రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

2024 ఏడాదికి గాను దివ్యాంగుల సాధికారతకు కృషి చేసిన వారికి జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

Posted On: 03 DEC 2024 1:36PM by PIB Hyderabad

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి గాను దివ్యాంగుల సాధికారతకు కృషి చేసిన వారికి జాతీయ పురస్కారాలను శ్రీమతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (డిసెంబర్ 3, 2024) న్యూఢిల్లీలో అందజేశారు.

ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తూ.. ఈ అవార్డులకు సామాజిక ప్రాధాన్యం ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇతర వ్యక్తులు, సంస్థలు వారిని అనుసరించడం ద్వారా దివ్యాంగులను సాధికారత దిశగా ముందుకు నడిపించవచ్చన్నారు.

ఈ ఏడాది ఇతివృత్తమైన ‘సమ్మిళిత, సుస్థిర భవిష్యత్తు కోసం దివ్యాంగుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం’ గురించి ప్రస్తావిస్తూ దివ్యాంగ జనులను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఉపాధి కల్పించడం, వారు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా వారిలో నాయకత్వ సామర్థ్యం పెరుగుతుందని రాష్ట్రపతి అన్నారు.

అందరితోనూ సమానమేనన్న భావన దివ్యాంగులకు కలిగేలా, వారు సౌకర్యవంతంగా ఉండేలా సమస్త మానవాళి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. ఎలాంటి అవరోధాలూ లేని వాతావరణాన్ని వారికి అందించడమే సమాజ ప్రాధాన్యం కావాలని సూచించారు. వాస్తవానికి దివ్యాంగులకు సమాన అవకాశాలూ సౌకర్యాలూ కల్పించిన సమాజాన్నే మేలైన సమాజంగా పిలుస్తారు.

వైకల్యమంటే అది ఏరకమైన లోపమూ కాదని, అది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని రాష్ట్రపతి చెప్పారు. ‘‘దివ్యాంగులకు కావాల్సింది సహానుభూతి... సానుభూతి కాదు. వారి పట్ల జాలితో వ్యవహరించడం కాదు.. గౌరవంతో ఉండటం అవసరం. వారిని భిన్నంగా చూడాల్సిన పని లేదు. ఆప్యాయత చూపిస్తే చాలు. ఇతరుల నుంచి సమానత్వం, మర్యాద, గౌరవం వారికి అందేలా సమాజం బాధ్యత వహించాలి’’ అని రాష్ట్రపతి అన్నారు.

‘‘అందరిలానే పని చేసే అవకాశం లభించినపుడు.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం, అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నామన్న భావన కలుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సాధికారత ద్వారా వారి జీవితాలు మెరుగవుతాయి’’ అని రాష్ట్రపతి అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

****


(Release ID: 2080204) Visitor Counter : 58