పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ పంచాయతీ పురస్కార విజేతలకు డిసెంబర్ 11న న్యూఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సత్కారం

మహిళల నాయకత్వంలో ఉన్న పంచాయతీల మెరుపులు:

జాతీయ పంచాయతీ పురస్కార విజేతలలో 42 శాతం పంచాయతీల సారథ్యం మహిళలదే

Posted On: 07 DEC 2024 6:26PM by PIB Hyderabad

ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డులను 2022-2023 సంవత్సరానికి అందుకోబోయేవారి వివరాలను పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అట్టడుగుస్థాయిలో అన్ని వర్గాలవారికీ అందే, దీర్ఘకాలంపాటు నిలిచి ఉండే అభివృద్ధి ప్రక్రియకు ఊతాన్నిచ్చే దిశలో దేశంలోని పంచాయతీ రాజ్ సంస్థలు చేస్తున్న మార్గదర్శక కృషిని, ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఈ పురస్కారాలు తోడ్పడుతాయి. ఈ నెల 11న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించే జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొని అవార్డు విజేతలకు, స్వీకర్తలకు పురస్కారాలను అందజేయనున్నారు.

 

 

 

 

అట్టడుగు స్థాయిలో పాలన, సమాజ అభివృద్ధి రంగాల్లో విస్తృత శ్రేణిలో విజయాలను సాధించినవారిని వివిధ కేటగిరీల్లో మొత్తం 45 మందిని ఈ సంవత్సరం పురస్కార విజేతలుగా ఎంపిక చేశారు. ఈ కేటగిరీల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం, గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, కర్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కారంలతోపాటు పంచాయత్ క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్‌లు ఉన్నాయి. ఈ పురస్కారాలు పేదరికాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ, బాలల సంక్షేమం, నీరు తగినంత స్థాయిలో లభ్యమయ్యేటట్టు జాగ్రత్తచర్యలు తీసుకోవడం, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక న్యాయం, మహిళలకు సాధికారిత కల్పన, వాతావరణ స్థిరత్వాన్ని పరిరక్షించడం వంటి కీలక రంగాలలో సాధించిన విజయాలను గుర్తిస్తాయి.

 

 

 

ఈ సంవత్సరం పోటీలో 1.94 లక్షల గ్రామ పంచాయతీలు పాల్గొన్నాయి. అవార్డులను గెలుచుకొన్న 42 పంచాయతీలలో 42 శాతం పంచాయతీలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఎంపికకు సునిశిత ప్రక్రియను అనుసరించారు. బ్లాకు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఏర్పాటుచేసిన 5 వివిధ కమిటీలు కొన్ని ప్రధాన రంగాలలో లోకలైజేషన్ ఆఫ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎల్ఎస్‌డీజీ)కి అనుగుణంగా పంచాయతీలు కనబరచిన పనితీరును క్షుణ్ణంగా మదింపు చేశారు. పంచాయతీ రాజ్ సంస్థలలో (పీఆర్ఐస్), గ్రామీణ స్థానిక సంస్థలలో (ఆర్ఎల్‌బీ) పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు పారదర్శకత్వాన్ని పెంచడానికి పంచాయతీ రాజ్ శాఖ కనబరుస్తున్న అచంచల నిబద్ధతను ఈ ప్రక్రియ ప్రముఖంగా చాటిచెబుతోంది.

అవార్డుల ప్రకటన ఘట్టం పూర్తికావడంతో, పంచాయతీ రాజ్ సంస్థల అభినందనీయ విజయాలను ఒక ఉత్సవంగా నిర్వహించడానికి రంగాన్ని సిద్ధం చేశారు. గ్రామీణ సమాజాలు చైతన్యంతోపాటు ఎలాంటి ప్రతికూల పరిస్థితులకైనా ఎదురొడ్డి నిలవగలిగేటట్లుగా వాటిని తీర్చిదిద్దడంలో పంచాయతీలు పోషించవలసిన పరివర్తనాత్మక పాత్రను ఈ పురస్కారాల ప్రకటన బలపరుస్తున్నది. ఈ పురస్కారాలను ఆయా సంస్థలు అమలుచేసిన అసాధారణ కార్యనిర్వహణకు ఒక గుర్తింపుగా ప్రదానం చేయడంతో పాటు, ఈ అత్యుత్తమ పద్ధతులను అనుసరించేటట్లుగా ఇతర పంచాయతీలకు ప్రేరణను అందించాలనే ఉద్దేశంతో కూడా ఇస్తున్నారు.

 

రాష్ట్రాలవారీ, కేటగిరీలవారీ పురస్కారాల విజేతల వివరాలను చూడడానికి: click here


(Release ID: 2082407) Visitor Counter : 30