సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రణబీర్ కపూర్ ముఖ్య అతిథిగా రాజ్ కపూర్ శతజయంతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన ఇఫీ గోవా
‘‘రాజ్ కపూర్ సినిమాలు వినోదాన్ని పంచడం మాత్రమే కాదు, అవి చిత్రకథలు చెబుతూ, ప్రేక్షకుల హృదయాలతో మాట్లాడేవి’’: రణబీర్ కపూర్
‘మేరా నామ్ జోకర్’ లాంటి పరాజయాలున్నప్పటికీ మా తాతయ్య ప్రేక్షకులకు చేరువగా ఉండేందుకు సాహసోపేతమైన సినిమాలు తీసేవారు’’: రణబీర్
కళాకారులుగా మన వేదికలు ఉపయోగించుకుంటూ, కళ ద్వారా వాతావరణ మార్పులు లాంటి ప్రపంచ సమస్యలపై అవగాహన పెంచాలి: రణబీర్
రాజ్ కపూర్ దూరదృష్టి ఉన్నవారు, వివిధ తరాలు, సంస్కృతులు ప్రేక్షకులకు చేరువయ్యే ఆయన సామర్థ్యం అసమానమైనది: రాహుల్ రావైల్, ప్రముఖ సినీ దర్శకుడు
ప్రముఖ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) నివాళులు అర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా ఆయన మనవడు రణబీర్ కపూర్, దిగ్గజ దర్శకుడు రాహుల్ రావైల్ హాజరయ్యారు. భారతీయ సినిమాకు రాజ్ కపూర్ చేసిన సేవలు, చిత్రరంగంపై ఆయన చెరగని ముద్ర, ఆయన తీసిన చిత్రాల వారసత్వం ప్రధానాంశాలుగా ఈ కార్యక్రమం జరిగింది.
చలనచిత్ర రంగంలో తన తాతయ్య చూపిన అసాధారణ ప్రభావం గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ, రాజ్ కపూర్ సినిమాలు కాలాతీతమైనవని, అవి సరిహద్దులను చెరిపేశాయని అన్నారు. ఆయన తెరకెక్కించిన ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 లాంటి సినిమాలు విశ్వవ్యాప్తమని, భారత్ నుంచి రష్యా వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యాయని అభిప్రాయపడ్డారు.
రాజ్ కపూర్ సినిమాల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవారా సినిమాలో కులతత్వం, శ్రీ 420 సినిమాలో అత్యాశ లాంటి ఇతివృత్తాలను ప్రస్తావించారని రణబీర్ వివరించారు. ప్రేమ్ రోగ్, రామ్ తేరీ గంగా మైలీ తదితర చిత్రాలు మహిళల సమస్యలు, సామాజిక ఇబ్బందుల ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ప్రశంసలు పొందాయని దర్శకుడిగా రాజ్ కపూర్ తన తరానికంటే ముందు ఉండేవారని అన్నారు.
నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ), నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ), ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంతో రాజ్ కపూర్ సినిమాలను పునరుద్ధరించేందుకు చేపడుతున్న ప్రయత్నాలపై రణబీర్ చర్చించారు. ఇప్పటికే 10 వరకు రాజ్ కపూర్ సినిమాలను పునరుద్ధరించారని, వాటిని ఈ ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భారతీయ సినిమాకు మూలాధారం లాంటి సినీదిగ్గజం రాజ్ కపూర్ తీసిన చిత్రాలను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాణం, నటన, సామాజిక అంశాలను వివరించడంలో మారుతున్న సినిమాల పాత్ర తదితర అంశాలపై చర్చలు జరిగాయి. తండ్రి కావడం వల్ల పర్యావరణ, సామాజిక మార్పులపై తనకు అవగాహన బాగా పెరిగిందని అన్నారు. కళాకారులు జ్ఞానాన్ని పంచడానికి, ప్రపంచ అంశాలపై అవగాహన పెంచేందుకు తమ వేదికలను ఉపయోగించాలని సూచించారు. నటనలో విలక్షణతను చూపించాల్సిన ప్రాధాన్యత గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప నటుల నుంచి నేర్చుకుంటూనే వారికంటూ ప్రత్యేకమైన శైలిని రూపొందించుకోవాలని ఔత్సాహిక నటులకు సూచించారు.
కార్యక్రమాన్ని ముగిస్తూ.. రాజ్ కపూర్‌కు నివాళులు అర్పించిన ఇఫికి కృతజ్జతలు తెలిపారు. అలాగే రాజ్ కపూర్ కాలాతీతమైన చిత్రాలను మరోసారి వీక్షించి ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు. చలనచిత్ర రంగంతో పాటు సమాజంలో తనదైన ముద్ర వేసిన రాజ్ కపూర్ గురించి రణబీర్ అభిప్రాయానికి, ఆలోచనలనకు రాహుల్ రావైల్ మరికొన్ని అంశాలను జోడించారు.
ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్శ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, భారతీయ చిత్ర దర్శకుడు, ఇఫీ ఉత్సవ డైరెక్టర్ శేఖర్ కపూర్, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి, ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతుల్ కుమార్, సమాచార ప్రసారమంత్రిత్వ శాఖ, సంయుక్త కార్యదర్శి (చలనచిత్రాలు) , వృందా దేశాయ్ పాల్గొన్నారు.
***
(Release ID: 2077398)
Visitor Counter : 26