ప్రధాన మంత్రి కార్యాలయం
గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
21 NOV 2024 9:27PM by PIB Hyderabad
గయానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
భారత్, గయానా మధ్య సుదీర్ఘమైన చారిత్రక సంబంధాలను ప్రధానమంత్రి తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. దేశ అత్యున్నత గౌరవాన్ని తనకు అందించినందుకు గయానా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్, గయానా మధ్య భౌగోళికంగా దూరం ఉన్నప్పటికీ, ఉమ్మడి వారసత్వం, ప్రజాస్వామ్యం రెండు దేశాలను దగ్గర చేశాయన్నారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామ్య లక్షణాలు, ప్రజా కేంద్రీకృత విధానాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. సమ్మిళిత పథంలో పురోగమించేలా ఈ విలువలు వారికి దోహదపడ్డాయని వ్యాఖ్యానించారు.
‘మానవతకే తొలి ప్రాధాన్యం’ భారత్ కు మంత్రప్రదమన్న ప్రధానమంత్రి.. బ్రెజిల్ లో జరిగిన ఇటీవలి జీ-20 సహా సర్వత్రా అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని బలంగా వినిపించేందుకు అది స్ఫూర్తినిస్తోందన్నారు. ప్రపంచానికి మిత్రుడిగా.. విశ్వబంధుగా భారత్ మానవాళికి సేవలందించాలని భావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాథమిక భావనే అంతర్జాతీయ సమాజంపై భారత విధానాన్ని రూపొందించిందన్నారు. పెద్ద, చిన్న దేశాలన్నింటికీ భారత్ సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
అంతర్జాతీయ ప్రగతి, శ్రేయస్సు మరింతగా పురోగమించడానికి మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. విద్య, ఆవిష్కరణల రంగంలో రెండు దేశాల మధ్య వినిమయం ఎక్కువగా జరగాలని, తద్వారా యువత సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. కరీబియన్ ప్రాంతానికి భారత దృఢమైన మద్దతును తెలియజేస్తూ.. భారత్-కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చినందుకు అధ్యక్షుడు అలీకి ధన్యవాదాలు తెలిపారు. భారత్-గయానా చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ దృఢ సంకల్పంతో ఉందన్నారు. భారత్- లాటిన్ అమెరికా ఖండం మధ్య అవకాశాల వారధిగా గయానా మారగలదని పేర్కొన్నారు. ‘‘మనం గతం నుంచి నేర్చుకోవాలి, మన వర్తమానాన్ని మెరుగుపరచుకోవాలి, భవిష్యత్తు కోసం బలమైన పునాదులు ఏర్పరచుకోవాలి’’ అని గయానా ధీరపుత్రుడు శ్రీ చెదీ జగన్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. భారత్ ను సందర్శించవలసిందిగా గయానా పార్లమెంటు సభ్యులను ఆయన ఆహ్వానించారు.
ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు.
***
(Release ID: 2076642)
Visitor Counter : 32
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam