ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్తగా తెచ్చిన మూడు నేరవిచారణ చట్టాల అమలు విజయవంతం చండీగఢ్‌లో దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
వలసకాలం నాటి చట్టాలకు ఈ చట్టాలు భరతవాక్యం పలుకుతాయి: ప్రధానమంత్రి
ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తున్న ‘‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం’’
అనే భావనను కొత్త నేర విచారణ చట్టాలు పటిష్టం చేస్తాయి: ప్రధానమంత్రి
సమానత్వం, సామరస్యం, సామాజిక న్యాయం.. ఈ ఆదర్శాల స్ఫూర్తితో న్యాయ సంహితను రూపొందించారు: ప్రధానమంత్రి
పౌరులకే ప్రాధాన్యం.. భారతీయ న్యాయ సంహితలో అతి కీలక సూత్రం ఇదే: ప్రధానమంత్రి
Posted On:
03 DEC 2024 4:03PM by PIB Hyderabad
పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... చండీదేవి మాతతో చండీగఢ్ గుర్తింపు జతపడి ఉందన్నారు. శక్తులలో ఒక రూపమే చండీదేవి, సత్యానికి, న్యాయానికి ప్రతీక చండీదేవి అని ఆయన అన్నారు. ఇవే అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలను సమగ్రంగా రూపొందించారన్నారు. దేశ ప్రజలు... భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొంటున్న, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం ఒక గొప్ప సందర్భం అని ప్రధాని అన్నారు. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక గట్టి ప్రయత్నమని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను అమలుచేస్తున్న తీరుతెన్నులపై ఒక ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటుచేయగా ఆ ప్రదర్శనలో కొంత భాగాన్ని తాను కాసేపటి కిందటే చూశానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. చట్టాలు అమలవుతున్న తీరును వివరించే ఈ ప్రత్యక్ష ప్రదర్శనను చూడాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరారు. కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా దేశ పౌరులందరికీ ఆయన తన స్నేహపూర్వక అభినందనలు తెలిపారు. చండీగఢ్ పాలన యంత్రాంగంలో ప్రతి ఒక్కరినీ కూడా ఆయన అభినందించారు.
దేశ నూతన న్యాయ సంహిత తుది రూపం మాదిరిగానే దాని రూపకల్పన ప్రక్రియ కూడా అంతే సమగ్రంగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎంతో మంది గొప్ప రాజ్యాంగ నిపుణులు, చట్ట నిపుణులు దీర్ఘాలోచనలు చేసి ఈ ప్రక్రియలో పాలుపంచుకొన్నారని ఆయన అన్నారు. దీనిపై సూచనలను, సలహాలను ఇవ్వాల్సిందిగా హోం మంత్రిత్వ శాఖ 2020 జనవరిలో కోరిందని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన చాలా మందితోపాటు, దేశంలో ఉన్నత న్యాయస్థానాలకు చెందిన పలువురు చీఫ్ జస్టిస్‌లు కూడా వారి వారి సూచనలను ఇచ్చారని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు, 16 హైకోర్టులు, జ్యుడీషియల్ అకాడమీలు, లా ఇనిస్టిట్యూషన్లు, పౌర సమాజ సంస్థలు, అనేక మంది మేధావులు.. చర్చలలోనూ, వాదోపవాదాలలోనూ మునిగితేలి, ఏళ్ళ తరబడి వారు గడించిన అనుభవాన్ని రంగరించి మరీ కొత్త సంహితల విషయంలో ఆలోచనలను, సలహాలను అందించారన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో మన దేశ అవసరాలపైన కూడా సంప్రదింపులు జరిగాయని ఆయన వివరిచారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత గడచిన ఏడు దశాబ్దాల్లో న్యాయ వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్ళపై తీవ్రస్థాయి మేధోమధనం జరిగిందని, దాంతోపాటే ప్రతి ఒక్క చట్టం ఆచరణకు వచ్చేసరికి ఎలా ఉండాలనే అంశాన్ని కూడా పరిశీలించారని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. న్యాయ సంహిత భవిష్యత్తు అనే కోణంపైన కూడా పరిశీలన చోటుచేసుకొందని ఆయన అన్నారు. ఈ తీవ్ర స్థాయి ప్రయత్నాలన్నీ కలసికట్టుగా న్యాయసంహిత ప్రస్తుత రూపాన్ని మనకు అందించాయని ఆయన అన్నారు. కొత్త న్యాయ సంహిత రూపకల్పనలో ఏకోన్ముఖ ప్రయత్నాలు చేసిన సుప్రీం కోర్టు, హైకోర్టులకు, ముఖ్యంగా పంజాబ్, హరియాణా హైకోర్టుకు, గౌరవనీయ న్యాయమూర్తులకు శ్రీ నరేంద్ర మోదీ తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘం ముందుకువచ్చి దీని బాధ్యతను తీసుకొన్నందుకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరి సహకారంతో రూపురేఖలు దిద్దుకొన్న భారతదేశ న్యాయసంహిత మన దేశ న్యాయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రానికి పూర్వ కాలంలో బ్రిటిషువారు అణచివేతకు, పీడనకు ఒక సాధనంగా నేర విచారణ చట్టాలను రూపొందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)ని... 1857లో జరిగిన ప్రథమ ప్రధాన స్వాతంత్య్ర పోరాటానికి పర్యవసానంగా 1860లో తెచ్చారని ఆయన అన్నారు. కొన్నేళ్ళు గడిచాక భారతీయ సాక్ష్య చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత సీఆర్‌పీసీ తొలిసారి ఉనికిలోకి వచ్చిందని వివరించారు. భారతీయులను శిక్షించి, వారిని దాస్యం ముగ్గులోకి దించాలన్నదే ఈ చట్టాల పరమావధి అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు అయినప్పటికీ మన చట్టాలు అదే శిక్షాస్మృతి, అదే దండన మనస్తత్వం చుట్టూరా తిరుగుతూ వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడప్పుడూ చట్టాల్లో మార్పులను చేస్తూ వచ్చినప్పటికీ వాటి స్వభావం ఒకే రకంగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. ఈ బానిస మనస్తత్వం భారతదేశ పురోగతిని చాలా వరకు ప్రభావితం చేసిందని ఆయన ప్రధానంగా చెప్పారు.
దేశ ప్రజలు ఈ వలసవాద మనస్తత్వం నుంచి ఇప్పుడు బయటకు రావాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. దేశ ప్రజలు వారి శక్తిని జాతి నిర్మాణానికి ఉపయోగించాలని ఆయన అన్నారు. దేశం కోసం ఆలోచించాల్సిన అవసరాన్ని ఇది తప్పనిసరి చేసిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో దేశాన్ని బానిస మనస్తత్వం నుంచి బయటపడేయాలన్న సంకల్పాన్ని తాను తీసుకొన్నట్లు ఆయన గుర్తుకు తెచ్చారు. కొత్త న్యాయ సంహితలు అమల్లోకి రావడంతో దేశం ఈ దిశలో మరో ముందడుగును వేసిందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం’ అనే భావన ప్రజాస్వామ్యానికి మూలమని, ఈ భావనను న్యాయ సంహిత బలపరుస్తోందని ఆయన అన్నారు.
సమానత్వం, సద్భావం, సామాజిక న్యాయం.. ఈ ఆలోచనలు న్యాయ సంహితలో ఇమిడి ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే... అయినప్పటికీ ఆచరణను బట్టి చూస్తే వాస్తవం వేరుగా ఉందన్నారు. పేదలు న్యాయస్థానంలోకి అడుగుపెట్టాలన్నా లేదా కనీసం పోలీసు స్టేషన్‌కి వెళ్లాలన్నా చట్టాల విషయంలో భయపడుతున్నారని ఆయన అన్నారు. సమాజంలోని ఈ మానసిక దృక్పథాన్ని మార్చడానికి నూతన న్యాయ సంహిత కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో చట్టం సమానత్వానికి హామీని ఇస్తుందని ప్రతి పేద వ్యక్తి నమ్ముతారని ఆయన అన్నారు. ఇది మన రాజ్యాంగం భరోసాను కల్పిస్తున్న వాస్తవిక సామాజిక న్యాయానికి అద్దం పడుతుందన్నారు.
ప్రతి బాధిత వ్యక్తి పట్ల- భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలు- సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. వీటి వివరాలను దేశంలో పౌరులందరూ తప్పక తెలుసుకోవాలని ఆయన ప్రధానంగా చెప్పారు. చండీగఢ్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాన్ని చూడండి అంటూ సభికులను శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ఈ తరహా కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలోనూ పోలీసు విభాగం ప్రసారం చేయడంతోపాటు ప్రచారంలోకి తేవాలని ఆయన మరీ మరీ చెప్పారు. ఫిర్యాదు ఇచ్చిన 90 రోజుల లోపల ఒక కేసు పురోగతి విషయమై సమాచారాన్ని బాధిత వ్యక్తికి ఇవ్వాలని, ఈ సమాచారాన్ని సంక్షిప్త సేవ సందేశం (ఎస్ఎమ్ఎస్) వంటి డిజిటల్ మాధ్యమ ప్రధాన సేవల ద్వారా నేరుగా ఆ వ్యక్తికే చేరేటట్లు చూడాలనే తరహా నిబంధనలు ఈ చట్టాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. పోలీసుల విధులకు అడ్డుపడే వ్యక్తిపై చర్య తీసుకోవడానికి ఒక వ్యవస్థను రూపొందించారు. అలాగే, పని చేసే ప్రదేశంలో, ఇంట్లో, సమాజంలో మహిళల సురక్ష సహా వారి హక్కులకు, వారి భద్రత కు పూచీపడడానికి ఒక ప్రత్యేక అధ్యాయాన్ని జతచేశారని ఆయన అన్నారు. చట్టం బాధిత వ్యక్తి వెన్నంటి నిలచేటట్లు న్యాయ సంహితలు బాధ్యత తీసుకొంటాయని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. మహిళలపై అత్యాచారం వంటి క్రూర నేరాలకు ఒడిగడితే ప్రథమ విచారణను చేపట్టిన నాటి నుంచి 60 రోజుల లోపల అభియోగాలను నమోదు చేస్తారని, విచారణను పూర్తి చేసిన 45 రోజుల లోపల కోర్టు ఉత్తర్వును తప్పనిసరిగా వెలువరించాలని కూడా నిబంధనలు ఉన్నాయన్నారు. దీంతోపాటు ఏ కేసులో అయినా రెండుసార్లకు మించి వాయిదాలను వేయడం జరగదని కూడా ఆయన తెలిపారు.
“పౌరుడికే ప్రాధాన్యం అన్నది న్యాయ సంహిత ప్రాథమిక మంత్రం’’ అని స్పష్టం చేసిన శ్రీ మోదీ ఈ చట్టాలు పౌరహక్కుల సంరక్షకులుగా ‘సులభతర న్యాయానికి’ ప్రాతిపదికగా నిలుస్తూ వచ్చాయన్నారు. గతంలో ఎఫ్ఐఆర్ నమోదవడం చాలా కష్టంగా ఉండేదనీ.. ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ ను చట్టబద్ధం చేశామనీ, ఎక్కడి నుంచైనా కేసు నమోదు చేయవచ్చనీ శ్రీ మోదీ పేర్కొన్నారు. బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని పొందే హక్కు కల్పించామని, ఇకపై బాధితులు అంగీకరించినప్పుడు మాత్రమే నిందితులపై కేసుల ఉపసంహరణ జరుగుతుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. పోలీసులు తమకు తాముగా ఏ వ్యక్తినీ నిర్బంధించలేరని, న్యాయసంహిత ప్రకారం.. అతడి/ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. మానవత, సునిశితత్వం కొత్త న్యాయసంహితలో రెండు ముఖ్యమైన అంశాలని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. ఇకపై శిక్ష లేకుండా నిందితుడిని చాలా కాలంపాటు జైలులో ఉంచలేరనీ, ఇకపై మూడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరం విషయంలో అరెస్టును కూడా ఉన్నతాధికారుల అనుమతితో మాత్రమే చేయవచ్చనీ శ్రీ మోదీ అన్నారు. చిన్నచిన్న నేరాలకు తప్పనిసరి బెయిల్ నిబంధన కూడా కల్పించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, సాధారణ నేరాల్లో శిక్షల స్థానంలో సామాజిక సేవ నిబంధనను కూడా చేర్చారని ప్రధానమంత్రి చెప్పారు. సామాజిక ప్రయోజనం దృష్ట్యా సానుకూల దిశలో ముందుకు సాగడానికి నిందితులకు ఇది అవకాశం కల్పిస్తుందన్నారు. తొలిసారి నేరాలకు పాల్పడ్డవారి విషయంలో న్యాయసంహిత సున్నితత్వంతో వ్యవహరిస్తుందనీ, న్యాయ సంహిత అమలు అనంతరం.. పాత చట్టాల కారణంగా జైలుపాలైన అలాంటి వేలాది మంది ఖైదీలు విడుదలయ్యారని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త న్యాయ సంహితలు పౌర హక్కుల సాధికారతను మరింత బలోపేతం చేస్తాయని ఆయన చెప్పారు.
సకాలంలో న్యాయం చేయడమే న్యాయానికి మొదటి ప్రమాణమని స్పష్టంచేసిన ప్రధానమంత్రి.. న్యాయసంహితను ప్రవేశపెట్టడం ద్వారా సత్వర న్యాయం దిశగా దేశం పెద్ద ముందడుగు వేసిందన్నారు. కేసులో ప్రతీ దశనూ పూర్తిచేయడానికి కాల పరిమితిని నిర్దేశించడం ద్వారా, అభియోగ పత్రాలు దాఖలు చేసి త్వరగా తీర్పులు ఇవ్వడానికి న్యాయసంహితలో ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కొత్తగా అమలు చేసిన న్యాయ సంహిత పరిణతి సాధించడానికి సమయం అవసరమన్న శ్రీ మోదీ.. ఇంత తక్కువ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫలితాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చండీగఢ్ నుంచి కొన్ని ఘటనలను ఆయన ఉదహరించారు. వాహనం దొంగతనం కేసును అక్కడ 2 నెలల 11 రోజుల్లోనే పరిష్కరించారు. ఓ ప్రాంతంలో అలజడిని వ్యాప్తిచేస్తున్న ఓ కేసులో నిందితుడికి 20 రోజుల్లో విచారణ పూర్తిచేసి కోర్టు శిక్ష విధించింది. ఢిల్లీ, బీహార్ లలో సత్వర న్యాయానికి సంబంధించి ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సత్వర తీర్పులు భారతీయ న్యాయ సంహిత శక్తి, ప్రభావాలకు నిదర్శనమన్నారు. జనసామాన్యం ప్రయోజనాలకు, వాళ్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఉంటే మార్పులు, ఫలితాలు తప్పక వస్తాయనడానికి ఈ మార్పులు నిదర్శనమని శ్రీ మోదీ స్పష్టంచేశారు. ఈ తీర్పులపై దేశంలో వీలైనంత ఎక్కువగా చర్చ జరగాలని ఆయన కోరారు. తద్వారా న్యాయం విషయంలో తన శక్తి ఎలా పెరిగిందో ప్రతి భారతీయుడికీ తెలుస్తుందన్నారు. పాత, జాప్యంతో కూడిన న్యాయ వ్యవస్థ ఇప్పుడు లేదన్న విషయమై నేరస్తులను కూడా ఇది అప్రమత్తం చేస్తుందన్నారు.
“కాలానుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనలు, చట్టాలు అమలవుతాయి” అని శ్రీ మోదీ అన్నారు. నేడు నేరాలు, నేరస్తుల పద్ధతులు మారాయని, ఆధునికమైన కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. డిజిటల్ ఆధారాన్ని ముఖ్యమైన సాక్ష్యంగా ఉంచవచ్చనీ, దర్యాప్తు సమయంలో సాక్ష్యాలు తారుమారవకుండా చూడడం కోసం మొత్తం ప్రక్రియకు సంబంధించి వీడియోగ్రఫీని తప్పనిసరి చేశారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇ-సాక్ష్య, న్యాయ శ్రుతి, న్యాయ సేతు, ఇ-సమన్ పోర్టల్ వంటి ఉపయుక్తమైన సాధనాల అభివృద్ధి ద్వారా కొత్త చట్టాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై కోర్టులు నేరుగా ఫోన్ ద్వారా, పోలీసులు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా నేరుగా సమన్లు అందించవచ్చని ఆయన చెప్పారు. సాక్షుల వాంగ్మూలాలను ఆడియో-వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చన్నారు. డిజిటల్ సాక్ష్యాలు కూడా ఇప్పుడు కోర్టులో చెల్లుబాటు అవుతాయన్న శ్రీ మోదీ.. అవి న్యాయానికి ప్రాతిపదిక అవుతాయని, నేరస్తుడు దొరికే వరకూ అనవసరంగా సమయం వృథా అవకుండా ఇది నిరోధిస్తుందని అన్నారు. దేశ భద్రతకూ ఈ మార్పులు అంతే అవసరమనీ.. డిజిటల్ సాక్ష్యాల ఏకీకరణ, సాంకేతికత ఉగ్రవాదంపై పోరాటంలో కూడా మనకు దోహదపడుతాయని ఆయన అన్నారు. కొత్త చట్టాల ప్రకారం ఉగ్రవాదులు లేదా ఉగ్రవాద సంస్థలు చట్టంలోని సంక్లిష్టతలను వాడుకోలేవన్నారు.
కొత్త న్యాయ సంహితలు ప్రతి శాఖలో ఉత్పాదకతను పెంచుతాయని, దేశ పురోగతిని వేగవంతం చేస్తాయని శ్రీ మోదీ స్పష్టంచేశారు. న్యాయపరమైన అవరోధాల కారణంగా పెరిగిన అవినీతిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందన్నారు. సుదీర్ఘమైన, జాప్యంతో కూడిన న్యాయ ప్రక్రియ ఆందోళనల వల్ల గతంలో విదేశీ పెట్టుబడిదారులు భారత్ తో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడలేదన్నారు. ఈ ఆందోళన తొలగిపోతే పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన అన్నారు.
దేశ చట్టాలు పౌరుల కోసమేనని పేర్కొన్న ప్రధానమంత్రి.. అందువల్ల చట్టపరమైన ప్రక్రియలు కూడా ప్రజల సౌలభ్యం కోసమే ఉండాలన్నారు. భారత శిక్షా స్మృతిలోని లోపాలు, నేరుస్తులకు బదులు నిజాయితీ పరులకు చట్టంపట్ల భయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. కొత్త న్యాయ సంహితలు ఇలాంటి ఇబ్బందులను తొలగించాయని శ్రీ మోదీ అన్నారు. బ్రిటీష్ పాలన నాటి 1500కు పైగా పాత చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
మన దేశంలో పౌర సాధికారతకు చట్టం ఒక మాధ్యమంగా మారేలా మన దృక్పథాన్ని విస్తృతపరచుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ కోరారు. చర్చలు, సంప్రదింపులు లోపించిన చట్టాలు అనేకం ఉండేవన్నారు. అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లను ఉటంకిస్తూ దీనిపై చాలా చర్చలు జరిగాయని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టంపై కూడా చర్చ జరుగుతోందన్నారు. పౌరుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి రూపొందించిన చట్టాలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టంచేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 అమలును ఆయన ఉదహరించారు. ఇది దివ్యాంగులకు సాధికారత కల్పించడమే కాకుండా, సమాజాన్ని మరింత సమ్మిళితంగా, సునిశితంగా మార్చే అంశమన్నారు. నారీ శక్తి వందన్ చట్టం ఇటువంటి పెద్ద మార్పునకు పునాది కాబోతోందన్నారు. అదేవిధంగా ట్రాన్స్ జెండర్ల సంబంధిత చట్టాలు, మధ్యవర్తిత్వ చట్టం, జీఎస్టీ చట్టం వంటివి చేశామనీ, వీటిపై సానుకూల చర్చలు అవసరమయ్యాయనీ ఆయన అన్నారు.
“ఏ దేశానికైనా దాని పౌరులే బలం, దేశంలోని చట్టమే ఆ పౌరుల బలం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని పాటించేలా ప్రజలను ప్రోత్సహిస్తుందనీ, చట్టం పట్ల పౌరులకు ఉన్న ఈ విధేయత దేశానికి పెద్ద ఆస్తి అవుతుందనీ శ్రీ మోదీ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి శాఖ, ప్రతి సంస్థ, ప్రతి అధికారి, ప్రతి పోలీసు న్యాయ సంహిత కొత్త నిబంధనలను తెలుసుకోవాలని, వాటి స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని శ్రీ మోదీ కోరారు. న్యాయ సంహితను సమర్థవంతంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలకంగా పనిచేయాలని ఆయన కోరారు. తద్వారా వాటి ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందన్నారు. ఈ కొత్త హక్కులపై పౌరులు వీలైనంతగా అవగాహనతో ఉండాలని ఆయన కోరారు. ఇందుకోసం కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. న్యాయ సంహితను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తే దేశానికి మరింత మెరుగైన, ఉజ్వల భవిష్యత్తును అందించగలుగుతామని ప్రధానమంత్రి అన్నారు. ఇది మన పిల్లల జీవితాన్ని నిర్ణయిస్తుందని, సేవాపరంగా సంతృప్తినిస్తుందని అన్నారు. అందరూ ఈ దిశలో కలసి పనిచేస్తారని, జాతి నిర్మాణంలో మెరుగైన పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత పాలకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, రాజ్యసభ సభ్యుడు శ్రీ సత్నామ్ సింగ్ సంధు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం- పరివర్తనాత్మకమైన మూడు కొత్త నేర చట్టాల అమలులో విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేడు చండీగఢ్ లో జాతికి అంకితం చేశారు.
స్వాతంత్ర్యానంతరమూ కొనసాగుతున్న వలస పాలన నాటి చట్టాలను తొలగించడంతోపాటు.. న్యాయ వ్యవస్థ దృష్టిని శిక్ష నుంచి న్యాయం వైపు మళ్లించేలా పరివర్తన తేవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ మూడు చట్టాల రూపకల్పన జరిగింది. దీని దృష్ట్యా ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘సురక్షిత సమాజం, అభివృద్ధి చెందిన భారతదేశం - శిక్ష నుంచి న్యాయం వరకు.’’
జూలై 1న దేశవ్యాప్తంగా అమలు చేసిన కొత్త నేర చట్టాలు భారత న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కీలక సంస్కరణలు భారత నేర న్యాయ వ్యవస్థలో చరిత్రాత్మక మార్పుగా నిలుస్తాయి. సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త యంత్రాంగాలను అందించడంతోపాటు వివిధ నేరాల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాయి.
నేర న్యాయవ్యవస్థ రంగాన్ని ఇప్పటికే ఈ చట్టాలు ఎలా పునర్నిర్మిస్తున్నాయో ప్రదర్శిస్తూ.. ఈ చట్టాల ఆచరణాత్మక అనువర్తనానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. కొత్త చట్టాల అమలు ద్వారా నేర విచారణను అనుకరిస్తూ ప్రత్యక్ష ప్రదర్శన కూడా నిర్వహించారు.
***
MJPS/SR
(Release ID: 2080901)
Visitor Counter : 63
Read this release in:
English
,
Odia
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam