మంత్రిమండలి
అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం
దేశంలో బలమైన ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థను పెంపొందించడంలో ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనం
అంతర్జాతీయంగా భారత పోటీతత్వాన్ని పెంపొందించడం లక్ష్యం
Posted On:
25 NOV 2024 8:45PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)ను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిని విస్తరించడంతోపాటు, 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
వికసిత భారత్ దిశగా అటల్ ఇన్నొవేషన్ మిషన్ 2.0 ముందడుగు. ఇప్పటికే ప్రభావవంతంగా ఉన్న భారత ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థను మరింత విస్తరించడం, బలోపేతం చేయడం, వృద్ధిని పెంచడం దీని లక్ష్యం.
దేశంలో బలమైన ఆవిష్కరణ వ్యవస్థ, వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆమోదం స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో 39వ ర్యాంకు, అంకుర సంస్థల విషయంలో ప్రపంచస్థాయి మూడో ర్యాంకు నేపథ్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ మలి దశ (ఏఐఎం 2.0) దేశ అంతర్జాతీయ పోటీతత్వాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మెరుగైన ఉద్యోగ కల్పనకు, సృజనాత్మక ఉత్పత్తులకు, ప్రభావవంతమైన సేవలందించడానికి ఏఐఎం కొనసాగింపు నేరుగా దోహదం చేస్తుంది.
అటల్ నైపుణ్య శాలలు (అటల్ టింకరింగ్ ల్యాబ్స్-ఏటీఎల్), అటల్ ఉద్భవన కేంద్రాల (అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్-ఏఐసీ) వంటి ఏఐఎం 1.0 విజయాల ఆధారంగా.. ఈ కార్యక్రమ విధానంలో గుణాత్మక మార్పును ఏఐఎం 2.0 సూచిస్తుంది. సరికొత్త సృజనాత్మక మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా దేశంలో నాటి నూతన వ్యవస్థ బలోపేతం కోసం ఏఐఎం 1.0 కృషిచేసింది. కాగా, వ్యవస్థలో అంతరాలను పూరించడంతోపాటు.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావ్యవస్థ, సమాజం ద్వారా ఆ విజయాలను మరింత పెంచడం కోసం రూపొందించిన ప్రయోగాత్మక కార్యక్రమాల అమలు ఏఐఎం 2.0లో ఉంటుంది.
భారత ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థలను మూడు విధాలుగా బలోపేతం చేయడం ఏఐఎం 2.0 లక్షం: (a) ఉత్ప్రేరణను పెంచడం ద్వారా (అంటే, మరింత మంది ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ఆహ్వానించడం ద్వారా), (b) విజయాల రేటును మెరుగుపరచడం ద్వారా (అంటే, విజయం సాధించేలా మరిన్ని అంకుర సంస్థలకు దోహదపడడం ద్వారా), (c) నాణ్యమైన/ మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా (అంటే, మెరుగైన ఉద్యోగాలు, ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా).
వ్యవస్థల్లో ఉత్ప్రేరకాలను పెంచడం లక్ష్యంగా రెండు కార్యక్రమాలు:
ఆవిష్కరణలో భాషా సమ్మిళిత కార్యక్రమం (ఎల్ఐపీఐ) ద్వారా దేశంలోని 22 అనుసూచిత భాషల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకత వ్యవస్థలను ఏర్పరచడం.. తద్వారా ఆంగ్లం మాట్లాడని ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఎదుర్కొనే అవరోధాలను తగ్గించడం. ఇందుకోసం ప్రస్తుత ఉద్భవన కేంద్రాల్లో 30 స్థానిక భాషా ఆవిష్కరణ కేంద్రాలను నెలకొల్పుతారు.
సరిహద్దు కార్యక్రమం ద్వారా జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలు, అభిలషణీయ జిల్లాలు-బ్లాకుల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకత కోసం తగిన పరిస్థితులను సృష్టించడం. ఆ ప్రాంతాల్లో భారత పౌరుల్లో 15% మంది నివసిస్తున్నారు. ఆయా నమూనాల అభివృద్ధి కోసం 2500 కొత్త ఏటీఎల్ లు ఏర్పాటు చేస్తారు.
ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా నాలుగు కార్యక్రమాలు:
దేశ ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థను నిర్మించి, నిర్వహించడం కోసం - మానవ మూలధన అభివృద్ధి కార్యక్రమం ద్వారా నిపుణులను (నిర్వాహకులు, ఉపాధ్యాయులు, శిక్షకులు) అందించడం. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం 5500 మంది నిపుణులను అందిస్తుంది.
అధునాతన సాంకేతికత యంత్రాంగం (డీప్ టెక్ రియాక్టర్) ద్వారా - మార్కెట్ లోకి రావడానికి సుదీర్ఘమైన సమయం, ఎక్కువ పెట్టుబడులు అవసరమైన పరిశోధన ఆధారిత అధునాతన సాంకేతిక అంకుర సంస్థల వాణిజ్యీకరణ మార్గాలను పరీక్షించేందుకు పరిశోధన పరీక్షక వ్యవస్థను ఏర్పాటు చేయడం. కనీసం ఒక డీప్ టెక్ రియాక్టర్ ను ప్రయోగాత్మకంగా చేపడతారు.
స్టేట్ ఇన్నొవేషన్ మిషన్ (ఎస్ఐఎం) ద్వారా - రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు అవి బలంగా ఉన్న అంశాల్లో శక్తిమంతమైన ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థలను సృష్టించడంలో సహాయం అందించడం. ఎస్ఐఎం అనేది నీతి ఆయోగ్ రాష్ట్రాల సహాయ కార్యక్రమంలో ఒక భాగం.
అంతర్జాతీయ సహకార కార్యక్రమం ద్వారా దేశ ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. ఈ దిశగా చర్యలు చేపట్టడానికి నాలుగు అంశాలను గుర్తించారు: (a) ఏడాదికోసారి అంతర్జాతీయ నైపుణ్య పోటీలు (గ్లోబల్ టింకరింగ్ ఒలింపియాడ్), (b) అభివృద్ధి చెందిన దేశాలతో 10 ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలు (c) విజ్ఞానంలో భాగస్వామిగా- ఏఐఎం, దాని కార్యక్రమాలను (ఏటీఎల్, ఏఐసీ) అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాప్తి చేయడంలో ఐక్యరాజ్యసమితి ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థకు సహాయం అందించడం, (d) భారత్ కోసం జీ20లో స్టార్టప్20 భాగస్వామ్య బృందాన్ని సమన్వయపరచడం.
ఫలితాల్లో (ఉద్యోగాలు, ఉత్పత్తులు, సేవలు) నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా రెండు కార్యక్రమాలు:
పారిశ్రామిక ప్రోత్సాహక కార్యక్రమం (ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్) ద్వారా అధునాతన అంకుర సంస్థలను విస్తరించడంలో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంచడం. కీలకమైన రంగాల్లో కనీసం 10 ఇండస్ట్రీ యాక్సిలరేటర్లను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేస్తారు.
కీలక పారిశ్రామిక రంగాల్లో ఉన్న అంకుర సంస్థల్లో- సమీకరణ, సేకరణ కోసం రంగాల వారీగా అటల్ ఆవిష్కరణ ప్రయోగ కేంద్రాల (ఏఎస్ఐఎల్) కార్యక్రమం. దీని ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఐడీఈఎక్స్ తరహా వేదికలను నిర్మించడం. కీలక మంత్రిత్వ శాఖల్లో కనీసం 10 ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తారు.
***
(Release ID: 2077777)
Visitor Counter : 158
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam