ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 14 DEC 2024 11:28PM by PIB Hyderabad

గౌరవనీయ సభాధ్యక్షా..

దేశ పౌరులకే కాక, ప్రపంచ ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ గర్వాన్ని కలిగించే క్షణాలివి.. ప్రజాస్వామ్య పండుగను సగర్వంగా వేడుక చేసుకునే సందర్భమిది. రాజ్యాంగ పాలన నీడలో చేసిన 75 ఏళ్ళ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. మన రాజ్యాంగ నిర్మాతలు పవిత్ర కార్యంగా భావించి చేపట్టిన సంకల్పం వల్లనే ఇది సాధ్యపడింది. వారి కృషి ఈ రోజుకీ మార్గదర్శనంగా నిలుస్తోంది. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తవడాన్ని ఘనమైన వేడుకగా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా పార్లమెంటు కూడా తన భావాలని పంచుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు, గౌరవనీయ సభ్యులందరికీ ధన్యవాదాలు.

అధ్యక్షా..

ఒక వ్యవస్థ 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడమంటే  సామాన్యమైన విషయం కాదు, ఇదొక గొప్ప విశేషం. స్వాతంత్ర్యానంతరం దేశ భవిష్యత్తు గురించి అనేక నిరాశాజనక అంచనాలు వినవచ్చేవి.. అటువంటి సందేహాలనన్నింటినీ పటాపంచలు చేసిన రాజ్యాంగం, నేడు మనని స్థిరమైన ఉన్నత స్థానానికి చేర్చింది. ఈ ఘనతను సాధ్యం చేసిన రాజ్యాంగ నిర్మాతలకే కాక, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించి, గౌరవించిన కోట్లాది పౌరులకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గత 75 ఏళ్ళగా అనేక పరీక్షలను ఎదుర్కొన్నప్పటికీ రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను గౌరవించిన మన పౌరులు ప్రశంసార్హులు. 

అధ్యక్షా..

మన రాజ్యాంగ నిర్మాతలకు నిశ్చయంగా తెలిసిన విషయాన్ని ప్రస్తావిస్తాను...భారతదేశం 1947 లోనే  పుట్టిందని, 1950 లోనే  ఇక్కడ ప్రజాస్వామ్యం పురుడుపోసుకుందని వారు ఎన్నడూ భావించలేదు. వేల ఏళ్ళ పురాతనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యం వారికి బాగా తెలుసు. అనాదిగా కొనసాగుతున్న వైభవాన్ని కొనసాగించేందుకు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని వారు భావించారు.

అధ్యక్షా..

దేశ ప్రజాస్వామ్య, గణతంత్ర చరిత్ర అసాధారణమైన ఘనత కలిగినవి.  ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయివి. ఈ కారణం వల్లే భారత్ ను నేడు ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భావిస్తున్నారు. ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత్. ఈ తరహా వ్యవస్థ మూలాలు ఇక్కడే ఉన్నాయి.

అధ్యక్షా..

ఈ సందర్భంగా ముగ్గురు దార్శనికుల మాటలని ఉటంకిస్తాను.. మొదటివారు శ్రీ రాజ్ రిషీ పురుషోత్తమ్ దాస్ టాండన్ గారు. ఆయన రాజ్యాంగ సభ చర్చల నేపథ్యంలో చెప్పిన మాటల్ని మీతో పంచుకుంటాను. అనేక శతాబ్దాల అనంతరం మన దేశం ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ఈ సమావేశం గడిచిన గొప్ప కాలాన్ని గుర్తుకు తెస్తోందని అన్నారు. మనం స్వతంత్రులుగా ఉన్న కాలంలో బుద్ది జీవులు ఒక వద్దకు చేరి జాతి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళను చర్చించేవారని గుర్తు చేశారు.

రాజ్యాంగ సభకే చెందిన మరొక సభ్యుడు డాక్టర్ రాధాకృష్ణన్ గారు.. గణతంత్ర పద్ధతి ఈ దేశానికి కొత్త కాదని, చరిత్రకు పూర్వమే ఇక్కడ ఉనికిలో ఉందని అన్నారు.

ఇక మూడోవారు బాబా సాహబ్ అంబేద్కర్ గారు.. ప్రజాస్వామ్యం భారత్ కు ఎంత మాత్రం కొత్త కాదని, ఈ నేలపై అనేక గణతంత్ర రాజ్యాలు పరిపాలన చేశాయని తెలియజేశారు.

అధ్యక్షా..

మన రాజ్యాంగ రూపకల్పనలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రాజ్యాంగ సభకు చెందిన 15 మంది గౌరవనీయ మహిళలు క్రియాశీలంగా పనిచేశారు. వారు తమ అభిప్రాయాలతో చర్చల స్థాయిని పెంచేవారు. భిన్న నేపథ్యాలకు చెందిన వీరు చేసిన సూచనలు రాజ్యాంగానికి చక్కని దిశను సూచించాయి. మహిళలకు సమానహక్కులు కల్పించేందుకు అనేక ప్రపంచ దేశాలు ఎంతో సమయం తీసుకుంటే, మన దేశంలో రాజ్యాంగం అమలు తొలి రోజు నుంచీ మహిళలకు ఓటు హక్కును కల్పించడం మనందరికీ గర్వకారణం.

అధ్యక్షా..

ఇటీవల జరిగిన జి-20 సదస్సులో మనం ఇదే రాజ్యాంగ స్ఫూర్తిని పాటించాం. భారత్ జి-20 అధ్యక్షతన, మహిళల అభివృద్ధి లక్ష్యాలకి తోడు, ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ అనే అంశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాం. దరిమిలా మహిళల నేతృత్వంలో అభివృద్ధిపై అనేక అర్ధవంతమైన చర్చలు జరిగాయి. అంతే కాదు, ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పార్లమెంటు సభ్యులంతా ముందుకొచ్చి ‘నారీ శక్తి వందన’ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం.

అధ్యక్షా..

75 ఏళ్ళ రాజ్యాంగ ఉత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో మహిళలు కేంద్ర బిందువులుగా ఉండటాన్ని గమనించవచ్చు. ఇటువంటి చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సమయంలో ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయి బాధ్యతలు నెరవేర్చడం, రాజ్యాంగ స్ఫూర్తికి సిసలైన ఉదాహరణగా భావించవచ్చు.

అధ్యక్షా..

ఈ సభలో మహిళా ఎంపీల సంఖ్య, వారి భాగస్వామ్యమూ క్రమంగా పెరుగుతోంది. మంత్రి మండలిలోనూ వీరి ప్రమేయం పెరుగుతోంది. నేడు సామాజిక రంగం, రాజకీయాలు, విద్య, క్రీడలు, సృజనాత్మక రంగాల వంటి అనేక రంగాల్లో స్త్రీల భాగస్వామ్యం దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. వైజ్ఞానిక రంగం, మరీ ముఖ్యంగా అంతరిక్ష సాంకేతికతలో వారు సాధిస్తున్న అద్భుతమైన విజయాలను చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విజయాలన్నిటి వెనుక ఉన్న గొప్ప స్ఫూర్తి మన రాజ్యాంగమే.

అధ్యక్షా..

భారత్ ఇప్పుడు అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోంది. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దేశం బలమైన అడుగులు వేస్తోంది. స్వాతంత్య్ర శతాబ్ది జరుపుకునే నాటికి పరిపూర్ణమైన అభివృద్ధి సాధించిన దేశంగా భారత్ ను చూడాలన్నది 140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పం. ఇదే ప్రతి భారతీయుడి కల. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన అంశం, మన రాజ్యాంగానికి పునాదిగా ఉన్న ఐక్యతే.

ఈ దేశానికి చెందిన ప్రముఖులు-స్వాతంత్య్ర సమరయోధులు, రచయితలు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, కార్మిక నాయకులు, రైతు నాయకులు, నిజానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రతినిధులు- దేశ ఐక్యత పట్ల తిరుగులేని నిబద్ధతతో మన రాజ్యాంగ రూపకల్పనలో ఒక్కటయ్యారు. భిన్న వర్గాలు, ప్రాంతాలకు చెందిన వీరందరికీ మన ఐక్యత ఎంత ముఖ్యమైందో బాగా తెలుసు. బాబా సాహెబ్ అంబేద్కర్ భిన్నత్వ  సవాలును ముందే ఊహించి హెచ్చరించారు.. వారి మాటల్ని మీకు  చదివి వినిపిస్తాను...  "భిన్న ప్రాంతాల, భాషల, మతాల, సంస్కృతుల  భారతీయ ప్రజానీకాన్ని ఏకం చేయడమే అసలైన సవాలు..దేశంలో ఐక్యతా భావం వెల్లివిరిసేలా ఒకరితో ఒకరు సామరస్యంగా ఉంటూ ఐక్యతా భావంతో నిర్ణయాలు తీసుకునేలా ఎలా ప్రేరేపించాలన్నది ఆలోచించాలి" అని అంబేద్కర్ అన్నారు.

అధ్యక్షా..

స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ నిర్మాతల మనస్సుల్లో ఐక్యత ప్రధాన అంశంగా ఉండగా, తర్వాతి కాలంలో స్వార్థం నిండిన కొందరి వక్రమైన ఆలోచనల వల్ల ఈ ఐక్యతపై దాడి జరిగిందని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. ఆనాడూ ఈనాడూ భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ని నిర్వచించే అసలైన శక్తి. వైవిధ్యాన్ని మనం వేడుక చేసుకుంటాం. ఆ వైవిధ్యాన్ని స్వీకరించడంలోనే దేశ పురోగతి దాగుంది. దురదృష్టవశాత్తూ విదేశీ పాలన నాటి బానిస మనస్తత్వాన్ని కలిగిన వారు, దేశ సంక్షేమాన్ని గ్రహించలేని వారు, 1947లో భారతదేశం పుట్టిందని విశ్వసించే వారు, మన భిన్నత్వంలో దాగున్న అంతర్లీన ఏకత్వాన్ని చూడలేకపోయారు. ఇటువంటి అమూల్యమైన వారసత్వాన్ని చూసి గర్వించే బదులు, దేశ సమైక్యతకు ముప్పు కలుగజేసే విబేధాలకు బీజం వేసే ప్రయత్నాలు జరిగాయి.

అధ్యక్షా..

భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం మన జీవితాల్లో అంతర్భాగమవ్వాలి. అదే బాబా సాహెబ్ అంబేద్కర్‌కు మనమందించగల నిజమైన నివాళి అవుతుంది.

అధ్యక్షా..

రాజ్యాంగానికి సంబంధించి ఒక అంశాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. గత పదేళ్ళుగా దేశ ప్రజలు సేవ చేసే అవకాశాన్ని మాకు అప్పగించారు. మా విధానాలను, నిర్ణయాలను సమీక్షిస్తే దేశ ఐక్యతను బలోపేతం చేసేందుకు మేం నిరంతరాయంగా కృషి చేసినట్లు స్పష్టమవుతుంది.

ఉదాహరణకు 370 అధికరణం జాతీయ ఐక్యతకు పెద్ద అడ్డంకిగా మారిందని గుర్తించి దాని తొలిగింపు నిర్ణయం తీసుకున్నాం. రాజ్యాంగస్ఫూర్తి మార్గదర్శనంగా జాతీయ ఐక్యతకు ప్రాధాన్యాన్నిస్తూ ఆర్టికల్370 ని భూస్థాపితం చేసి దేశ ఐక్యతకే పెద్దపీట వేశాం. 

అధ్యక్షా..

భారతదేశం వంటి పెద్ద దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలన్నా,  అనుకూలమైన వ్యవస్థలు అవసరం. ఎన్నో ఏళ్ళు చర్చలకే పరిమితమైన ‘వస్తు సేవల పన్ను – జీఎస్టీని’ మేం ప్రవేశపెట్టాం. ఆర్థిక ఐక్యతను పెంపొందించడంలో జీఎస్టీ కీలక పాత్ర పోషించింది. ఈ విషయంలో గత ప్రభుత్వం కూడా చక్కని కృషి చేసింది. మా హయాంలో ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కింది. "ఒక దేశం, ఒకే పన్ను" అనే పద్ధతి ద్వారా మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం.

అధ్యక్షా..

రేషన్ కార్డు పేదలకు ఎప్పుడూ కీలకమైన పత్రంగా ఉపయోగపడుతుంది. అయితే ఇంతకు ముందు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్లే పేద వ్యక్తి,  కొత్త ప్రాంతంలో రేషన్ కార్డు ప్రయోజనాలను పొందలేకపోయేవాడు. భారత్ వంటి విశాలమైన దేశంలో ప్రాంతాలకతీతంగా ప్రతి పౌరుడికీ సమాన హక్కులు ఉండాలి. ఈ ఐక్యతా భావాన్ని బలోపేతం చేయడానికే మేం  "ఒక దేశం, ఒకే రేషన్ కార్డు" అనే పథకాన్ని ప్రవేశపెట్టాం.

గౌరవనీయ అధ్యక్షా..

సాధారణ పౌరులకు, ముఖ్యంగా పేదలకు, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకం పేదరికాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఎక్కడ నివసిస్తున్నా, మరీ ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలి. పని నిమిత్తం సొంత రాష్ట్రానికి దూరంగా ఉన్న వ్యక్తి అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో ఆరోగ్య సంరక్షణ సేవలను వినియోగించుకోలేకపోతే వ్యవస్థ  విఫలమైనట్టే కదా! జాతీయ ఐక్యతా మంత్రానికి కట్టుబడి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా "ఒక దేశం, ఒకే ఆరోగ్య కార్డు" కార్యక్రమాన్ని అమలు చేశాం. నేడు బీహార్‌లోని మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి పూణేలో పని చేస్తున్నప్పుడు అనారోగ్యానికి గురైతే, తన వద్దనున్న  ఆయుష్మాన్ కార్డు ద్వారా తక్షణమే ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలుగుతాడు.

అధ్యక్షా..

కొన్ని  ప్రాంతాలకు విద్యుత్తు అందుబాటులో ఉండటం, మరికొన్ని ప్రాంతాలు విద్యుత్ సరఫరా ఊసు లేకుండా అంధకారంలో మగ్గడం గతంలో అనేకసార్లు గమనించాం. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి విద్యుత్ కొరత వలననే  తరచుగా అంతర్జాతీయ వార్తల్లో భారత్‌ గురించి చెడుగా ప్రచారమయ్యేది. ఆ రోజులు మనందరికీ గుర్తే! ఈ పరిస్థితిని చక్కబరిచేందుకు,  రాజ్యాంగ స్ఫూర్తి నుంచి బలం పొంది, ఐక్యతా మంత్రం మార్గనిర్దేశం చేస్తూండగా, “ఒకే దేశం, ఒకే గ్రిడ్” పథకాన్ని ప్రవేశపెట్టాం. నేడు భారత్‌లోని ప్రతి ప్రాంతానికీ విద్యుత్తును సజావుగా చేరవేస్తున్నాం.

అధ్యక్షా..

మన దేశ మౌలిక సదుపాయాలు చాలా కాలం అసమానతలు, వివక్షతతో సతమతమయ్యాయి. అటువంటి అసమానతలను తొలగించి, సమతుల్య అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా జాతీయ ఐక్యతను బలోపేతం చేసేందుకు కృషి చేశాం.  ఈశాన్య ప్రాంతం, జమ్మూ కాశ్మీర్, హిమాలయ ప్రాంతాలు లేదా ఎడారి ప్రాంతాలు, ప్రాంతంతో సంబంధం లేకుండా  అన్ని ప్రాంతాల్లో  మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చే  ప్రయత్నాలు చేశాం. వనరుల కొరత కారణంగా ఏర్పడే అంతరాలను తొలగించడం, సమానమైన అభివృద్ధి ద్వారా ఐక్యతా భావాన్ని పెంపొందించడం మా లక్ష్యం.

అధ్యక్షా..

కాలం మారింది. డిజిటల్ రంగంలో ‘ఉన్నవారు’, ‘లేనివారు’ అన్న వర్గీకరణకు తావు లేని అభివృద్ధి సాధన కోసం కృషి చేస్తున్నాం. నేడు మన  ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం విజయగాధగా ప్రపంచ గుర్తింపును పొందింది. సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడం ద్వారా మన రాజ్యాంగ నిర్మాతల ఆశయాన్ని సాకారం చేశాం. 'భారత్‌ లో ఐక్యతను' పెంపొందించే లక్ష్యంతో ప్రతి పంచాయతీకి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని విస్తరించాం. దేశాన్ని శక్తిమంతంగా తయారు చేశాం.

అధ్యక్షా..

మన రాజ్యాంగం ఐక్యతను చాటుతుంది, మాతృభాషల గుర్తింపు ఈ ఐక్యతలో ఒక కీలకమైన అంశం.  మాతృభాషలను అణచివేయడం ద్వారా ఏ దేశమూ పురోగతి సాధించలేదు. ఈ అవగాహనకు అనుగుణంగానే నూతన విద్యావిధానం మాతృభాషకు ప్రాధాన్యతనిస్తోంది. నేడు, పేద కుటుంబాల పిల్లలు కూడా తమ మాతృభాషలో చదువుకుంటూ  డాక్టర్లు,  ఇంజనీర్ల వంటి పెద్ద చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు.  వివిధ భారతీయ భాషలకు ప్రాచీన భాషల హోదానిచ్చి  గౌరవించాం. జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు, యువతరంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించేందుకు 'ఏక్ భారత్ శ్రేష్ఠ్  భారత్' పథకాన్ని  ప్రారంభించాం.

అధ్యక్షా..

‘కాశీ తమిళ్ సంగమం’, ‘తెలుగు కాశీ సంగమం’ వంటి కార్యక్రమాలు ముఖ్య సంస్థాగత కార్యక్రమాలుగా రూపుదిద్దుకొన్నాయి.  సమాజంలో సన్నిహితత్వాన్ని పెంచడంతోపాటు మన రాజ్యాంగంలో ఎంతో ప్రాధాన్యాన్నిస్తూ పొందుపరచుకొన్న భారతదేశ ఐక్యతను పండుగలా జరుపుకోవడం ఈ సాంస్కృతిక కార్యక్రమాల ఉద్దేశం. 

 

అధ్యక్షా..

రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొన్న సందర్భంగా, ఆ రాజ్యాంగంలో ముఖ్య ఘట్టాలను ఒకసారి సమీక్షించుకోవడం ముఖ్యం. 25వ, 50వ, 60వ వార్షికోత్సవాల వంటి ప్రధాన ఘట్టాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే, చరిత్ర ఒక మిశ్రిత వారసత్వాన్ని గురించి తెలియజేస్తోంది. రాజ్యాంగం తన 25వ వార్షికోత్సవ ఘట్టానికి చేరుకొన్నప్పుడు, దేశం పెనుచీకటి కమ్ముకొన్న కాలానికి సాక్షిగా నిలిచింది. అత్యవసర పరిస్థితిని అమలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను స్తంభింపచేశారు. దేశాన్ని ఒక జైలులా మార్చివేసి, పౌరుల హక్కులను లాగేసుకొన్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేశారు. ఈ తీవ్ర అన్యాయం కాంగ్రెస్ పార్టీ రికార్డులో చెరిపేయలేని మరకగా మిగిలింది. ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని గురించి చర్చించుకొన్నప్పుడల్లా ఈ నమ్మక ద్రోహాన్ని మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతల కృషిని వమ్ముచేసే ఒక చర్యగా గుర్తుచేసుకొంటారు.

అధ్యక్షా..

రాజ్యాంగం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నప్పుడు, 2000 నవంబరు 26న ఈ ముఖ్య ఘట్టాన్ని దేశ ప్రజలు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకొన్నారు. ఆయన దేశ ఐక్యత, ప్రజల ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అలా చేసి రాజ్యాంగ స్ఫూర్తికి ప్రాణంపోసి, ప్రజల్లో  ప్రేరణను నింపారు.

 

అధ్యక్షా..

ఆ కాలంలో ముఖ్యమంత్రినయ్యే గౌరవం నాకు దక్కింది. నా పదవీకాలంలో రాజ్యాంగం తన 60వ వార్షికోత్సవంలోకి అడుగిడినప్పుడు మేం గుజరాత్‌లో అపూర్వ ఉత్సాహంతో ఒక ఉత్సవాన్ని నిర్వహించాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక పల్లకీని తయారుచేసి, అందులో రాజ్యాంగ ప్రతిని ఉంచి ఓ ఏనుగు మీద సంప్రదాయబద్ధంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యమంత్రి ముందు భాగంలో కాలినడకన సాగుతూ ఉండగా, ‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’ (రాజ్యాంగ గౌరవ యాత్ర)ను నిర్వహించాం. మన రాజ్యాంగాని ఉన్న అత్యంత ఆరాధనీయ భావనను చాటుకొంటూ రాజ్యాంగానికున్న ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజెబుతూ ఈ యాత్రను నిర్వహించాం. నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని స్మరించుకోవడానికి లోక్‌సభ పాత చాంబర్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేయగా, అలాంటి ఉత్సవం అవసరం ఏముంది? అనీ, జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఉందికదా! అనీ ఒక సీనియర్ నేత ప్రశ్నించారు. ఈ ధోరణి అప్పట్లో రాజ్యాంగ ప్రాధాన్యాన్ని ఎంత తక్కువ చేసి చూశారో తేటతెల్లం చేస్తోంది. ఏమైనప్పటికీ, రాజ్యాంగానికున్న శక్తిని, వైవిధ్యాన్ని చర్చించుకోవడానికి మనకు ఒక అవకాశం ఈ ప్రత్యేక కార్యక్రమంలో లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఒక ఫలప్రదమైన సంభాషణ జరగాల్సినచోట, రాజకీయ నిర్భందాలు కమ్ముకోవడం దురదృష్టకరం. పార్టీ వైఖరులను అధిగమించి, ఒక చర్చలో పాలుపంచుకోవడం రాజ్యాంగంపట్ల నవతరానికి అవగాహనను మరింత పెంచడంకోసం ఒక చర్చను చేపడితే ఎంతో బాగుండేది.

అధ్యక్షా..

రాజ్యాంగం పట్ల నేను నా హృదయపూర్వక గౌరవాన్ని ప్రకటిస్తున్నాను. రాజ్యాంగం వల్లే నా వంటి వ్యక్తులు ఎలాంటి రాజకీయ పరంపరగానీ లేదా నేపథ్యంగానీ లేకున్నా బాధ్యతాయుత పదవులను అధిష్టించగలిగారు. ఇది రాజ్యాంగానికి ఉన్న శక్తితోనూ, ప్రజల ఆశీర్వాదాలతోనూ సాధ్యమైంది. నా మాదిరిగానే జీవనాన్ని ఎంతో చిన్న స్థాయిలో మొదలుపెట్టి, ఇక్కడికి వచ్చినవారు ఎంతో మంది ఉన్నారు. మనకు కలలు కనడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి రాజ్యాంగం శక్తినిచ్చింది.  ప్రజలు మా పట్ల ఒకసారికాదు, రెండుసార్లుకాదు, ఏకంగా మూడుసార్లు అపార ప్రేమను, విశ్వాసాన్ని చూపించారు. రాజ్యాంగం లేని పక్షంలోనూ ఇది సాధ్యపడేదే కాదు.

 

అధ్యక్షా..

మన దేశ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్ళు, అడ్డంకులు వచ్చాయి. అయినప్పటికీ మొక్కవోని బలంతో, నిబద్ధతతో రాజ్యాంగాన్ని వెన్నంటి దృఢంగా నిలిచినందుకు ఈ దేశ ప్రజలకు నేను తప్పక నమస్కరిస్తాను.

 

అధ్యక్షా..

ఈ రోజు నేను వ్యక్తిగత విమర్శల జోలికి పోవాలనుకోవడంలేదు. ఏమైనప్పటికీ వాస్తవాలను ఈ దేశ ప్రజల ఎదుట ఉంచడం నా కర్తవ్యం. కాంగ్రెస్ పార్టీలో ఒక ఫలానా కుటుంబం రాజ్యాంగాన్ని బలహీన పరచడానికి ఉండే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవగా, అందులో 55 సంవత్సరాలపాటు ఒక కుటుంబం పాలించినందువల్ల ఆ కుటుంబాన్ని గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. ఈ దేశ ప్రజలకు నిజం ఏమిటో, ఆ కాలంలో జరిగిందేమిటో, విరుద్ధ సంప్రదాయాలు, లోపభూయిష్ట విధానాలు, ఈ కుటుంబం నెలకొల్పిన హానికారక విధానాలు - ఏవైతే ఈనాటికీ వాటి అనంతర కాల ప్రభావాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాయో - ఈ నిజాల్ని తెలుసుకొనే హక్కు ఉన్నది. ప్రతి దశలో ఈ కుటుంబం రాజ్యాంగానికి అపకారం చేసింది.

 

అధ్యక్షా..

దేశంలో 1947 నుంచి 1952 వరకు ఎన్నికైన ప్రభుత్వమంటూ ఏదీ లేదు. దానికి బదులుగా ఒక తాత్కాలికమైన, ఎంపిక చేసిన వ్యవస్థ కుదురుకొని ఎన్నికలను నిర్వహించేంత వరకు ఒక తాత్కాలిక వెసులుబాటుగా పనిచేస్తూ వచ్చింది. ఆ కాలంలో రాజ్యసభను ఇంకా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించలేదు. రాజ్యాంగ రూపకర్తలు విస్తృతంగా చర్చించిన తరువాత రాజ్యాంగాన్ని సిద్ధం చేసినా, ప్రజాతీర్పు అంటూ ఏదీ లేదు. 1951లో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు కావడానికన్నా ముందు ఈ తాత్కాలిక వ్యవస్థ ఒక ఆర్డినెన్స్‌ను రాజ్యాంగాన్ని సవరించడానికి ఉపయోగించుకొన్నది. దీంతో ఎలాంటి ఫలితం వచ్చింది? భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేశారు. ఈ చట్టం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ శిల్పులను తీవ్రంగా అవమానించింది. రాజ్యాంగ పరిషత్తు చర్చల సందర్భంగా వారు సాధించలేకపోయిన అంశాలను ఆ తరువాత పట్టుకొని, దొడ్డిదారిగుండా వారి పదవిని ఉపయోగించుకొని నేరవేర్చుకొన్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి నిర్ణయం అనేదానికన్నా ఒక తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వేరెవరో తీసుకొన్న నిర్ణయం. ఇది భారీ పాపం. ఇందులో అనుమానం లేనేలేదు.

 

అధ్యక్షా..

అదే కాలంలో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ‘‘రాజ్యాంగం మీ దారికి అడ్డుపడితే... దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చేయాలంటూ అందులో పేర్కొన్నారు. స్వయానా పండిత్ నెహ్రూ రాసిన ఈ మాటలు రాజ్యాంగ పవిత్రత పట్ల ఒక దిగ్భ్రమను కలిగించేటంతటి నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి.

 

అధ్యక్షా..

1951 నాటి ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను ఎవరూ పట్టించుకోకుండా వదిలిపెట్టలేదు. ఇది తీవ్రమైన తప్పు అంటూ అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పండిత్ నెహ్రూ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా నడుచుకొంటున్నారని లోక్‌సభ స్పీకర్ హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ప్రముఖ నేతలైన ఆచార్య కృపలానీతోపాటు, జయప్రకాశ్ నారాయణ్ కూడా ఈ పనికి ఒడిగట్టకండి అంటూ పండిట్ నెహ్రూను కోరారు. సీనియర్లు, గౌరవనీయులు చక్కని సలహా ఇచ్చినప్పటికీ కూడా వారి ఆందోళనలను పండిట్ నెహ్రూ లెక్కచేయక, రాజ్యాంగానికి సంబంధించిన తనదైన ప్రత్యేక వివరణను మొండి పట్టుదలతో అమలుచేశారు.

 

అధ్యక్షా..

రాజ్యాంగ సవరణల పట్ల తనివి తీరని తపనను కాంగ్రెస్ పార్టీ పెంచుకొని, తన రాజకీయ కార్యక్రమాల్ని అమలుచేయడానికి అనుకూలంగా రాజ్యాంగంలో తరచు మార్పులు చేస్తూపోయింది. ఈ పట్టువిడవని విధానం రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్రమైన గాయాలను చేసింది.

అధ్యక్షా..

రాజ్యాంగాన్ని సుమారు 60 ఏళ్ళలో 75 సార్లు సవరించారు.

 

అధ్యక్షా..

రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడానికి దేశ ప్రప్రథమ ప్రధాని తొలిబీజం వేయగా, ఆ తరువాత మరో ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ దానికి నారు-నీరు పోశారు. తొలి ప్రధాని నడుం కట్టిన పాపకార్యాలు మరింత నష్టాన్ని కొనితెచ్చాయి. 1971లో సుప్రీం కోర్టు ప్రకటించిన నిర్ణయాన్ని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా నిష్ఫలం చేశారు. ఈ సవరణ సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయడమొక్కటే కాకుండా న్యాయవ్యవస్థ రెక్కలను కూడా కత్తిరించింది. న్యాయ సమీక్షకు తావు ఇవ్వకుండానే రాజ్యాంగంలో ఏ అధికరణాన్నయినా పార్లమెంటు సవరించవచ్చని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ హక్కులను ఒక పద్ధతి ప్రకారం తగ్గించి వేశారు. ఈ దారుణ చర్యకు 1971లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఒడిగట్టారు. ఆమె ప్రభుత్వం ఈ సవరణను ప్రాథమిక హక్కులను స్వాధీన పరచుకోవడానికీ, న్యాయవ్యవస్థపై నియంత్రణను సంపాదించడానికీ ఉపయోగించుకొంది.

 

అధ్యక్షా..

శ్రీమతి గాంధీని జవాబుదారుగా చేసే వారంటూ ఎవరూ లేకపోవడంతో ఆమె ఎన్నిక రాజ్యాంగ విరుద్ధ పద్ధతుల్లో జరిగిందనీ, ఆ ఎన్నిక చెల్లదనీ కోర్టు తేల్చినప్పుడు ఆమె తన పదవిని అంటిపెట్టుకొని ఉండడానికి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించడం ద్వారా ప్రతిఘటనకు దిగారు. రాజ్యాంగ నిబంధనలను దుర్వినియోగపరచిన ఈ తీరు భారత ప్రజాస్వామ్యానికి గొంతు నులిమి ఊపిరి సలపనీయకుండా చేసింది. 1975లో ఆమె 39వ సవరణను తీసుకువచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్‌ల ఎన్నికలను కోర్టులో- అవి వెనుకటి కాలానికి చెందినవయినా సరే- సవాలు చేయడానికి వీల్లేదని ఈ సవరణ తేల్చి చెప్పింది. ఇది రాబోయే కాలంలో తప్పుగా నడుచుకొంటే ఒక కవచంగా ఉపయోగపడడం ఒక్కటే కాకుండా, మునుపటి అధికారాల అతిక్రమణకు రక్షణను కల్పించే సాధనంగా కూడా ఉంది. 

 

అధ్యక్షా..

అత్యవసర పరిస్థితి అమలైన కాలంలో, ప్రజల ప్రాథమిక హక్కులను అణగదొక్కారు, వేల మందిని జైళ్ళలో పెట్టారు. న్యాయవ్యవస్థ నోరు కట్టివేశారు. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారు. శ్రీమతి గాంధీ ‘‘కమిటెడ్ జ్యుడీషియరీ’’ అనే భావనను ముందుకు తెచ్చారు. ఆ భావన న్యాయపరమైన స్వతంత్రతను బలహీనపరిచింది. రాజ్యాంగాన్ని సమర్ధిస్తూ, శ్రీమతి గాంధీకి వ్యతిరేకంగా ఒక తీర్పును ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నాకు- ఆయన అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయినా కూడా- భారత ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కకూడదని ఉద్దేశపూర్వకంగా నిరాకరించారు. ఇది రాజ్యాంగ ఆదర్శాలపైనా, ప్రజాస్వామిక విలువలపైనా జరిగిన ఘోరమైన దౌర్జన్యం. 

 

అధ్యక్షా..

 

అనేక మంది రాజకీయ నాయకులను, ఈ రోజు సభలో ఉన్న పార్టీ ప్రతినిధులు సహా, ఆ కాలంలో జైళ్ళలో పెట్టారు. అమాయక  పౌరులపై క్రూరమైన దాడులు చేశారు. వారిని పోలీసులు హింసించారు.  చాలా మంది జైళ్ళలో ప్రాణాలను పోగొట్టుకొన్నారు. దయ అనేది ఎరుగని ప్రభుత్వం ఎలాంటి శిక్షా లేకుండా రాజ్యాంగాన్ని ముక్కచెక్కలు చేస్తూపోయింది.

 

అధ్యక్షా..

రాజ్యాంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించే ఈ సంప్రదాయం అంతటితోనే ముగియలేదు.  నెహ్రూ మొదలుపెట్టిన పనిని ఇందిరా గాంధీ తరువాత రాజీవ్ గాంధీ కొనసాగించారు. రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని మరో తీవ్రమైన దెబ్బ కొట్టారు. షా బానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని, రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వాన్ని నిలబెడుతూ ఓ వృద్ధురాలికి న్యాయసమ్మతంగా ఆమెకున్న హక్కులను తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకన్నా ఓట్ బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఛాందస వాద ఒత్తిడులకు తలొగ్గి, న్యాయ స్ఫూర్తిని వదిలిపెట్టి ఓ  చట్టాన్ని తెచ్చి ఈ తీర్పును తిప్పేసింది.

 

అధ్యక్షా..

రాజ్యాంగాన్ని అక్రమంగా దిద్దడమనే సంప్రదాయం కొనసాగింది. నెహ్రూ మొదలుపెట్టిన దానిని ఇందిర ముందుకు తీసుకుపోయారు. రాజీవ్ కూడా దానికి బలాన్నిచ్చారు. ఈ కారణంవల్ల రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయ్యారు. ఆయన రాజ్యాంగాన్ని మరోసారి తీవ్రంగా దెబ్బతీశారు. ‘సమానత్వం అందరికీ లభించాలి, న్యాయం అందరికీ దక్కాలి’ అనే భావనను ఆయన దెబ్బకొట్టారు.

 

అధ్యక్షా..

షా బానో కేసులో సుప్రీంకోర్టు ముఖ్య తీర్పును ఇస్తూ, రాజ్యాంగంలో ఉల్లేఖించిన ఆత్మగౌరవాన్ని, సారాన్ని ఆధారం చేసుకొని ఓ భారతీయ మహిళ విషయంలో న్యాయాన్ని నిలబెట్టింది. ఈ వయో వృద్ధురాలికి న్యాయంగా దక్కాల్సిన వాటిని కోర్టు ఆమెకు మంజూరు చేసింది. అయితే, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజీయాల వత్తిళ్ళకు తలొగ్గి, ఛాందసవాద డిమాండులకు లొంగిపోయి ఈ తీర్పును అలక్ష్యం చేశారు. న్యాయాన్ని కోరుకున్న ఒక వృద్ధురాలి పక్షాన నిలబడడానికి బదులు ఆయన ఛాందసవాదుల జట్టులో చేరారు. రాజ్యాంగ స్ఫూర్తిని త్యజిస్తూ, పార్లమెంటులో ఒక చట్టాన్ని చేసి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిర్వీర్యం చేశారు.

 

అధ్యక్షా..

ఇది ఏ ఒక్కసారో జరిగిన సందర్భం కాదు. రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి నెహ్రూగారు మొదలుపెట్టిన సంప్రదాయాన్ని ఇందిర గారు ముందుకు తీసుకువెళ్ళగా, రాజీవ్ గారు మరింత బలపరిచారు. ఈ నమూనాను రాజీవ్ గారు ఎందుకని శాశ్వతీకరించారు?  రాజ్యాంగ పవిత్రత అంటే ఉన్న నిర్లక్ష్యాన్నుంచి, దానిని అక్రమంగా దిద్దాలన్న ఇచ్ఛ నుంచి ఈ స్థితి తలెత్తింది.

 

అధ్యక్షా..

ఈ దుర్మార్గం వారితోనే ఆగిపోలేదు. తరువాతి తరం నాయకత్వం కూడా చెడ్డ పనిలో భాగం పంచుకొంది. నాకన్నా ముందుగా ప్రధాని పదవిని నిర్వహించిన వ్యక్తి ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించిన ఒక పుస్తకంలో ఉన్న అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలచాను. ఈ పుస్తకంలో మన్మోహన్ సింగ్ గారు అన్నమాటలు ఇవి.. ‘‘పార్టీ అధ్యక్షుడు ఒక అధికార కేంద్రమనే విషయాన్ని నేను ఒప్పుకొని తీరాలి. పార్టీకి ప్రభుత్వం జవాబుదారు’’.

 

అధ్యక్షా..

చరిత్రలో మొట్టమొదటిసారిగా, రాజ్యాంగానికి అంత తీవ్రంగా నష్టాన్ని కలిగించారు. ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన ప్రధానమంత్రి.. ఈ భావనలతో రాజీ పడ్డారు. మనకు ఒక రాజ్యాంగమంటూ ఒకటి ఉన్నా, రాజ్యాంగ విరుద్ధమైన, ఏ ప్రమాణమూ చేయని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను ప్రధాని పదవికన్నా మిన్నగా చేసి, ప్రధానమంత్రి కార్యాలయం కన్నా ఉన్నత స్థానాన్ని దానికి కల్పిస్తూ రాజ్యాంగాన్ని నష్టపరిచారు. దీనితో ప్రధానమంత్రి కార్యాలయానికి  ఒక అప్రకటిత, కుచించుకుపోయిన స్థాయిలో మిగిలిపోయింది. రాజ్యాంగం నెలకొల్పిన పాలన సిద్ధాంతాల విలువ ప్రభావపూర్వకంగా తగ్గిపోయింది.

 

అధ్యక్షా..

మరో తరానికి చెందిన విషయాన్ని ప్రస్తావించుకొందాం రండి. వారు పాల్పడ్డ చర్యల్ని పరిశీలిద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం, పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. ప్రభుత్వ అధిపతి మంత్రిమండలిని ఏర్పాటు చేస్తారు. ఇది ఒక రాజ్యాంగపరమైన ఓ ప్రాథమిక ప్రక్రియ. అయినప్పటికీ మంత్రిమండలి తీసుకొన్న ఒక నిర్ణయాన్ని అహంకారం మూర్తీభవించిన, రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తులు- పత్రికా రచయితల సమక్షంలో- నిస్సిగ్గుగా చించివేశారు. వారికి అనువైనప్పుడల్లా రాజ్యాంగానికి మార్పుచేర్పులను చేయడానికీ, రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడానికీ వారు అలవాటు పడిపోయారు. మంత్రివర్గ నిర్ణయాన్ని తెలియజేసే పత్రాన్ని ఒక అహంకారపూరిత వ్యక్తి చించి వేసి, ఆ నిర్ణయాన్ని మంత్రిమండలి వెనుకకు తీసుకోకతప్పని పరిస్థితిని కల్పించడం శోచనీయం. ఈ పద్ధతిలో, ఏ రకం  వ్యవస్థయినా ఎలా పని చేస్తుంది?


 

అధ్యక్షా,

రాజ్యాంగం పట్ల వారు వ్యవహరించిన తీరు గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆ సమయంలో దానిలో భాగం పంచుకున్న వారు దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ రాజ్యాంగం పైన మాత్రమే నా దృష్టి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలు నేను పంచుకోవడం లేదు. చారిత్రక వాస్తవాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను.

అధ్యక్షా

కాంగ్రెస్ పార్టీ పదేపదే రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోంది, దాని ప్రాధాన్యాన్ని తగ్గిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలను ఉపేక్షించిన ఉదాహరణలతో కాంగ్రెస్ వారసత్వం నిండి ఉంది. 370 వ అధికరణ గురించి అందరికీ తెలిసిందే కానీ, 35ఏ అధికరణ గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా, చట్టబద్దత లేకుండా దేశంలో 35ఏ అధికరణను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ చట్టం రాజ్యాంగానికి మూలస్తంభం లాంటి పార్లమెంట్ పవిత్రతను దెబ్బతీసింది. పార్లమెంటే పక్కకు వెళ్లిపోయింది, దాని గొంతును అణిచివేశారు. పార్లమెంట్ అంగీకారం లేకుండా, రాష్ట్రపతి ఆదేశాలతో 35ఏను అమల్లోకి తీసుకువచ్చి, చట్టసభను అంధకారంలోకి నెట్టేశారు. 35ఏ అధికరణ అమలు చేయకుండా ఉంటే, జమ్ము కాశ్మీర్లో పరిస్థితి ఇలా దారుణంగా ఉండేది కాదు. ఈ ఏపకక్ష నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా, దేశానికి దీర్ఘకాలిక సమస్యలను తెచ్చిపెట్టింది.

అద్యక్షా,

అది పార్లమెంటుకున్న విశిష్టాధికారం. ఇలాంటి విషయాల్లో ఎవరూ తమకు తోచినట్లుగా వ్యవహరించకూడదు. మెజారిటీ ఉన్నప్పటికీ, ఈ పద్ధతిని కొనసాగించడానికి వారు విముఖత వ్యక్తం చేశారు. వారి అపరాధ భావం నుంచే ఇది పుట్టుకొచ్చింది. తాము చేస్తున్న పనులను ప్రజల నుంచి దాచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

అధ్యక్షా,

ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అత్యంత గౌరవమిస్తారు. ఆయనకు చాలా ప్రత్యేక స్థానం కల్పించారు. మన జీవితంలో పురోగతిని తీసుకొచ్చిన మార్పులకు బాట వేసిన సూత్రధారి ఆయనే.

అధ్యక్షా

ఆ కాలంలో బాబా సాహెబ్ అంబేద్కర్‌పై చూపించిన ద్వేషం గురించి చర్చించాలని నేను అనుకోవడం లేదు. అటల్ జీ అధికారంలో ఉన్నప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్‌‌కు గౌరవ సూచకంగా స్మారక స్థూపాన్ని నిర్మించాలని భావించారు. ఈ నిర్ణయం అటల్‌జీ హయాంలో తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ, పదేళ్ల యూపీఏ పాలనలో ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ముందుకు తీసుకెళ్లలేదు. తిరిగి మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బాబా సాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవంతో ఆలీపూర్ రోడ్‌లో బాబా సాహబ్ మెమోరియల్‌ను నిర్మించాం.

అధ్యక్షా

చంద్రశేఖర్‌జీ ప్రధానిగా ఉన్న సమయంలో 1992లో బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారకోత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనపథ్ వద్ద అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ 40 ఏళ్లుగా ఆ ఆలోచన ఎలాంటి పురోగతికి నోచుకోకుండా కాగితాలకే పరిమితమైంది. 2015లో మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాన్ని పూర్తి చేసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలనే నిర్ణయం కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాతే కార్యరూపం దాల్చింది.

అధ్యక్షా,

ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 125 వ జయంతోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఆయన శతజయంతి జరుపుకున్న సమయంలో మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలి మహూను ఆయన గౌరవార్థం పునర్నిర్మించింది.

అధ్యక్షా,

బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు అంకితభావంతో పనిచేశారు. భారతదేశం సమగ్రాభివృద్ధి సాధించాలంటే ఏ ప్రాంతమూ లేదా వర్గమూ వెనకబడి ఉండిపోకూడదని దృఢంగా నమ్మేవారు. ఈ ఆలోచనే రిజర్వేషన్ల పద్ధతికి నాంది పలికేలా చేసింది. అయితే, మతపరమైన బుజ్జగింపుల కోసం చేసిన స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి తీరని అన్యాయం జరిగింది.

అధ్యక్షా,

రిజర్వేషన్ల కథ సుదీర్ఘంగా, సవాళ్లతో నిండి ఉంటుంది. నెహ్రూజీ నుంచి రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ ప్రధానమంత్రులు అందరూ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రులకు నెహ్రూ విస్తృతంగా లేఖలు రాసినట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. అంతే కాకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇదే సభలో సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారు. కానీ భారతదేశంలో సమానత్వాన్ని, సమతూకమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టారు. వాటిని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు.

సమాజంలో అసమానతలను పరిష్కరించాలని సూచించిన మండల్ కమిషన్ నివేదిక దశాబ్దాల పాటు మరుగునపడింది. అధికారం నుంచి కాంగ్రెస్ తప్పుకున్న తర్వాతే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అప్పటి వరకు వివిధ హోదాల్లో దేశానికి సేవ అందించడంలో ఓబీసీలకు సరైన స్థానం దక్కలేదు. ఇది వారికి కాంగ్రెస్ చేసిన తీరని అన్యాయం. ఓబీసీలకు రిజర్వేషన్లు ముందే అమలు చేసి ఉంటే వివిధ హోదాల్లో జాతి నిర్మాణం కోసం వారు తమదైన రీతిలో సేవలు అందించి ఉండేవారు. ఈ విషయంలో ఏమీ చేయకూడదని కాంగ్రెస్ భావించింది. ఆ పార్టీ చేసిన మరో పాపం ఇది, వారు చేసిన పనులకు పర్యవసానాలను దేశం భరిస్తూనే ఉంది.

అధ్యక్షా,

రాజ్యాంగం ముసాయిదా దశలో ఉన్నప్పుడు, రాజ్యాంగ సభ వ్యవస్థాపక సభ్యులు రిజర్వేషన్లను మతపరంగా కల్పించాలా? వద్దా? అనే అంశంపై గంటలు, రోజుల తరబడి చర్చల్లో నిమగ్నమయ్యారు. విస్తృత చర్చల అనంతరం, భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం మతం లేదా వర్గం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదని సమష్టి నిర్ణయం తీసుకున్నారు. ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. యాదృచ్ఛికంగా లేదా పొరపాటున తీసుకున్నది కాదు. దేశ ఐక్యత, సమగ్రత కోసం మతం లేదా వర్గం ఆధారంగా ఇలాంటి నిబంధనలు తీసుకురాకూడదని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించారు. కానీ అధికార దాహం, ఓటు బ్యాంకును తృప్తి పరచాలనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లను కల్పించే కొత్త ఆటను మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో దానిని అమల్లోకి తీసుకువచ్చి, సుప్రీంకోర్టు నుంచి అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మాత్రం కొత్త సాకులు, ఆలోచనలతో వస్తూ.. ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పుకుంటున్నారు. వారి అసలు ఉద్దేశం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, మతపరమైన రిజర్వేషన్లను కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. అధ్యక్షా, ఇది రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను దెబ్బ తీసే సిగ్గులేని చర్య.

అధ్యక్షా,

ప్రస్తుతం వార్తల్లో ఉన్న అంశమైన ఉమ్మడి పౌర స్మృతి గురించి నేను చర్చించాలనుకుంటున్నాను. ఈ అంశాన్ని రాజ్యాంగ సభ కూడా విస్మరించలేదు. ఉమ్మడి పౌర స్మృతి గురించి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. విస్తృత చర్చల అనంతరం భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసే విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిదనే భావనకు వచ్చారు. ఇది రాజ్యాంగ పరిషత్తు నుంచి వచ్చిన నిర్దేశం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరైతే రాజ్యాంగాన్ని, ఈ దేశాన్ని అర్థం చేసుకోలేదో, ఎవరైతే అధికార కాంక్షను దాటి ఏదీ చదవలేరో వారికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వాస్తవంగా ఏమి చెప్పారో తెలియదు. బాబాసాహెబ్ చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ అంశంపై వీడియోలు ఎడిట్ చేసి అసందర్భోచితంగా, తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేయవద్దు.

అధ్యక్షా,

మతం ఆధారంగా రూపొందించిన పర్సనల్ చట్టాలను రద్దు చేయాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గట్టిగా వాదించారు. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ సభ్యుడైన కేఎం మున్షీ, ఐక్యతకు, జాతిని ఆధునికికీరించడానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని సుప్రీం కోర్టు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఆ దిశగా పనిచేయాలని ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ నిర్మాతల భావాలను దృష్టిలో పెట్టుకొని లౌకిక పౌర స్మృతిని తీసుకొచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డి అంకిత భావంతో మేం పనిచేస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రూపకల్పన చేసిన వారి ఆలోచనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలను, ఆకాంక్షలను కూడా అగౌరవపరుస్తోంది. ఎందుకంటే ఈ చర్యలు వారి రాజకీయ ఎజెండాకు విరుద్ధంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని వారు పవిత్ర గ్రంథంగా భావించడం లేదు. వారు దాన్ని రాజకీయ వ్యూహాలకు ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రజల్లో భయం నింపడానికి, రాజకీయ క్రీడలు ఆడే వస్తువుగా రాజ్యాంగాన్ని మార్చేశారు.

అధ్యక్షా,

రాజ్యాంగం అనే పదాన్ని పలకడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు. తన సంస్థాగత రాజ్యాంగాన్ని గౌరవించలేని పార్టీ, సొంత మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండని పార్టీ, దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని ఆశించలేం. రాజ్యాంగాన్ని అంగీకరించి, అనుసరించడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అవసరం, అది వారి రక్తంలో లేదు. నిరంకుశత్వం, వారసత్వ రాజకీయాలు వారి నరనరాల్లోనూ ఇంకిపోయి ఉన్నాయి. వారు పాటించే ప్రజాస్వామ్య విలువలు, పనితీరులో గందరగోళం చూడండి. నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాను. 12 కాంగ్రెస్ ప్రావిన్సు కమిటీలు ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్‌కు మద్ధతిచ్చాయి. ఒక్కటంటే ఒక్క కమిటీ కూడా నెహ్రూకు మద్దతివ్వలేదు. వారి పార్టీ విధానం ప్రకారం సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధాని కావాల్సి ఉంది. కానీ ఏం జరిగింది? ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేకుండా, వారి పార్టీ విధానాలనే విస్మరించి సర్దార్ పటేల్‌ను పక్కన పెట్టి అధికారం సొంత చేసుకున్నారు. తన రాజ్యాంగాన్నే పాటించని పార్టీ దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తుంది?

అధ్యక్షా,

వారు చెప్పే కథలకు సరిపోయే పేర్లను రాజ్యాంగంలో వెతుక్కుంటున్న వారికి, వారి సొంత పార్టీ చరిత్రలోనే జరిగిన చేదు నిజాన్ని గుర్తు చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అత్యంత వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా పనిచేశారు. వెనకబడిన వర్గానికి కాదు, అత్యంత వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పేరు సీతారాం కేసరిజీ. ఆయనకి ఎలాంటి మర్యాదనిచ్చారో తెలుసా? ఆయన అవమానపడ్డారు. ఆయన్ను బాత్రూంలో బంధించారు, ఆ తర్వాత నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేశారు. ఈ విధంగా అవమానించమని వారి పార్టీ రాజ్యాంగంలో రాయలేదు. కానీ దానిని పూర్తిగా విస్మరించారు. వారు తమ సొంత పార్టీ రాజ్యాంగంలోని ప్రజాస్వామ పద్ధతులనే సరిగ్గా పట్టించుకోలేదు. కాలక్రమేణా, ప్రజాస్వామ్వ విలువలను పూర్తిగా విడిచిపెట్టి, కుటుంబ పాలనకు బందీగా ఆ పార్టీ మారిపోయింది.

అధ్యక్షా,

రాజ్యాంగంతో ఆడుకోవడం, దాని స్ఫూర్తిని నాశనం చేయడం కాంగ్రెస్ స్వభావంలో పూర్తిగా ఇంకిపోయింది. రాజ్యాంగం, దాని పవిత్రత, సమగ్రత మాకు అత్యంత విలువైనవి. ఈ మాటలు చెప్పడానికే మేం పరిమితం కాలేదు - మా పనులు దానిని రుజువు చేస్తున్నాయి. కఠిన పరీక్షలు ఎదురైనప్పుడల్లా సరికొత్త ఉత్సాహంతో పుంజుకున్నాము. మీకొక ఉదాహరణ చెబుతాను. 1996లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మమ్మల్ని రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 13 రోజులే కొనసాగింది. మేము రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించకుండా ఉండి ఉంటే, మెజారిటీ సాధించేందుకు పదవులు, ఉప ప్రధానమంత్రిత్వాలు లేదా ఇతర ప్రోత్సాహకాలను అందించి అధికారాన్ని సొంతం చేసుకునేందుకు బేరసారాలకు దిగి అధికార ఫలాలను అనుభవించి ఉండేవాళ్లం. అలాంటి మార్గాన్ని అటల్ జీ ఎంచుకోకుండా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకున్నారు. అందుకే 13 రోజుల తర్వాత రాజీనామా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చుతునక. 1998 లో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే)గా స్థిరమైన ప్రభుత్వాన్ని మేం ఏర్పాటు చేశాం. కానీ, ‘‘మేం కాకపోతే ఇంకెవ్వరూ ఉండకూడదు’’ అనే మనస్తత్వం ఉన్నవారు అటల్ జీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యదావిధిగా కుయుక్తులు పన్నారు. అప్పుడు విశ్వాస పరీక్ష జరిగింది. ఆ సమయంలో కూడా ఓట్ల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం జరిగింది. కానీ అటల్‌జీ రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి, ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడానికి సిద్ధపడ్డారు. ప్రభుత్వం పడిపోయింది కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువు నిలబడ్డాయి. ఇదీ మా చరిత్ర, మా విలువలు, మేం పాటించే సంప్రదాయం. మరో వైపు ఏం జరిగిందో చూడండి. సంఖ్యాబలం లేని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఓటుకి నోటు కుంభకోణానికి పాల్పడ్డారు. నోట్ల కట్టలను పార్లమెంటులోకి తీసుకొచ్చారు. న్యాయవ్యవస్థ కూడా దీన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దారుణమైన దాడిగా పరిగణించింది. పవిత్రమైన భారతదేశ పార్లమెంట్‌ను ఓట్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగే సంతలా మార్చేశారు.   

ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకున్న నిబద్ధతకు, దాన్ని తారుమారు చేసే కాంగ్రెస్ స్వభావానికి మధ్య ఉన్న  ఈ బేధమే రాజ్యాంగానికి మేము ఇచ్చే విలువను, దాని పట్ల వారి అలక్ష్యాన్ని తెలియజేస్తుంది.

అధ్యక్షా,

1990ల్లో పార్లమెంటు సభ్యులకు నిస్సిగ్గుగా లంచాలిచ్చిన కార్యక్రమం జరిగింది – 140 కోట్ల మంది హృదయాల్లో దాచుకున్న రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కిన క్షమించరాని పాపమది. అధికార దాహం, అధికార కాంక్ష ఈ రెండే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర, వర్తమానం.

అధ్యక్షా,

2014లో ఎన్డీయేకు తిరిగి  సేవ చేసే అవకాశం వచ్చింది. రాజ్యాంగం, ప్రజాస్వామం బలోపేతమయ్యాయి. పాత రుగ్మతల నుంచి దేశాన్ని విముక్తం చేసే కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. గదచిన పదేళ్లలో మీరు కూడా రాజ్యాంగ  సవరణలు చేశారు కదా అని అడిగారు. అవును మేం రాజ్యాంగ సవరణలు చేశాం- జాతీయ ఐక్యత, దాని సమగ్రత, ఉజ్వల భవిష్యత్తు కోసం, రాజ్యాంగ స్పూర్తికి కట్టుబడి వాటిని చేశాం. ఎందుకు మేం సవరణలు చేయాల్సి వచ్చింది? గత మూడు దశాబ్ధాలుగా దేశంలోని ఓబీసీ  వర్గం ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించమని కోరుతోంది.  వారి గౌరవాన్ని నిలబెట్టేందుకు మేం రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పించాం. ఇలా చేయడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం. సమాజంలో అణచివేతకు గురైన, అణగారిన వర్గాలకు చెందిన వారికి అండగా నిలవడం మా బాధ్యత. అందుకే రాజ్యాంగ సవరణ చేశాం.

అధ్యక్షా,

ఈ దేశంలో... కులంతో నిమిత్తం లేకుండా, పేదరికం వల్ల అవకాశాలను అందిపుచ్చుకోలేని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు జీవితంలో ముందుకెళ్లలేకపోయారు.. ఇది అసంతృప్తి, అశాంతి పెరగడానికి దారితీసింది. డిమాండ్లు వచ్చినప్పటికీ, ఎవరూ సరైన చర్యలు తీసుకోలేదు. మేం రాజ్యాంగ సవరణ ద్వారా జనరల్ కేటగిరీ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దేశంలో రిజర్వేషన్ల కోసం జరిగిన మొదటి సవరణ ఇది. దీనిపై ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. ప్రతి ఒక్కరూ సహృదయంతో, సదవగాహనతో దీనిని స్వాగతించారు. సామాజిక ఐక్యతను పెంపొందించడంతోపాటు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నందునే పార్లమెంటు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అందరూ సహకరించడం వల్లే ఈ సవరణ జరిగింది.

అధ్యక్షా,

అవును, మేం రాజ్యాంగానికి సవరణలు చేశాం. అయితే, మహిళలను సాధికారులను చేయడానికే మేం వాటిని చేశాం. ఆ సమయంలో.. బిల్లును సభలో ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ల దిశగా ముందడుగు పడుతున్న వేళ.. వారి మిత్రపక్షాల్లో ఒకరు వెల్ లోకి దూసుకొచ్చి పత్రాలను లాక్కుని చించేశారు. దాంతో సభ వాయిదా పడింది — పాత పార్లమెంటు భవనమే దీనికి సాక్షి. దీంతో ఈ వ్యవహారం 40 ఏళ్లుగా నిలిచిపోయింది. ఇక మహిళల హక్కుల పురోగతిని అడ్డుకున్న అదే వ్యక్తులు నేడు వారి మార్గనిర్దేశకులనుకుంటున్నారు. దేశంలోని మహిళలకు అన్యాయం చేసిన వారే ఇప్పుడు వారికి నిర్దేశకులవుతున్నారు!  

అధ్యక్షా,

దేశ ఐక్యత కోసం రాజ్యాంగ సవరణలు చేశాం. అధికరణ 370 అవరోధంగా ఉండడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ లో కూడా అమలు కాలేకపోయింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశంలోని ప్రతి భాగానికీ వర్తింపజేయాలని మేం భావించాం. బాబాసాహెబ్ గౌరవార్థం.. రాజ్యాంగ సవరణ చేసి సాహసోపేతంగా అధికరణ 370ని తొలగించి దేశ ఐక్యతను బలోపేతం చేశాం. ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది.

అధ్యక్షా,

రాజ్యాంగ సవరణ ద్వారా మేం అధికరణ 370ని తొలగించాం. పొరుగు దేశాల్లోని మైనారిటీలకు ఏ సంక్షోభం ఎదురైనా భారత్ ఆదుకోవాలని.. విభజన సమయంలో మహాత్మాగాంధీ సహా సీనియర్ నాయకులంతా బహిరంగంగానే సూచించారు. గాంధీజీ ఇచ్చిన హామీని ఆయన పేరుతో అధికారంలోకి వచ్చిన వారు ఏనాడూ నెరవేర్చలేదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా ఆ హామీని మేం నెరవేర్చాం. ఇది మేం తెచ్చిన చట్టమని గర్వంగా చెప్తున్నాం. ఇప్పుడూ దాన్ని సమర్థిస్తున్నాం. అందులో మేం వెనుకడుగు వేయబోం. ఎందుకంటే, దేశ రాజ్యాంగ స్ఫూర్తికి మేం దృఢంగా కట్టుబడి ఉన్నాం.

అధ్యక్షా,

గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు, ఉజ్వల భవిష్యత్తు దిశగా స్థిరమైన దారులు వేసేందుకు మేం రాజ్యాంగ సవరణలు చేశాం. మేం నిజమో కాదో కాలమే తేలుస్తుంది. ఈ సవరణలు స్వార్థ అధికార ప్రయోజనాల కోసం చేసినవి కావు – అవి దేశ ప్రయోజనాల కోసం సత్సంకల్పంతో చేసినవి. కాబట్టి, అవి దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని ఈ నిర్ణయాలను ప్రశ్నించే వారు అర్థం చేసుకోవాలి.

అధ్యక్షా,

రాజ్యాంగం గురించి ఇక్కడ అనేక ప్రసంగాలు చేశారు. అనేక అంశాలను లేవనెత్తారు. ప్రతి ఒక్కరికీ స్వీయ పరిమితులున్నాయి. రాజకీయాల్లో నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొన్ని పనులు చేయడానికి అవకాశముంది. అయినప్పటికీ.. అధ్యక్షా! మన రాజ్యాంగంలో దేశ ప్రజలే ఎల్లప్పుడూ అత్యంత సునిశితమైన అంశం. ‘ప్రజలమైన మేము’ అంటే భారత పౌరులు. రాజ్యాంగమున్నది వారికోసమే, వారి సంక్షేమం కోసమే, వారి గౌరవం కోసమే. కాబట్టి, సంక్షేమ రాజ్యం దిశగా రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుంది. సంక్షేమ రాజ్యమంటే పౌరులకు గౌరవప్రదమైన జీవితానికి భరోసా కల్పించడం. మన కాంగ్రెస్ సహచరులెప్పుడూ ఓ మాటను ఇష్టంగా చెప్తుంటారు.. దాన్నే నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నాను. వారు ఎక్కువగా ఇష్టపడే పదం, వారికి అవినాభావ సంబంధమున్న పదం ‘జుమ్లా’. మా కాంగ్రెస్ సహచరులు రాత్రింబవళ్లు ‘జుమ్లా’ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ దేశంలో ‘గరీబీ హటావో’ అనే అతిపెద్ద ‘జుమ్లా’ నాలుగు తరాల పాటు కొనసాగిందని ప్రజలకు తెలుసు. ఈ పేదరిక నిర్మూలన నినాదమొక ‘జుమ్లా’. ఇది వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడి ఉండవచ్చు. కానీ పేదల పరిస్థితి ఎప్పుడూ మెరుగుపడలేదు.

అధ్యక్షా,

స్వాతంత్ర్యం వచ్చిన అనేక ఏళ్ల అనంతరం కనీసం టాయిలెట్ సదుపాయం కూడా లేకుండా ఓ కుటుంబం గౌరవప్రదంగా జీవిస్తున్నదని నిజంగా ఎవరైనా చెప్పగలరా? దీన్ని పరిష్కరించడానికి సమయం కూడా మీకు లేదా? మన దేశంలో టాయిలెట్ కట్టుకోవడం ఒకప్పుడు పేదలకు కలగా ఉండేది. ఉద్యమంలా జరిగిన టాయిలెట్ల నిర్మాణం ద్వారా.. వారి ఆత్మగౌరవం దిశగా అది సాకారమైంది. మేం ఈ పనిని చేపట్టి అవిశ్రాంతంగా పనిచేశాం. దీన్ని అపహాస్యం చేశారని తెలుసు. ఏదేమైనా.. జనసామాన్యం గౌరవాన్ని నిలబెట్టాలని మేం మనస్పూర్తిగా భావించాం కాబట్టి మేం అధైర్యపడలేదు, దృఢంగా నిలబడి ముందుకు సాగాం. అందుకే, ఆ కల నెరవేరింది. తల్లులు, సోదరీమణులు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం సూర్యోదయానికి ముందో, సూర్యాస్తమయం తరువాతో బహిర్భూమికి వెళ్లేవారు. అది మీకు ఎన్నడూ ఎలాంటి బాధనూ కలిగించలేదు. మీరు పేదలను టీవీలోనో, పత్రికల పతాక శీర్షికల్లోనో చూశారు.. వారి జీవన వాస్తవికత మీకు తెలియకపోవడమే అందుకు కారణం. లేదంటే, మీరు వారిని ఇంతటి అన్యాయానికి గురి చేసేవారు కాదు.

అధ్యక్షా,

ఈ దేశంలో 80% మంది స్వచ్ఛమైన తాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. వారు దానిని పొందకుండా నా రాజ్యాంగం అడ్డుకుందా? సామాన్య ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడాన్ని రాజ్యాంగం లక్ష్యంగా పెట్టుకుంది.

అధ్యక్షా,

గొప్ప కృషి, అంకితభావంతో మేం ఈ దిశగానూ ముందుకెళ్లాం.

అధ్యక్షా,

ఈ దేశంలో లక్షలాది మంది తల్లులు పొయ్యిలపై ఆహారాన్ని వండుకునేవారు. పొగతో వారి కళ్ళు ఎర్రబడ్డాయి. పొగలో వంట చేయడమంటే వందలాది సిగరెట్ల పొగను పీల్చడం లాంటిదని చెప్తారు. అది వారి శరీరాల్లోకి వెళ్లేది. వారి కళ్లు మండేవి, వారి ఆరోగ్యం క్షీణించేది. వారికి పొగ నుంచి విముక్తి కల్పించేందుకు మేం కృషిచేశాం. 2013 వరకు 9 సిలిండర్లివ్వాలా లేదంటే 6 సిలిండర్లివ్వాలా అన్న చర్చలే జరిగాయి. కానీ అనతికాలంలోనే, గ్యాస్ సిలిండర్ దేశంలో ప్రతి ఇంటినీ చేరింది. ఎందుకంటే, ప్రతి పౌరుడూ, అదీ 70 ఏళ్ల అనంతరం.. మౌలిక సదుపాయాలు తప్పక పొందాలన్నది మా ఉద్దేశం.

అధ్యక్షా,

మన పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేందుకు రాత్రింబవళ్లు కష్టపడి తమ పిల్లలను చదివించాలనుకుంటారు, కానీ ఒక్కసారి అనారోగ్యం ఇంటిని చుట్టుముట్టిందంటే.. వారి ప్రణాళికలన్నీ నాశనమవుతాయి, మొత్తం కుటుంబం శ్రమ వృథా అవుతుంది. ఈ పేద కుటుంబాల చికిత్స కోసం మీరేమీ ఆలోచించలేకపోయారా? రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ 50 నుంచి 60 కోట్ల మంది పౌరులకు ఉచిత వైద్యం అందేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మేం అమలు చేశాం. నేడు సామాజికవర్గంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వారికి కూడా ఆ సదుపాయాన్ని అందించాం.

అధ్యక్షా,

నిరుపేదలకు ఆహార సామగ్రి అందించడం గురించి మేం మాట్లాడితే, దాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారు. 25 కోట్ల మంది విజయవంతంగా పేదరికాన్ని జయించారని మేం చెప్తుంటే.. ‘‘మరి మీరు ఇప్పటికీ పేదలకు ఆహార సామగ్రి ఎందుకిస్తున్నారు’’ అని అడుగుతున్నారు.

అధ్యక్షా,

పేదరికం నుంచి బయటపడిన వారికి వాస్తవం తెలుసు. రోగి కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి బయటికెళ్లేటప్పుడు.. ‘‘ఇంటికి వెళ్లండి, మీ ఆరోగ్యం బాగానే ఉంది, శస్త్రచికిత్స విజయవంతమైంది. కానీ వచ్చే నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి, కొన్ని విషయాలకు దూరంగా ఉండండి, అలా అయితే మీకు మళ్లీ ఏ ఇబ్బందీ ఉండదు’’ అని చెప్తారు. అదేవిధంగా, పేదలు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా చూసుకోవడానికి వారికి చేయూతనివ్వడం చాలా అవసరం. అందుకే వారికి ఉచితంగా రేషన్ అందిస్తున్నాం. ఈ కృషిని అపహాస్యం చేయకండి.. ఎందుకంటే మేం వారిని పేదరికం నుంచి బయటికి తెచ్చాం, తిరిగి అందులో పడకూడదని కోరుకుంటున్నాము. ఇంకా పేదరికంలో మగ్గుతున్న వారిని అందులోనుంచి బయటకు తెచ్చేలా మేం కృషి చేయాల్సి ఉంది.

అధ్యక్షా,

మన దేశంలో పేదల పేరుతో నినాదాలు చేశారు. పేదల పేరు చెప్పే బ్యాంకులను జాతీయం చేశారు. కానీ, 2014 వరకూ 50 కోట్ల మంది ప్రజలు బ్యాంకు గడప కూడా తొక్కలేదు.

అధ్యక్షా,

పేదలకు బ్యాంకులోకి ప్రవేశం కూడా ఉండేది కాదు.. ఈ అన్యాయం చేసింది మీరే. కానీ నేడు.. 50 కోట్ల మంది పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలనిచ్చి వారి కోసం మేం బ్యాంకు ద్వారాలను తెరిచాం. అది మాత్రమే కాదు.. ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, లబ్ధిదారుడికి 15 పైసలే చేరుతున్నాయని ఒక ప్రధాని చెప్పేవారు. కానీ ఎన్నడూ దానికి పరిష్కారం చూపలేదు. మేం పరిష్కారం చూపాం. ఇవాల, ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, 100 పైసలూ పేదల ఖాతాల్లోకే వస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే బ్యాంకును సక్రమంగా ఎలా వాడుకోవాలో, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మేం చూపించాం.

అధ్యక్షా,

గ్యారంటీ ఏదీ లేకుండా బ్యాంకుల దగ్గరకు కూడా వెళ్లేందుకు వీలుపడని వ్యక్తులు.. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పూచీకత్తూ లేకుండానే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఈ అధికారాన్ని మేం పేదలకు అందించాం. రాజ్యాంగం పట్ల మాకున్న నిబద్ధత వల్లే ఇది సాధ్యపడింది.

అధ్యక్షా,

ఇందువల్లే ‘పేదరిక నిర్మూలన’ అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. పేదలను ఈ కష్టాల నుంచి గట్టెక్కించడమే మా లక్ష్యం, దానికి మేం కట్టుబడి ఉన్నాం. ఆ లక్ష్యం దిశగా రేయింబవళ్లూ కృషిచేస్తున్నాం. ఎవరూ పట్టించుకోని వారి బాధలను మోదీ వింటాడు, వారి యోగక్షేమాలను చూసుకుంటాడు.

అధ్యక్షా,

‘దివ్యాంగజనులు’ నిత్యం పోరాడుతున్నారు. ఇప్పుడే మన దివ్యాంగులకు మౌలిక సదుపాయాలు మెరుగ్గా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చక్రాల కుర్చీలు రైల్వే కంపార్టుమెంట్ల వరకూ ఎక్కడికైనా వెళ్లగలవు. సమాజంలో అట్టడుగున ఉన్న, అణగారిన ప్రజల ప్రయోజనాల పట్ల మా శ్రద్ధాసక్తులే ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుకు కారణం. వారి సంక్షేమంపై మాకున్న అంకితభావమే ఈ మార్పునకు కారణమైంది.

అధ్యక్షా,

భాషలో ఎలా వాదించాలో మీరు నాకు చెప్పారు. కానీ, నా దివ్యాంగ జనులకు జరిగిన అన్యాయం మాటేమిటి? ఉదాహరణకు.. ప్రత్యేకించి వినికిడి, భాషణ లోపాలున్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సంకేత భాషా వ్యవస్థ! అస్సాంలో ఓ తరహా సంకేత భాష నేర్పుతారు, ఉత్తర ప్రదేశ్ లో మరొకటి, మహారాష్ట్రలో ఇంకొకటి. ఒక ఉమ్మడి సంకేత భాష ఉండడం మన దివ్యాంగ జనులకు అత్యంత కీలకమైన అవసరం. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల అనంతరం కూడా దీనిగురించి ఎవరూ ఆలోచించలేదు. ఏకీకృత సంకేత భాషా  వ్యవస్థను రూపొందించేలా మేం చొరవ తీసుకున్నాం. అదిప్పుడు దేశంలోని దివ్యాంగ సోదరీ సోదరులందరికీ ఉపయోపడుతోంది.

అధ్యక్షా,

మన సమాజంలోని సంచార, అర్ధ సంచార సమూహాలు చాలా కాలంగా విస్మరణకు గురయ్యాయి. వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు మేం శ్రీకారం చుట్టాం. వారి ప్రయోజనాలపై శ్రద్ధ వహించడం రాజ్యాంగ పరమైన ప్రాధాన్యం. మేం వారికి గుర్తింపు లభించేలా కృషి చేశాం.

అధ్యక్షా,

ఇరుగుపొరుగున, ప్రతీ ప్రాంతంలో, ఫ్లాట్ వద్ద లేదా సమాజంలో వీధి వ్యాపారులు మనందరికీ తెలుసు. రోజూ ఉదయం వీధి వ్యాపారి వచ్చి కష్టపడి పనిచేసి.. ఇతరుల జీవనం నిరాటంకంగా కొనసాగేలా సహాయపడతారు. వీళ్లంతా రోజూ 12 గంటలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక్కోసారి కార్లను అద్దెకు తీసుకుంటారు, ఎక్కువ వడ్డీకి డబ్బును అప్పు తెచ్చుకుని వాటితో సరుకులు కొనుక్కుంటారు. సాయంత్రానికల్లా అప్పు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించి పిల్లల కోసం ఆహారాన్ని కొనుక్కుపోవాల్సి వస్తుంది. ఇదీ వారి పరిస్థితి. మా ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తూ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా వారు ఈ పథకంలో మూడో దశకు చేరుకున్నారు. వారిప్పుడు నేరుగా బ్యాంకు నుంచి గరిష్ట రుణాలను పొందుతున్నారు. ఇది వారి ప్రతిష్ఠను పెంచి అభివృద్ధికి దోహదపడడంతోపాటు వ్యాపార విస్తరణను పెంచుతుంది.

అధ్యక్షా,

దేశంలో విశ్వకర్మల సేవలు అవసరం లేని వారుండరు. సమాజంలో అతి ముఖ్యమైన ఈ వ్యవస్థ శతాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ విశ్వకర్మ వర్గం గురించి ఏనాడూ ఆలోచించలేదు. మేం విశ్వకర్మ వర్గాల సంక్షేమం కోసం ఓ ప్రణాళికను రూపొందించాం. బ్యాంకుల నుంచి రుణాలు అందే ఏర్పాట్లు చేశాం, వారికి తగిన శిక్షణ అందించాం, అధునాతనమైన పనిముట్లను అందించాం. తద్వారా కొత్త నమూనాల రూపకల్పనలో, వాటిని మరింత అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడడంపై దృష్టిసారించాం.

అధ్యక్షా,

ట్రాన్స్ జెండర్లు కుటుంబం చేతా, సమాజం చేతా తిరస్కరణకు గురయ్యారు. వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వారిని గుర్తించింది. మా ప్రభుత్వమే భారత రాజ్యాంగం ప్రకారం వారికి హక్కులు కల్పించింది. చట్టపరమైన నిబంధనలు, ఏర్పాట్ల ద్వారా వారి హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు మేం కృషిచేశాం. వారు గౌరవం, రక్షణలతో కూడిన జీవితాన్ని గడిపేలా భరోసానిచ్చాం.

అధ్యక్షా,

ఆదివాసీ సమూహాల గురించి మనమెప్పుడూ మాట్లాడుకుంటాం. నాకు గుర్తుంది.. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ గ్రామం నుంచి అంబాజీ వరకు గుజరాత్ తూర్పు ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతమే. స్వయంగా ఆదివాసీ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి చాలా ఏళ్లు పాలించినప్పటికీ.. ఆ ప్రాంతంలో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ఒక్క పాఠశాల కూడా లేదు. నేను రాకముందు ఒక్క పాఠశాలలో కూడా విజ్ఞాన శాస్త్ర బోధన ఉండేది కాదు. విజ్ఞాన శాస్త్రాలను బోధించే పాఠశాలలు లేనప్పుడు.. రిజర్వేషన్ల గురించి ఎంత మాట్లాడినా ఆ పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు ఎలా కాగలరు? ఆ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషిచేశాను. ఇప్పుడక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే పాఠశాలలున్నాయి. విశ్వవిద్యాలయాలను కూడా అక్కడ నెలకొల్పాం. రాజకీయాలు మాట్లడడం సులభమే. కానీ, అధికారం కోసం మాత్రమే ఆలోచించడం వల్లే వారు రాజ్యాంగం ప్రకారం పనిచేయలేదు. ఆదివాసీ సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి సంక్షేమం కోసం కృషిచేశాం. మాకు దిశానిర్దేశం చేసిన మన రాష్ట్రపతికి నా కృతజ్ఞతలు. ఆ నిర్దేశం ద్వారా పీఎం జన్ మాన్ పథకాన్ని సృష్టించాం. ఆదివాసీ సమాజాల్లోని విస్మరణకు గురైన చిన్న, వెనుకబడిన వర్గాల అభ్యున్నతిపై ఇది దృష్టిపెడుతుంది. వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయాలు వారినెప్పుడూ విస్మరించినప్పటికీ.. మోదీ వారిని చేరాడు, పీఎం జన్ మాన్ పథకం ద్వారా వారి అభివృద్ధికి భరోసా కల్పించాడు.

అధ్యక్షా,

అన్ని వర్గాల అభివృద్ధిలో సమతౌల్యం సాధించేందుకే అత్యంత వెనుకబడిన వ్యక్తులకు కూడా రాజ్యాంగం అవకాశాలు కల్పిస్తుంది. తదనుగుణంగా బాధ్యతలనూ అందిస్తుంది. అదేవిధంగా, ఏ భౌగోళిక ప్రాంతమూ ఇందుకు మినహాయింపు కాదు. గతంలో మన దేశం ఏం చేసింది? 60 ఏళ్లుగా 100 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. ‘వెనుకబడిన జిల్లాలు’ అనే ఈ ముద్ర వాటిని అభివృద్ధికి దూరం చేసింది. ఈ ప్రాంతాలకు బదిలీలు జరిగితే అధికారులు దానిని ‘శిక్ష’గా భావించారు. బాధ్యతాయుతమైన అధికారులెవరూ అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఈ మొత్తం పరిస్థితినీ మేం మార్చేశాం. ‘అభిలషణీయ జిల్లాలు’ అనే భావనను మేం పరిచయం చేశాం. 40 ప్రమాణాల ఆధారంగా ఆన్లైన్లో మేం వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాం. నేడు, ఈ ఆకాంక్షాత్మక జిల్లాలలో అనేకం ఆయా రాష్ట్రాల్లో మెరుగైన పనితీరు కనబరిచే జిల్లాల స్థాయికి చేరుకున్నాయి. కొన్నైతే జాతీయ సగటు స్థాయిలను చేరుకున్నాయి. అభివృద్ధికి ఏ ప్రాంతమూ మినహాయింపు కాకూడదు. ప్రస్తుతం ‘అభిలషణీయ బ్లాకులు’గా గుర్తించడం ద్వారా 500 ప్రాంతాల అభ్యున్నతి దిశగా మేం పనిచేస్తున్నాం. వాటి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం.

అధ్యక్షా,

పెద్దపెద్ద కథలు చెప్పేవారిని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది - ఈ దేశంలో ఆదివాసీ సమాజం 1947 తర్వాతనే ఉన్నదా? రాముడు, కృష్ణుడి కాలంలో ఆదివాసీ సమాజం లేదా? ఆదివాసీ సమాజం ఎప్పట్నుంచో ఉంది.. వారిని మనం ‘ఆదిపురుష్’గా పిలుచుకుంటాం. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంత పెద్ద ఆదివాసీ సామాజిక వర్గానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా లేదు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆదివాసీ వ్యవహారాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఆదివాసీల అభివృద్ధి, వికాసం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు.

అధ్యక్షా,

మత్స్యకార సమాజం మచ్చివర ఇప్పటిదేనా? వారి బాధలను మీరు గుర్తించలేదా? మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమే. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించడంతోపాటు ఆ వర్గాల సమస్యలను కూడా మేం పరిష్కరించాం.

అధ్యక్షా,

మన దేశంలో సన్నకారు రైతులు వారి కోసం సహకార సంఘాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. అది వారి జీవనంలో విడదీయలేని భాగమైంది. సహకార రంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి, దానిని మరింత సమర్థవంతంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దడం ద్వారా చిన్న, సన్నకారు రైతులను మేం సాధికారులుగా మార్చాం. చిన్న రైతుల సంక్షేమానికి మేం మనస్పూర్తిగా కృషిచేస్తున్నాం. ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను మేం ఏర్పాటు చేశాం. సవాళ్లను పరిష్కరించే మా విధానానికి ఇది నిదర్శనం. అలాగే, దేశ యువతే మన బలమని మేం గుర్తించాం. ప్రపంచం సమర్థవంతమైన శ్రామిక శక్తి కోసం అన్వేషిస్తున్న తరుణంలో.. మన జనాభా నిర్మితి మనకు గొప్ప అవకాశం. అంతర్జాతీయ శ్రామికశక్తి అవసరాలకు అనుగుణంగా మన యువతను సన్నద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను నెలకొల్పాం. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మన యువతకు నైపుణ్యాలను అందించి, అంతర్జాతీయ వేదికలపై వారు పరుగులుపెట్టేలా తీర్చిదిద్దాం.

అధ్యక్షా,

తక్కువ ఓట్లు లేదా తక్కువ సీట్లు ఉన్న కారణంగా మన ఈశాన్య రాష్ట్రాలను ఎవరూ పట్టించుకోలేదు. అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వమే తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆ కృషి ఫలితాలను మనమిప్పుడు చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అభివృద్ధి మార్గాలు పరచుకున్నాయి. ఫలితంగా.. ఈ ప్రాంతంలో రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతూ.. అవి వేగంగా పురోగమిస్తున్నాయి.

అధ్యక్షా,

నేటికీ, అభివృద్ధి చెందిన దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భూమి రికార్డులకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మన పల్లెల్లో సామాన్యులకు చాలావరకూ తమ భూమికి, ఇంటికి సంబంధించి సరైన యాజమాన్య పత్రాలు ఉండవు. దాంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడం లేదా వారు లేనప్పుడు ఆక్రమణల నుంచి వారి ఆస్తులను రక్షించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పరిష్కరించడం కోసం స్వామిత్వ యోజనను మేం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని అట్టడుగు, నిరుపేద ప్రజలకు యాజమాన్య పత్రాలను అందిస్తున్నాం. తద్వారా వారికి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు అందిస్తున్నాం. ఈ స్వామిత్వ యోజన ముఖ్యమైన ముందడుగుగా రుజువైంది. నిరుపేదల సాధికారతకు సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది.

అధ్యక్షా,

గత పదేళ్లుగా ఇన్ని చర్యల ద్వారా పేదల సాధికారత కోసం అవిశ్రాంతంగా పనిచేశాం. నిరుపేదల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాం. వారిని సరైన దిశలో నడిపించాం. ఫలితంగా అనతికాలంలోనే 25 కోట్ల మంది దేశ ప్రజలు విజయవంతంగా పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ విజయంపై మేం గర్విస్తున్నాం. రాజ్యాంగ నిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజ్యాంగ మార్గదర్శకత్వంలోనే మేమే కృషి చేశాం. దీనిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాను.

అధ్యక్షా,

మేం చెప్పే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ కేవలం నినాదం మాత్రమే కాదు.. ఇది మాపై నమ్మకానికి ప్రతీక. అందుకే ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేశాం. రాజ్యాంగంలో ఎలాంటి పక్షపాతానికీ తావులేదు. ప్రతి పథకం ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు 100 శాతం అందేలా చూడటం ద్వారా పరిణతితో కూడిన పాలన సాగించాలని మేం భావించాం. ఈ పరిణత/సంతృప్త విధానమే నిజమైన లౌకికవాదం. వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయమైన వాటా అందేలా చూడడమే నిజమైన సామాజిక న్యాయం. నిజమైన లౌకికవాదం, నిజమైన సామాజిక న్యాయాల స్ఫూర్తితోనే మేం కృషిచేస్తున్నాం.

అధ్యక్షా,

దేశానికి మార్గనిర్దేశం చేయడం, ముందుకు నడిపే సామర్థ్యం మన రాజ్యాంగం అందించే మరో స్ఫూర్తి. దేశ దిశను నిర్దేశించే చోదకశక్తిగా రాజకీయాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. వచ్చే దశాబ్ధాల్లో రాజకీయాల భవిష్యత్తు గమనంలో మన ప్రజాస్వామ్య పథం ఏమిటన్న విషయమై మనమిప్పుడు చర్చించాల్సిన అవసరముంది.

అధ్యక్షా,

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలు, అధికార దాహంతో నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి మరుగున పడే వాతావరణాన్ని సృష్టించాయి. నేను అన్ని రాజకీయ పార్టీలనూ ప్రశ్నించాలనుకుంటున్నాను - కుటుంబ వారసత్వంతో సంబంధం లేకుండా సమర్థవంతమైన నాయకత్వానికి ఈ దేశంలో సరైన అవకాశం ఉండకూడదా? రాజకీయ కుటుంబాల నుంచి రాని వారికి రాజకీయ ద్వారాలు మూసుకునే ఉండాలా? కుటుంబ కేంద్రీకృత రాజకీయాలు భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి హాని కలిగించలేదా? భారత ప్రజాస్వామ్యాన్ని వారసత్వ రాజకీయాల బారి నుంచి విముక్తం చేయడం మన రాజ్యాంగపరమైన బాధ్యత కాదా? కుటుంబ కేంద్రీకృత రాజకీయాలు పూర్తిగా ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతాయి - ప్రతి నిర్ణయం, విధానం వారి ప్రయోజనాల కోసమే అయి ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రతిభావంతులైన, సమర్థులైన యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఎలాంటి రాజకీయ వారసత్వం లేని వ్యక్తులను తమ శ్రేణుల్లోకి ఆహ్వానించడానికి రాజకీయ పార్టీలు పూనుకోవాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించాను. ఆ విషయాన్ని నేను చెప్తూనే ఉంటాను. రాజకీయ కుటుంబ నేపథ్యం లేని 1,00,000 మంది యువకులను రాజకీయ రంగంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. దేశానికి కొత్త గాలి కావాలి, రెట్టించిన ఉత్సాహం కావాలి, సరికొత్త సంకల్పాలు – దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని స్వప్నించే యువత కావాలి. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దిశగా నిర్ణయాత్మకంగా ముందుకు సాగుదాం.

 

అధ్యక్షా,

మన రాజ్యాంగంలో పొందుపరిచిన విధుల గురించి ఒకసారి ఎర్రకోట నుంచి నేను మాట్లాడిన విషయం నాకు గుర్తుంది. ఆ విధుల అంశాన్ని కూడా కొందరు ఎగతాళి చేయడం చూసి ఆశ్చర్యపోయాను. తన బాధ్యతలను నిర్వర్తించాలన్న భావనను ప్రపంచంలో ఎవరూ తప్పు పడతారని అనుకోలేం. దురదృష్టవశాత్తూ, ఈ ప్రాథమిక సూత్రాన్నీ అపహాస్యం చేసేవారున్నారు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడి హక్కులను కల్పించింది. అయితే, విధులను నిర్వర్తించాలని సూచిస్తుంది. ధర్మం, బాధ్యతలు, విధులే మన నాగరికత సారం. మహాత్మా గాంధీ ఓసారి చెప్పిన మాటను నేను ప్రస్తావించాను – ‘‘తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తే.. హక్కులు సహజంగానే లభిస్తాయని మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. ఆమె చదువుకోలేదు.. కానీ చాలా తెలివైనది’’. ఈ విషయాన్ని మహాత్మాగాంధీ చెప్పారు. గాంధీజీ ఈ సందేశం ఆధారంగా.. మన ప్రాథమిక విధులను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తే, ‘వికసిత భారత్’గా ఈ దేశ పరివర్తనను ఎవరూ అడ్డుకోలేరని నేను దృఢంగా విశ్వసిస్తాను. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. విధులు నిర్వర్తించడంలో మన అంకితభావాన్ని బలోపేతం చేసే సందేశంగా ఈ ఘట్టం ఉపయోగపడాలి. ఇది తక్షణ అవసరం.

 

అధ్యక్షా,

రాజ్యాంగ స్పూర్తి నుంచి ప్రేరణ పొంది.. దేశ భవిష్యత్తు కోసం 11 తీర్మానాలను గౌరవ సభ ఎదుట ప్రవేశపెట్టాలని భావిస్తున్నాను.

 

1. మొదటి తీర్మానం: పౌరులైనా, ప్రభుత్వమైనా అందరూ తమ విధులు తప్పక నిర్వర్తించాలి.

2. రెండో తీర్మానం: 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్'కు అనుగుణంగా ప్రతి ప్రాంతం, ప్రతి సామాజికవర్గం అభివృద్ధి చెందాలి.

3. మూడో తీర్మానం: అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. అవినీతిపరులైన వ్యక్తులను సామాజిక ఆమోదం ఉండకూడదు.

4. నాలుగో తీర్మానం: దేశ చట్టాలు, నియమాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండడానికి దేశ పౌరులు గర్వించాలి.

5. ఐదో తీర్మానం: బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొంది మన వారసత్వం పట్ల గర్వించాలి.

6. ఆరో తీర్మానం: దేశ రాజకీయాలు వారసత్వ పాలన నుంచి విముక్తి పొందాలి.

7. ఏడో తీర్మానం: రాజ్యాంగాన్ని గౌరవించాలి తప్ప రాజకీయ లబ్ధి కోసం దాన్ని సాధనంగా వాడుకోకూడదు.

8. ఎనిమిదో తీర్మానం: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ.. రిజర్వేషన్లు పొందుతున్న వారి హక్కులను హరించడానికి వీల్లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే అన్ని ప్రయత్నాలను ఆపాలి.

9. తొమ్మిదో తీర్మానం: మహిళల నేతృత్వంలోని అభివృద్ధిలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి.

10. పదో తీర్మానం: రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధికి దోహదం చేయాలి. ఇదే మన ప్రగతికి మంత్రం కావాలి.

11. పదకొండో తీర్మానం: ‘ఏక భారత్ శ్రేష్ట భారత్’ లక్ష్యం సర్వోన్నతం కావాలి.

 

అధ్యక్షా,

ఈ సంకల్పంతో అందరం కలిసి ముందుకు సాగితే.. రాజ్యాంగంలోని అంతర్లీన స్ఫూర్తి అయిన ‘ప్రజలమైన మేము’, ‘సబ్ కా ప్రయాస్’ (సమష్టి కృషి) ‘వికసిత భారత్’ స్వప్నం సాకారమయ్యే దిశగా మనల్ని నడిపిస్తుంది. ఈ సభలోని ప్రతి ఒక్కరూ, అలాగే దేశంలోని 140 కోట్ల మంది పౌరులూ ఈ స్వప్నంలో భాగస్వాములవ్వాలి. దేశం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే తప్పకుండా ఆశించిన ఫలితాలను సాధిస్తుంది. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల పట్ల, వారి శక్తి పట్ల, ‘యువశక్తి’ పట్ల, ‘నారీ శక్తి’ పట్ల నాకు అపారమైన గౌరవముంది. అందుకే 2047లో దేశం వందేళ్ల స్వతంత్ర సంబరాలను చేసుకునే నాటికి ‘వికసిత భారత్’గా నిలుస్తుందని నేను చెప్తున్నాను. ఈ సంకల్పంతో ముందుకు సాగుదాం. ఈ మహత్తరమైన, పవిత్రమైన కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు. సమయాన్ని పొడిగించిన గౌరవనీయ సభాధ్యక్షుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మీ అందరికీ ధన్యవాదాలు.

 

ధన్యవాదాలు

 

***


(Release ID: 2086042) Visitor Counter : 92