సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్ టీ – యునెస్కో గాంధీ పతకాన్ని గెలుచుకున్న ‘క్రాసింగ్’.. స్వీడిష్ దర్శకుడు లెవాన్ అకిన్ తెరకెక్కించిన చిత్రం


ఇఫీలో ‘క్రాసింగ్’ను ప్రత్యేకంగా నిలిపిన వ్యక్తిగత, సామాజిక అంశాలు

 గోవాలో జరుగుతున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో స్వీడిష్ దర్శకుడు లెవాన్ అకిన్ తెరకెక్కించిన క్రాసింగ్ చిత్రం ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్ టీ – యునెస్కో గాంధీ పతకాన్ని గెలుచుకుంది. శాంతి, అహింసా విలువలను ప్రతిబింబించేదిగా.. మానవ హక్కులను ప్రోత్సహించేదిగా ఈ సినిమాను ఈ పురస్కారం గుర్తించింది. ఈ విలువలను శక్తిమంతంగా ప్రదర్శించడం ‘క్రాసింగ్’ ఎంపికకు కారణమైంది. విజేతకు యునెస్కో గాంధీ పతకం, ద్రువీకరణ పత్రాలను అందిస్తారు.

అద్భుతమైన చిత్ర నిర్మాణ విలువలతోపాటు స్త్రీపురుష సమానత్వం, సామాజిక అవగాహనపై ఆలోచనాత్మకంగా సాగిన కథనాన్ని న్యాయ నిర్ణేతలు అభినందించారు. “ప్రేమ, అవగాహన ఈ సినిమాలో మనసును హత్తుకునే అంశాలు” అని న్యాయ నిర్ణేతలు వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ చలనచిత్ర, టీవీ, దృశ్యశ్రవ్య ప్రసార మండలి (ఐసీఎఫ్ టీ), యునెస్కో సహకారంతో నెలకొల్పిన ఈ పురస్కారాన్ని సహనం, సాంస్కృతిక సామరస్యం, శాంతియుత సంస్కృతి ఆదర్శాలను ప్రతిబింబించే చిత్రాలకు అందిస్తారు.

చాలా ఏళ్ల క్రితం అదృశ్యమైన తన మేనకోడలిని వెతుక్కుంటూ జార్జియా నుంచి ఇస్తాంబుల్‌కు ఓ యువకుడితో ప్రయాణం మొదలుపెట్టిన ఒక వృద్ధ మహిళ కథను ‘క్రాసింగ్’ సినిమా చెప్తుంది. ఓ వాగ్దానాన్ని నెరవేరుస్తున్న స్త్రీగా అద్భుతంగా నటించిన ఎంజియా అరబలి పాత్ర.. అనూహ్యంగా లింగపరమైన సమస్యలు, సమానత్వం వంటి అంశాలను తెరపైకి తెస్తుంది. ప్రేమ, అవగాహన, తరతరాల అనుబంధాలపై ఈ చిత్రం అందమైన కథనాన్ని అల్లింది. సామాజిక, సాంస్కృతిక అంశాలను పదునుగా వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది పది విశిష్టమైన చిత్రాలను ఈ పురస్కారం కోసం పరిశీలించారు. వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, జానర్లకు చెందినవైనప్పటికీ.. గాంధేయ సూత్రాలకు కట్టుబడి ఉండడం వాటిలోని ఉమ్మడి లక్షణం. నామినీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి:

ఇఫీలో గాంధీ పతక న్యాయ నిర్ణేతలు:

·         ఇసబెల్లి డానెల్, అంతర్జాతీయ చలనచిత్ర విమర్శకుల సమాఖ్య (ఎఫ్ఐపీఆర్ఈఎస్ సీఐ) గౌరవాధ్యక్షుడు

·         సెర్జ్ మైఖేల్, సీఐసీటీ-ఐసీఎఫ్ టీ ఉపాధ్యక్షుడు

·         మరియా క్రిస్టినా ఇగ్లేసియాస్, యునెస్కో సాంస్కృతిక రంగ కార్యక్రమ మాజీ అధ్యక్షుడు

·         డాక్టర్ అహ్మద్ బెడ్జవుయీ, అల్జీర్స్ చలనచిత్రోత్సవ కళాత్మక దర్శకుడు

·         జుయాన్ హున్, సీఐసీటీ-ఐసీఎఫ్ టీ యువజన విభాగపు సృజనాత్మకత, ఆవిష్కరణల వేదిక దర్శకుడు

మీడియాతో న్యాయ నిర్ణేతల సంభాషణను ఇక్కడ వినొచ్చు.

 

ఐసీఎఫ్ టీ యునెస్కో గాంధీ పతకం గురించి

ఉన్నతమైన కళాత్మక, చిత్ర నిర్మాణ విలువలే కాకుండా.. అత్యంత ముఖ్యమైన సామాజిక అంశాల్లో నైతికతను ప్రోత్సహిస్తూ తీసిన సినిమాలకు ఐసీఎఫ్ టీ-యునెస్కో గాంధీ పతకాన్ని అందిస్తారు. 46వ ఇఫీ సందర్భంగా దీనిని ప్రారంభించారు. శక్తిమంతమైన పరివర్తన సాధనమైన సినిమా ఆధారంగా.. ఉమ్మడి మానవ విలువలపై నిశితమైన అవగాహనను ప్రోత్సహించడం కోసం  పురస్కారాన్ని ప్రారంభించారు.

ఐసీఎఫ్ టీ యునెస్కో గాంధీ పతకం కేవలం పురస్కారం మాత్రమే కాదు.. స్ఫూర్తినివ్వడంలో, అవగాహన కల్పించడంలో, ఐక్యం చేయడంలో సినిమా శక్తిని ఇది చాటుతుంది.

పెద్దలు చెప్పినట్టు.. ఇఫీ ముగియవచ్చు. కానీ, అది ఆగిపోదు! ఈ 9 రోజుల సినీ మహోత్సవానికి తెరపడగానే.. గోవా ఇఫీ కథలు, దర్శకులతో సంభాషణలు, వేడుకలను ఉన్నదున్నట్టుగా చూస్తూ ఆనందించండి. ఇందుకోసం [ఈ లింక్] (https://pib.gov.in/iffi/55/)పై క్లిక్ చేస్తే చాలు.  

 

****

iffi reel

(Release ID: 2078882) Visitor Counter : 36