ప్రధాన మంత్రి కార్యాలయం
అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసిన ప్రధాని
ఈశాన్య ప్రాంతం భారతదేశానికి ‘అష్టలక్ష్మి’: ప్రధానమంత్రి
అష్టలక్ష్మి మహోత్సవం ఈశాన్య ప్రాంత ఉజ్వల భవితను పండుగలా జరిపే వేడుక;
ఇది అభివృద్ధి నవోదయాన్ని సూచించే ఉత్సవం,
ఇది ‘వికసిత్ భారత్’ మిషన్‌ను మరింత ముందుకు తీసుకుపోతుంది: ప్రధాని
మేం ఈశాన్య ప్రాంతాన్ని ఉద్వేగం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం అనే మూడు అంశాలతో ముడివేస్తున్నాం: ప్రధాని
Posted On:
06 DEC 2024 7:27PM by PIB Hyderabad
అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.
భారత్ మండపం గత రెండేళ్ళలో అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక అయిందని, ఆ కార్యక్రమాల్లో విజయవంతంగా ముగిసిన జి-20 సమావేశం కూడా ఒకటిగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు నిర్వహించుకొంటున్న కార్యక్రమం మరింత ప్రత్యేకమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఈశాన్య భారత వన్నెచిన్నెలతో పూర్తి ఢిల్లీ తళుకులీనేటట్లు చేసిందని ఆయన అభివర్ణించారు. వచ్చే మూడు రోజులపాటు ప్రప్రథమ అష్టలక్ష్మి మహోత్సవ్‌ను నిర్వహించుకొంటామని ఆయన చెబుతూ, ఈ కార్యక్రమం ఈశాన్య భారతం శక్తి సామర్థ్యాలను మన దేశ ప్రజలకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కూడా చాటిచెప్పనుందన్నారు. ఈ కార్యక్రమంలో అనేక వ్యాపార ఒప్పందాలు జరగనున్నాయని, ఈ కార్యక్రమం ఈశాన్య ప్రాంత సంస్కృతిని కళ్లకు కట్టనుందని, ఈశాన్య ప్రాంత వంటకాలు, తదితర ఆకర్షణలు ఇక్కడ కొలువుదీర నున్నాయన్నారు. ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్న ‘పద్మ’ పురస్కారాల విజేతలు సహా వివిధ రంగాలకు చెందిన కార్యసాధకుల ఘనతలను చూసి ప్రజలు స్ఫూర్తిని పొందే అవకాశాన్ని ఈ ఉత్సవం ఇవ్వనుందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అద్వితీయమూ, ఇదే మొదటిసారికూడానని శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, ఇది ఈశాన్య భారతదేశంలో భారీ పెట్టుబడి అవకాశాలకు తలుపులు తెరవనుందన్నారు. ఇది రైతులకు, కార్మికులకు, చేతివృత్తులవారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు లభించిన ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఈశాన్య భారతంలో ఉన్న భిన్నత్వాన్ని, అనేక అవకాశాలను తెలియజేస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తూ, అష్టలక్ష్మి మహోత్సవ్ నిర్వాహకులకు, ఈశాన్య భారత ప్రజలకు, పెట్టుబడిదారులకు తన శుభాకాంక్షలు తెలిపారు.
గడచిన వంద, రెండువందల ఏళ్ల కాలంలో ప్రపంచంలోని పశ్చిమ దేశాల ఉన్నతిని ప్రతి ఒక్కరూ గమనించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థాయిలలో ప్రపంచంపై పశ్చిమ ప్రాంతం ప్రభావాన్ని చూపిందని ప్రధాన మంత్రి అన్నారు. యాదృచ్చికంగా భారతదేశంలో కూడా పశ్చిమ ప్రాంత ప్రభావంతోపాటు భారత వృద్ధి గాథలో పశ్చిమ ప్రాంతం పోషించిన పాత్ర ప్రభావం కనిపించిందని ఆయన అన్నారు. పశ్చిమ దేశాలకు ప్రాధాన్యం పెరిగిన కాలం గడచిపోయాక, 21వ శతాబ్దం తూర్పు ప్రాంతానికి చెందిందవుతుంది. అది కూడా ముఖ్యంగా ఆసియాకూ, భారతదేశానికీ చెందుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే కాలాల్లో భారతదేశ వృద్ధి గాథ తూర్పు భారత్‌కు, ముఖ్యంగా ఈశాన్య భారత్‌కు చెందుతుందన్న ద్రుఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత దశాబ్దులలో ముంబయి, అహమదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లు పెద్ద నగరాలుగా వృద్ధిలోకి రావడాన్ని భారత్ చూసిందని, ఇక ఇప్పుడు గౌహతి, అగర్తలా, ఇంఫాల్, ఇటానగర్, గాంగ్‌టక్, కోహిమా, షిల్లాంగ్, ఐజ్వాల్ వంటి నగరాల నూతన శక్తియుక్తులను భారత్ చూడబోతోందని, దీనిలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రధాన పాత్రను పోషించనున్నాయని ఆయన అన్నారు.
భారతీయ సంప్రదాయాలను గురించి ప్రధానమంత్రి చెబుతూ, లక్ష్మీదేవిని సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యాల దేవతగా పిలుచుకొంటూ ఉంటారని ప్రస్తావించారు. లక్ష్మీ మాతకు ఉన్న ఎనిమిది రూపాలను ఆయన ఒక్కటొక్కటిగా వివరించారు. ఇదే మాదిరిగా, ఈశాన్య భారతంలోనూ ఎనిమిది రాష్ట్రాలు మనకు ‘అష్టలక్ష్ములు’గా ఉన్నాయని, వాటి పేర్లు అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం అని శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. అష్టలక్ష్ముల ఎనిమిది రూపాలకు ఈశాన్య ప్రాంతంలోని ఈ ఎనిమిది రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఆయన అన్నారు.
ఆది లక్ష్మి రూపం అష్టలక్ష్ములలో మొట్టమొదటిదని శ్రీ మోదీ అంటూ, మన ఈశాన్య ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఆది సంస్కృతి ప్రబలంగా విస్తరించిందన్నారు. ఈశాన్య భారతంలో ప్రతి ఒక్క రాష్ట్రం తనదైన సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా పాటిస్తోందని ప్రధాని చెబుతూ, ఈ సందర్భంగా మేఘాలయలోని చెరీ బ్లాసం ఫెస్టివల్, నాగాలాండ్‌లో హార్న్‌బిల్ ఫెస్టివల్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ ఫెస్టివల్, మిజోరంలో చప్‌చార్ కూట్ ఫెస్టివల్, అసోంలో బీహూలతోపాటు మణిపురి నాట్యాన్ని గురించి తెలిపారు. ఇలా చెప్పుకొంటూపోతే ఈశాన్య భారతం గొప్ప వైవిధ్యానికి నిలయంగా ఉందన్నారు.
లక్ష్మీదేవి రెండో రూపం ‘ధన లక్ష్మి’ని గురించి ప్రధానమంత్రి చెబుతూ, ఈశాన్య ప్రాంతంలో ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అక్కడ ఖనిజాలు, చమురు, తేయాకు తోటలు, జీవవైవిధ్యంల మేలికలయిక వర్ధిల్లుతోందన్నారు. అక్కడ పునరుత్పాదక ఇంధన వనరులు అపారంగా ఉన్నాయని, ఇది యావత్తు ఈశాన్య ప్రాంతానికి ‘‘ధన లక్ష్మి’’ అనుగ్రహించిన దీవెన, ఆ దేవత ప్రసాదించిన ఒక వరం అని ఆయన అభివర్ణించారు.
లక్ష్మీదేవి మూడో రూపం అయిన ‘ధాన్య లక్ష్మి’ ఈశాన్య ప్రాంతాన్ని ఎంతగానో కరుణిస్తోందని శ్రీ మోదీ అంటూ, ప్రాకృతిక వ్యవసాయానికి, సేంద్రీయ వ్యవసాయానికి, చిరుధాన్యాల సాగుకు ఈశాన్య ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. భారతదేశంలో పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం కొనసాగుతూ ఉన్న మొట్టమొదటి రాష్ట్రం సిక్కిం. ఈ కారణంగా సిక్కింను చూసుకొని మన దేశం గర్వపడుతోందని ఆయన అన్నారు. ధాన్యం, వెదురు, మసాలా దినుసులు, ఔషధీయ మొక్కలను ఈశాన్య ప్రాంతాల్లో పండిస్తున్నారని, ఇది అక్కడి సాగుశక్తికి ఒక నిదర్శనంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యప్రదమైన జీవనశైలికి, పోషణ వి విజ్ఞానానికి సంబంధించిన అంశాల్లో ప్రపంచానికి భారతదేశం అందించదలుస్తున్న మార్గదర్శకత్వానికి దోహదం చేసే పరిష్కారాలు ఈశాన్య ప్రాంతంలో దండిగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.
అష్టలక్ష్మి రూపాలలో నాలుగో రూపం ‘గజ లక్ష్మి’ గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ, ఈ గజ లక్ష్మీదేవి ఒక పద్మం పై ఆసీనురాలై ఉంటారని, ఆమెకు ఇరుపక్కలా గజరాజులు అభిషేకిస్తూ ఉంటాయన్నారు. ఈశాన్య ప్రాంతం విస్తృతంగా ఉన్న అటవీప్రాంతాలకు, కజిరంగా, మానస్, మెహావో వంటి జాతీయ పార్కులు, ఇతరత్రా వన్యప్రాణి అభయారణ్యాలకు పేరెన్నిక గన్నది అని ఆయన గుర్తు చేశారు. అక్కడ అద్భుతమైన గుహలు, మనోహరమైన చెరువులు ఉన్నాయన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత మనోహరమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దే శక్తి గజ లక్ష్మీ మాత ఆశీర్వాదాలకు ఉందని ఆయన అభివర్ణించారు.
సృజనాత్మకతకు, నైపుణ్యాలకు ఈశాన్య ప్రాంతం పేరు తెచ్చుకొందని, ఈ రెండు అంశాలు అష్టలక్ష్మి రూపాలలో అయిదో రూపమైన ‘సంతాన లక్ష్మి’కి ప్రతీకలని ప్రధాన మంత్రి ప్రధానంగా చెప్పారు. ‘సంతాన లక్ష్మి’ అంటే సృజనశీలత్వానికి, ఉత్పాదకతకు ప్రతీకని ఆయన అన్నారు. అసోంకు చెందిన ముగా పట్టు, మణిపూర్‌కు చెందిన మొయిరాంగ్ ఫీ, వాంఖేయీ ఫీ, నాగాలాండ్‌లో చాఖేశాంగ్ శాలువాలు వంటి చేనేతల, హస్తకళల ప్రావీణ్యం అందరి మనస్సులను దోచుకోగలిగేవేనని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంత హస్తకళలతోపాటు సృజనాత్మకతతోనూ, చేతివృత్తి పనితనంతోనూ నిండి ఉండే భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను సొంతం చేసుకొన్న ఉత్పత్తులు డజన్లకొద్దీ అక్కడ తయారవుతున్నాయని కూడా ఆయన అన్నారు.
అష్టలక్ష్మి రూపాలలో ఆరవ రూపం ‘వీర లక్ష్మి’.. ఈ రూపం ధైర్యసాహసాలకు, శక్తికి సంకేతం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంతం మహిళా శక్తికి ఒక సంకేతంగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. నారీ శక్తిని చాటిచెప్పిన మణిపూర్‌లోని నుపీ లాన్ ఉద్యమాన్ని ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బానిసత్వాన్ని ప్రతిఘటిస్తూ ఈశాన్య ప్రాంత మహిళలు ఎలుగెత్తి పోరాడిన ఘట్టం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని శ్రీ మోదీ అన్నారు. జానపద గాథల్లో మనకు ఎదురుపడే సాహసిక మహిళలు మొదలు మన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న రాణీ గైదిన్‌లియూ, కనకలత బరువా, రాణి ఇందిరా దేవి, లల్‌నూ రోపిలియానీ వంటి వారు యావత్తు దేశానికీ స్ఫూర్తిగా నిలిచారని ఆయన అన్నారు. ఈ సంప్రదాయాన్ని ఈశాన్య ప్రాంతానికి చెందిన పుత్రికలు ఈనాటికీ పరిరక్షిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంత మహిళల్లో తొణికిసలాడుతున్న ఔత్సాహిక పారిశ్రామికత్వం పూర్తి ఈశాన్య ప్రాంతానికి ఒక గొప్ప బలాన్ని ఇచ్చిందని, ఇది సాటి లేనిదని కూడా ఆయన అన్నారు.
అష్టలక్ష్మీ రూపాలలో ఏడో లక్ష్మిని ‘జయ లక్ష్మి’గా చెబుతూ, ఈ దేవత ప్రఖ్యాతిని, కీర్తిని ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశంపై యావత్తు ప్రపంచం పెట్టుకొన్న ఆశలు, అంచనాలలో ప్రధాన పాత్ర ఈశాన్య ప్రాంతానిదేనని ఆయన చెప్పారు. భారతదేశం తన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో సంధానించాలనే అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తుండగా, ఆసియాలోని దక్షిణ ప్రాంత దేశాలలో, తూర్పు ప్రాంత దేశాలలో ఉన్న అపార అవకాశాలతో భారత్‌ను ఈశాన్య ప్రాంతం కలుపుతున్నదని ఆయన అన్నారు.
అష్టలక్ష్ములలో ఎనిమిదో లక్ష్మి ‘విద్యా లక్ష్మి’. ఈ దేవత విద్యకు, జ్ఞానానికి సంకేతంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించడంలో తోడ్పడే ప్రధాన విద్యా కేంద్రాలు ఎన్నో ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఉన్నాయన్నారు. వాటిలో ఐఐటి గౌహతి, ఎన్ఐటి సిల్చర్, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి అగర్తలతోపాటు ఐఐఎమ్ షిల్లాంగ్ వంటివి ఉన్నాయని ఆయన వివరించారు. ఈశాన్య ప్రాంతానికి మొట్టమొదటి ఎఐఐఎమ్ఎస్ ఇప్పటికే దక్కిందని, దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని మణిపూర్‌లో నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. ఈశాన్య ప్రాంతం మనకు మేరీ కామ్, బైచూంగ్ భూటియా, మీరాబాయి చానూ, లవ్లీనా, సరితా దేవి వంటి ప్రముఖ క్రీడాకారిణులను ఎందరినో అందించిందని తెలిపారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతం టెక్నాలజీ సంబంధిత అంకుర సంస్థలు, సేవా కేంద్రాలు, సెమీ కండక్టర్స్ తయారీ వంటి పరిశ్రమల ఏర్పాటు అంశంలోనూ ముందడుగు వేయడం మొదలుపెట్టిందని, ఈ సంస్థలలో వేలాది యువత పని చేస్తున్నారని శ్రీ మోదీ చెప్పారు. ఈ ప్రాంతం యువతీయువకులు విద్యను, నైపుణ్యాలను సంపాదించుకొనేందుకు ఒక ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొంటోందని ఆయన అన్నారు.
‘‘ఈశాన్య ప్రాంతానికున్న మేలైన భవిష్యత్తును ఒక పండుగలా చేసుకొనే సందర్భమే అష్టలక్ష్మి మహోత్సవ్’’ అని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇది అభివృద్ధి నవోదయ సంబరం. ఇది ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) ఆవిష్కారానికి దన్నుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనే ఉత్సాహం ప్రస్తుతం ఉరకలెత్తుతోంది. గత పదేళ్ళలో ఈశాన్య ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోవడాన్ని ప్రతిఒక్కరూ గమనించారని ఆయన అన్నారు. ఈ ప్రయాణం అంత సులభమైంది ఏమీ కాదని, భారత వృద్ధి ప్రయాణంలో ఈశాన్య రాష్ట్రాలను కూడా కలుపుకొని ముందుకు పోవడానికి చేతనైన ప్రతి ఒక్క చర్యను ప్రభుత్వం తీసుకొందని శ్రీ మోదీ తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో ఓట్లు, సీట్లు తక్కువ స్థాయిలో ఉన్న కారణంగా ఇదివరకటి ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని ఏమంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసిందని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.
ఢిల్లీకి, ఈశాన్య ప్రాంత ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గత పదేళ్ళలో అలుపెరుగక శ్రమించిందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు 700 సార్లకు పైగా ఈశాన్య ప్రాంతంలో పర్యటించారని, అక్కడి ప్రజలతో చాలా కాలం అనుబంధాన్ని పెంచుకోవడంతో ప్రభుత్వానికి, ఈశాన్య ప్రాంతానికి మధ్య భావోద్వేగభరితమైన బంధాన్ని ఏర్పరచారని శ్రీ మోదీ అన్నారు. దీనితో అక్కడ అభివృద్ధి గొప్పగా జోరందుకొందని ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ, 1990 దశాబ్దంలో ఒక విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో 50కి పైగా మంత్రిత్వ శాఖలు వాటి బడ్జెట్‌లలో 10 శాతం బడ్జెట్‌ను ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 1990 దశాబ్దం నాటి నుంచీ పోల్చిచూస్తే, గత పదేళ్ళలో ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు ఎంతో అధిక స్థాయిలో ఉన్నాయన్నారు. ఒక్క గత దశాబ్దంలోనే, పైన ప్రస్తావించిన పథకం కింద ఈశాన్య ప్రాంతంలో రూ.5 లక్షల కోట్ల కన్నా ఎక్కువ నిధులను ఖర్చు చేశారని, దీనినిబట్టి చూస్తే ఈశాన్య ప్రాంతం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యాన్ని కనబరిచిందీ తెలుస్తుందని ఆయన అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా ‘పిఎం-డెవైన్’, ‘స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ స్కీమ్’, ‘నార్త్ ఈస్ట్ వెంచర్ ఫండ్’ వంటి అనేక ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాలు అనేక కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయని అంటూ ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ పథకాన్ని కూడా ప్రారంభించించామని వెల్లడించారు. కొత్త పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తే కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందని చెప్పారు. భారతదేశానికి సెమీకండక్టర్ రంగం కొత్తదని, ఈ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అస్సాంను ఎంచుకుందని చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పినప్పుడు, మన దేశ పెట్టుబడిదారులు, ప్రపంచ పెట్టుబడిదారులు అక్కడ లభ్యమయ్యే కొత్త అవకాశాలను అన్వేషిస్తారని అన్నారు.
"ఈశాన్య ప్రాంతాలను భావోద్వేగాలు, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం అనే మూడు సూత్రాలతో జోడిస్తున్నాం" అని శ్రీ మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాక భవిష్యత్తుకు బలమైన పునాదులను నిర్మిస్తున్నామని అన్నారు. గత దశాబ్దాలలో అనేక ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో రైలు అనుసంధాన కొరత సవాలుగా నిలిచిందని, 2014 తర్వాత తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, సామాజిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి సారించిందని వెల్లడించారు. ఈ చర్యలు మౌలిక సదుపాయాల నాణ్యతను, ఈశాన్య ప్రజల జీవన నాణ్యతనూ మెరుగుపరిచాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అమలును కూడా తమ ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలియజేస్తూ బోగి-బీల్ వంతెనను ప్రస్తావించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బోగి-బీల్ వంతెన పూర్తి కావడానికి ముందు ధేమాజీ-దిబ్రూగఢ్ ల మధ్య ప్రయాణం ఒక రోజంతా కొనసాగేదని, వంతెన పూర్తయ్యాక రెండు ఊర్ల మధ్య ప్రయాణాన్ని కేవలం ఒకటి లేదా రెండు గంటల్లో పూర్తి చేయవచ్చని శ్రీ మోదీ అన్నారు.
“గత దశాబ్దంలో దాదాపు 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తయ్యాయి” అని శ్రీ మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా టన్నెల్, ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ మూడు రహదార్ల హైవే, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలలో సరిహద్దు రోడ్ల ప్రాజెక్టులు బలమైన రహదారి వ్యవస్థను ఏర్పరచాయని చెప్పారు. గత సంవత్సరం G-20 సందర్భంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ (ఐ-ఎంఏసీ) నిర్మాణాన్ని భారత్ చేసిన సూచనను గుర్తుచేసుకున్న శ్రీ మోదీ, ఐ-ఎంఏసీ భారతదేశ ఈశాన్య ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానిస్తుందని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల రైలు కనెక్టివిటీ అనేక రెట్లు పెరిగిందని, ఈశాన్య రాష్ట్రాలలోని అన్ని రాజధాని నగరాలను రైలు మార్గంలో కలిపే పని పూర్తి కానుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈశాన్య ప్రాంతంలో మొదటి వందే భారత్ రైలు పరుగులు తీయడం ప్రారంభించిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఈశాన్య ప్రాంతంలో విమానాశ్రయాలు, విమాన సేవల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని శ్రీ మోదీ చెప్పారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులపై జలమార్గాలను నిర్మించే పనులు కొనసాగుతున్నాయని, సబ్రూమ్ ల్యాండ్‌పోర్ట్ నుంచి నీటి అనుసంధానం మెరుగుపడుతోందని శ్రీ మోదీ వెల్లడించారు.
మొబైల్, గ్యాస్ పైప్‌లైన్ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రాన్ని ఈశాన్య గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నామని, సుమారు 1600 కి.మీ గ్యాస్ పైప్‌లైన్ను నిర్మిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 2600కు పైగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ కనెక్టివిటీపై కూడా దృష్టి సారించిందని, ఈశాన్య ప్రాంతంలో 13 వేల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో 5G కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చినందుకు శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈశాన్య ప్రాంతంలో సామాజిక సదుపాయాల కల్పన దిశగా అపూర్వమైన కృషి జరిగిందని, క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు ఆధునిక సౌకర్యాలు గల ఆసుపత్రులు సహా వైద్య కళాశాలలను విస్తరణను చేపట్టామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఈశాన్య ప్రాంతంలో లక్షలాది రోగులకు ఉచిత వైద్యం అందిందని ఆయన తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స అందించే ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డును అందించామని శ్రీ మోదీ తెలియజేశారు.
కనెక్టివిటీతో పాటు ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయం, వస్త్ర పరిశ్రమ, పర్యాటక రంగాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని శ్రీ మోదీ అన్నారు. దరిమిలా ఈశాన్య ప్రాంతాలను సందర్శించేందుకు ప్రజలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారని, గత దశాబ్దంలో పర్యాటకుల సంఖ్య దాదాపు రెట్టింపైందని శ్రీ మోదీ చెప్పారు. పెట్టుబడులు, పర్యాటకం పెరగడం వల్ల కొత్త వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. ప్రాథమిక సదుపాయాల నుంచీ సమ్మిళితం వరకూ, అనుసంధానం నుంచీ అనుబంధాల పెంపు వరకూ, ఆర్థికం నుండి భావోద్వేగాల వరకూ కొనసాగుతున్న ప్రయాణం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేరుస్తోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
అష్టలక్ష్మి రాష్ట్రాల యువతకు భారత ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యాన్నిస్తోందని, వారు ఎల్లప్పుడూ అభివృద్ధినే కోరుకుంటారని ప్రధాని అన్నారు. గత దశాబ్దంలో ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రంలో శాశ్వత శాంతి నెలకొనాలని దేశ ప్రజలందరూ బలంగా ఆకాంక్షించారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి వల్ల వేలాది యువత హింసా మార్గాన్ని విడిచిపెట్టి అభివృద్ధి పథంలో పయనం ప్రారంభించారని చెప్పారు. గత దశాబ్దంలో ఈశాన్య ప్రాంతంలో అనేక చారిత్రాత్మక శాంతి ఒప్పందాలు జరిగాయని, సరిహద్దు వివాదాలను ఆయా రాష్ట్రాలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నాయని ప్రశంసించారు. దరిమిలా ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక కేసులు చాలా వరకు తగ్గాయని అన్నారు. అనేక జిల్లాల నుంచి ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని తొలగించామన్న ప్రధాని, అష్టలక్ష్మికి కొత్త భవిష్యత్తును కలిసికట్టుగా లిఖించాలని, ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వ్యాఖ్యానించారు.
*****
MJPS/SR
(Release ID: 2082977)
Visitor Counter : 9
Read this release in:
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam