికారులు కూడా పాల్గొంటారు.
కొత్తగా ఏర్పాటైన సహకార సంఘాల నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యూహాలను చర్చించే వేదికగా ఈ సదస్సు ఉపయోగపడుతుంది. దానితోపాటు.. రైతులు, గ్రామీణ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం, అదనపు ఆదాయ వనరులను అందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే అవకాశాలను కూడా సదస్సులో చర్చిస్తారు.
***
(Release ID: 2087978)
Visitor Counter : 7
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam